You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వలింగ సంపర్కులకు మద్దతుగా భారత్‌లో తొలి 'ప్రైడ్ మార్చ్' ఎప్పుడు జరిగింది... చరిత్ర సృష్టించిన ఈ మార్చ్ కథేంటి?
భారత్‌లో నేడు ప్రైడ్ మార్చ్‌లు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటికి వేల మంది హాజరై స్వలింగ సంపర్కులకు మద్దతు పలుకుతుంటారు. కానీ, 1999లో పరిస్థితులు వేరు. ఆనాడు దేశంలోని తొలి ప్రైడ్ మార్చ్ పశ్చిమ బెంగాల్‌లో ఎలా జరిగిందో జర్నలిస్టు సందీప్ రాయ్ గుర్తుచేసుకున్నారు.
1999 జులై 2న కోల్‌కతాలో జరిగిన మార్చ్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమకర్త పవన్ ఢాల్ పాల్గొన్నారు. దీన్నే భారత్‌లో తొలి ప్రైడ్ వాక్‌గా చెబుతుంటారు. దీనిలో పాల్గొన్న 15 మందిలో పవన్ కూడా ఒకరు.
అమెరికాలో ఎల్‌జీబీటీక్యూ ఉద్యమానికి పునాదివేసిన న్యూయార్క్ స్టోన్‌వాల్ అలర్లకు 30వ వార్షికోత్సవంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ప్రదర్శనల్లో ఇది కూడా ఒక భాగం.
అయితే, జులై అనేది భారత్‌లో రుతుపవన కాలం. దీంతో గులాబీ రంగు త్రిభుజాల బొమ్మలతో పసుపు రంగు టీషర్టులు వేసుకున్న ఆ 15 మంది వర్షంలో బాగా తడిసిపోయారు.
‘‘నిజానికి దాన్ని నడక కంటే ఈతగా చెప్పుకోవాలి’’ అని ఢాల్ చెప్పారు.
అయితే, ఆనాడు ఈ కార్యక్రమాన్ని ‘ప్రైడ్ మార్చ్’కు బదులుగా ‘ఫ్రెండ్‌షిప్ వాక్’గా అభివర్ణించారు. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునేందుకు ఇలా పేరు మార్చారు.
1999 నాటికి భారత్‌లో స్వలింగ సంపర్కం నేరం. దీనికి గురించి పెద్దగా ఎవరూ మాట్లాడేవారు కూడా కాదు. కేవలం కొన్ని నగరాల్లోనే వీరికి మద్దతుగా కొన్ని సంస్థలు పనిచేసేవి.
మెయిలింగ్ లిస్టులు, యాహూ గ్రూప్‌ల ద్వారా అప్పట్లో భారత్‌లోని స్వలింగ సంపర్కులు ఒకరిని ఒకరు కలుసుకునేవారు. ప్రైడ్ మార్చ్ ఆలోచన కూడా వీటి నుంచే పుట్టింది.
1999 ఏప్రిల్ 29న ‘ఎల్‌జీబీటీక్యూ+ ఇండియా గ్రూప్’ కన్వీనర్ ఒవైస్ ఖాన్... ‘న్యూయార్క్ గే లిబరేషన్ డే’ తరహాలో ఇక్కడ కూడా ఒక పాదయాత్రను చేపడదామని భావించారు. దీనిలో గులాబీ రంగు త్రిభుజాలు, ఇంద్రధనుస్సు రంగుల నెమలి బొమ్మలను ఉపయోగించాలని ఆయన అనుకున్నారు.
న్యూయార్క్ లాంటి నగరాల్లో జరిగే ప్రైడ్ మార్చ్‌లతోపాటు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పారు.
అయితే, అందరూ ఖాన్‌లా ఉత్సాహంతో లేరు. ఆ 15 మందిలో ఒకరైన, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ రఫీకుల్ హాక్ దౌజాకు ‘‘పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారు, పశ్చిమ దేశాల ఐడియాలను కాపీ కొడుతున్నారు’’అని దూషణలు కూడా ఎదురయ్యాయి.
