గురు మా: ముంబయిలో అరెస్టైన ఈ బంగ్లాదేశీ ట్రాన్స్‌జెండర్ పర్సన్‌ 200 మంది అనుచరులతో భారత్‌లో ఏం చేస్తున్నారు?

    • రచయిత, అల్పేష్ కర్కరే
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని గోవండిలో బంగ్లాదేశ్‌కు చెందిన 'గురు మా' అలియాస్ బాబు ఖాన్ అనే ట్రాన్స్‌జెండర్‌ పర్సన్‌ను ముంబయి పోలీసులు అక్టోబర్ 17న అరెస్టు చేశారు.

నకిలీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి ఈ 'గురు మా' దశాబ్దాలుగా దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి ముంబయిలోని వివిధ ప్రాంతాలలో 20కి పైగా ఆస్తులున్నాయని, సదరు వ్యక్తిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు.

గురు మా తో సంబంధాలున్న 200 మందికి పైగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ముంబయిలోని వివిధ ప్రదేశాలలో నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఆ వ్యక్తులను, వారి న్యాయవాదులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, అందుబాటులోకి రాలేదు. వారి స్పందన రాగానే అప్‌డేట్ చేస్తాం.

ముంబయిలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై సామాజిక కార్యకర్త కృష్ణ ఆడేల్కర్ ఈ ఏడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు చర్యలు తీసుకున్నట్లు ఆడేల్కర్ చెప్పారు.

ముంబయిలో బంగ్లాదేశ్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సంబంధించిన పెద్ద ముఠా పనిచేస్తోందని ఆడేల్కర్ ఆరోపించారు. వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

'కిన్నర్ మా' అనే సంస్థ, దాని నాయకులు బంగ్లాదేశ్ పౌరులకు ఆశ్రయం కల్పిస్తున్నారని, వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ ఆరోపణల తర్వాత, "కిన్నర్ మా" సంస్థకు చెందిన 12 మంది సభ్యులు విక్రోలీలో మూకుమ్మడిగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆడేల్కర్ ఆరోపణలు తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఆత్మహత్యకు యత్నించిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆడేల్కర్ తమ పరువు తీశారని, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కొంతమంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు మీడియాతో చెప్పారు.

(ఆత్మహత్య తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, భారత ప్రభుత్వ జీవన్‌సాతీ హెల్ప్‌లైన్ 1800 233 3330 నుంచి సహాయం పొందవచ్చు. మీరు మీ స్నేహితులు బంధువులతో కూడా మాట్లాడండి).

అసలేం జరిగింది?

భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై గత ఏడాదిగా భద్రతా సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముంబయిలో కూడా పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో, గోవండిలోని రఫీక్ నగర్ నుంచి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై ఒక ఫిర్యాదు అందింది. దీంతో, బాబు ఖాన్ అలియాస్ 'గురు మా'తో సహా పలువురి పత్రాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గురు మా వద్దనున్న పత్రాల్లో చాలా తేడాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. వారి పత్రాలు నకిలీవని (ఫోర్జరీ చేసినవి) తేలింది.

'గురు మా' బంగ్లాదేశ్ సిటిజెన్ అని పోలీసులు తెలిపారు. దీంతో, 'గురు మా'‌పై అక్రమ నివాసం, ఇతర సెక్షన్ల కింద గోవండి శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రస్తుతం 'గురు మా' జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఎవరీ గురు మా?

అరెస్టైన 36 ఏళ్ల గురు మా అలియాన్ బాబు ఖాన్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గురువు. ముంబయిలోని గోవండి ప్రాంతంలో చాలా ఏళ్లుగా నివసిస్తున్నారు.

'గురు మా' తనను తాను 'ఇండియన్ సిటిజెన్'గా చూపించుకోవడానికి జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ వంటి నకిలీ పత్రాలను సృష్టించారని పోలీసులు తెలిపారు.

దీంతో పోలీసులు గురు మాతో సంబంధం ఉన్న ఇతరులెవరు, వాళ్లు ఎక్కడెక్కడున్నారు వంటి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

మానవ అక్రమ రవాణా, మోసం వంటి నేరాల కింద గురు మా పై గతంలో ముంబయిలోని శివాజీ నగర్, నార్పోలి, దేవ్‌నార్, ట్రోంబే, కుర్లా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

"గురు మాను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది" అని శివాజీనగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనఘా సతవ్సే బీబీసీతో చెప్పారు.

ఆడేల్కర్‌పై ఫిర్యాదు

ముంబయితో సహా రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు పదేపదే డిమాండ్ చేస్తున్నారు.

దేశంలోకి చొరబడి డ్రగ్స్, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై, వారికి మద్దతు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులు, ముంబయి పోలీసులకు 2025 ఏప్రిల్‌లో సామాజిక కార్యకర్త కృష్ణ ఆడేల్కర్ ఒక లేఖ రాశారు.

గురు మా అరెస్టు అనంతరం, కేవలం ఒక వ్యక్తిపై కాకుండా ఇందులో ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవాలని, మొత్తం రాకెట్‌ను ఛేదించాలని ఆడేల్కర్ డిమాండ్ చేశారు.

"గురు మా లాగే, ముంబయి శివారు ప్రాంతంలోని కిన్నర్ మా సంస్థ, దాని హెడ్ సల్మా ఖాన్‌పై కూడా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. వారికి అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది?. వారు ప్రజలను దోచుకుంటున్నారా? అక్రమ వ్యాపారం చేస్తున్నారా? గురు మా అనేది ఒక లింక్ మాత్రమే. ఇతర చొరబాటుదారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?" అని ఆడేల్కర్ ప్రశ్నించారు.

మరోవైపు, తమపై ఆరోపణలు చేస్తున్న ఆడేల్కర్‌పై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

"ఆడేల్కర్ ఆరోపణలు అవాస్తవం, నిరాధారం. మా సభ్యులలో ఒకరు ఫిర్యాదు చేయడంతో గతంలో ఆయన అరెస్టయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రతీకారానికి దిగారు" అని కిన్నర్ మా సంగఠన్‌కు చెందిన సల్మా ఖాన్ బీబీసీతో అన్నారు.

"గురు మా తో మాకు సంబంధం లేదు. బంగ్లాదేశీయులపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. కానీ, తమ పరువు తీస్తున్నారని ట్రాన్స్‌జెండర్ సమాజం బాధపడుతోంది. దీని కారణంగా మా సభ్యులు కొందరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీనికి కారణమైన వారిపై విచారణ జరపాలి" అని సల్మా ఖాన్ అన్నారు.

పార్క్‌సైట్ పోలీసులు దీనిపై ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)