You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తర కాశీ: కూలిన సొరంగంలోకి డ్రిల్లింగ్ ఎలా చేస్తున్నారు... లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలు ఏ దశలో ఉన్నాయి?
ఉత్తర కాశీ సిల్క్యారా గ్రామంలో సొరంగం కూలిపోయి అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు 11 రోజులుగా కొనసాగుతున్న సహాయ చర్యలు దాదాపు పూర్తి కావస్తున్నాయి.
41 మంది కార్మికులను బయటకి తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలలో ఈరోజు (నవంబర్ 22) ఎంతో ముఖ్యమైన రోజు.
సహాయక సిబ్బంది వీరిని కాపాడేందుకు కూలిపోయిన సొరంగంలోని శిథిలాల్లోకి 45 మీటర్లు డ్రిల్ చేసుకుంటూ వెళ్లారు. ఇంకా 12 మీటర్లనే డ్రిల్ చేయాల్సి ఉంది.
అంతకుముందు నిర్వహించిన పత్రికా సమావేశంలో 39 మీటర్లు డ్రిల్ చేసుకుంటూ వెళ్లినట్లు అధికారులు చెప్పారు.
ప్రస్తుతం మరో 6 మీటర్లు డ్రిల్ చేశారు. దీంతో మొత్తంగా 45 మీటర్ల వరకు డ్రిల్ చేసి పైప్‌లైన్‌ను వేసినట్లు ఉత్తరఖాండ్ ప్రభుత్వానికి చెందిన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు.
అమెరికన్ ఓగర్ మెషిన్‌తో సొరంగ శిథిలాలను డ్రిల్ చేస్తున్నారు. తదుపరి దశ పనులు ప్రారంభమయ్యాయని కూడా ఖుల్బే తెలిపారు.
సహాయక చర్యలలో భాగంగా ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సిల్క్యారా సొరంగంలోకి వెళ్లినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని వారు లోపలికి వెళ్లారు.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడి బయటకు తీసుకుని వచ్చిన తరువాత తక్షణ వైద్య సేవలు అందించేందుకు వీటిని అక్కడికి తీసుకువచ్చారు.
మొత్తం 30 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ రాత్రికి సహాయక చర్యలు పూర్తవుతాయని తమకు అలర్ట్ వచ్చిందని అంబులెన్స్ స్టాఫ్ చెప్పారు. వారికి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచామని తెలిపారు.
అంతకుముందు రోడ్లు, రవాణా విభాగానికి చెందిన అదనపు కార్యదర్శి (టెక్నికల్) మహమ్మూద్ అహ్మద్, ఉత్తరాఖండ్ రాష్ట్ర కార్యదర్శి నిరాజ్ ఖైర్వాల్‌లు బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఈ రాత్రికి లేదా గురువారం ఉదయానికి సహాయక చర్యలు పూర్తవుతాయి’’ అని చెప్పారు.
త్వరలోనే కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొస్తామని ఆశిస్తున్నామని వారన్నారు.
‘‘డ్రిల్ చేయడం అయిపోతే, 6 అంగుళాల పైప్‌ను మేం పంపిస్తాం. దీనికి ఎంతో సమయం పట్టదు. కానీ, డ్రిల్ చేసి తొలి పైప్‌ను పంపించిన తర్వాత, దానికి వెల్లింగ్ రెండో పైప్‌కు కలపాలి’’ అని మహమ్మూద్ అహ్మద్ చెప్పారు. దీనికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందన్నారు. ఈ సమయాన్ని మూడున్నర గంటలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా చెప్పారు.
సొరంగంలోని శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను తాము మైక్రోఫోన్, స్పీకర్ ద్వారా సంప్రదించినట్లు రెస్క్యూ ఆపరేషన్ నోడల్ అధికారి నీరజ్ ఖైర్వాల్ తెలిపారు.
దీని ద్వారా ప్రతి కార్మికుడితో తమ డాక్టర్లు మాట్లాడుతున్నారని చెప్పారు. వారి మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, సైకియాట్రిస్ట్‌తో కూడా మాట్లాడిస్తున్నామని చెప్పారు.
వారికి ఆహారాన్ని కూడా సహాయక సిబ్బంది అందిస్తున్నారు. తాజా ఆహారం, నిత్యావసరాలు అంటే బట్టలు, బ్రష్, టవల్ వంటి వాటిని వారికి సరఫరా చేస్తున్నారు.
వారు బయటికి వస్తే మా సంతోషానికి అవధులుండవు
ఈ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఒకరి బంధువు ఇంద్రిజీత్ కుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. అందులో చిక్కుకున్న వారు బయటకి వస్తే తన సంతోషానికి అవధులు ఉండవని అన్నారు.
‘‘నా సోదరుడు, నాకు తెలిసిన మరో వ్యక్తి ఈ శిథిలాల్లో చిక్కుకున్నారు. అధికారులు చెప్పేదంతా నిజమే. నా సోదరుడితో మాట్లాడేందుకు నేను ఉదయం ఆరింటికి టన్నెల్ లోపలికి వెళ్లాను. అతను బయటికి వస్తే మా సంతోషానికి అవధులుండవు’’ అని ఆయన అన్నారు.
ఉత్తర కాశీ సొరంగం నుంచి తొలి వీడియో
సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులకు సంబంధించిన వీడియోను న్యూస్ ఏజెన్సీ పీటీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కార్మికులు సొరంగం లోపల నిల్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు కనిపించారు.
లోపలున్న వారు బాగున్నారని తెలియగానే కుటుంబ సభ్యులకు, సహాయక సిబ్బందికి, అధికారులకు ఆశలు పెరిగాయి.
ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా వీరిని చూశారు. ఆరు అంగుళాల ఫుడ్ పైప్‌లైన్ ద్వారా ఈ కెమెరాను లోపలికి పంపారు. ఈ వీడియోలో కార్మికులు పసుపు, తెల్లటి రంగులో ఉన్న హెల్మెట్లు ధరించి ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పైప్‌లైన్‌లో వచ్చిన ఆహారాన్ని వారు తీసుకుంటున్నారు.
సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిస్థితి ఎలా ఉందోనని భయపడుతున్న కుటుంబాలకు ఈ వీడియో ఊరటనిచ్చింది.
70 శాతం పనులు పూర్తి
నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగం.
బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఇది ఒక వివాదాస్పద ప్రాజెక్టు అని, దీని వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని, ఇప్పటికే అదో పెద్ద సమస్యగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో 2020లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 2024 చివరి నాటికి ఈ సొరంగ నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు.
అయితే, ఇప్పుడు జరిగిన ప్రమాదం మూలంగా దీని నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో సోషల్ మీడియా ప్రచారం గీత దాటుతోందా... బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ యాడ్స్‌పై నిషేధం ఎందుకు?
- క్యాన్సర్: పొగతాగే వారిలో లంగ్ క్యాన్సర్ దారుణంగా పెరుగుతోంది... హెచ్చరిస్తున్న తాజా నివేదికలు
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- కేసీఆర్ ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల పాత్ర ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా?
- పట్టిసీమ: కృష్ణా డెల్టా రైతులకు ఇదే పెద్దదిక్కు అయ్యిందా? మరి పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)