You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అటకామా పూవై పూచెనో - ఎడారిలో పుష్ప విలాసం
అటకామా ఎడారి.. చిలీ దేశంలో అటు ఆండీస్ పర్వతాలు, ఇటు పసిఫిక్ మహాసముద్రం నడుమ సన్నగా, పొడవుగా విస్తరించి ఉంటుంది.
ఇక్కడి తీవ్రమైన పొడి వాతావరణం కారణంగా రాత్రిపూట ఆకాశాన్ని అత్యంత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో ఇదొకటి.
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌కు నిలయంగా ఈ ఎడారి ప్రసిద్ధి చెందింది.
సాధారణంగా బీడుగా ఉండే ఈ అటకామా ఎడారి ప్రాంతం, శీతాకాలంలో దక్షిణార్ధగోళంలో గణనీయంగా పెరిగిన వర్షపాతం కారణంగా ఇప్పుడు రంగురంగుల అందమైన అడవిపూలతో తివాచీలా కనువిందు చేస్తోంది.
అనేక ఏళ్లకొకసారి కనిపించే అద్భుతమైన దృశ్యంగా దీన్ని భావిస్తున్నారు.
సగటు కన్నా ఎక్కువ వర్షపాతం ఈ ఎడారి నేలను తడిపినప్పుడు.. అంతవరకు భూమిలో నిద్రాణ స్థితిలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి.
అలా పెరిగిన మొక్కలతో అడవిపూలు విరగబూశాయి.
ఇది 'ప్రకృతి' సౌందర్యం...
సాధారణంగా అటకామా ఎడారిలో ప్రతి సంవత్సరం 15 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది.
కానీ ఈ ఏడాది ఆగస్టు నెలలోనే 12 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అందులో ఎక్కువ భాగం ఒకే ఒక్క రోజు కురిసిందే.
అంతకుముందు, జూన్ నెలలో ఆ ఎడారి ప్రాంతమంతటినీ మంచు కప్పేయడం కనిపించింది.
సాధారణంగా ఎడారిలో అనూహ్యమైన, అరుదైన అధిక వర్షపాతం, అధిక హిమపాతం అక్కడి నేలలో నిద్రాణంగా ఉన్న విత్తనాలను మేల్కొల్పాయి.
అద్భుతమైన అడవిపూల తివాచీలు ఏర్పడటానికి దోహదం చేశాయి.
ప్రపంచంలో మరెక్కడా కనిపించని పువ్వులు
ఈ అద్భుతమైన పువ్వుల వికాసం సాధారణంగా ఆగస్టు నెలాఖరు నుంచి నవంబరు రెండో వారం వరకు ఉంటుంది.
200 కంటే ఎక్కువ విభిన్న రకాల అడవి పువ్వులతో ఇది ఆవిష్కృతమైంది.
వీటిలో కొన్ని జాతుల పూలు ప్రపంచంలో మరెక్కడా పెరగవు.
2024లో కూడా ఈ ప్రాంతంలో అధిక వర్షపాతం కారణంగా ఈ అరుదైన పుష్ప సోయగం కనిపించింది.
ఈ దృశ్యం మరికొన్ని వారాల పాటు ఉంటుందని చిలీ నేషనల్ ఫారెస్ట్ కార్పొరేషన్ చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)