గన్ కేసులో దోషిగా తేలిన అమెరికా అధ్యక్షుడి కుమారుడు, కోర్టు తీర్పును గౌరవిస్తానన్న జో బైడెన్

    • రచయిత, బెర్న్డ్ డెబుస్మాన్ జూనియర్, మ్యాక్స్ మట్జా, ఆంథోని జర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తుపాకీ కొనే సందర్భంలో అవకతవకలకు పాల్పడ్డరని న్యాయస్థానం తీర్పు చెప్పింది. తన కుమారుడి కేసులో జ్యూరీ నిర్ణయాన్ని గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

54 ఏళ్ల హంటర్ బైడెన్, 2018లో తుపాకీని కొనుగోలు చేసే సమయంలో దరఖాస్తులో తన మాదకద్రవ్యాల వినియోగం గురించి అబద్ధం చెప్పినందుకు 12 మంది జ్యూరీ సభ్యులు ఆయనను దోషిగా నిర్ధరించారు.

ఈ తీర్పు తర్వాత ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడి కుమారుడిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ చేపట్టడం ఇదే మొదటిసారి.

బైడెన్ నవంబర్‌లో తిరిగి ఎన్నిక కోసం ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన కుమారుడిపై మూడు నేరారోపణలు రుజువు అయ్యాయి.

దీనికి రెండు వారాల ముందు ఆయన ఎన్నికల ప్రత్యర్థి డోనల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో ఒక నేరారోపణలో దోషిగా తేలారు.

డెలావేర్‌లో జరిగిన ఈ విచారణకు జో బైడెన్ హాజరు కాకున్నా, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో సహా పలువురు కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా హాజరయ్యారు.

తీర్పు తర్వాత అధ్యక్షుడు బైడెన్ డెలావేర్‌లోని విల్మింగ్టన్‌కు వెళ్లి, అక్కడ తన కుమారుడిని పలకరించి, ఆయనను కౌగిలించుకున్నారు.

"నేను అధ్యక్షుడినే, కానీ తండ్రిని కూడా. ఈ కేసులో వచ్చిన తీర్పును అంగీకరిస్తున్నా. హంటర్ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్నందుకు న్యాయ ప్రక్రియను గౌరవిస్తాను" అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రెసిడెంట్ బైడెన్ అంతకుముందు తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని తోసిపుచ్చారు.

జో బైడెన్ భావోద్వేగాలపై ప్రభావం

హంటర్ బైడెన్ తన సోదరుడు బ్యూ బైడెన్ మెదడు క్యాన్సర్‌తో మరణించినప్పటి నుంచి మాదకద్రవ్యాలను ఉపయోగించడం ప్రారంభించారు.

తుపాకీని కొనుగోలు చేసే సమయంలో ఆయన క్రాక్ కొకైన్ వాడుతున్నారని నిరూపించేందుకు ప్రాసిక్యూటర్లు ప్రయత్నించడంతో, విచారణలో ఇబ్బందికరమైన వివరాలు వెల్లడయ్యాయి.

హంటర్ మాజీ భార్య కాథ్లీన్ బుహ్లే, మాజీ స్నేహితురాలు జో కెస్టాన్‌ల నుంచి ఆయన తరచుగా డ్రగ్స్ వాడడం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యుల సంబంధాలను దెబ్బతీసిందనే వాంగ్మూలాన్ని జ్యూరీ సభ్యులు విన్నారు.

ఆయన వ్యసనాన్ని వివరించే టెక్ట్స్ మెసేజ్‌లు, అర్ధ-నగ్నంగా ఉన్న హంటర్ బైడెన్ ఫొటోలను కోర్టుకు చూపించారు.

దీనిపై ట్రంప్ ప్రచార బృందం నుంచి వెలువడిన ఒక ప్రకటన, "ఈ విచారణ బైడెన్ కుటుంబం చేసిన నిజమైన నేరాల నుంచి దృష్టి మరల్చడం కంటే మరేమీ కాదు" అని పేర్కొంది.

కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు మాత్రం, రిపబ్లికన్‌లది కపటబుద్ధి అంటూ, అమెరికా న్యాయవ్యవస్థను ప్రశంసించారు.

"రిపబ్లికన్లు, డెమొక్రాట్‌ల మధ్య ప్రతిస్పందనలో ఉన్న వ్యత్యాసాన్ని పోల్చి చూడండి" అని మేరీల్యాండ్ డెమొక్రాట్ జేమీ రాస్కిన్ అన్నారు.

ట్రంప్ నేరారోపణను ప్రస్తావిస్తూ ఆయన, "రిపబ్లికన్లు మొత్తం న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారు, ఎందుకంటే ఈ కేసు జరుగుతున్న తీరు వాళ్లకు నచ్చడం లేదు. అయితే అమెరికా అధ్యక్షుడి కుమారుడిని విచారిస్తున్నా, ఏ ఒక్క డెమొక్రాట్ సభ్యుడూ దీనిని ఎత్తి చూపడం నేను చూడలేదు’’ అన్నారు.

బైడెన్ అధ్యక్ష పదవీకాలంలో మొదటి రెండు సంవత్సరాలలో ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన మైఖేల్ లారోసా మాట్లాడుతూ, "ఇది ఏ తండ్రిపై అయినా వ్యక్తిగతంగా ప్రభావం చూపుతుంది. అధ్యక్షుడిగా ఆయన తన విధుల విషయంలో పరధ్యానం చూపకపోవచ్చు కానీ ఇది ఖచ్చితంగా ఆయన భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాను" అన్నారు.

అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం?

హంటర్ బైడెన్‌ను దోషిగా నిర్థరించిన పలువురు జ్యూరర్లు తమ నిర్ణయం వెనుక రాజకీయాలు కారణాలు లేవని చెప్పారు.

"నేను అధ్యక్షుడు జో బైడెన్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు" అని ఒక జ్యూరీ సభ్యుడు బీబీసీకి చెప్పారు.

"జ్యూరీ సభ్యులు ఎవరూ దీనిలో ఎవరూ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని భావించడం లేదు" అని అన్నారాయన.

కేసును నిశితంగా పరిశీలిస్తున్న జో బైడెన్, జ్యూరర్ల నిర్ణయం విని భావోద్వేగానికి లోనైనట్లు ఆయన సలహాదారులు అమెరికా వార్తా సంస్థలకు తెలిపారు.

బైడెన్ డి-డే వార్షికోత్సవ కార్యక్రమాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారని మీడియా సంస్థ పొలిటికో తెలిపింది.

తన రాజకీయ జీవితం తన కుమారుడి న్యాయపరమైన సమస్యలకు కారణమైందని బైడెన్ భావిస్తున్నారని వెల్లడించింది.

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, అధ్యక్షుడి సలహాదారులు ఆయన కుమారుని గురించి ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడరు.

కొందరు సలహాదారులు హంటర్ బైడెన్ బయట కనిపించడాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించారు.

రాబోయే 120 రోజుల్లో హంటర్ బైడెన్‌కు శిక్ష విధిస్తారు, అయితే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదు.

హంటర్‌కు 25 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఆయన నేరం చేయడం ఇదే మొదటిసారి కాబట్టి అంత పెద్ద శిక్ష విధించే అవకాశం తక్కువ అని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఈ చట్టపరమైన ప్రక్రియ ఈ ఏడాది పొడవునా, ఆయన తండ్రి ఎన్నికల ప్రచారం చేసే సమయం అంతా కొనసాగుతుంది. సెప్టెంబరులో, ఆయన సుమారు 11 కోట్ల రూపాయల ఆదాయపు పన్నును చెల్లించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలపై కాలిఫోర్నియాలో విచారణను ఎదుర్కొంటారు.

ఆ కేసులో దోషిగా తేలితే, హంటర్ బైడెన్‌కు 17 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అయితే, ప్రజలు ఈ హంటర్ బైడెన్ విచారణను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

అందువల్ల నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో, హంటర్ కేసు తీర్పు ప్రభావం చూపే అవకాశం పెద్దగా లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)