అర్ధగంటకు ఒకసారి మూడు నిమిషాలు నడిస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

ప్రతి అర్ధగంటకు ఒకసారి మూడు నిమిషాలు నడవడం ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడే అవకాశం ఉందని యూకే డయాబెటిస్ ఛారిటీ కాన్ఫరెన్స్‌లో ఒక అధ్యయనం నిరూపించింది.

టైప్-1 డయాబెటిస్ ఉన్న 32 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం చేపట్టారు.

ఏడు గంటల సమయంలో రెగ్యులర్ వాకింగ్ బ్రేక్స్‌ తీసుకుంటూ చేపట్టిన ఈ అధ్యయనంలో వారిలో బ్లడ్ షుగర్ స్థాయులు తగ్గాయి.

‘యాక్టివిటీ స్నాక్స్’ అనే ఈ యాక్టివిటీ ఆచరణాత్మకంగా, ఖర్చు లేని మార్పులను అందించగలదని డయబెటిస్ యూకే తెలిపింది.

బ్రిటన్‌లో నాలుగు లక్షల మంది టైప్ 1 డయాబెటిస్‌తో ఇబ్బందులు పడుతున్నారు. క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది.

అప్పుడు క్లోమం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. దీని కోసం వ్యాధి బాధితులు క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి.

‘నడుస్తూ ఫోన్ మాట్లాడండి’

బ్లడ్ షుగర్‌తో దీర్ఘకాలం బాధపడితే, ఇది మూత్రపిండాల వైఫల్యం, కంటి సమస్యలు, గుండెపోటు లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

టైప్1 డయాబెటిస్‌తో బాధపడే ప్రజలు నిత్యం బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుందని డయాబెటిస్ యూకే రీసర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎలిజబెత్ రాబర్ట్సన్ చెప్పారు. ఎలిజబెత్ రాబర్ట్సన్ ఈ అధ్యయానికి నిధులు అందించారు.

‘‘ఇది అద్భుతమైన, ప్రోత్సహించదగ్గ యాక్టివిటీ. పెద్దగా కష్టం లేకుండా, సులభంగా ఆచరణాత్మకమైన మార్పులను ఈ అధ్యయనం సూచిస్తుంది. నడుస్తూ ఫోన్ కాల్స్ మాట్లాడటం లేదా బ్రేక్ తీసుకునేందుకు మధ్య మధ్యలో టైమర్ పెట్టుకుని గుర్తు చేసుకోవడం, లేదా ఎక్కువ సేపు కూర్చోకుండా చూసుకోవడం వంటి వాటితో బ్లడ్ షుగర్ స్థాయులను మెరుగ్గా నియంత్రించుకోవచ్చు’’ అని ఆమె చెప్పారు.

ఈ విధానంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను అర్థం చేసుకునేందుకు దీనిపై మరింత అధ్యయనం చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.

తక్కువ యాక్టివిటీతోనే ఇంత అద్భుతమైన ఫలితాలను చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని యూనివర్సిటీ ఆఫ్ సండర్‌ల్యాండ్ లీడ్ రీసర్చర్ డాక్టర్ మాథ్యూ క్యాంప్‌బెల్ చెప్పారు.

"టైప్ 1 డయాబెటిస్‌తో ఇబ్బంది పడే కొందరికి ‘యాక్టివిటీ స్నాకింగ్’ అనేది మరింత శారీరక వ్యాయామానికి అత్యంత కీలకమైన అడుగు అవ్వొచ్చు. ఇతరులకు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రించుకునేందుకు ఇదొక సులభమైన ప్రక్రియ కావొచ్చు" అన్నారు.

సంప్రదాయ విధానాల్లో శారీరక వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు బ్లడ్‌లో గ్లూకోజ్‌ ప్రమాదకర స్థాయులకు పడిపోయే ముప్పుంటుంది. కానీ ఈ విధానంలో ఇలాంటిది కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.

ఈ ప్రయోగం ప్రాథమిక దశలో టైప్ 1 డయాబెటిస్ ఉన్న 32 మంది వ్యక్తులపై రెండు సెషన్లపాటు అధ్యయనం చేపట్టారు.

ఒక సెషన్‌లో వారు ఏడు గంటల పాటు కూర్చునే ఉన్నారు. మరో సెషన్‌లో ఏడు గంటల్లో ప్రతి అర్ధగంటకు ఒకసారి మూడు నిమిషాలపాటు నడిచారు.

ప్రతి సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి 48 గంటల పాటు వారి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను చెక్ చేస్తూనే ఉన్నారు.

ఈ ఏడు గంటల్లో వారు నిత్యం తీసుకునే ఆహారాన్నే తీసుకున్నారు. ఇన్సులిన్ ట్రీట్మెంట్‌లో ఎలాంటి మార్పూ చేయలేదు.

లేవకుండా అలాగే కూర్చున్న వారిలో సగటు బ్లడ్ షుగర్ లెవల్స్ 8.2 mmol/L గా ఉన్నాయి. నడవడం కోసం తరచూ బ్రేక్స్ తీసుకొన్నవారిలో సగటు స్థాయులు(6.9 mmol/L) తగ్గాయి.

దీర్ఘకాలం పాటు దీనిపై అధ్యయనాలు చేపడితే ఈ విధానం ద్వారా కలిగే ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవచ్చని డాక్టర్ క్యాంప్‌బెల్ చెప్పారు.

రోజులో ఎక్కువ సమయం పాటు నడవడం, కదలడం వంటి సులభతరమైన విధానాలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.

డయాబెటిస్ అంటే ఏమిటి?

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక అనారోగ్యం. ఇది మనిషి శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయులు అత్యధికంగా పెరిగేందుకు కారణమవుతుంది.

రెండు రకాల డయాబెటిస్:

టైప్ 1: ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలపై శరీర రోగనిరోధక వ్యవస్థ అటాక్ చేసి, ఈ కణాలను నాశనం చేస్తుంది.

టైప్ 2: ఈ సమస్య ఉంటే శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. లేదా ఇన్సులిన్‌‌కు శరీర కణాలు స్పందించవు.

టైప్ 1 డయాబెటిస్‌తో పోలిస్తే టైప్ 2 డయాబెటిస్ ఎక్కువ సాధారణంగా ఉంటోంది.

ఆధారం: ఎన్‌హెచ్‌ఎస్, డయాబెటిస్ యూకే

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)