‘‘నన్ను దగ్గరికి లాక్కొని ‘నువ్వంటే నాకిష్టం’ అంటూ ముద్దుపెట్టడం ప్రారంభించాడు’’- ఓ చారిటీ ఓనర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మహిళా శరణార్థుల ఆరోపణలు

    • రచయిత, ఫండనుర్ ఓజ్టర్క్, కవూన్ ఖమూష్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

నిస్సహాయ స్థితిలో ఉన్న చాలామంది సిరియా మహిళలకు సాదెతిన్ కరగోజ్ మొదట్లో దివి నుంచి భువికి దిగి వచ్చిన ఒక దేవదూతలా కనిపించారు. వారి కమ్యూనిటీలో ఆయనకు 'గ్రాండ్‌ఫాదర్ ఆఫ్ రెఫ్యూజీస్' అనే పేరుంది.

కానీ, తుర్కియే రాజధాని అంకారాలోని నిస్సహాయ స్థితిలో ఉన్న కొంతమంది మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల కుంభకోణంలో సాదెతిన్ కేంద్రంగా వచ్చిన ఆరోపణలు ఏడాది పాటు బీబీసీ న్యూస్ తుర్కియే చేసిన దర్యాప్తులో బయటపడ్డాయి. తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ సాదెతిన్ ఖండించారు.

తుర్కియేలోని అల్టిండాగ్ ప్రాంతాన్ని 'మినీ అలెప్పొ'గా పిలుస్తారు. ఎందుకంటే సిరియాకు చెందిన వేలమంది శరణార్థులు ఇక్కడే నివసిస్తారు. ఈ ప్రాంతంలోనే 2014లో సాదెతిన్ కరగోజ్ ఒక చారిటీ (దాతృత్వ సంస్థ)ని నెలకొల్పారు.

ప్రపంచంలో అత్యధికమంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే దేశాల్లో తుర్కియే ఒకటి. సాదెతిన్ నెలకొల్పిన చారిటీ వంటి సంస్థలు ఏ ఉపాధిలేనివారికి, ముఖ్యంగా మహిళలకు జీవనాధారంగా ఉంటాయి.

ఇక్కడ ఆశ్రయం పొందిన వారిలో మదీనా (అసలు పేరు కాదు. గోప్యతరీత్యా మార్చి రాశాం) ఒకరు. సిరియా అంతర్యుద్ధం, 2016లో అలెప్పోలోని తన ఇంటిని చుట్టుముట్టినప్పుడు ఆమె ఇంటి నుంచి పారిపోయారు.

‘మీ కోసం నా తలుపులు తెరిచే ఉంటాయి’

రెండేళ్ల తర్వాత, తన ముగ్గురు పిల్లల్లో ఒకరికి తీవ్ర అనారోగ్యం చేసిందని, భర్త తమను వదిలేసి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. అంకారాలో పిల్లలతో ఒంటరిగా నిస్సహాయ స్థితిలో మిగిలిపోయానని ఆమె తెలిపారు.

అందరూ ఆమెకు సాదెతిన్ కరగోజ్ చారిటీ సంస్థ అయిన 'ఉముత్ హయిర్ మగజాసి'ని ఆశ్రయించాల్సిందిగా చెప్పారు. ఈ సంస్థ న్యాపీలు, పాస్తా, ఆయిల్, దుస్తులు వంటివి విరాళాలుగా సేకరించి శరణార్థులకు అందిస్తుంది.

'మీ కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన నాతో చెప్పారు. నువ్వు వెళ్లడానికి ఏ మార్గం లేనప్పుడు నా దగ్గరికి రా, మీ బాగోగులు నేను చూసుకుంటాను అని సాదెతిన్ అన్నారు' అని మదీనా గుర్తు చేసుకున్నారు.

సహాయం కోసం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు, అనుమతి లేకుండానే స్టోర్‌లో మహిళందరినీ ఆయన ముట్టుకున్నారని, తనను కూడా తాకారని మదీనా చెప్పారు.

