You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?
- రచయిత, కవిత యార్లగడ్డ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
భారతదేశంలో మొక్కలను, వృక్షాలను పూజించే సంప్రదాయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లాలమ్మ గుడిలో అమ్మవారికి పూలు, పళ్లు నైవేద్యంగా సమర్పించేందుకు ఆన్యం శ్రీదేవి భర్తతో కలిసి వెళ్లారు. పక్షుల కిలకిలా రావాలు, చల్లని గాలి, భారీ వృక్షాలు, ప్రవహించే నీటి గల గలలతో ఆ అడవి వారికి స్వాగతం పలికింది.
"పిల్లలు లేని వారిక్కడకు వస్తే పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతారు" అని శ్రీదేవి భర్త ఆన్యం రాంబాబు చెప్పారు. ఆయన ఈ గుడికి తరచుగా వస్తూ ఉంటారు.
ఈ గుడిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రశాంత వదనంతో ఆసీనురాలైన చిన్న దేవతా విగ్రహం ఉంది. అమ్మవారికి పూలు, పళ్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయని ఇక్కడికొచ్చే భక్తులు నమ్ముతారు. పల్లాలమ్మ దేవి ప్రకృతికి దగ్గరగా ఉండటంతో ఆమెను ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు.
ఈ గుడి చుట్టూ మర్రి, రావి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పై ఉడతలు పరుగులు పెడుతున్నాయి. పక్షుల కువ కువలు వినిపిస్తున్నాయి.
"ఇక్కడకొచ్చే భక్తులు అమ్మవారికి మొక్కుకుని ఈ చెట్లకు వేలాడే ఊడలకు ఎర్రని తాళ్లను కట్టి అమ్మవారి ఆశీర్వాదాలు కోరుకుంటారు" అని రాంబాబు భార్య చెప్పారు.
భారతదేశంలోని సుమారు 100,000-150,000 వరకు ఉన్న మఠాలు, ప్రాకృతిక ఆరాధనా స్థలాలు అటవీ సంరక్షణ కేంద్రాలు మారాయి. అంతే కాకుండా ఇవి అంతరించిపోయే దశలో ఉన్న అనేక జీవరాశులకు ఆవాసాలుగా ఉంటున్నాయి.
భారతదేశంలో హరిత వన సంరక్షణ చర్యలను విస్తృతం చేసేందుకు సాంస్కృతిక ఆచారాలు, సామాజిక నాయకత్వం చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశం అటవీ ప్రాంతాన్ని చాలా త్వరితగతిన కోల్పోతున్నందున, ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలను అడవులను రక్షిస్తాయని నమ్ముతున్నారు.
"ఆలయాలకు వెళ్లడం, చెట్లు, సరస్సులను పూజించడం చాలా మంది హిందువులకు సహజంగా ఉండే అలవాటు" అని పూజారి లక్ష్మణ్ ఆచార్య చెప్పారు.
"కొన్ని శతాబ్దాల నుంచి భారతీయులు చెట్లను పూజిస్తున్నారు. చెట్లు లేకపోతే మనుషుల మనుగడే లేదన్న గౌరవంతోనే వాటిని పూజిస్తున్నారు" అని ఆన్యం రాంబాబు అన్నారు.
ఈ చెట్ల ఆకులు, పూలను చాలా పూజలు, క్రతువుల్లో ఉపయోగిస్తారు.
ప్రకృతి ఆరాధన
భారతదేశంలో ప్రకృతి వనరులను సంరక్షించడం, పరిరక్షించడం సాంస్కృతిక ఆచారాల్లో భాగంగా వస్తోంది. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే స్వదేశీ జాతుల్లో ఈ ఆచారాలను పాటించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
చాలా కమ్యూనిటీల్లో వృక్షాలు, మొక్కలు, జంతువులు, నదులు, పర్వతాల ఆరాధనను తమ పరిసరాలతో అనుసంధానం చేసేందుకు ఒక ఆధ్యాత్మిక బంధంగా భావిస్తారు.
వృక్ష సంపదను నాశనం చేస్తే అక్కడుండే దేవతకు ఆగ్రహం కలుగుతుందని నమ్మడం వల్ల చాలా పురాతన అడవుల సంరక్షణ సాధ్యమవుతోంది. ఈ అడవులను నాశనం చేయాలని చూసేవారి పై అమ్మవారు ప్రతీకారం తీర్చుకుంటారని భక్తులు భావిస్తారు.
