You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, దూసుకొస్తున్న ‘‘మొంథా’’ తుపాను
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం (27.10.25) నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బీబీసీకి తెలిపింది.
"దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి" అని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాధ కుమార్ బీబీసీతో చెప్పారు.
‘‘మొంథా’’ గా పిలిచే ఈ తుపాను కాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తరువాత తీరం దాటుతుందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది.
ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
అల్పపీడన ప్రభావంతో...
రెండు, మూడు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు ఉన్నట్టుండి కురవడం మధ్యలో ఆగడం...మళ్లీ భారీగా కురవడం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఈ వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
"అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. అది తీవ్రవాయుగుండంగా మారి... 27న అంటే సోమవారం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది." అని జగన్నాధ కుమార్ వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తపానుగా మారుతున్న క్రమంలో.,..ఏర్పడే వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే అయిదు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఎప్పుడెప్పుడు...ఎక్కడెక్కడ వర్షాలంటే...
భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసింది. ఇప్పటీకే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని...ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయనే ప్రకటనను విడుదల చేసింది.
శనివారం(25-10-25) :
* కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఆదివారం(26-10-25) :
* గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అలాగే కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సోమవారం(27-10-25) :
• కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
తీరం వెంబడి బలమైన గాలులు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో "తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదు. ...తదుపరి సూచనలు వచ్చేవరకు బోట్లను లంగరు వేసి ఉంచితే మంచిది," అని జగన్నాధకుమార్ తెలిపారు
రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
"మెరుపులతో కూడిన వర్షం, ఉరుములు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హోర్డింగ్‌లు ఉన్న ప్రదేశాల్లో నిలవకండి. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్‌లో ఉంచకూడదు" అని అధికారులు జాగ్రత్తలు సూచించారు.
సోషల్ మీడియా వదంతులను నమ్మకండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడనుందన్న వాతావరణ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లలతో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం నుండి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112, 1070, లేదా 1800-425-0101 నంబర్లకు సంప్రదించాలని చెప్పారు.
సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)