You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీకు విపరీతంగా చెమట పడుతుంటే ఏం చేయాలి, శరీరంపై ఎక్కడెక్కడ డియోడరెంట్ వాడకూడదు?
- రచయిత, ఎస్తర్ కాహుంబి
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఎక్కువసేపు బయట తిరిగిన తర్వాత, లేదంటే ఎవరినైనా కలిసే ముందు మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందని మీకెప్పుడైనా అనిపించిందా?
ఈ రకమైన ఆందోళనను సోషల్ మీడియా మరింత తీవ్రం చేస్తుంది. ఎందుకంటే, 'ఫ్రెష్‌గా' ఉండడం గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు కనిపిస్తాయి. కొన్నింటిలో ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ శరీరమంతా డియోడరెంట్ పూసుకుంటున్నట్లు ఉంటే, మరికొన్ని బస్సులు, రైళ్లలో ప్రయాణించేప్పుడు తోటి ప్రయాణీకుల నుంచి దుర్వాసన వస్తోందంటూ ఫిర్యాదు చేస్తున్నట్లు ఉంటాయి.
అయితే, నిపుణులు మాత్రం చెమట పట్టడమనేది సర్వసాధారణమైన విషయమని అంటున్నారు. అంటే, శరీర శుభ్రత లేకపోవడం కాదు, ఇది శరీరపు సహజ ప్రక్రియ.
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు తరచుగా చెమట పడుతుంది. ఈ చెమట శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి సాయపడుతుంది.
చెమట పట్టడంపై సాధారణంగా రేకెత్తే ప్రశ్నలకు సమాధానాలు.. రోజంతా తాజాగా ఉండడానికి సులువైన మార్గాల గురించి తెలుసుకునేందుకు బీబీసీ నిపుణులతో మాట్లాడింది.
చెమట నుంచి దుర్వాసన ఎందుకొస్తుంది?
శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట ఉత్పత్తవుతుంది. ఇందులో ప్రధానంగా నీరు, ఉప్పు ఉంటుంది. చెమట ఆరిపోయినప్పుడు, వేడి బయటకు వెళ్లి శరీరం చల్లబడుతుంది.
కానీ, ఇక్కడ గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే, చెమట నుంచి నేరుగా దుర్వాసన రాదు.
మన శరీరంలో రెండు నుంచి నాలుగు మిలియన్ల వరకు స్వేద గ్రంథులు ఉంటాయని ప్రొఫెసర్ స్పియర్ వివరిస్తున్నారు.
ఇవి రెండు రకాల చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఒకటి నీటిలాంటిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మరో దానిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా, కొవ్వుతో కూడిన చెమట చంకలు, తొడల చుట్టూ పేరుకుపోతుంది. బ్యాక్టీరియా దానిని విచ్ఛిన్నం చేసినప్పుడు, దాని నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది.
చెమట పట్టడం శరీరానికి మంచిదే. కాకపోతే ప్రతిఒక్కరూ శుభ్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలనే కోరుకుంటారు.
అలాగని, చెమట పట్టకుండా ఉండేందుకు ప్రయత్నించకూడదు. దానిని ఎలా నిర్వహించాలో ( మెయింటైన్) నేర్చుకుంటే, జీవనం సాఫీగా సాగిపోతుందని నిపుణులు అంటున్నారు.
రోజంతా ఫ్రెష్‌గా ఉండడం సాధ్యమేనా?
చెమట, దుర్వాసనను నివారించేందుకు సబ్బు, నీటితో స్నానం చేయడం సులువైన మార్గం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, స్నానం ఎప్పుడెప్పుడు చేయాలి?
కొంతమంది రోజూ స్నానం చేయాలని సూచిస్తుంటే, మరికొందరు వారానికి మూడుసార్లు చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
స్నానం చేసేప్పుడు చంకలు, తొడలు, పాదాలను శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యమని ప్రొఫెసర్ స్పియర్ అంటున్నారు.
"స్నానం చేసేటప్పుడు శరీరమంతా తడుస్తుంది. కానీ, చాలామంది తమ పాదాలను కడుక్కోవడం మర్చిపోతారు. పాదాలను కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి."
