ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో హార్దిక్ పాండ్యా

అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ జరుగుతోంది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌటైంది.

విరాట్ కోహ్లీ (54 పరుగులు), కేఎల్ రాహుల్ (55 పరుగులు) అర్ధ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ కూడా వేగంగా ఆడి 47 పరుగులు చేశాడు.

కానీ శుభ్‌మన్ గిల్ 4 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు, రవీంద్ర జడేజా 9, సూర్య కుమార్ యాదవ్ 18 పరుగులు మాత్రమే చేయగలిగారు.

ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఆసీస్ బౌలర్ల ధాటికి కేఎల్ రాహుల్ మినహా, మిగతా భారత బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

దీంతో హార్దిక్ పాండ్యాను సోషల్ మీడియాలో అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

గాయం కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు హార్దిక్.

'నిన్ను మిస్ అవుతున్నాం పాండ్యా'

ఎక్స్ (ట్విటర్)‌లో అభిమానులు హార్దిక్ గురించి పలు పోస్టులు పెట్టారు.

'స్లాగ్ స్వీప్-189' అనే యూజర్ హార్దిక్ పాండ్యాను ఈ రోజు మిస్ అవుతున్నామని పోస్టు పెట్టారు.

Frosty_11 అనే యూజర్ "మనం హార్దిక్ పాండ్యాను మిగతా రోజుల కంటే ఇవాళ ఎక్కువగా మిస్ అవుతాం" అని రాశారు.

స్టోరీల్స్ అనే పేరుగల అకౌంట్‌లో "హార్దిక్‌ను మిస్ అవుతున్నా. అతను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల కోసమే ఉంటాడు" అని అన్నారు.

సమీర్ అల్లానా అనే అభిమాని 'ఫైనల్ ఆడేందుకు అత్యంత అర్హమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా మాత్రమే' అని పోస్టు పెట్టారు.

ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో పాండ్యా గణాంకాలను కూడా పంచుకున్నారు అభిమానులు.

పాండ్యా స్థానంలో షమీ..

గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా స్థానంలో మొహమ్మద్ షమీ జట్టులోకి వచ్చారు.

ఈ టోర్నీలో 4 నాలుగు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరిన షమీ.. అద్భుత బౌలింగ్‌తో ప్రశంసలు అందుకుంటున్నారు.

ఫైనల్ మ్యాచ్‌లో తాను వేసిన రెండో బంతికే ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన వార్నర్‌ను ఔట్ చేశాడు షమీ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)