అమెరికాలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో ప్రమాదం.. 19 మంది ఆచూకీ గల్లంతు

    • రచయిత, నార్డిన్ సాద్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలోని టెన్నెసీలో ఒక సైనిక పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో బ్లాస్ట్ కారణంగా 19 మంది ఆచూకీ గల్లంతైంది.

ఫ్యాక్టరీ నేలమట్టమైన తర్వాత, గుర్తించిన కొందరిని సమీపంలో ఆస్పత్రికి తరలించామని హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ చెప్పారు.

తొలుత ఈ ఫ్యాక్టరీ వద్ద ఉన్నట్లు భావించినవారిలో ఒకరిని, ఇంట్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైనట్లు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు క్రిస్ డేవిస్.

ప్రమాదానికి గురైన ఈ ప్లాంట్‌ టెన్నెసీలోని బక్స్‌నార్ట్‌లో ఉంది.

ఈ ప్లాంట్‌లో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ, నిల్వ చేస్తుంటారు.

అయితే, ఈ పేలుడుకు కారణమేంటన్నది ఇంకా తెలియలేదు.

యాక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ ఈ ప్లాంట్‌ను నడుపుతోంది.

ప్రమాదం తర్వాత సంఘటన స్థలానికి చెందిన వీడియోల్లో.. పూర్తిగా కాలిన దృశ్యాలు, శిథిలాలు, మంటల్లో కాలుతూ పొగలు కక్కుతున్న వాహనాలు, ప్లాంట్‌లో మొత్తం కాలిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి తొలిసారి మీడియా ముందుకు వచ్చిన షెరీఫ్ క్రిస్ డేవిస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కచ్చితంగా ఎంతమంది చనిపోయి ఉంటారో చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

పేలుడు జరిగినప్పుడు ప్లాంట్ నడుస్తూనే ఉందని ఆయన చెప్పారు.

రెండుసార్లు సంభవించిన పేలుళ్లు, ప్రమాదం స్థలం వద్దకు సహాయక చర్యలు అందించేందుకు వెళ్లనీయకుండా ఆటంకమయ్యాయి.

‘అప్పుడే తమ రోజును ప్రారంభించిన కార్మికులు ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారు మరణించి ఉండొచ్చు. 19 ప్రాణాలు మనకు కనిపించకుండా పోయాయి’ అని డేవిస్ చెప్పారు.

కొన్ని గంటల తర్వాత రెండోసారి మీడియా ముందుకు వచ్చిన డేవిస్, 19 మందిని ఇంకా గుర్తించలేదని, ఒక పెద్ద భవంతిలో పేలుడు సంభవించిందని ధ్రువీకరించారు.

పేలుడుతో వందల మీటర్ల దూరం వరకు శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయని తెలిపారు.

ఈ ఫ్యాక్టరీకి వాయువ్యంలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన డేవిస్.. ''ఇది భారీ పేలుడు ప్రమాదమని నేను చెప్పగలను. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ పేలుడు శబ్దాలను విన్నారు'' అని చెప్పారు.

అయితే, ఈ పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా అనే విషయంపై స్పందించేందుకు డేవిస్ నిరాకరించారు.

ప్రస్తుత పరిస్థితిని తన కార్యాలయం పర్యవేక్షిస్తున్నట్లు టెన్నెసీ గవర్నర్ బిల్ లీ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. దీన్ని విషాద ఘటనగా పేర్కొన్నారు.

ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి రాష్ట్ర, స్థానిక అథారిటీలు కూడా ఈ పేలుడు ఘటనపై పనిచేస్తున్నాయి.

ఈ పేలుడు ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇద్దరికి చికిత్స అందించి, డిశ్చార్జ్ చేసినట్లు సమీపంలోని డిక్సన్‌లో ట్రైస్టార్ హెల్త్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ కాసే స్టాప్ చెప్పారు.

స్వల్ప గాయాలు పాలైన మరొకరికి ఇంకా చికిత్స కొనసాగుతోందన్నారు.

ఈ ఘటన నుంచి బయటపడ్డ రోగులకు ఆ ప్రాంతంలోని ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఈ ఫ్యాక్టరీకి 30 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న వారు కూడా ఈ పేలుడు శబ్దాలను విన్నారు.

ఈ ఫ్యాక్టరీ 1300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సీ-4, టీఎన్‌టీ, ఇతర హైగ్రేడ్ సైనిక, వాణిజ్య పేలుడు పదార్థాలను తయారు చేసి, అక్కడే నిల్వ చేస్తుంది.

యాక్యురేట్ ఎనర్జిటిక్స్ సిస్టమ్స్ ప్రస్తుతం తన ఆపరేషన్లను నిలిపివేసిందని షెరీఫ్ చెప్పారు. ఈ సంస్థలో 75 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

''ప్రస్తుతం వారి కుటుంబాలు, ఉద్యోగులపై కంపెనీ దృష్టి పెడుతోంది'' అని డేవిస్ చెప్పారు.

ఈ పేలుడు ఘటన హిక్‌మాన్, హంఫ్రీస్ కౌంటీల మధ్య జరిగింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్‌తో పాటు ఫెడరల్ ఏజెన్సీలు, స్థానిక సంస్థల నుంచి తక్షణమే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

ఎఫ్‌బీఐ, ఏటీఎఫ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని డేవిస్ చెప్పారు.

అధికారులు కొన్నిరోజుల పాటు ప్రమాద స్థలం వద్దనే ఉండనున్నారని, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అధికార బృందాలు ప్రయత్నిస్తాయని డేవిస్ చెప్పారు.

2014లో ఇదే ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ సమయంలో రియో అమ్యూనిషన్ అనే కంపెనీ పేలుడు జరిగిన యూనిట్‌ను నిర్వహించేది. ఆ సమయంలో జరిగిన ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురికి గాయాలైనట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)