అమెరికా: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలకు పోటెత్తిన జనం.. ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారు?

    • రచయిత, గ్రేస్ ఎలిజా గుడ్విన్, కైట్లిన్ విల్సన్
    • నుంచి, న్యూయార్క్, వాషింగ్టన్

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, మియామీ, లాస్ ఏంజెలెస్ తదితర నగరాల్లో నిరసన తెలిపేందుకు భారీగా జనం తరలివచ్చారు.

శనివారం ఉదయం న్యూయార్క్ నగరంలోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌ వద్ద చేపట్టిన ర్యాలీ, ప్రారంభమైన కొద్దిసేపటికే వేలాదిమంది చేరారు.

'రాచరికం కాదు ప్రజాస్వామ్యం', 'రాజ్యాంగం ఐచ్ఛికం కాదు' వంటి నినాదాలున్న ప్లకార్డులు పట్టుకున్న నిరసనకారులతో వీధులు కిక్కిరిసిపోయాయి.

ప్రదర్శనలకు ముందు, 'నిరసనకారులకు తీవ్ర వామపక్ష యాంటీఫా ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయని' ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. అది "అమెరికాను ద్వేషించే ర్యాలీ" అని ఖండించారు.

ర్యాలీ నేపథ్యంలో అనేక అమెరికా రాష్ట్రాలు నేషనల్ గార్డ్‌ను మోహరించాయి. అయితే, దాదాపు 70 లక్షల మంది హాజరైన ఈ కార్యక్రమాలు శాంతియుతంగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు.

'నో కింగ్స్' కార్యక్రమాల ముఖ్య సిద్ధాంతం 'అహింస' అని ఆ నిరసనకారుల బృందం తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాలలో ఘర్షణలను నివారించాలని 'నో కింగ్స్' ప్రదర్శనల్లో పాల్గొనే వారిని కోరింది.

హోరెత్తిన న్యూయార్క్

'ప్రజాస్వామ్యం అంటే ఇదే' అనే నినాదంతో న్యూయార్క్‌లో జనసమూహాలు నిరసన తెలిపాయి.

అదేసమయంలో హెలికాప్టర్లు, డ్రోన్లు వారి తలపై నుంచి ఎగురుతూ కనిపించాయి. పోలీసులు వారి పక్కన మోహరించారు.

నగరంలోని ఐదు బరోల(ప్రాంతాలు)లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు లక్ష మందికి పైగా జనం గుమిగూడారని, నిరసనలకు సంబంధించి ఎలాంటి అరెస్టులు జరగలేదని న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్ తెలిపింది.

టైమ్స్ స్క్వేర్‌లో నిలుచున్న ఒక పోలీసు అధికారి అంచనా ప్రకారం, 7వ అవెన్యూలో 20,000 మందికి పైగా మార్చ్ చేశారు.

'ఇది నాకు ధైర్యాన్నిస్తుంది'

ట్రంప్ పాలనలో "ఫాసిజం, నిరంకుశ ప్రభుత్వం వైపు అడుగుల" పట్ల ఆగ్రహం, బాధతో ఉన్నానని ఫ్రీలాన్స్ రచయిత, ఎడిటర్ బెత్ జాస్లోఫ్ అన్నారు. అందుకే తాను న్యూయార్క్ నిరసనలో పాల్గొన్నానని చెప్పారు.

"నేను న్యూయార్క్ నగరంపై చాలా శ్రద్ధ చూపుతాను'' అని ఆమె అన్నారు.

"ఇక్కడ చాలామంది ఇతర ప్రజలతో కలవడం నాకు ధైర్యాన్ని ఇస్తుంది" అని బెత్ చెప్పారు.

ట్రంప్ జనవరిలో రెండో దఫా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, అధ్యక్షుడి అధికార పరిధిని విస్తరించారు.

ఫెడరల్ ప్రభుత్వంలో కొన్నింటిని రద్దు చేయడానికి, అమెరికా నగరాలలో 'నేషనల్ గార్డ్' దళాలను మోహరించడానికి (రాష్ట్ర గవర్నర్ల అభ్యంతరాలు ఉన్నప్పటికీ ) ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉపయోగించారు.

తన శత్రువులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా తన అడ్మినిస్ట్రేషన్‌లోని ఉన్నత న్యాయ అధికారులను కోరారు.

