You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డిబ్రూగఢ్ జైలు: అమృత్‌పాల్ సింగ్‌ను బంధించిన ఈ కారాగారం ఎలా ఉంటుంది?
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం...
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్, ఖలిస్తాన్ అనుకూల అమృత్‌పాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకి తరలించారు.
మోగాలోని రోడే గ్రామంలో అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను భటిండా లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. మార్చి 18 నుంచి ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు.
అమృత్‌పాల్ సింగ్‌ను అస్సాంలోనిడిబ్రూగఢ్ జైలుకి తరలిస్తున్నట్లు ఉదయం మీడియా సమావేశంలో పంజాబ్ పోలీస్ ఐజీ సుఖ్‌చేన్ సింగ్ గిల్ చెప్పారు.
అమృత్‌పాల్ సింగ్ సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’తో సంబంధం ఉన్న కొందరిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎస్ఏ)ను అమలు చేసి, వారిని ఇప్పటికే డిబ్రూగఢ్‌లోని సెంట్రల్ జైలులో ఉంచారు.
అమృత్‌పాల్ సింగ్ బాబాయి హర్జిత్ సింగ్, ఆయన అనుచరులను కూడా మార్చి నుంచి ఇక్కడే ఉంచారు.
ఈశాన్య భారతంలో అత్యంత పాత జైళ్లలో ఒకటైన డిబ్రూగఢ్ జైలు అమృత్‌పాల్ తరలింపుతో చర్చనీయాంశంగా మారింది.
వారిస్ పంజాబ్ దే నాయకులను డిబ్రూగఢ్ తరలించినప్పటి నుంచి జైలు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
అమృత్‌పాల్ సింగ్‌ను డిబ్రూగఢ్ జైలుకి ఎందుకు తరలించారు?
అమృత్‌పాల్ సింగ్ అనుచరులను డిబ్రూగఢ్ జైలుకి తరలించి, వారిని అక్కడ ఉంచడం వెనక ప్రభుత్వ వ్యూహంపై మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ దత్తా.. ‘‘ పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్‌లో అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు ఆయుధాలతో వచ్చిన ఆందోళనలు చేశారు. కానీ, అస్సాం వచ్చి అలా చేయడం అంత తేలికైన విషయం కాదు’’ అన్నారు.
‘‘ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసిన అమృత్‌పాల్ అనుచరులను పంజాబ్, సరిహద్దు రాష్ట్రాల్లోని జైళ్లలో ఉంచకపోవడానికి కారణం ఉంది. డిబ్రూగఢ్ జైలులో ఎన్నో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. రైలు, విమానంలో డిబ్రూగఢ్ చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు’’ అని అన్నారు.
దీంతో పాటు డిబ్రూగఢ్ జైలులో ఎలాంటి గూండాయిజం చేయడానికి వీలుండదు. ప్రత్యేక సెల్‌లో ఆయన్ను ఉంచుతారు. ఈ జైలులో భాష కూడా ఒక పెద్ద సమస్య. దీంతో, వారు జైలు లోపల ఏం చేయడానికి వీలుండదు.
అమృత్‌పాల్, అతని అనుచరులకంటే ముందు అస్సాం శివసాగర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే, రైతు నేత అఖిల్ గొగోయ్‌ను 2017లో ఎన్‌ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి, ఇక్కడికే తరలించారు.
అస్సాం ప్రభుత్వ సమాచారం మేరకు, ఆ రాష్ట్రంలో 31 జైళ్లున్నాయి. వాటిలో ఆరు సెంట్రల్ జైళ్లు కాగా, 22 జిల్లా జైళ్లు, ఒకటి స్పెషల్ జైలు. ఒకటి ఓపెన్ ఎయిర్ జైలు, మరొకటి సబ్ జైలు.
భద్రతా ఏర్పాట్లు ఎలా?
డిబ్రూగఢ్ జైలుకి ప్రవేశ ద్వారం బయట అధునాతన ఆయుధాలతో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.
దీంతో పాటు జైలు పరిసర ప్రాంతాల్లో అదనంగా సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు.
