You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘నోట్లో కంకర పోసి పట్టకారుతో పళ్లను పీకేసిన పోలీసు...’’
పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి పళ్లను పట్టకారుతో పీకారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి తాలూకాలో జరిగింది.
ఈ కేసులో అంబసముద్రం ఏఎస్పీ బల్వీర్ సింగ్ మీద ఆరోపణలు రాగా ఆయనను సస్పెండ్ చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ఆ ఘటన మీద విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు.
విచారణ సందర్భంగా ఏఎస్పీ బల్వీర్ సింగ్ ‘క్రూరంగా’ ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
‘‘అంబసముద్రం పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం తీసుకెళ్లిన ఏఎస్పీ బల్వీర్ సింగ్ పట్టకారుతో మా పళ్లు పీకేశారు, పళ్లు విరగ్గొట్టారు’’ అని ఆ వీడియోల్లో కొందరు ఆరోపించారు.
ఏఎస్పీపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఎండీ షబ్బీర్ అలం, సబ్ కలెక్టర్ చేరన్ మహాదేవి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు.
అసలు ఆరోపణలేంటి?
హత్యాయత్నం కేసులో మార్చి 23న తమను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఒక వీడియోలో కొందరు వ్యక్తులు చెప్పారు.
పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లిన తర్వాత, ఏఎస్పీ సింగ్ అక్కడికి యూనిఫాంలో వచ్చారు.
కొద్ది సేపటి తర్వాత సాధారణ దుస్తుల్లో వచ్చి తమపై దాడి చేశారని ఆ వీడియోలో చెప్పారు.
''ఏఎస్పీ సింగ్ చేతులకు గ్లవ్స్ తొడుక్కుని, క్రీడా దుస్తుల్లో వచ్చారు. నోట్లో గ్రావెల్ రాళ్లు పెట్టి క్రూరంగా దాడి చేశారు. రాళ్లతో ఆయన మా పళ్లు కూడా విరగ్గొట్టారు. మాలో ఒకరికి ఇటీవలే వివాహమైంది. ఇప్పుడు అతను మంచంపట్టాడు. కనీసం తినలేని పరిస్థితిలో ఉన్నాడు. మాలాగ ఎవరూ బాధపడకూడదు'' అని ఆ వీడియోలో వాళ్లు చెప్పారు.
ఏఎస్పీ బల్వీర్ సింగ్ పళ్లు పీకేశారని ఆరోపణలు చేసిన వారిలో ఒకరైన వేద నారాయణతో బీబీసీ మాట్లాడింది.
''నేను అంబసముద్రంలోని విక్రమసింగపురంలో పదేళ్ల కిందటి నుంచి ఉంటున్నాను. ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నా భార్యతో గొడవల కారణంగా గత నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను.
ఒక ధ్రువీకరణ పత్రం కోసం మార్చి 20న నేను ఇంటికెళ్లాను. అక్కడ నేను, నా భార్య గొడవపడ్డాం. అంతలోనే పోలీసులు వచ్చారు. నా మొబైల్ ఫోన్ లాగేసుకుని పోలీస్ స్టేషన్‌కి రావాలన్నారు.'' అని చెప్పారు.
ఆ మరుసటి రోజే స్థానిక దేవాలయంలో పండగ ఉండడంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లలేదని వేదనారాయణ చెప్పారు.
మార్చి 23న ఇద్దరు పోలీసులు వచ్చి తనను విక్రమసింగపురం పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని ఆయన చెప్పారు.
''పోలీస్ స్టేషన్లో వేచి ఉన్న సమయంలో, ఏఎస్పీ చేతిలో నీకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉందని ఒక పోలీస్ అన్నారు. ఏఎస్పీ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. హిందీలో ప్రశ్నించారు. నాకు హిందీ రాకపోవడంతో ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పాను.
వాళ్లు నన్ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లారు. అక్కడ నా దిగువ పళ్ల వరసలో నుంచి ఒక పంటిని ఏఎస్పీ పట్టకారుతో పీకేశారు. పట్టకారుతో తన చెవిపై కూడా గాయం చేశారు'' అని చెప్పారు.
సాయంత్రం 5 గంటల సమయంలో స్టేషన్ నుంచి పంపించేశారని వేదనారాయణ తెలిపారు. ''అప్పటి నుంచి నేను సరిగ్గా తినలేకపోతున్నాను'' అని చెప్పారు.
మరికొన్ని ఆరోపణలు
అంబసముద్రం ఏఎస్పీగా బల్వీర్ సింగ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కస్టడీలో హింసిస్తున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
కొద్దిరోజుల కిందట సీసీ కెమెరా ధ్వంసం చేసిన కేసులో జమీన్ సింగపట్టికి చెందిన సూర్య అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.
అక్కడ ఏఎస్పీ నా పన్ను పీకేశారని, మరో ముగ్గురి పళ్లు విరగ్గొట్టారని సూర్య బీబీసీకి చెప్పారు. వాళ్లు స్థానిక ఆస్పత్రిలో చేరారని తెలిపారు.
విచారణపై నమ్మకం లేదు
''విచారణకు పిలిచిన వారిని కొట్టడం, వారిపై దాడి చేయడం వంటివి చేయకూడదని చట్టం చెబుతోంది. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి'' అని ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది మహారాజ బీబీసీతో అన్నారు.
''జిల్లా అధికారుల విచారణపై మాకు నమ్మకం లేదు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. లేదంటే సీబీఐకి అప్పగించాలని కోరుతున్నాం.
ఫిర్యాదుదారులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది'' అని మహారాజ అన్నారు.
మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్పీ బల్వీర్ సింగ్‌ను బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్ లిస్టులో ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)