మొదట్లో ఢాల్‌కు కూడా దీనిపై అంత ఆసక్తి లేదు. ‘‘కోల్‌కతాలో మరో మార్చ్. ఇలాంటి మార్చ్‌లు నేను చాలా చూశాను. వీటి కోసం చాలా కష్టపడాలి’’ అని తనలో తానే అనుకున్నారు.
కానీ, ఖాన్ మాత్రం ఎలాగైనా ఈ మార్చ్ చేపట్టాలని భావించారు. భారత్‌లోని ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంపై వ్యాసాల సంకలనం ‘గులాబీ బాఘీ’లో ఈ విషయాలను ఖాన్ గుర్తుచేసుకున్నారు. ‘‘మిత్రులారా.. నేను ఒక్కడినే అయినా ఫర్వాలేదు. ఈ మార్చ్ జరుగుతుంది’’ అని తోటి స్వలింగ సంపర్కులకు ఆనాడు ఆయన చెప్పారు.
కేవలం కొద్దిమంది వాలంటీర్లతో ఎలాంటి డబ్బులూ లేకుండా ఈ మార్చ్‌ను నిర్వహించడం అంత తేలిక కాదు.
ఆ రోజు ఉదయం కూడా చాలా అనుమానాలతోనే ఖాన్ నిద్రలేచారు. అసలు ఎవరైనా వస్తారో లేదో అని కూడా ఆయన మనసులో అనుకున్నారు.
మొత్తంగా ఆ మార్చ్‌లో 15 మంది పాల్గొన్నారు. వీరిలో ఏడుగురు కోల్‌కత్తా వాసులే. మిగతావారు దిల్లీ, ముంబయిలతోపాటు పశ్చిమబెంగాల్‌లోని బనగావ్, కుర్సాంగ్ లాంటి చిన్న పట్టణాల నుంచి వచ్చారు.
అసలు ఎందుకు ఈ మార్చ్? అని దీనిలో పాల్గొన్నవారిలో ఒకరిని ఓ వృద్ధురాలు అడిగారు. దీనికి సమాధానంగా ‘హక్కుల కోసం’ అని ఆయన చెప్పారు. ఆ తర్వాత.. ప్రజలు వ్యక్తిగత జీవితంలో తమకు నచ్చినట్లు తాము ఉంటే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో అని ఆమె వ్యాఖ్యలు చేశారు.
మరికొందరు మాత్రం మార్చిని అనుమానంగా చూశారు. కొంతదూరం నడిచిన తర్వాత ఈ మార్చ్‌లో పాల్గొన్నవారు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరిలో కొందరు ప్రభుత్వ కార్యాలయాలు, మానవ హక్కుల కమిషన్‌లను సందర్శించి హక్కులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు.
‘‘మేం అక్కడ ఒక జూనియర్ అధికారిని కలిశాం. ఆయనైతే మమ్మల్ని చూసి చాలా గందరగోళపడ్డారు’’ అని ఢాల్ చెప్పారు.
ఆ రోజు మధ్యాహ్నం దాటిన తర్వాత విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేశారు. అయితే, ఆ మార్చ్‌కు సంబంధించి తాము ఎలాంటి ఫోటోలనూ తీయలేదని కొందరు విలేఖరులు చెప్పారు.
దీంతో కెమెరాల ముందు మరోసారి మార్చ్ చేస్తున్నట్లుగా వారు నడిచారు. ‘‘పత్రికల్లో ఆ ఫొటోలే ప్రచురించారు’’ అని నవ్వుతూ ఢాల్ వివరించారు.
మార్చ్‌లో పాల్గొన్న కొందరి గురించి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియదు. ‘‘ఆ రోజు నేను ఎక్కడికి వెళ్లిపోయానా అని మా ఇంట్లోవారు కంగారు పడ్డారు’’ అని ప్రస్తుతం అట్లాంటాలో జీవిస్తున్న నవరుణ్ గుప్తా చెప్పారు.