1859-60 ఏడాదిలో బ్రిటీష్ ప్రభుత్వం డిబ్రూగఢ్ సెంట్రల్ జైలుని ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ జైలు గురించి పెద్దగా ఎప్పుడూ చర్చ జరగలేదు. నేషనల్ సెక్యూరిటీ(ఎన్ఎస్ఏ) యాక్ట్ కింద ఇతర రాష్ట్రాల్లో అరెస్ట్ చేసిన ఏ ఖైదీని, నిందితుడిని కూడా ఈ జైలులో ఉంచలేదు.
గత నెలలో అమృత్‌పాల్ అనుచరులను అరెస్ట్ చేసి, ఇక్కడకు తీసుకొచ్చినప్పుడు, ఈ జైలులో భద్రతా ఏర్పాట్ల గురించి డిబ్రూగఢ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ బిస్వజీత్ పెగూ జర్నలిస్ట్‌లకు వివరించారు.
‘‘ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసిన ఏడుగుర్ని డిబ్రూగఢ్‌కి తీసుకొచ్చి, సెంట్రల్ జైలులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు వెలుపల, లోపల బహుళ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం’’ అని ఆయన తెలిపారు.
కేవలం అసోం పోలీసులు మాత్రమే కాక, ఈ జైలు సెక్యూరిటీ కోసం కేంద్ర సాయుధ దళాలను కూడా ఇక్కడికి తరలించినట్లు చెప్పారు.
జైలులో అంత నిఘా ఎందుకు?
‘‘ఎన్‌ఎస్ఏ కింద అదుపులోకి తీసుకున్న ఏడుగుర్ని పంజాబ్ నుంచి ఇక్కడికి తరలించారు. వారిలో నలుగుర్ని మార్చి 19న, ఒకర్ని మార్చి 20న, ఇద్దర్ని మార్చి 21న ఇక్కడికి తీసుకొచ్చారు’’ అని అంతకుముందు అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ చెప్పారు.
అమృత్‌పాల్, ఆయన అనుచరులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇలాంటి పరిస్థితిలో డిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో భద్రతా ఏర్పాట్లపై స్థానిక అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
డిబ్రూగఢ్ నగరంలో అస్సాం ట్రంక్ రోడ్డుకి సమీపంలో ఫూల్ బాగాన్ ప్రాంతంలో సుమారు 76 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సెంట్రల్ జైలు ఉంది. 1859-60లో ఏర్పాటైన ఈ జైలుకి చుట్టుపక్కల ప్రధాన పరిసరాల్లో సుమారు 30 అడుగుల ఎత్తులో గోడలను నిర్మించారు.
1991 జూన్‌లో నిషేధిత తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(యూఎల్ఎఫ్ఏ)కి చెందిన ఐదుగురు హై ప్రొఫైల్ వ్యక్తులు ఈ జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు.
1990లలో యూఎల్ఎఫ్ఏ రాష్ట్రంలో తీవ్ర హింస సృష్టించింది. ఈ ఘటన తర్వాత, అధికారులు జైలు గోడలను మరింత ఎత్తు పెంచాలని నిర్ణయించారు.
ఇలాంటి పరిస్థితుల్లో అమృత్‌పాల్ సింగ్ ఏడుగురు అనుచరులను పంజాబ్ నుంచి డిబ్రూగఢ్ తరలించారన్న వార్తను విని చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఆశ్చర్యానికి గురయ్యారు.
‘‘ఈ కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టి 53 ఏళ్లు గడిచిపోయాయి. కానీ, ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా డిబ్రూగఢ్ జైలు గురించి ఇంతలా మాట్లాడుకోవడం నేను వినలేదు’’ అని డిబ్రూగఢ్ జిల్లా సెషన్స్ కోర్ట్‌లో సీనియర్ న్యాయవాది జోగేంద్రనాథ్ బారువా అన్నారు.
‘‘నాకు తెలిసినంత వరకు, ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసిన బయట ఏ రాష్ట్రాలకు చెందిన వారిని కూడా డిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు’’ అని తెలిపారు.
కేవలం 1975 ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే మెయింటనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కొందర్ని ఈ జైలులో ఉంచారు. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన బయట వ్యక్తుల్ని ఈ జైలుకి తీసుకురావడం ఇదే తొలి కేసు అన్నారు.
