ట్రంప్ -హష్ మనీ కేస్: ‘మా ఆవిడ ఎంత నొచ్చుకుందో మీకు అర్థం కాదు...’

    • రచయిత, బెర్న్డ్ డెబుస్మాన్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

హష్-మనీ కేసులో తనపై జరిగిన విచారణ, దోషిగా తేల్చడం తన భార్య, మాజీ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌కు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని డొనల్డ్ ట్రంప్ అన్నారు.

గత వారం హష్-మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను దోషిగా గుర్తిస్తూ న్యూయార్క్‌లోని మన్‌హటన్ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

తనతో సెక్స్‌లో పాల్గొన్న విషయం బయటపెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మాజీ శృంగార తార స్టోర్మీ డేనియల్స్‌కు ట్రంప్ డబ్బులు చెల్లించారని, ఈ చెల్లింపుల విషయంలో బిజినెస్ రికార్డులను తారుమారు చేశారనే అభియోగాలపై ఆయన్ను మన్‌హటన్ కోర్టు దోషిగా తేల్చింది.

తనపై విచారణ రాజకీయ ప్రోద్భలంతో జరిగిందని ట్రంప్ పదేపదే అంటున్నారు.

నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడమే తన ప్రతీకారమని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

జులై 11న ఉదయం 10 గంటలకు ట్రంప్‌కు శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి జువాన్ మెర్ఖాన్ ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లే యోచనలో ట్రంప్ ఉన్నారు.

న్యూయార్క్ న్యాయ వివాదం ముఖ్యంగా తన భార్యకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడిన సమయంలో ట్రంప్ అన్నారు.

డేనియల్స్ వాదనేంటి?

తానూ, ట్రంప్ ఓ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా 2006 జులైలో కలుసుకున్నామని డేనియల్స్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.

సాయంత్రం తనతో డిన్నర్‌కు రావాలని ట్రంప్ ఆహ్వానించారని, తనకు ఇష్టం లేకపోయినా, తన పబ్లిసిస్ట్ ( పబ్లిసిటీ కోసం పని చేసే వ్యక్తి) సూచన మేరకు ఆయనతో భోజనం చేసేందుకు అంగీకరించానని డేనియల్స్ అప్పట్లో వెల్లడించారు.

గోల్ఫ్ టోర్నమెంట్‌కు ట్రంప్ భార్య మెలనియా ట్రంప్ హాజరు కాలేదు. ఆ సమయంలో ఆమె బాలింత.

కాలిఫోర్నియా, నెవాడా మధ్యనున్న లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాను, ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్నట్టు తెలిపారు.

హోటల్ రూమ్ దగ్గర ట్రంప్ పైజమాతో వచ్చి పలకరించారని, తాను బాత్ రూమ్‌కు వెళ్లి వచ్చే సరికి, బాక్సర్ షార్ట్, టీ షర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చుని కనిపించారని ఆమె వెల్లడించారు. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో ఈ చర్యలో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో తాము కండోమ్ కూడా ఉపయోగించలేదని చెప్పారు.

ట్రంప్‌ తనతో శృంగారంలో పాల్గొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా నోరుమూసుకుని ఉండేందుకు 2016 ఎన్నికల ముందు ట్రంప్ లాయర్ కోహెన్ ‘హష్-మనీ’ కింద 1,30,000 డాలర్లు ఇచ్చినట్టు డేనియల్స్ తెలిపారు.

ఆ ఎన్నికలలో ట్రంప్ గెలిచారు. తన కుటుంబానికి ఏమవుతుందోననే ఆందోళనతో తాను ఆ డబ్బు తీసుకున్నట్టు డేనియల్స్ చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను ట్రంప్ లాయర్ ఆ సమయంలో కొట్టిపారేశారు.

అంతేకాక, ట్రంప్, ఆయన భార్య వేరువేరు బెడ్లపై పడుకుంటారని కూడా డేనియల్స్ తన వాంగ్మూలంలో చెప్పారు.