మరోవైపు తల్లిదండ్రులు వేరే ఊరికి వెళ్లడంతో ఫ్యాషన్ డిజైనర్ ఆదిత్య మొనాట్ ఆ రోజు మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, మరుసటి రోజు వార్తా పత్రికల్లో ఆ మార్చ్ ఫొటోలు వస్తాయని ఆయన అనుకోలేదు.
పత్రికల్లో ఆ ఫోటోలను ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు చూశారు. ‘‘వారు ఆశ్చర్యపడ్డారు. అలాగే గర్వంగా కూడా ఫీలయ్యారు’’ అని ఆదిత్య తెలిపారు.
కానీ దౌజా విషయానికి వస్తే పత్రికల్లో ఆయన ఫొటో చూసి ఇంటికి పొరుగున ఉండేవారు సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నారు.
‘‘నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి వారు మాకు తెలుసు’’ అని ఆయన చెప్పారు.
ఖాన్ మాత్రం ఆశాభావంతోనే ఉండేవారు. ‘’15 మంది అంటే ఫర్వాలేదు. వారిని లెక్క పెట్టాలంటే కనీసం రెండు చేతులు కావాలి’’ అని ఆయన అనుకున్నారు.
ఆ మార్చ్‌కు విదేశాల నుంచి కూడా స్పందనలు వచ్చాయి.
‘‘నాకు కళ్ల నుంచి నీరు వచ్చాయి’’ అని అమెరికాకు చెందిన ముస్లిం స్వలింగ సంపర్కుల సంఘం అల్ ఫతీహా ఫౌండర్ ఫైజల్ ఆలం చెప్పారు. ఆయన మార్చి నిర్వాహకులకు ఒక లేఖ రాశారు.
‘‘నా లాంటి యువకుల్లో ఈ మార్చ్ కొత్త ఆశలు రేపింది. భారత్‌లోనూ మా లాంటి స్వలింగ సంపర్కులు బహిరంగంగా, గర్వంగా, బయటకువచ్చి హక్కుల కోసం పోరాడొచ్చని దీని ద్వారా తెలిసింది’’ అని క్వీరిస్తాన్ పుస్తక రచయిత పరమేశ్ షహానీ చెప్పారు.
‘‘మన దేశంలోనూ స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవించడం సాధ్యమవుతుందని ఆ మార్చ్ నిరూపించింది’’ అని ఆయన అన్నారు.
ఆ మార్చ్‌కు 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2019లో ఢాల్, ఖాన్, దౌజా మరికొందరు కలిసి ఒక ఫ్రెండ్‌షిప్ వాక్‌ను నిర్వహించారు. అయితే, అప్పుడు ఏదో వేరే దేశంలో నిర్వహించినట్లుగా మార్చ్ జరిగింది.
2018లోనే స్వలింగ సంపర్కం నేరంకాదని భారత్ స్పష్టంచేసింది. ఆ తర్వాత కొన్ని ఏళ్లకు స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేయడంపైనా సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది. మరోవైపు స్వలింగ సంపర్కుల ఉద్యమాలతో ట్రాన్స్‌జెండర్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు.
2019లో చేపట్టిన మార్చ్‌లో భారత్‌లోని చిన్నచిన్న పట్టణాలు, నగరాల నుంచి కూడా ప్రజలు వచ్చారు.
అయితే, ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారలేదు. ‘‘20వ వార్షికోత్సవం కూడా వర్షంతో తడిచింది’’ అని ఢాల్ చెప్పారు.
అయితే, కొన్ని సంతోషకరమైన పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. ఏళ్లపాటు మాట్లాడని తన పొరుగింటి మహిళ దౌజాకు క్షమాపణలు కూడా చెప్పారు.
సరైన పని కోసం మనం కృషి చేస్తూనే ఉండాలని దీని ద్వారా తనకు తెలిసిందని దౌజా అన్నారు. ‘‘ప్రజల మద్దతు ఉంటుంది. ఈ రోజు కాకపోతే, 20 ఏళ్ల తర్వాతైనా వస్తుంది’’ అని ఆయన చెప్పారు.
(సందీప్ రాయ్ కోల్‌కత్తాకు చెందిన జర్నలిస్టు, రచయిత)
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)