సరుకుల కోసం ఆఫీసులోని కర్టెన్ వెనుక ఉన్న ప్రాంతానికి తనతో రావాలని సాదెతిన్ చెప్పినట్లు మదీనా గుర్తు చేసుకున్నారు.

సిరియాకు పంపిస్తానంటూ బెదిరింపులు

''నన్ను దగ్గరికి లాక్కొని ‘నువ్వంటే నాకిష్టం’ అన్నారు. తర్వాత ముద్దు పెట్టడం ప్రారంభించాడు. నేను అరిచాను. నన్ను వదిలేయమని, అక్కడి నుంచి వెళ్లనివ్వమని కోరాను. నేను అరిచి ఉండకపోతే ఆయన నాపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించేవారు'' అని మదీనా వివరించారు.

ఎలాగోలా ఆ భవనం నుంచి బయటపడ్డానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సాదెతిన్‌ను హెచ్చరించినట్లు ఆమె తెలిపారు.

''అయినా అతను నన్ను వదల్లేదు. తన దగ్గరకు రావాలని అంటుండేవారు. ఒకరోజు మా ఇంటికి వచ్చి, తలుపు తీయమంటూ గట్టిగా బాదారు. చాలా దారుణంగా మాట్లాడారు. భయంతో నేను తలుపు తీయలేదు. నన్ను సిరియాకు తిరిగి పంపిస్తానంటూ బెదిరించారు. బయటకు తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతో పోలీసులకు చెప్పలేదు. ఎవరికీ నా పరిస్థితి గురించి తెలియనివ్వలేదు'' అని మదీనా చెప్పారు.

రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన సాదెతిన్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

తన చారిటీ సంస్థ 37,000 మందికి పైగా, ముఖ్యంగా శరణార్థులను ఆదుకుందని బీబీసీతో అన్నారు. చారిటీలోని సరుకులు పంపిణీ చేసే ప్రాంతం చిన్నగా, ఇరుకుగా, సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని ఆయన చెప్పారు. తానెప్పుడూ ఏ మహిళతో అక్కడ ఒంటరిగా లేనని చెప్పారు.

సాదెతిన్ చారిటీకి గత కొన్నేళ్లలో చాలా గుర్తింపు వచ్చింది. 2020లో ఒక స్థానిక వార్తా సంస్థ ఒక అవార్డును కూడా అందించింది. జాతీయ టీవీ చానెళ్లలోనూ చారిటీకి సంబంధించిన కథనాలు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి తమ సంస్థకు విరాళాలు అందినట్లు సాదెతిన్ చెప్పారు.

మదీనాతో సహా ముగ్గురు మహిళలు బీబీసీతో మాట్లాడారు. తమను సాదెతిన్ లైంగికంగా వేధించారని, హింసించారని చెప్పారు.

సాదెతిన్ 2016 నుంచి 2024 మధ్య కాలంలో పాల్పడిన లైంగిక వేధింపులను తాము స్వయంగా చూడటమో, లేదా బాధితుల నుంచి వినడమో జరిగిందని మరో ఏడుగురు మహిళలు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు గతంలో చారిటీలో పనిచేశారు.

‘ఎక్కువ సమయం పట్టదు, 10 నిమిషాలే’

'ఆయన డెస్క్ వెనుకాల ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే మేం సహాయక సామగ్రి పెడతాం. ఆ గదిలో ఆయన మహిళల్ని వేధించడం మేం చూసేవాళ్లం'' అని వాళ్లు చెప్పారు.

సాదెతిన్ తమకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు ఆయన మాకు దివి నుంచి దిగివచ్చిన ఒక దేవదూతలా కనిపించారని 27 ఏళ్ల సిరియా శరణార్థి నాడా(అసలు పేరు కాదు) అన్నారు.

