గాజా, ఇజ్రాయెల్‌లను సెట్ చేశానని చెప్పుకున్న ట్రంప్, యుక్రెయిన్, రష్యాలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?

    • రచయిత, ఆంథోనీ జుర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా-రష్యా నాయకుల సమావేశం గురించి మీడియాలో తరచూ హడావుడి కనిపిస్తుంటుంది. అందులో కొన్ని అతిశయోక్తులు కూడా ఉంటాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను రెండు వారాల్లోపు బుడాపెస్ట్‌లో కలుస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పిన కొద్దిరోజులకే, తేదీ ఎప్పుడో కూడా తెలియకుండా ఆ సమావేశం వాయిదా పడింది.

రెండు దేశాల అగ్రదౌత్యవేత్తల మధ్య జరగాల్సిన సమావేశం కూడా రద్దయింది.

"నేను టైమ్ వేస్ట్‌ మీటింగ్‌లు పెట్టాలని అనుకోవడం లేదు, ఏం జరుగుతుందో చూస్తా" అని మంగళవారంనాడు వైట్‌హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ట్రంప్ అన్నారు.

యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపడానికి డోనల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది తాజా మలుపు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడంలో సహాయం చేసిన తర్వాత ఆయన మళ్లీ ఈ అంశంపై దృష్టి సారించారు.

గాజా ఒప్పందంపై గతవారం ఈజిప్టులో ట్రంప్ తన ప్రధాన దౌత్య సంధానకర్త స్టీవ్ విట్‌కాఫ్‌తో మాట్లాడుతూ, ‘‘మనం రష్యాది కూడా పూర్తి చేయాలి’’ అన్నారు.

కానీ, గాజాలో సాధించినది, దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుక్రెయిన్ యుద్ధంలో రిపీట్ కావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తక్కువ పరపతి

స్టీవ్ విట్‌కాఫ్ చెబుతున్న దాని ప్రకారం, ‘‘ఖతార్‌లోని హమాస్ సంధానకర్తలపై ఇజ్రాయెల్ దాడి గాజా ఒప్పందం జరగడానికి కీలకంగా మారింది. ఇది అనేక అరబ్ దేశాలను ఆగ్రహానికి గురిచేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి చేయడంలో ట్రంప్‌కు ఉపయోగపడింది’’

జెరూసలేంకు అమెరికా రాయబార కార్యాలయాన్ని తరలించడం, వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థావరాల విషయంలో అమెరికా స్టాండ్ మారడం, ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యకు మద్దతు ఇవ్వడం వంటి సుదీర్ఘ చరిత్ర కారణంగా ట్రంప్ ఇజ్రాయెల్‌లో బలమైన ప్రభావాన్ని సంపాదించారు. వాస్తవానికి, ట్రంప్ ఇజ్రాయెల్‌లో నెతన్యాహు కంటే ఎక్కువ పాపులర్. ఒప్పందం కోసం ఒత్తిడి చేయడానికి ఇది ఆయనకు అదనపు బలాన్ని ఇచ్చింది.

అరబ్ నాయకులతో ట్రంప్‌కు సన్నిహిత రాజకీయ, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది చర్చలలో ఆయనకు మరింత బలాన్ని ఇచ్చింది.

కానీ, యుక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే, ట్రంప్‌కు చాలా తక్కువ పరపతి ఉంది. గత తొమ్మిది నెలల్లో, ఆయన వేర్వేరు వ్యూహాలను ప్రయత్నించారు - కొన్నిసార్లు పుతిన్‌పై, కొన్నిసార్లు జెలియెన్‌స్కీ పై ఒత్తిడి తెచ్చారు – కానీ, పెద్దగా విజయం సాధించలేదు.

రష్యా చమురు, గ్యాస్‌పై కొత్త ఆంక్షలు విధిస్తానని ట్రంప్ బెదిరించారు. యుక్రెయిన్‌కు కొత్త లాంగ్ రేంజ్ ఆయుధాలు ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ, ఆ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, యుద్ధం మరింత తీవ్రతరం కావొచ్చని అమెరికా అధ్యక్షుడికీ తెలుసు.