భారతదేశంలో పాములను పునర్జన్మకు సంకేతంగా భావిస్తారు. దీంతో, వాటిని సంరక్షిస్తూ ఉంటారు. ఒక పామును చంపితే, ఆ వ్యక్తి పై పగ తీర్చుకునేందుకు కొన్ని వందల పాములు పుడతాయని నమ్ముతారు. "ప్రతీ జీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని గ్రామస్థులు నమ్మకం" అని ఆంధ్రప్రదేశ్‌లో క్రియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అన్ను జలాయ్స్ చెప్పారు.
దేశంలో విశాలమైన మడ అడవులకు నిలయమైన సుందర్‌బన్స్ పై 'ఫారెస్ట్ ఆఫ్ టైగర్స్' అనే పుస్తకం రాశారు అన్ను.
"ఇక్కడ పర్యావరణాన్ని, వనరులను తేలికగా భావించరు. భారతీయులు అడవులను పూజిస్తారు. స్థానికులు మనుగడ సాగించేందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చే అడవులను పూజిస్తారు" అని చెప్పారు.
పులుల దాడుల నుంచి తమను రక్షిస్తుందని నమ్మే బోన్‌బీబీ దేవతను పూజించేందుకు హిందూ ముస్లిం మత్స్యకారులు సుందర్‌బన్స్ సందర్శిస్తారు. ఈ అడవులు బేర్స్ బ్రీచెస్, నిపా పామ్, యాపిల్ లాంటి మొక్కలతో పాటు ఫిషింగ్ క్యాట్, ఎస్టువరైన్ క్రొకోడైల్, కామన్ ఆటర్, మానిటర్ లిజర్డ్, డాల్ఫిన్ లాంటి వైవిధ్యమైన జీవరాశులకు నిలయంగా ఉన్నాయి.
ఈశాన్య భారతదేశంలో ఉండే ఘరో, కాసీ తెగల ప్రజలు ఈ వృక్ష సమూహాల్లోకి మనుషులను అడుగు పెట్టనివ్వకుండా కాపలా కాస్తూ ఉంటారు. ఈ వృక్ష సంపదను వారు చాలా పవిత్రంగా భావిస్తూ చెట్ల నుంచి రాలే పళ్లు, ఆకులను కూడా తీసేందుకు కూడా సంశయిస్తారు.
మధ్య భారతదేశంలో ఉండే గోండ్ తెగ వారు చెట్లను నరకడాన్ని అంగీకరించరు. చెట్ల నుంచి రాలిన పళ్లను మాత్రమే తీసుకుంటారు. "ప్రకృతిని తాకకుండా వదిలేస్తే, దేవతలు సమాజాన్ని పరిరక్షించి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయని నమ్ముతారు" అని జలాయ్స్ చెప్పారు.
అమ్మవారిని పూజిస్తూ ప్రకృతిని పరిరక్షించేవారిని ఆమె ఎల్లప్పుడూ రక్షిస్తుందని రాంబాబు అన్నారు.
కొన్ని ముఖ్యమైన అడవులను పరిరక్షించేందుకు, నిర్లక్ష్యం చేసిన వాటిని పునరుద్ధరించేందుకు పుణెకు చెందిన అప్లైడ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఈఆర్‌ఎఫ్) స్థానికులతో కలిసి పని చేస్తోంది. ఇప్పటి వరకు ఏఈఆర్‌ఎఫ్ 80 ప్రాకృతిక ఆరాధనా స్థలాలను పరిరక్షించింది.
"ఇలాంటి అడవులను పరిరక్షించడంలో ఉన్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు ఏదో ఒక విధానాన్ని సృష్టించని పక్షంలో రానున్న తరానికి అడవులు మిగలవు. క్షేత్ర స్థాయిలో ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది"అని ఏఈఆర్‌ఎఫ్ డైరెక్టర్ అర్చన గాడ్‌బోల్ అన్నారు.
ఆమె గత 30 సంవత్సరాలుగా అడవులను పరిరక్షించే పనులు ఉన్నారు.