అలాగే, మన దుస్తులు కూడా చెమట వల్ల ప్రభావితమై దుర్వాసనను వెదజల్లుతాయి.
కాటన్, లినెన్ వంటి దుస్తులు చెమటను పీల్చుకుంటాయి. అయితే, సింథటిక్ దుస్తులు చెమటను పీల్చుకోవు. దీంతో వేడి, అసౌకర్యంగా ఉంటుంది.
చెమట వాసనను నియత్రించడంలో డియోడరెంట్లు, యాంటీపెర్స్పిరెంట్లు కూడా సాయపడతాయి. డియోడరెంట్స్‌లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది చర్మాన్ని కొద్దిగా ఆమ్లంగా చేస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. దీంతో దుర్వాసన తగ్గి, డియోడరెంట్ సువాసనే వస్తుంది.
యాంటీపెర్స్పిరెంట్లలో అల్యూమినియం లవణాలు ఉంటాయి. ఇవి చెమట గ్రంథులను అడ్డుకుని, ఎక్కువగా చెమట పట్టకుండా చేస్తాయి.
రాత్రిపూట యాంటీపెర్స్పిరెంట్ రాసుకుని ఉదయం కడిగేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
రాత్రిపూట చెమట గ్రంథులు తక్కువగా పనిచేస్తాయి. కాబట్టి, అల్యూమినియాన్ని శరీరం సులభంగా శోషిస్తుంది. ఇది నెమ్మదిగా పేరుకుపోతుంది, వాటి ప్రభావం కూడా క్రమంగా కనిపిస్తుంది.
యాంటీపెర్స్పిరెంట్లు హాని చేస్తాయా?
యాంటీపెర్స్పిరెంట్స్ రొమ్ము క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతాయనే సందేహాలు చాలాకాలంగా ఉన్నాయి.
"కానీ, ఇప్పటివరకు ఉన్న ఆధారాలు అవి సురక్షితమైనవనే సూచిస్తున్నాయి. యాంటీపెర్స్పిరెంట్లు క్యాన్సర్‌కు కారణమవుతాయని ఏ అధ్యయనం ఇంకా నిరూపించలేదు" అని డాక్టర్ నోరా జాఫర్ అంటున్నారు.
అల్యూమినియం లవణాలు చర్మంపై స్వల్పకాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతాయని, అవి ఏర్పరచే పొర చర్మంతో పాటే పోతుందని ఆమె వివరించారు.
అయితే, ఈ ఉత్పత్తులను సరిగ్గా వాడకపోవడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
"ఒక యాంటీపెర్స్పిరెంట్ 72 గంటలు లేదా 48 గంటలు పనిచేస్తుందని విక్రయదారు చెప్పింది నమ్మి వినియోగదారులు స్నానం చేయకపోతే, స్వేదగ్రంథులకు అడ్డంకులు ఏర్పడి, చికాకు కలిగిస్తాయి" అని ప్రొఫెసర్ స్పియర్ వివరించారు.
చెమట, మృతకణాలు చర్మంపై పేరుకుపోయినప్పుడు, చెమట గ్రంథులు మూసుకుపోయి చికాకు కలిగిస్తాయి.
చంకలు పొడిగా ఉన్నప్పుడు మాత్రమే అల్యూమినియం కలిగిన ఉత్పత్తులను రాసుకోవాలని చర్మ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఎందుకంటే, చర్మం తడిగా ఉన్నప్పుడు అల్యూమినియం క్లోరైడ్ నీటితో కలిసి ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, ఇది కూడా చికాకు కలిగిస్తుంది.
నేచురల్ డియోడరెంట్స్ పనిచేస్తాయా?
నేచురల్ డియోడరెంట్స్ ఈ రోజుల్లో ప్రజాదరణ పొందుతున్నాయి. అల్యూమినియం లేదా కృత్రిమ సువాసనలను నివారించాలనుకునే వారి కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.
ఈ డియోడరెంట్స్‌లో సాధారణంగా సహజ యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు లేదా మొక్కల నూనెలు ఉంటాయి. ఇవి దుర్వాసనను తగ్గిస్తాయి. అదనంగా, బియ్యం లేదా టాపియోకా స్టార్చ్(సగ్గుబియ్యం గంజి) వంటి చెమటను శోషించే పదార్థాలుంటాయి.