కొన్ని సందర్భాల్లో, ట్రంప్ జెలియెన్‌స్కీని విమర్శించారు. ఆ దేశంతో నిఘా పార్టనర్‌షిప్‌ను నిలిపివేశారు. ఆయుధ సరఫరాలను ఆలస్యం చేశారు. కానీ, యుక్రెయిన్ ఓటమి ఐరోపాను అస్థిరపరచగలదని యూరోపియన్ మిత్రదేశాల ఒత్తిడి చేయడంతో మళ్లీ వారితో నిలబడ్డారు.

ఒప్పందాలు చేసుకోవడంలో తన నైపుణ్యం గురించి ట్రంప్ తరచుగా మాట్లాడుతుంటారు. కానీ, పుతిన్, జెలియెన్‌స్కీలతో ఆయన సమావేశాలు యుద్ధాన్ని ఆపడంలో పని చేయలేదు.

పుతిన్ వాడుకుంటున్నారా?

ఒప్పందం కుదుర్చుకోవాలనే ట్రంప్ ఆసక్తిని - వ్యక్తిగత సమావేశాలు సమస్యలను పరిష్కరించగలవనే ఆయన నమ్మకాన్ని, పుతిన్ వాడుకుంటున్నారు.

జులైలో రష్యాపై కొత్త ఆంక్షలను ట్రంప్ ఆమోదించబోతున్న సమయంలోనే అలాస్కాలో శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ అంగీకరించారు. దీంతో ఆంక్షల ప్రణాళికలు నిలిచిపోయాయి.

గతవారం, యుక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు, పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను పంపాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు రావడంతో, పుతిన్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. అనంతరం, బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశానికి సంబంధించిన ప్రణాళికలను ట్రంప్ ప్రకటించారు.

మరుసటి రోజు, వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ కలిశారు. ఈ సమావేశం ఎటువంటి పురోగతి లేకుండా ముగిసింది.

కాగా, తనను పుతిన్ ఆడిస్తున్నారనే ఆరోపణలను ట్రంప్ ఖండించారు.

"పెద్దపెద్దోళ్లే నాతో ఆడుకున్నారు. కానీ, నేను నెగ్గుకొచ్చాను" అని అన్నారు ట్రంప్.

జెలియెన్‌స్కీ అనుమానం

ఇటీవలి సంఘటనలను యుక్రెయిన్ అధ్యక్షుడు గుర్తు చేశారు. ‘‘యుక్రెయిన్‌కు లాంగ్‌రేంజ్ ఆయుధాలు లభించే అవకాశం తగ్గిన వెంటనే రష్యా కూడా శాంతి చర్చలపై ఆసక్తి తగ్గించింది" అని జెలియన్ స్కీ అన్నారు.

కొద్దిరోజుల్లోనే, యుక్రెయిన్‌కు క్షిపణులు పంపడంపై ఆలోచించడం నుంచి బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశాన్ని ప్లాన్ చేయడం వరకు ట్రంప్ వెళ్లారు. ఆపై రష్యా స్వాధీనం చేసుకోలేని ప్రాంతాలను కూడా (మొత్తం డాన్‌బాస్ ప్రాంతాన్ని) వదులుకోవాలని జెలియెన్ స్కీపై ప్రైవేట్‌గా ఒత్తిడి చేశారు.

ఆయన ఇప్పుడు రెండు దేశాలకు కాల్పుల విరమణను ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నారు. కానీ, రష్యా ఆ ఆలోచనను తిరస్కరించింది.

యుక్రెయిన్ యుద్ధాన్ని కొన్నిగంటల్లోనే ముగించగలనని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు దానిని ముగించడం అనుకున్నదానికంటే చాలా కష్టమని ఆయన అంగీకరించారు.

తన శక్తికి పరిమితులు ఉన్నాయని - రెండు వైపులా పోరాటాన్ని ఆపడానికి ఇష్టపడనప్పుడు శాంతిని సాధించడం కష్టమని ట్రంప్ అంగీకరించిన కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)