You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇరానీ బోట్లు'
ఇరాన్ పడవలు గల్ఫ్ ప్రాంతంలో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాయని, రాయల్ నేవీ నౌక రంగంలోకి దిగడంతో అవి వెనుతిరిగాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బీపీ ట్యాంకర్‌కు రక్షణగా ఉన్న హెచ్ఎంఎస్ బ్రిటిష్ యుద్ధనౌకను బలవంతంగా మూడు పడవలు, ట్యాంకర్ మధ్యలోంచి వెళ్ళేలా చేశాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
ఇరానీల చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.
తమ ట్యాంకర్‌ను దిగ్బంధంలోకి తీసుకున్నందుకు ప్రతిచర్యలు ఉంటాయని ఇరాన్ గతంలో హెచ్చరించింది. కానీ, ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ తాము చేయలేదని ప్రకటించింది.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)కు చెందినవిగా భావిస్తున్న పడవలు బ్రిటిష్ హెరిటేజ్ ట్యాంకర్‌ను సమీపించి, గల్ఫ్ దాటి హోర్మూజ్ జల సంధిలోకి వెళ్ళకుండా ఆపాయని భావిస్తున్నారు.
హెచ్ఎంఎస్ మాంట్రోస్ గన్స్‌ను ఇరానీ బోట్లపై గురిపెట్టిన తరువాత అవి వెనక్కి తిరిగాయని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది. హెచ్చరికలకు అనుగుణంగా పడవలు వెనుతిరగడంతో ఎలాంటి కాల్పులు జరగలేదు.
ఇరానీ బోట్లు వచ్చినప్పుడు బ్రిటిష్ హెరిటేజ్ అబూ మూసా వద్ద ఉన్నట్లు బీబీసీకి చెప్పారు. అబూ మూసా దీవి వివాదాస్పద జలాల్లో ఉన్నప్పటికీ, హెచ్ఎంఎస్ మాంట్రోస్ అక్కడి అంతర్జాతీయ జలాల్లోనే ఉండిపోయింది.
ఆ సంఘటనతో ఆందోళన చెందిన బ్రిటన్ ప్రభుత్వం 'ఉద్రిక్తతలు తగ్గించాలి' అని ఇరానీ అధికారులను కోరిందని రక్షణ శాఖ కార్యదర్శి పెన్నీ మార్డాంట్ చెప్పారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి జెరెమీ హంట్ కూడా, యూకే ఈ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని అన్నారు.
ప్రధానమంత్రి థెరెసా మే అధికా ప్రతినిధి, "మా ప్రభుత్వ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయానాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉంది" అని ప్రకటించారు.
ఇరాన్ ఏమంటోంది?
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ నేవీ అధికారులు మాత్రం తాము ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశామన్న ఆరోపణల్లో నిజం లేదని తోసిపుచ్చారు. గత 24 గంటలలో ఏ విదేశీ నౌకకూ తాము ఎదురపడలేదని ఐఆర్‌జీసీ నేవీ ప్రకటించింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్, 'ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడానికే బ్రిటన్ ఈ ఆరోపణలు చేస్తోంది' అని ఆరోపించారు.
"ఈ ఆరోపణలకు ఎలాంటి విలువ లేదు" అని జరీఫ్ చెప్పినట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- భారత జట్టు భవిష్యత్ ఏంటి... ప్రపంచ కప్ మిగిల్చిన జ్ఞాపకాలేంటి...
- ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవలలు పుడతారా...
- #BottleCapChallenge: ఈ వైరల్ బాటిల్ క్యాప్ చాలెంజ్ ఏంటి? ఎందుకు?
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)