ద వరల్డ్: పెద్ద కారు సైజ్ కెమేరా, 3200 మెగా పిక్సెల్ సామర్థ్యం.. అంతరిక్షం ఫొటోలు తీస్తుంది

వీడియో క్యాప్షన్, ద వరల్డ్: అంతరిక్ష రహస్యాలను ఈ అబ్జర్వేటరీ వెలుగులోకి తేనుందా?
ద వరల్డ్: పెద్ద కారు సైజ్ కెమేరా, 3200 మెగా పిక్సెల్ సామర్థ్యం.. అంతరిక్షం ఫొటోలు తీస్తుంది

అంతరిక్షాన్ని పరిశీలించడానికి చిలీలో ‘రూబిన్ అబ్జర్వేటరీ’ని ఏర్పాటు చేశారు.

అక్కడి నిర్మలమైన ఆకాశం, పొడి వాతావరణం అంతరిక్ష పరీశీలనలకు అనుకూలం కావడంతో ఈ అబ్జర్వేటరీని పదివేల అడుగుల ఎత్తైన కొండ మీద ఏర్పాటుచేశారు.

ఈ అబ్జర్వేటరీ 2025 అక్టోబర్ ‌నుంచి ఆకాశాన్ని సర్వే చెయ్యడం ప్రారంభిస్తుంది.

అప్పటి నుంచి పదేళ్ళపాటు ఆకాశాన్ని స్పష్టంగా, అత్యంత వివరంగా స్కాన్ చేస్తుంది.

ఆ ఫోటోల సాయంతో, ఆకాశంలోనివి కొన్ని ఎందుకు ఎక్కువగా మెరుస్తున్నాయి? కొన్ని ఎందుకు మసకబారుతున్నాయి? అనేది తెలుసుకునేందుకు, విశ్వంలో రాబోయే మార్పుల గురించి అర్థం చేసుకోవడానికి వీలవుతుందని నిపుణులు అంటున్నారు.

ఈ ఫోటోలను సీమోన్యి సర్వే టెలిస్కోప్‌తో తీస్తారు. దాదాపు 28 అడుగుల పొడవైన ఈ టెలిస్కోప్‌ని రూపొందించడానికి 40 అంతర్జాతీయ సంస్థలు సాయం చేశాయి.

galileo

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గెలీలియో

గెలీలియోతో ప్రారంభం

మన సౌర కుటుంబంలోనే 8 పెద్ద గ్రహాలు, 5 చిన్న గ్రహాలతోపాటు, వందలాది చందమామలు, వేలాది తోకచుక్కలు ఉన్నాయి.

వీటన్నిటికీ మధ్య, స్వతహాగా నక్షత్రం అయిన సూర్యుడున్నాడు. అయితే, మన పాలపుంతలో అలాంటి నక్షత్రాలు కొన్ని వందల కోట్లున్నాయి.

విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా గెలీలియో టెలిస్కోప్‌ని వాడారు.

గెలీలియో 1609 లో టెలిస్కోప్‌లోంచి జూపిటర్ గ్రహాన్ని, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలనూ చూశారని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ కేథరిన్ హేమెన్స్ చెప్పారు.

‘అప్పట్లో, విశ్వానికి కేంద్రం భూ గ్రహమే అని నమ్మేవాళ్ళు. ఆ నమ్మకం సరికాదని, ఆ మాటకొస్తే ఇతర గ్రహాలలానే భూమికూడా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోందని గెలీలియో అర్థం చేసుకున్నారు. 1920లో అనేక విషయాలు కొత్తగా బయటపడటం వల్ల, మన పాలపుంత వంటి గెలాక్సీలు విశాలవిశ్వంలో ఎన్నో ఉన్నాయని తెలిసింది. వీటన్నిటివల్ల 'బిగ్ బ్యాంగ్ థియరీ' వెలుగులోకి వచ్చింది. మొదట్లో మన విశ్వం చిన్నదిగా, వేడిగా, అధిక సాంద్రతతో ఉన్నట్లు అర్థమైంది. ఆ విశ్వం విస్తరిస్తూ పోయి, 13.8 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం పేలిపోయిందని, ఆ తర్వాతే ఇప్పుడు మనం చూస్తున్న విశ్వపు రూపం ఏర్పడిందని తెలిసింది’ అన్నారు హేమెన్స్.

rubinobservatory

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చిలీలో ఎత్తయిన కొండపై ఏర్పాటు చేసి రూబిన్ అబ్జర్వేటరీ

వేరా రూబిన్, కెన్‌ఫోర్డ్‌తో కలిసి చేసిన పరిశోధనల్లో విశ్వం గురించి ముఖ్యమైన విషయాలెన్నో తెలిశాయి. 1970వ దశకంలోని టెలిస్కోప్‌లు ఇప్పటిలా ఆధునికమైనవి శక్తిమంతమైనవి కాకపోయినా, వాటి సాయంతోనే ఈ అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్తలిద్దరూ మనకు దగ్గరలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీని పరిశీలించారు.

ఆండ్రోమెడా గెలాక్సీ, అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వేగంతో తిరుగుతోందని వేరా రూబిన్ కనుగొన్నారు.

చిలీలోని అబ్జర్వేటరీకి వేరా రూబిన్ పేరు పెట్టారు.

rubinobservatory

ఫొటో సోర్స్, rubinobservatory

ప్రపంచంలోనే పెద్దదైన 3200 మెగాపిక్సెల్ సామర్థ్యంగల డిజిటల్ కెమెరా

వేరా రూబిన్ అబ్జర్వేటరీలో అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ ఉందని అబ్జర్వేటరీ డైరెక్టర్, వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ ప్రొఫెసర్ జోకో ఇవోజిచ్ చెప్పారు.

ఈ టెలిస్కోప్‌లో, ప్రపంచంలోనే పెద్దదైన 3200 మెగాపిక్సెల్ సామర్థ్యంగల డిజిటల్ కెమెరాను అమర్చారు.

ఈ టెలిస్కోప్‌లో అమర్చిన ఆ కెమెరా సైజు దాదాపు ఒక పెద్ద కారు అంత ఉంటుంది. దీని డేటాను చిలీ యూనివర్సిటీకి చెందిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా అమెరికాకు, అక్కడి నుంచి ఫ్రాన్స్, యూకే దేశాలకు పంపి, అక్కడ విశ్లేషిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

rubinobservatory

ఫొటో సోర్స్, rubinobservatory.org