మొదటిసారి ఆ చారిటీకి వెళ్లినప్పుడు, తనతో పాటు ఖాళీ ఫ్లాట్‌లోకి వస్తేనే సహాయ సామగ్రి ఇస్తానని సాదెతిన్ అన్నట్లు ఆమె చెప్పారు.

''ఎక్కువ సమయం పట్టదు. కేవలం 10 నిమిషాలే. ఒకవేళ నువ్వు రాకపోతే నేను నీకేం ఇవ్వనని అన్నారు. అప్పుడు నేను అక్కడి నుంచి పారిపోయాను. మరోసారి నా బిడ్డకు న్యాపీలు ఇస్తానని కర్టెన్ వెనుకాల ఉన్న ఏరియాలోకి తీసుకెళ్లారు. ఒక చేతిలో న్యాపీలు పట్టుకొని, మరో చేతితో నా ఛాతిని తాకడానికి ప్రయత్నించారు. భయపడకు ఇదంతా సహజమే అని అన్నారు. మరోసారి వెనుక నుంచి వచ్చి నా చేయి గట్టిగా పట్టుకొని అతని మర్మాంగాలవైపుకు తీసుకెళ్లాడు. నా మీద దాడికి వచ్చిన రాక్షసుడిలా అనిపించాడు. భయంతో నా ఒళ్లంతా కంపించిపోయింది. నేను ఏడుస్తుంటే, ఏడవొద్దు, ఇదంతా సాధారణమే, త్వరగా అయిపోతుంది అని అన్నాడు. నేను అక్కడినుంచి పారిపోయాను, బయట ఉన్న మహిళలకు ఆ షాపులోకి వెళ్లొద్దని చెప్పాను. ఆ తర్వాతి నుంచి మళ్లీ సహాయం కోసం ఆ చారిటీకి వెళ్లలేదు'' అని నాడా వివరించారు.

ఏ గత్యంతరం లేని పరిస్థితుల్లో సహాయం కోసం తొలుత ఆయన వద్దకు వెళ్లినట్లు ఆమె చెప్పారు.

లైంగిక వేధింపులతో ఎదురయ్యే కళంకం, నిందలకు భయపడి తనకు జరిగిన దాని గురించి కనీసం తన భర్తతో కూడా చెప్పే ధైర్యం చేయలేదని నాడా తెలిపారు.

పోలీసుల విచారణ

సాదెతిన్ తనను లైంగికంగా వేధించారని చెప్పిన మూడో మహిళ బటోల్‌కు ముగ్గురు పిల్లలు. భర్త లేరు.

''సహాయం కోరుతూ ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా వెనుక భాగంపై ఆయన చేయి వేశారు. నాకు బాగా కోపం వచ్చింది. ఆయన్ను తోసేసి, సామగ్రి అక్కడే పడేసి షాప్ నుంచి బయటకు వచ్చాను. ఈ ఘటనల గురించి బహిరంగంగా మాట్లాడితే నాలాగే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న చాలామందికి ఉపయోగపడుతుందని నేను భావించా'' అని ఆమె చెప్పారు.

సాదెతిన్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికంటే ముందు కనీసం రెండుసార్లు పోలీసులు ఆయనను విచారించారు.

సాదెతిన్ తనపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డారంటూ 2019లోనూ ఒక మహిళ ఆరోపించినట్లు లీగల్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. కానీ, ఆయనపై కేసు పెట్టడానికి సరైన సాక్ష్యాలు లేవని ప్రాసిక్యూటర్ భావించారు.

సాదెతిన్‌పై వచ్చిన ఆరోపణల గురించి తెలుసుకున్న తర్వాత ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ 2022లో అనేక రహస్య ఇంటర్వ్యూలు నిర్వహించింది. 2025లో పోలీసులు ఆయన షాప్‌పై రైడ్ నిర్వహించి కార్యకలాపాలను నిలిపేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనను విచారించారు.

