తెలంగాణ: కోలాటమాడుతూ, పాటలు పాడుతూ ఘనంగా బతుకమ్మ సంబురాలు

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పాటలు పాడుతూ కోలాటాలు ఆడి, బతుకమ్మలను సాగనంపారు.

తెలంగాణ చరిత్రలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది.

బతుకమ్మ ఒక పూల పండుగ. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది.

ఈ పండుగ సందర్భంగా మహిళలు ప్రధానంగా గౌరీ దేవతను ఆరాధిస్తారు.

గత వారం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుక, ఈ రోజు (ఆదివారం) సద్దుల బతుకమ్మ‌తో ముగిసింది.

'సద్దుల బతుకమ్మ' సందర్భంగా కోలాటాల అనంతరం, మహిళలు ఊరేగింపులతో బతుకమ్మలను తీసుకెళ్లి, చెరువులు, నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు.

వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గునుగు, గుమ్మడి, కట్ల పువ్వులు, బంతిపూలతో అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు మహిళలు.

నగరంలోని పద్మాక్షి గుట్ట ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ‌లతో తరలివచ్చారు. పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు.

అనంతరం పద్మాక్షి ఆలయ ఆవరణలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ‌ను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బతుకమ్మ ఐకాన్‌గా నిలిచిందని ఉద్యమకారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)