స్థానికులతో కలిసి పని చేయడం, ఈ తోటల జీవావరణం గురించి తెలియచేయడం ద్వారా ఏఈఆర్‌ఎఫ్, పశ్చిమ కనుమల్లో అంతరించిపోయే దశలో ఉన్న నాలుగు రకాల హార్న్‌బిల్స్ , పాంగోలిన్‌లను పరిరక్షించగలిగింది. తైలం తీసేందుకు వాడే మొక్కల విత్తనాలు, ఔషధ మొక్కల పై అధ్యయనాలు నిర్వహించింది.
ఈ పరిరక్షణ చర్యల ద్వారా స్థానిక ప్రజలు ఆదాయం సంపాదించుకునేందుకు కూడా ఏఈఆర్‌ఎఫ్ సహాయపడుతుంది. 25 ప్రాకృతిక ఆరధాన స్థలాలను కాపాడేందుకు వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది.
ఉదాహరణకు చెట్లను నరికి వినాశనానికి గురి చేయడానికి బదులు ఔషధంగా పనికొచ్చే బహెడా చెట్టును ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పింది. దీంతో, స్థానికులకు ఆదాయం లభించింది. ఈ బహెడా చెట్టు పై హార్న్‌బిల్స్ గూళ్లు కట్టుకుంటాయి.
"ఏఈఆర్‌ఎఫ్ సహాయంతో బహెడా పళ్లను సేకరించి అమ్మడం మొదలుపెట్టాను. ఇది నా జీవనోపాధికి ఉపయోగపడింది" అని పుణె దగ్గర ఒక గ్రామంలో నివసిస్తున్న సంతోష్ భిడే చెప్పారు.
అడవుల పరిరక్షణ
హరితహారాన్ని 25 - 30 మిలియన్ హెక్టార్ల వరకు విస్తరించి 2030 నాటికి 2-3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను వాతావరణం నుంచి తొలగించాలని భారతదేశం భారీ ప్రణాళిక చేపట్టింది. 2021 ఫారెస్ట్రీ నివేదిక ప్రకారం దేశంలో 81 మిలియన్ హెక్టార్ల మేర అటవీ సంపద విస్తరించి ఉంది.
భారతదేశం దీర్ఘకాలిక వాతావరణ లక్ష్యాలను సాధించేందుకు అటవీ ప్రాంతాన్ని పెంచడం చాలా కీలకం. ప్రభుత్వం నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రాం, గ్రీన్ ఇండియా మిషన్ ద్వారా దేశీయ మొక్కలు, మూలికలు, ఇతర మొక్కల జాతులను పెంచేందుకు ప్రోత్సహిస్తోంది.
ఈ మిషన్ కింద విడుదల చేసిన నిధులలో 82 % అడవులను నాటేందుకు వినియోగిస్తుండగా, మిగిలిన నిధులను నిర్వహణ, పర్యవేక్షణకు ఖర్చు పెడుతున్నారు.
కానీ, అడవుల వినాశనం, నగరీకరణ, పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రయత్నాలను అణచివేస్తున్నాయి.
గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం భారతదేశం 2001 - 2021 మధ్యలో 376,000 హెక్టార్ల అటవీ భూములను కోల్పోయింది.
ఇది 204 మెగాటన్నుల కార్బన్ డయాక్సైడ్‌తో లేదా 100,000 టన్నుల బొగ్గును కాల్చడంతో సమానం.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశంలో సంపన్నమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే పవిత్రమైన తోటలు భద్రంగా ఉన్నాయి. ఇవి వాతావరణంలోని ఉద్గారాలను పీలుస్తూ కార్బన్ సింకుల్లా పని చేస్తున్నాయి.
"కర్నాటక లోని కొడగు లో సుమారు 1214 ప్రాకృతిక ఆరాధనా స్థలాలు ఉన్నాయి. ఇవి 165 కు పైగా దేవతలకు నిలయంగా ఉన్నాయని చెబుతారు. గత 15 ఏళ్లలో పట్టణీకరణ, వ్యవసాయ భూముల ఆక్రమణ కారణంగా ఈ ప్రాంత విస్తీర్ణం బాగా తగ్గిపోయింది"అని కొడగు లో ఫారెస్ట్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ భత్రహళ్లి నారాయణప్ప చెప్పారు.