సంక్షోభంలో ఉన్న దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి తన చర్యలు అవసరమని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. తానొక నియంత లేదా ఫాసిస్ట్ అనే వాదనలు అతిగా ఉన్నాయని, ఆవేశపూరితమైనవిగా కొట్టిపారేశారు.

కానీ, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, అమెరికా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

'ఫాసిజం వస్తుందని ఊహించలేదు'

గత శతాబ్దంలో తన స్వదేశం (ఇటలీ) అనుసరించిన విధానాన్నే ఇప్పుడు అమెరికా అనుసరిస్తోందని, దీనిపై ఆందోళనతోనే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నానని ఇటలీలో పెరిగిన న్యూజెర్సీ నివాసి, రిటైర్డ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ మాస్సిమో మాస్కోలి(68) చెప్పారు.

"ముస్సోలినీ సైన్యం నుంచి బయటికొచ్చి స్వాతంత్య్ర పోరాటంలో చేరిన ఒక ఇటలీ ధీరుడికి నేను మేనల్లుడిని'' అని మాస్కోలి అన్నారు.

''ఆయన్ను ఫాసిస్టులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అలాంటి ఫాసిజాన్ని మళ్లీ 80 ఏళ్ల తర్వాత అమెరికాలో చూస్తానని అనుకోలేదు" అని అన్నారు.

వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు, లక్షలాది మంది అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ నిధులకు కోతపెట్టడంపై కూడా మాస్కోలి ఆవేదన వ్యక్తంచేశారు

''మేం సుప్రీంకోర్టుపై ఆధారపడలేం, ప్రభుత్వంపై ఆధారపడలేం'' అన ఆయన బీబీసీతో చెప్పారు.

''మేం కాంగ్రెస్‌పై కూడా ఆధారపడలేం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రస్తుతం అమెరికా పౌరులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే, మేం పోరాడుతున్నాం'' అని మాస్కోలి అన్నారు.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

సెనేట్ మైనారిటీ నాయకుడు, న్యూయార్క్‌కు చెందిన డెమొక్రాట్ చక్ షూమర్ కూడా నిరసనలో పాల్గొన్నారు.

"అమెరికాలో మాకు నియంతలు లేరు. ట్రంప్ మా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడాన్ని అనుమతించబోం" అని షూమర్ 'ఎక్స్'లో పోస్టు చేశారు.

"ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని పరిష్కరించండి" అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్న తన ఫోటోలను ఆయన పంచుకున్నారు.

ఇక, వాషింగ్టన్ డీసీలో, వెర్మోంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ కీలక ప్రసంగం చేశారు.

''మేం ఇక్కడికి వచ్చామంటే అమెరికాను ద్వేషిస్తున్నామని కాదు, ప్రేమిస్తున్నామని'' అని అక్కడ గుమిగూడిన వేలాది మంది జనసమూహంతో బెర్నీ అన్నారు.

డీసీ మార్చ్‌లో "మేక్ అమెరికన్ గ్రేట్ ఎగైన్" అని ట్రంప్ నినాదం ముద్రించిన టోపీని ధరించిన ఒక వ్యక్తిని బీబీసీ చూసింది.

నగర సందర్శనకు వచ్చానని, నిరసనను చూడాలనుకున్నానని ఆయన చెప్పారు. ఆ వ్యక్తి తన పేరు చెప్పడానికి నిరాకరించారు.

అయితే ఈ నిరసనను తాను పూర్తిగా "అర్థం చేసుకోలేకపోయినా" ప్రజలు మాత్రం మర్యాదగా ఉన్నారని అన్నారు. కొద్దిసేపటికే, ఒక మహిళ ఆయనపై అవమానకరమైన వ్యాఖ్య చేస్తూ అరిచారు.

అమెరికాకే పరిమితం కాలేదు

యూరప్‌లో, బెర్లిన్, మాడ్రిడ్, రోమ్‌ నగరాలలో కూడా ప్రదర్శనలు జరిగాయి. అమెరికా ప్రజలకు వారు సంఘీభావం తెలిపారు. లండన్‌లో అమెరికా రాయబార కార్యాలయం వెలుపల వందలాదిగా నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు.