బ్రిటీష్ పాలనలో ఈ సెంట్రల్ జైలు నిర్మాణం
‘‘డిబ్రూగఢ్ సెంట్రల్ జైలుని బ్రిటీష్ పాలనలో నిర్మించారు. జైలు అడ్మినిస్ట్రేషన్ రికార్డులలోని సమాచారం ప్రకారం దీన్ని 1859-60లలో ఏర్పాటు చేసినట్లు ఉంది’’ అని బారువా చెప్పారు.
కానీ, అంతకు ముందు నుంచి ఉన్న సమాచారం ప్రకారం, పేరుగాంచిన నేరస్తుడు బిసాగమ్ సింగ్ఫోను, ఆయన అనుచరులను విచారించేందుకు 1843 ఏడాదిలో ఇక్కడ సెంట్రల్ జైలు స్థానంలో బ్రిటీష్ అధికారులు తొలుత కోర్టును ఏర్పాటు చేశారు.
1843లో ఈ ప్రాంతంలోనే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టును బ్రిటీష్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టేది. శిక్ష పడిన తర్వాత నేరస్తులను ఇక్కడికి తీసుకొచ్చే వారని బారువా వివరించారు.
‘‘సింగ్ఫో అరెస్ట్ తర్వాత, బ్రిటీష్ ప్రభుత్వంలోని అప్పర్ అస్సాంకు చెందిన డిప్యూటీ కమిషనర్ డేవిడ్ స్కాట్ కోర్టు ఉన్న ఈ స్థలాన్ని ప్రస్తుత డిబ్రూగఢ్ సెంట్రల్ జైలు వార్డ్ నెంబర్ 1గా మార్చారు. ఆ సమయంలో ఇటుకలతో నిర్మించిన ప్రాంతం ఇదొక్కటే’’ అని బారువా వివరించారు.
డిబ్రూగఢ్ సెంట్రల్ జైలు ఏర్పాటు తర్వాత, ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ దీపాలి బారువా తన పుస్తకం ‘అర్బన్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఏ కేస్ స్టడీ’ అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు.
డిబ్రూగఢ్ జైలు బిల్డింగ్ నిర్మాణం కోసం బ్రిటీష్ ప్రభుత్వం 1840లో రూ.2700 ఖర్చు చేసేందుకు ఆమోదించిందని తెలిపారు.
డిబ్రూగఢ్ జైలు నిర్మాణ ఖర్చును తగ్గించేందుకు ఖైదీలను దాని నిర్మాణ పనులకు వాడారు. ఆ సమయంలో ఈ జైలుకి దగ్గర్లో ఒక ఆస్పత్రి కూడా ఉండేది.
1853లో ఈ ప్రాంతానికి వచ్చిన బ్రిటీష్ అధికారులు ఈ జైలు పరిస్థితి చూసి ఇటుకలతో కాంక్రీట్ బిల్డింగ్‌ను ఇక్కడ నిర్మించేందుకు ఒప్పుకున్నారు.
అప్పట్లో ఈ జైలులో 50 మంది ఖైదీలుండేవారు. ఈ ఖైదీల్లో కొందర్ని రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం పని చేయించారు. ఈ జైలులో 1857-58 కాలంలో రోజుకు సగటున 45 మంది ఖైదీలుండేవారు.
మహిళా ఖైదీలకు నాలుగు వార్డులు
బ్రిటీష్ ప్రభుత్వం డిబ్రూగఢ్‌లో మిలటరీ బేస్‌ను ఏర్పాటు చేసింది. 1840లలో డిబ్రూగఢ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఈ జైలు నిర్మాణ సమయంలో ఇక్కడ 500కి పైగా ఖైదీలను ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రొగ్రామ్‌లో భాగంగా జాతీయ మానవ హక్కుల సంఘానికి చెందిన బృందం కొన్నేళ్ల క్రితం డిబ్రూగఢ్ జైలుని సందర్శించింది. ఆ సమయంలో జైలులో ఖైదీల కోసం ఒకే ఒక్క మెయిన్ కిచెన్ ఉంది.
ఇదే కిచెన్‌లో మహిళా ఖైదీల కోసం కూడా వంటను సిద్ధం చేసి, ఆ తర్వాత మహిళల వార్డుకి తరలిస్తారని కమిషన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
పురుష ఖైదీలకు 24 వార్డులు ఉండగా, మహిళా ఖైదీలకు నాలుగు ప్రత్యేక వార్డులున్నట్లు మానవ హక్కుల కమిషన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.