"కానీ, పట్టణీకరణ చెందని మిగిలిన భూభాగం అద్భుతంగా ఉంది. ఈ అడవులను పరిరక్షిస్తే ఆ అడవుల్లో ఉండే దేవతలు తమను పరిరక్షిస్తారని ప్రజలు నమ్ముతారు. ఈ నమ్మకమే అడవుల పరిరక్షణకు తోడ్పడింది" అని అన్నారు.
పవిత్రమైన అడవులు జీవ వైవిధ్యంతో పాటు అనేక వృక్ష జాతులతో సంపన్నంగా ఉంటాయని 2018లో నిర్వహించిన ఒక అధ్యయనం చెబుతోంది. సెంట్రల్ వెస్ట్రన్ ఘాట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 91 జాతులతో పోలిస్తే పవిత్రమైన అడవుల్లో 144 వృక్ష జాతులను నమోదు చేసినట్లు అధ్యయనం తెలిపింది.
గత 35 ఏళ్లలో సహజంగా పెరుగుతున్న అడవులతో పోలిస్తే సిక్కింలోని దేవ్‌రాలి, ఎన్‌చేలో రెండు అడవులు రెట్టింపు స్థాయిలో కార్బన్ ఉద్గారాలను పీల్చుకున్నాయని ఒక అధ్యయనం పేర్కొంది.
"ఈ ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కాపాడటంలో స్థానిక కమ్యూనిటీల తోడ్పాటు, అడవుల పరిరక్షకులు, స్థానిక దేవతల చుట్టూ అలుముకున్న సంప్రదాయ క్రతువులు చాలా కీలకం" అని జలాయ్స్ చెప్పారు.
పుణెలో స్వచ్చంద సంస్థ దేవ్‌రాయి ఫౌండేషన్ కృత్రిమ అడవులను సృష్టించేందుకు కృషి చేస్తోంది. వీటిని దేవ్‌రాయ్స్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 119 రకాల వృక్ష జాతులను సంరక్షించింది.
ఈ సంస్థ రకరకాల వృక్ష జాతులను నాటుతుంది. కానీ, ఇక్కడ సాగే నిర్మాణ పనుల వల్ల చాలా వరకు మొక్కలు మాయమైపోయాయి. ఈ సంస్థకు సీడ్ బ్యాంక్ కూడా ఉంది. భారతదేశంలో అడవులను పెంచాలనే ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా విత్తనాలను సరఫరా చేస్తుంది. "జీవావరణాలు, అడవులను పరిరక్షించేందుకు స్థానికుల సహకారం చాలా అవసరం" అని దేవ్‌రాయి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘునాథ్ ఢోలే చెప్పారు.
"ఈ అడవులను సంరక్షించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి స్థానికులకు అవగాహన కల్పిస్తాం" అని చెప్పారు.
భారతదేశంలోని చాలా అడవుల్లో ఆలయాలతో కూడుకున్న సరస్సులు కూడా ఉన్నాయి. మొసళ్లు, తాబేళ్లు, బాతులు, చేపల లాంటి జాతుల మనుగడకు ఈ సరస్సులు చాలా ముఖ్యం. ఇవి సహజమైన కార్బన్ సింకుల్లా పని చేస్తాయి.
"అంతరించిపోయే జాతుల్లో ఉన్న కొన్ని రకాల తాబేళ్లు, మొసళ్ళు, అరుదుగా కనిపించే మంచి నీటి స్పాంజ్ లాంటి వాటి పరిరక్షణకు ఇవి కారణమవుతాయి" అని ఢోలే అన్నారు.
"పవిత్రమైన అడవులున్న ప్రతీచోటా మీకొక సరస్సు కూడా కనిపిస్తుంది. ఈ సరస్సులో నీరు వేసవిలో కూడా ఇంకదు" అని బత్తరహళ్లి చెప్పారు.
"దీంతో, కరవు ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రజలకు నీటి సరఫరా జరిగేందుకు తోడ్పడతాయి. ఇవి రైతుల పంటలను వృద్ధి చేసేందుకు సహాయపడతాయి".
" ప్రాకృతిక ఆరాధనా ప్రాంతాలు సక్రమంగా ఉన్నచోట ప్రజలు ఏడాది పొడవునా నీటి సరఫరా ఉంటుంది. వారి జీవనోపాధికి సహకరిస్తుంది" అని బెంగళూరులోని సెంటర్ ఫర్ ఇకలాజికల్ సైన్సెస్ కోఆర్డినేటర్ టీవీ రామచంద్ర చెప్పారు.
