యూఏఈలో పనిచేసే భారతీయులకు ప్రయోజనం కలిగేలా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ప్రైవేట్ రంగ ఉద్యోగులకు డిసెంబర్ 2, 3 తేదీలను వేతనంతో కూడిన సెలవులుగా ప్రకటించింది.

అంటే, యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు డిసెంబర్ 2, 3 తేదీల్లో సెలవు రావడంతో పాటు ఆ రెండు రోజులకు వేతనం కూడా లభిస్తుంది.

52వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఏఈ తాజా ప్రకటన చేసింది.

యూఏఈలో డిసెంబర్ 2, 3 తేదీలు జాతీయ సెలవు దినాలు.

1971లో ఇదే రోజుల్లో యూనియన్‌గా యూఏఈ ఏర్పాటైంది.

ఈ ఏడాదితో యూఏఈ ఏర్పాటై 52 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా దుబయ్‌లో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో దేశాభివృద్ధికి సంబంధించిన కథను చెప్పనున్నారు.

యూఏఈ 52వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా డిసెంబర్ 2, 3 తేదీల్లో వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తున్నట్లు యూఏఈ మానవ వనరుల శాఖ ప్రకటించింది.

యూఏఈ పౌరులకు, నాయకత్వానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పింది.

ఇవే కాకుండా, యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అక్టోబర్ 21న కూడా సెలవు ఉంటుంది. అయితే, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త జన్మదినం మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ సెలవు దినం కూడా మారుతుంటుంది.

మూడు రోజుల సెలవులు

‘యూఏఈ మెమోరియల్ డే(సంస్మరణ దినం)’ రోజు పబ్లిక్ హాలీడే ఉంటుంది. అయితే, ఆ రోజున కూడా వేతనంతో కూడిన సెలవు ఇస్తారా, లేదా అనే అంశంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఈ ఏడాది నవంబర్ 30న సంస్మరణ దినం జరుపుకుంటారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని ఈ రోజున వారు స్మరించుకుంటారు.

నిరుడు సంస్మరణ దినం సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సెలవును ఇచ్చారు.

జాతీయ దినోత్సవ సెలవులతో కలిపి నిరుడు ఉద్యోగులకు మూడు రోజుల సెలవు లభించింది.

కానీ, ఈసారి శుక్రవారం రోజున డిసెంబర్ నెల మొదలవుతుంది. అంటే డిసెంబర్ 1వ తేదీ అయిన శుక్రవారం రోజున ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది.

కానీ, ఈసారి అక్కడి నివాసితులకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మూడు రోజులు సెలవులు రానున్నాయి.

జనవరి 1వ తేదీ సోమవారం వేతనంతో కూడిన సెలవు కాగా దీనికంటే ముందు శని, ఆదివారాలు కూడా సెలవు దినాలే. ఇలా వరుసగా మూడు రోజులు సెలవు పొందనున్నారు.

యూఏఈలో భారతీయులు

యూఏఈలోని విదేశీయుల్లో అత్యధికులు భారతీయులే. యూఏఈ జనాభాలో భారతీయులు 30 శాతం ఉంటారు. మొత్తం 35 లక్షల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు.

వీరిలో 20 శాతం మంది అబుదాబిలో, మిగతావారు దుబయ్‌తోపాటు మిగతా ఆరు ఉత్తర ప్రావిన్సులలో ఉంటారు. ఇక్కడున్న ఎక్కువ మంది భారతీయులు పని వెదుక్కుంటూ వచ్చినవారే. కేవలం 10 శాతం మంది మాత్రమే తమ కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడ నివసిస్తారు.

భారత్ నుంచి యూఏఈకి కేరళ ప్రజలే ఎక్కువగా వెళ్తున్నట్లు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

2014లో యూఏఈకి భారత్ నుంచి వలస వెళ్లినవారిలో 38 శాతం మంది కేరళ నుంచే ఉన్నారు. 3 కోట్ల జనాభా గల కేరళలో పది శాతం మంది రాష్ట్రంలో నివసించట్లేదని ఒక అంచనా.

కేరళలో ప్రతీ మూడో ఇంటి నుంచి ఒకరు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలను గల్ఫ్ దేశాలుగా పిలుస్తారు.

రాష్ట్రంలోని బ్యాంకుల డేటా ప్రకారం, గల్ఫ్ దేశాల్లో పని చేసేవారు, ప్రతీ ఏడాది కేరళకు పెద్దమొత్తంలో డబ్బు పంపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో నివసించే కేరళ ప్రజల్లో 20 శాతం మంది కుటుంబంతో జీవిస్తారు. మిగతావారు ఏడాదికి ఒకసారి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)