టొరంటోలో కూడా ఇలాంటి ప్రదర్శనలు కనిపించాయి. అక్కడ అమెరికా కాన్సులేట్ దగ్గర ప్రదర్శనకారులు "హ్యాండ్స్ ఆఫ్ కెనడా" అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.

'రంగంలోకి నేషనల్ గార్డ్'

ట్రంప్, ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే నిరసన ర్యాలీల గురించి ప్రస్తావించినట్లుగా కనిపించింది. ఈ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం కావాల్సి ఉంది, దాని టీజర్‌ను శనివారం విడుదల చేశారు.

''ఒక రాజు! ఇది ఒక నాటకం కాదు" అని ట్రంప్ ఆ ఇంటర్వ్యూ ప్రివ్యూ క్లిప్‌లో అన్నారు. "మీకు తెలుసు కదా- వారు నన్ను రాజు అని సంబోధిస్తున్నారు. నేను రాజును కాదు" అన్నట్లుగా అందులో ఉంది.

"మనం నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దించాల్సి ఉంటుంది'' అని కాన్సాస్ సెనేటర్ రోజర్ మార్షల్ ర్యాలీలకు ముందు సీఎన్ఎన్‌తో అన్నారు.

"ఇది (ర్యాలీ) శాంతియుతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. కానీ సందేహమే" అని చెప్పారు.

నిరసనలకు ముందు అనేక అమెరికా రాష్ట్రాలలోని రిపబ్లికన్ గవర్నర్లు నేషనల్ గార్డ్ దళాలను సిద్ధంగా ఉంచారు.

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ గురువారం తన రాష్ట్ర నేషనల్ గార్డ్‌ను సన్నద్ధం చేశారు. ఆస్టిన్‌లో "యాంటిఫా-సంబంధిత ప్రదర్శన" జరగబోతున్నందున వారు (నేషనల్ గార్డ్) అవసరమవుతారని చెప్పారు.

రాష్ట్రంలోని సీనియర్ డెమొక్రాట్ జెన్ వూ సహా పలువురు ఈ చర్యను ఖండించారు.

"శాంతియుత నిరసనలను అణిచివేసేందుకు సాయుధ సైనికులను పంపడం రాజులు, నియంతలు చేసే పని. గ్రెగ్ అబోట్ తాను కూడా వారిలో ఒకడినని నిరూపించుకున్నారు" అని జెన్ వూ విమర్శించారు.

వర్జీనియాకు చెందిన రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ కూడా రాష్ట్ర నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దించాలని ఆదేశించారు. అయితే స్థానిక కథనాల ప్రకారం, నిరసన సమయంలో దళాలు అక్కడ లేవు.

ట్రంప్ అభ్యర్థన మేరకు ఆగస్టు నుంచి నేషనల్ గార్డ్‌ను మోహరించిన వాషింగ్టన్ డీసీలో నిరసన ప్రాంతం వద్ద స్థానిక పోలీసులు ఉన్నప్పటికీ, ఏ దళాలూ కనిపించలేదు.

'తగ్గుతున్న ప్రజాదరణ'

డోనల్డ్ ట్రంప్ విధానాలను అమెరికన్లు తీవ్రంగా విభేదిస్తున్నారు.

ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ పోల్‌లో అధ్యక్షుడిగా ఆయన పనితీరును కేవలం 40 శాతం మంది మాత్రమే ఆమోదించారు. 58 శాతం మంది తిరస్కరించారని ఆ పోల్‌లో తేలింది. ఇది ఆయన తొలి దఫా పదవీకాలంలో ఉన్న సగటు ఆమోదం రేటింగ్‌ను పోలి ఉంది.

జనవరిలో రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన 47 శాతం ఆమోదం రేటింగ్ కంటే తక్కువగా ఉంది.

అధ్యక్షులు తమ పదవీకాలం గడిచేకొద్దీ ప్రజాదరణ కోల్పోవడం సర్వసాధారణం.

రాయిటర్స్/ఇప్సోస్ ప్రకారం, జనవరి 2021లో నాటి అధ్యక్షుడు జో బైడెన్‌కు 55 శాతం ఆమోద రేటింగ్‌ ఉండేది. అదే సంవత్సరం అక్టోబర్ నాటికి, ఆయన ఆమోదం 46 శాతంకి తగ్గింది.

(అనా ఫాగుయ్ అదనపు రిపోర్టింగ్‌)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)