సరైన సాక్ష్యం లేనందున సాదెతిన్‌ను ప్రాసిక్యూట్ చేయొద్దంటూ ఈ ఏడాది జూన్‌లో ప్రాసిక్యూటర్ కార్యాలయం జారీ చేసిన ఒక నివేదికను ఆయన తరఫు లాయర్లు బీబీసీకి చూపించారు.

బాధితులు ముందుకు రాకపోవడంతో..

ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పోలీసులతోపాటు ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది. కానీ ఈ విషయంలో బాధితులు, సాక్షులు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తదుపరి చర్యలు తీసుకోలేకపోతున్నామని ఐరాస వెల్లడించింది.

తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించిన సాదెతిన్, ఒకవేళ ఇవే నిజమైతే మరింత మంది మహిళలు ముందుకు వచ్చి ఉండేవారని అన్నారు.

''ముగ్గురు, అయిదుగురు, 10 మంది నుంచి ఫిర్యాదులు రావొచ్చు. అలాంటివి జరుగుతాయి. 100, 200 మంది నీపై ఫిర్యాదు చేశారని చెబితే, నిజంగానే నేను అలాంటి పనులు చేశానని మీరు నమ్మొచ్చు'' అని ఆయన అన్నారు.

తనకు డయాబెటిస్, హైబీపీ ఉందని ఆయన చెప్పారు. 2016లో తన ఎడమ వృషణాన్ని తొలగించినట్లు ఒక మెడికల్ రిపోర్టును చూపిస్తూ, దీని ప్రకారం తాను ఎలాంటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గనలేనని ఆయన వివరించారు.

ఒకే వృషణంతో..

ఒక వృషణాన్ని తీసేసినప్పటికీ టెస్టోస్టెరాన్ స్థాయిలు 90 శాతం ఉంటాయని, ఇది లైంగిక జీవితాన్ని ఏవిధంగానూ ప్రభావితం చేయదని ఇస్తాంబుల్ యూనివర్సిటీలోని యూరాలజీ నిపుణుడు, పురుషుల లైంగిక ఆరోగ్యం నిపుణుడు అటెస్ కడియోగ్లు స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని మేం సాదెతిన్ దృష్టికి తీసుకెళ్లగా, సెక్స్‌లో పాల్గొనడం తనకు సాధ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు.

డ్రగ్స్ అమ్మినందుకు, ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మహిళలపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను కాబట్టి నాపై పగ తీర్చుకునేందుకు ఈ మహిళలంతా తనపై లైంగిక ఆరోపణలు చేశారని సాదెతిన్ అన్నారు. గతంలో తనపై మోపిన ఆరోపణలను ప్రాసిక్యూటర్లు కొట్టివేశారని ఆయన తెలిపారు.

తాము లేదా తమ బంధువులు నేరం చేశారంటూ సాదెతిన్ చేసిన ఆరోపణల్ని మహిళలంతా ఖండించారు. వారికి నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు బీబీసీకి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు.

ఈ ఏడాది మార్చిలో సాదెతిన్ తన చారిటీ సంస్థ పేరును 'బీర్ ఎవిమ్ అసెవి డెర్నెగీ' అని మార్చి అధికారికంగా రిజిస్టర్ చేయించారు.

మదీనా ఇప్పుడు కొత్త ఇంటికి మారారు. తన ఫోన్ నంబర్ మార్చేశారు. పీడకలల్లో తనకు ఇప్పటికీ సాదెతిన్ కనిపిస్తారని ఆమె చెప్పారు.

''నేను ఇప్పుడు ఏ పురుషుడిని నమ్మలేను. నేను డిప్రెషన్‌లో ఉన్నా. చనిపోవాలని అనుకున్నా. నేను ఇంకా బతికి ఉండటానికి నా పిల్లలే కారణం. నా కుమారుణ్ని బతికించుకునేందుకు చాలా ప్రయత్నించా. కానీ, ఏడేళ్లకే వాడు చనిపోయాడు'' అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)