ఇండియా - ఆస్ట్రేలియా ఫైనల్లో అసలు ‘టర్నింగ్ పాయింట్’ అదేనా?

    • రచయిత, అభిజీత్ శ్రీవాత్సవ
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

వన్డే ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా పది మ్యాచులు గెలిచి, ఫైనల్ మ్యాచులో ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి, ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది ఆస్ట్రేలియా.

ఇంతకూ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్ ఏమిటి? మ్యాచ్ భారత్‌కు దూరం కావడం ఎప్పుడు మొదలైంది?

ట్రావిస్ హెడ్(137) ఇన్నింగ్స్‌తో, భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని కేవలం 43 ఓవర్లలోనే సాధించింది ఆస్ట్రేలియా.

భారత్ బ్యాటింగ్‌లో మొదట్లో సజావుగానే జరిగింది. జట్టుకు బలమైన పునాది వేసేందుకు దూకుడుగా బ్యాటింగ్ చేసే ఓపెనర్ రోహిత్ శర్మ, ఫైనల్ మ్యాచ్‌లోనూ తనదైన ఇన్నింగ్స్‌తోనే ముందుకు సాగాడు.

తొలి నాలుగు ఓవర్లలో 30 పరుగులు సాధించింది జట్టు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐదో ఓవర్‌లో వెనుదిరిగాడు.

అయినా రోహిత్ దూకుడు మాత్రం తగ్గలేదు.

పదో ఓవర్‌‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేశాడు. రెండో బంతికి సిక్స్, మూడో బంతికి ఫోర్ కొట్టాడు రోహిత్. అప్పటికి జట్టు స్కోర్ 76 పరుగులు, రన్ రేట్ 8 కన్నా ఎక్కువే ఉంది.

పదో ఓవర్‌తో పవర్ ప్లే ముగుస్తుందనగా, నాలుగో బంతిని పెద్ద షాట్‌గా మలుద్దామని రోహిత్ ప్రయత్నించాడు.

రన్ రేట్‌ ప్రకారం చూసినా, రోహిత్ ఆ బంతిని షాట్ ఆడాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

స్టేడియమంతా నిశ్శబ్దంగా మారిన క్షణం

మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని షాట్ ఆడాలని రోహిత్ చేసిన ప్రయత్నం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. విజయావకాశాలను భారత జట్టుకు దూరం చేసిన ప్రధాన కారణం ఇదే అయ్యింది.

ఆ బంతిని రోహిత్ లాంగ్ ఆఫ్‌లో షాట్ కొడదామని చూశాడు. కానీ ఆ బంతి, బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి, గాలిలో, కవర్ ఏరియా వైపు మళ్లింది.

బంతిని గమనించిన ట్రావిస్ హెడ్, తన స్థానం నుంచి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అసాధ్యం అనుకున్న ఆ క్యాచ్‌ను డైవ్ చేసి మరీ పట్టుకున్నాడు. రోహిత్ పెవిలియన్‌కు చేరాడు.

తొలుత, గాయం కారణంగా ట్రావిస్ హెడ్ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడలేదు. ఐదో మ్యాచ్ నుంచి తిరిగి జట్టులోకి వచ్చాడు. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, జట్టును విజయతీరానికి చేర్చాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒంటి చేత్తో పోరాటం చేస్తున్న డేవిడ్ మిల్లర్(101) ఇచ్చిన క్యాచ్‌ పట్టుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 212 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లోనూ రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకుని, అదే స్థాయిలో మ్యాచ్ మలుపు తిరగడానికి కారణమయ్యాడు.

రోహిత్ ఔట్ తరువాత కామెంటేటర్ హర్ష భోగ్లే, అతి ముఖ్యమైన రోజున, ఫీల్డింగ్‌ మ్యాచ్‌ను ఎలా మలుపు తిప్పగలదో ఆస్ట్రేలియా జట్టు చూపిస్తోంది అని ట్వీట్ చేశారు.

మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్‌ కూడా రోహిత్ ఇచ్చిన క్యాచ్ ఫైనల్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పారు.

రోహిత్ అవుటయ్యే సమయానికి అతడి స్ట్రయిక్ రేట్ 151.61 ఉండగా, జట్టు స్కోరులో 62% అతడి పరుగులే ఉన్నాయి.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజున ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను తమ ప్రదర్శనతో నిశ్శబ్దంగా మార్చుతామన్నాడు. అతడు చెప్పినట్లుగానే రోహిత్ నిష్క్రమణతో స్టేడియం మొత్తం మూగబోయింది.

మ్యాచ్ తరువాత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ- “రోహిత్ వికెట్ పడటం దురదృష్టకరం” అన్నాడు.

చేజారిన మ్యాచ్

వరుసగా వికెట్లు పడుతుండటం వల్ల బ్యాటింగ్‌కు అవకాశం లేకపోయిందని కోచ్ ద్రవిడ్ అన్నాడు.

రోహిత్ తరువాత బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ మూడు బంతులను మాత్రమే ఎదుర్కొని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు.