‘నా కుటుంబానికి చాలా కష్టంగా అనిపించింది’

‘‘ఆమె బాగానే ఉంది. కానీ, ఆమెకు ఇది చాలా కష్టంగా అనిపించి ఉండొచ్చు’’ అని భార్యను ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు.

‘‘చాలా రకాలుగా నాకంటే వారికే (నా కుటుంబానికే) ఎక్కువ కష్టంగా అనిపించింది’’ అని తెలిపారు.

మొత్తం 34 అభియోగాల్లో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. న్యూయార్క్ చట్టం ప్రకారం ప్రతి అభియోగంపైనా గరిష్ఠంగా నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఫాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తనకు శిక్ష పడే అవకాశం ఉందని ఒప్పుకున్నారు. తనకు శిక్ష పడినా ఒకే అని, కానీ, ప్రజలు ఒప్పుకుంటారా అన్న దానిపై తనకు నమ్మకం లేదన్నారు.

ప్రజలు దీన్ని తీసుకోవడం కష్టం కావొచ్చని తనకనిపిస్తుందని చెప్పారు. ‘‘మీకు తెలుసా, ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద, ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది’’ అని అన్నారు.

ఇంత వేగంగా జ్యూరీ తీర్పును ప్రకటించడంపై తాను చాలా ఆశ్చర్యానికి గురైనట్లు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న మాజీ శృంగార తార స్టోర్మీ డేనియల్స్‌ అన్నారు.

ట్రంప్ దోషిగా తేలిన తర్వాత తను తొలిసారి బ్రిటన్ వార్తాపత్రిక ది మిర్రర్‌తో మాట్లాడారు.

ట్రంప్‌కు జైలు శిక్ష పడాలని, అలాగే ఆయనకు పేదల కోసం కమ్యూనిటీ సర్వీస్‌ను శిక్షగా విధించాలని, మహిళల సహాయతా కేంద్రంలో వలంటీరుగా పని చేసేలా శిక్ష విధించాలని డేనియల్స్ అన్నారు.

ట్రంప్ దోషిగా తేలిన తర్వాత కూడా తనకింకా ఈ కేసు పూర్తి కానట్లేనని ఆమె అన్నారు.

‘‘ట్రంప్ దోషిగా నిర్ధరణ అవ్వొచ్చు. కానీ, నేనింకా దీని ప్రభావంతోనే జీవించాల్సి ఉంది’’ అని డేనియల్స్ అన్నారు.

మూడు ఇతర క్రిమినల్ కేసులలో కూడా ట్రంప్ డజను వరకు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. దీనిలో జార్జియా కేసు కూడా ఉంది.

2020 ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై స్వల్ప తేడాతో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక, ఆ ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నినట్లు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రస్తుతం అప్పీళ్లలో ఉంది.

సున్నితమైన సమాచారం ఉన్న డాక్యుమెంట్లను సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఉన్న ఆరోపణలపై ఆయన ఫ్లోరిడాలో కేసును ఎదుర్కొంటున్నారు. జడ్జి ఈ కేసు విచారణను వాయిదా వేశారు.

ఎవరీ స్టార్మీ డేనియల్స్

45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటిగా, దర్శకురాలిగా డేనియల్స్ పేరు తెచ్చుకున్నారు. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు.

దీంతోపాటు 2000లో వచ్చిన ‘40 ఇయర్స్ ఓల్డ్ వర్జిన్’, ‘నాక్డ్ అప్’ అనే చిత్రాలు సహా హాలీవుడ్ ప్రధాన స్రవంతి చిత్రాలలో కనిపించారు.

ఆమె రాజకీయాలలోనూ పాలుపంచుకున్నారు. ట్రంప్‌లానే తాను కూడా రిపబ్లికన్‌నేనని ప్రకటించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)