జైలులో ఏ సౌకర్యాలున్నాయి?
నేటికి కూడా ఈ జైలులో ఖైదీలకు కేవలం మెయిన్ కిచెన్ మాత్రమే ఉంది. దీన్ని మరింత పెద్దదిగా మార్చేందుకు పునరుద్ధరణ జరుగుతోందని డిబ్రూగఢ్ జిల్లా, సెషన్స్ కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.హుస్సేన్ తెలిపారు.
గత ఫిబ్రవరి నెలలో సమర్పించిన వివరాల్లో డిబ్రూగఢ్ సెంట్రల్ జైలులోని ప్రస్తుతం 445 మంది ఖైదీలున్నారని హుస్సేన్ చెప్పారు. వారిలో 430 మంది పురుష ఖైదీలు కాగా, 15 మంది మహిళా ఖైదీలు.
ఈ ఖైదీల్లో ఇద్దరు విదేశీయులున్నట్లు హుస్సేన్ చెప్పారు. ప్రస్తుతం ఈ జైలులో 680 మంది ఖైదీలను ఉంచొచ్చు. అయితే, ఇక్కడ మరింత ఎక్కువ మందిని ఎప్పుడూ ఉంచలేదు.
ఈ జైలులో సురక్షితమైన మంచి నీటి సౌకర్యం కూడా ఉంది. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా 94 టాయిలెట్స్ ఉన్నాయి.
ఈ జైలుకి లోపల ఒక ఆస్పత్రి కూడా ఉంది. దీనిలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్ట్‌లు సేవలందిస్తుంటారు. ఈ జైలులో స్కూల్ కూడా ఉంది. ఒక టీచర్‌ని కూడా నియమించారు.
జైలుకి వెలుపల శిక్ష పడిన ఖైదీలు పనిచేసుకునేందుకు ఒక పెద్ద గార్డెన్ కూడా ఉంది. హస్త కళల్లో శిక్షణ ఇచ్చేందుకు కళాకారులు కూడా ఉన్నాయి. ఇంట్లో అవసరమైన అనేకరకాల వస్తువులను వీరు తయారు చేస్తుంటారు.
జీవిత ఖైదు పడిన పెద్ద పెద్ద నేరగాళ్లను, పేరుమోసిన క్రిమినల్స్‌ను ఈ జైలులో ఉంచుతారు.
తీవ్రమైన నేరాలకు లేదా తీవ్రవాద సంస్థలకు చెందిన వారిని ఇక్కడ ఉంచేందుకు అత్యంత పటిష్టమైన సెల్ కూడా ఈ జైలులో ఉంది. సాధారణంగా ఇతర ఖైదీలను ఈ సెల్ వైపుకి పోనివ్వరు.
ఎమర్జెన్సీ సమయంలో డిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో పరిస్థితులు
ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు ఈ జైలులో గడిపిన సీనియర్ న్యాయవాది అసీమ్ దత్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘ఆ సమయంలో ఎన్ఎస్ఏ చట్టం లేదు. ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జూన్ 25, 1975న నేను అరెస్ట్ అయ్యాను. మమ్మల్ని సాధారణ ఖైదీలలాగా ఉంచలేదు. అన్ని రకాల సౌకర్యాలు ఈ జైలులో ఉంటాయి. దుస్తులు, ఆహారం, డ్రింక్స్ ఇలా ప్రతీది ఇక్కడ లభిస్తాయి’ అని తెలిపారు.
1975లో డిబ్రూగఢ్ జైలులో పురుషులకు 11 వార్డులు, మహిళలకు ఒక వార్డు ఉండేదని అసీమ్ దత్తా చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అస్సాం ప్రాంతానికి సంఘ్ చాలక్ లాగా ఆయన పనిచేసే వారు.
‘‘డిబ్రూగఢ్ జైలులో ఖైదీలకు అందించే సౌకర్యాల విషయంలో పెద్దగా మార్పులు చేశారని నేను భావించడం లేదు. ఫుడ్, డ్రింక్ సౌకర్యాలు ఆ కాలంలో కూడా బాగుండేవి. ప్రస్తుతం ఖైదీలకు దోమ తెరలు కూడా ఇచ్చారు’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)