రాహుల్ ద్రవిడ్ మాట్లాడిన దానిని బట్టి చూస్తే, రోహిత్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ వికెట్ల తరువాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌ వికెట్ల గురించే ప్రస్తావించినట్లు అర్థమవుతోంది.

నిజానికి, విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 54 పరుగులు చేస్తే, కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ స్ట్రయిక్ రేట్ 61.68 మాత్రమే ఉంది.

ఇది మాత్రమే కాదు, రోహిత్, శ్రేయస్‌ల నిష్క్రమణ తర్వాత భారత జట్టు డిఫెన్స్‌లో పడింది. తరువాతి 16 ఓవరల్లో ఒక్క ఫోర్ కూడా సాధించలేకపోయింది. ఎనిమిదిగా ఉన్న రన్ రేట్ కాస్తా ఐదుకు పడిపోయింది.

28.3 ఓవర్ల వద్ద విరాట్ కోహ్లీ అవుటయ్యాక బరిలోకి దిగిన రవీంద్ర జడేజా 22 బంతులకు తొమ్మిది పరుగులే తీశాడు.

జట్టు భారీ స్కోర్ సాధిస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. చివరికి భారత జట్టు 240 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రాహుల్ ద్రవిడ్ ఇంకా ఏమన్నాడు?

మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో, స్లో బ్యాటింగ్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “ఈ టోర్నమెంట్‌లో మేం ఎప్పుడూ భయంగా ఆడలేదు. ఈ మ్యాచ్‌లోనూ అదే కనిపిస్తుంది. తొలి 10 ఓవర్లకే 80 పరుగులు చేశాం. కానీ, ఈ మ్యాచ్‌లో ఎటాకింగ్ గేమ్ ఆడదామన్న ఆలోచనలో ఉండగానే వికెట్లు పడ్డాయి. వరుస వికెట్లు పడుతుంటే, కాస్త డిఫెన్సివ్‌గానే ఆడాలి కదా” అన్నాడు.

"30-40 పరుగులు తక్కువగా చేశామని మాకు తెలుసు. కానీ, వరుసగా వికెట్లు కోల్పోయాం. విరాట్ కోహ్లీ అవుట్ తరువాత, రవీంద్ర జడేజా, రాహుల్‌ కూడా అవుటయ్యారు. ఫలితంగా మరో 30-40 పరుగులు చేయకుండానే ముగించాల్సి వచ్చింది. ఒకవేళ 280 పరుగుల వరకు జట్టు స్కోర్ చేసుంటే, మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది” అని చెప్పాడు.

ఇంకో 30-40 పరుగులన్నా సాధించాల్సింది: రోహిత్ శర్మ

కెప్టెన్ రోహిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జట్టు కనీసం 280 పరుగులు స్కోర్ చేస్తుందని ఆశించామన్నాడు.

"ఈ రోజు మేం అంతగా ఆడలేకపోయాం. నిజానికి, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ క్రీజులో ఉన్నప్పుడు 270-280 పరుగులు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, వేగంగా వికెట్లు కోల్పోయాం. కనీసం 20-30 పరుగులన్నా సాధించాల్సింది కానీ, సాధ్యపడలేదు" అన్నాడు.

భారత్‌ను తక్కువ అంచనా వేయని కమిన్స్

రాహుల్ ద్రవిడ్, రోహిత్ అభిప్రాయాలతో పోలిస్తే, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఉద్దేశం మరోలా ఉంది.

మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ, "ఇండియా 300 పరుగులు చేస్తుందని మేం అంచనా వేశాం" అన్నాడు.

దీనిని బట్టి చూస్తే, ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ కోసం ఎంత సన్నద్ధంగా ఉందో, భారత్‌ను కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహాలతో సిద్ధమైందో తెలుస్తోంది.

లీగ్‌ మ్యాచ్‌లలో భారత్, దక్షిణాఫ్రికాల నుంచి ఓటమి ఎదురయ్యాక, తిరిగి పుంజుకున్న ఆస్ట్రేలియా ఆ తరువాతి ఏడు మ్యాచ్‌లను వరుసగా గెలిచి, సెమీ ఫైనల్‌కు చేరింది.

రెండో లీగ్ మ్యాచ్‌లో తమను ఓడించిన జట్టు (దక్షిణాఫ్రికా)ను సెమీ ఫైనల్లో ఓడించి, ఇంటికి పంపించింది.

తొలి లీగ్ మ్యాచ్‌లో తమకు పరాజయాన్ని మిగిల్చిన భారత్‌ను, ఫైనల్‌లో ఓడించి, టైటిల్‌ను గెల్చుకుంది.

వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఆశలను నీరుగార్చడమే కాదు, టోర్నీలో అన్ని జట్లపై విజయాలను సాధించి, ఆరోసారి టైటిల్‌ను గెలుచుకుని ప్రపంచ క్రికెట్లో తన ఆధిక్యాన్ని చూపింది ఆస్ట్రేలియా.

ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికీ, ఈ ప్రపంచ కప్‌‌లో చాలా సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)