పరిమితులు
ప్రాచీన ఆచారాలు అడవులను పరిరక్షిస్తాయని చెప్పినప్పటికీ, ఈ అడవుల చుట్టూ చాలా ఆధునికత కూడా వచ్చి చేరింది.
2000 సంవత్సరంలో 25 హెక్టార్ల మేర విస్తరించిన మణిల్ అయ్యప్ప అడవి ప్రస్తుతం 2 హెక్టార్లు మాత్రమే ఉంది. మిగిలిన ప్రాంతమంతా పట్టణంగా మారిపోయింది.
"అక్కడ పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించారు. ఇక్కడకు విచ్చేసే భక్తులతో చాలా వరకు చెట్లు మాయమైపోవడంతో పాటు చుట్టు పక్కల చాలా చెత్త పేరుకుపోయింది"అని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక భక్తుడు బద్దం నూకరాజు అన్నారు.
"ఈ అడవుల చుట్టూ చోటు చేసుకుంటున్న వ్యాపారీకరణ, భారీ ఆలయాల నిర్మాణం గురించి చాలా ప్రశ్నలు పుడుతున్నాయి" అని రామచంద్ర అన్నారు.
"గతంలో పరిరక్షణకు, ఆచారానికి మధ్య ఒక అనుసంధానం ఉండేది. ఈ అడవులకు హాని జరగకుండా దేవతలను పూజించేవారు. కానీ, వ్యాపారీకరణ వల్ల అడవుల పరిరక్షణ వెనుక దాగిన ముఖ్య ఉద్దేశ్యం మరుగున పడిపోయింది" అని అన్నారు.
వ్యవసాయం, ఇంధనం, మౌలిక సదుపాయాల కల్పన, వేట కోసం అడవుల నరికివేత ఈ అడవులకు పెద్ద ముప్పుగా ఉన్నాయని బత్తరహళ్లి భావిస్తారు.
"చుట్టు పక్కల గ్రామాల్లో చాలా మంది వంట చెరకు కోసం ఇక్కడకు వస్తూ ఉంటారు. జంతువులను వేటాడే ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. వీటికి ఎల్లవేళలా కాపలా కాయలేం" అని కొడగు గ్రామస్థుడు నంజప్ప గౌడ అన్నారు.
భారతదేశంలో జీవావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ప్రాకృతిక ఆరాధనా క్షేత్రాలు చాలా కీలకం" అని చెన్నై లోని సీపీ రామస్వామి అయ్యర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నందిత కృష్ణ అన్నారు. కేవలం ఈ అడవుల పైనే ఆధారపడటం సరైన విషయం కాదని అన్నారు.
"భారతదేశం వాతావరణ లక్ష్యాలను సాధించేందుకు పవిత్రమైన అడవులు చాలా ప్రయోజనకరంగా పని చేస్తాయి. ప్రతీ గ్రామంలో కొన్ని హెక్టార్ల ఇలాంటి ప్రాకృతిక ఆరాధనా స్థలాలు ఉంటే అవి స్థానిక పర్యావరణాన్ని మెరుగుపరుస్తాయి" అని కృష్ణ అన్నారు.
"ఇవి పూర్తి పరిష్కారం కాదు, కానీ జీవావరణాన్ని పరిరక్షించేందుకు వాతావరణ మార్పులతో పోరాడేందుకు పాక్షికంగా పని చేస్తుంది" అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే: రూ.15 వేల కోట్లతో నిర్మించిన రోడ్డు కనీసం 5 రోజులు కూడా వర్షాలను తట్టుకోలేకపోయిందా?
- ఇవి ప్రపంచంలోనే అత్యంత హానికారకమైన నత్తలు: ‘వీటిని తాకొద్దు, తినొద్దు’ - అధికారుల హెచ్చరిక
- రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: విధులు నిర్వర్తించడంలో తడబడిన దర్శకుడు
- అధీర్ రంజన్ చౌదరి: ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటారా... సోనియాగాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బీజేపీ
- ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు.... ఏమిటి దీనికి పరిష్కారం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)