"ఇవి స్వేద గ్రంథులను మూసివేయవు, కాబట్టి మృదువుగా ఉంటాయి. వాసనను మాత్రమే ప్రభావితం చేస్తాయి" అని డాక్టర్ జాఫర్ వివరించారు.
"సహజమైనవి అంటే, అవి ఎలాంటి సమస్యలను కలిగించవని కాదు. వాటిలో ఉపయోగించే ముఖ్యమైన నూనెలు లేదా బేకింగ్ సోడా వంటి పదార్థాలు సున్నితమైన చర్మంపై దద్దుర్లు కలిగిస్తాయి" అని ఆయన తెలిపారు.
ఇవి ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపవచ్చు. ఇది చర్మంలోని బ్యాక్టీరియా, డియోడరెంట్లోని పదార్థాలపై ఆధారపడి ఉంటుంది.
ఎక్కువగా చెమట పడుతున్నట్లయితే, ఈ డియోడరెంట్స్ అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. కానీ, అల్యూమినియం వాడకుండా ఉండాలనుకునేవారికి ఇవి బెటర్ ఆప్షన్.
డియోడరెంట్‌ను శరీరంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చా?
ఇప్పుడు జనం ఏ డియోడరెంట్ లేదా యాంటీపెర్స్పిరెంట్ వాడాలి? శరీరంలో ఎక్కడెక్కడ వాడొచ్చు? అనే విషయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.
బ్రిటన్, అమెరికాల్లో ప్రైవేట్ పార్ట్స్‌తో సహా అన్నిచోట్లా వాడుకోవచ్చని చెబుతున్న కొత్త రకం డియోడరెంట్స్ అమ్ముడవుతున్నాయి.
కొన్ని ఉత్పత్తులు మీరు స్నానం చేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తాయని, మరికొన్ని 72 గంటల వరకు దుర్వాసన రాకుండా చేస్తాయని కూడా పేర్కొంటున్నారు.
అయితే, శరీరమంతటా డియోడరెంట్ కొట్టుకోవాల్సిన అవసరం లేదని.. ముఖ్యంగా ప్రైవేట్ భాగాల వద్ద అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
"జననేంద్రియ ప్రాంతాలు చాలా సున్నితమైనవి. అక్కడ డియోడరెంట్ వాడటం వల్ల చర్మం ఎరుపుబారడం, అలెర్జీలు రావొచ్చు. అలాగే, సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది" అని డాక్టర్ జాఫర్ హెచ్చరిస్తున్నారు.
"సబ్బు లేదా నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది" అని ఆయన సూచిస్తున్నారు.
చెమట ఎప్పుడు ఆందోళనకరం?
కొంతమంది హైపర్ హైడ్రోసిస్‌తో బాధపడుతుంటారు, అంటే వారికి అవసరమైన దానికంటే ఎక్కువ చెమట పడుతుంది.
హైపర్ హైడ్రోసిస్‌తో బాధపడేవారిలో స్వేద గ్రంథులు అతి చురుగ్గా మారి అధిక చెమటను ఉత్పత్తి చేస్తాయని ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ పేర్కొంది.
కొన్నిసార్లు ఇది హార్మోన్ల మార్పులు, థైరాయిడ్ సమస్య, ఇన్ఫెక్షన్ వంటి ఇతర వ్యాధుల లక్షణం కూడా కావొచ్చని వైద్యులు అంటున్నారు.
దీనికి సంబంధించిన చికిత్సలో ఎక్కువ అల్యూమినియం లవణాలు కలిగిన బలమైన యాంటీపెర్స్పిరెంట్లను ఉపయోగిస్తారు. ఇది చెమటను తగ్గిస్తుంది.
కొన్ని సందర్భాల్లో, బొటాక్స్ ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. సమస్య తీవ్రమైన సందర్భాల్లో, శస్త్రచికిత్స ద్వారా స్వేద గ్రంథులను తొలగిస్తారు.
"మీకు ఎక్కువగా చెమటలు పడుతున్నట్లు అనిపిస్తే, బిడియ పడకుండా డాక్టర్ సహాయం తీసుకోండి" అని ప్రొఫెసర్ స్పియర్ సలహా ఇస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)