డోనల్డ్ ట్రంప్: ఈ కేసును అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారా?

    • రచయిత, సారా స్మిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారనే కేసులో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని మాన్‌హటన్ కోర్టులో హాజరయ్యారు.

తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, వీటిపై విచారణ జరపవద్దని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

అయితే ‘‘ఎలాంటి పబ్లిసిటీ అయినా మనకు మేలే చేస్తుంది’’అనే సిద్ధాంతాన్ని నిరూపించేలా డోనల్డ్ ట్రంప్ లైఫ్‌స్టైల్ కనిపిస్తుంది. తాజా క్రిమినల్ కేసు ఆయన మనస్తత్వానికి ఒక పరీక్ష లాంటిది.

ఈ కేసు ద్వారా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఫ్లోరిడాలోని తన ఇల్లు ‘‘మారాలాగో’’ నుంచి న్యూయార్క్ వరకు ఆయన ప్రయాణ మార్గంలో లైవ్‌లు ఇచ్చేందుకు టీవీ చానెళ్లు వరుసకట్టాయి.

కోర్టులో ఎలా నడచుకోవాలి? ఎలా కనిపించాలి? నవ్వాలా లేక సీరియస్‌గా ఉండాలా? లాంటి అంశాలపై తన అడ్వైజర్లతో ఆయన మంతనాలు జరిపి ఉండొచ్చు.

మీరు అవునన్నా లేదా కదన్నా.. ఈ కోర్టు వ్యవహారం కూడా ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమం లాంటిదే.

అయితే, ఈ క్రిమినల్ కేసులో విచారణను ఎన్నికల విజయంగా ట్రంప్ మలచుకోగలరా? అనేదే అసలు ప్రశ్న.

గత వారం ఆయనపై అభియోగాలు మోపాలని జ్యూరీ నిర్ణయించినప్పటి నుంచీ ఎంత డబ్బు(8 మిలియన్ డాలర్లు – రూ.65.74 కోట్లు)ను ప్రచారం కోసం సేకరించామో ఆయన ప్రచారకర్తలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రేసులో ప్రత్యర్థులతో పోలిస్తే ఆయన చాలా ముందున్నారని చెబుతున్న ఒపీనియన్ పోల్స్‌ను కూడా ప్రస్తావిస్తున్నారు.

ఇది అవసరమా?

ప్రజలకు బాగా సుపరిచితుడైన ట్రంప్‌కు అధికారులు సంకేళ్లు వేసినప్పుడు తీసిన ఫొటో రాజకీయంగా ఎంతవరకు మేలు చేస్తుందనే విషయంలో స్పష్టతలేదు.

అయితే, అలాంటి పరిస్థితి రాలేదు. ఆయనకు సంకెళ్లు వేయలేదు.

అలాంటి ఫొటో బయటకు వస్తే ఎలా ఉంటుందని అడిగినప్పుడు వైట్‌హౌస్ మాజీ అధికార ప్రతినిధి హోగన్ గిడ్లీ స్పందించారు.. ‘‘అది అత్యంత అందమైన, పౌరుషం ఉట్టిపడే ఖైదీ ఫొటో అవుతుంది’’అని సరదాగా వ్యాఖ్యానించారు.

కాకపోతే ట్రంప్ నుంచి మనం ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు. మరి రిపబ్లికన్ పార్టీలోని ఆయన రాజకీయ ప్రత్యర్థులు దీన్ని ఎలా చూస్తున్నారు? ఇదే అసలైన ప్రశ్న.

ఫ్లోరిడా గవర్నర్ ర్యాన్ డిశాంటిస్ స్పందిస్తూ.. ‘‘న్యాయ వ్యవస్థను రాజకీయ అజెండా కోసం ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తే, మొదటికే మోసం వస్తుంది’’అని వ్యాఖ్యానించారు.

మరోవైపు మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ఈ కేసులో ట్రంప్‌పై నేరారోపణలు మోపడం అనేది అమెరికా న్యాయవ్యవస్థ గురించి ప్రపంచానికి మనం తీవ్రమైన సందేశం పంపినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు.

నిజానికి ఇలాంటి వార్తలనే ఆయన రిపబ్లికన్ మద్దతుదారులు కూడా వినాలని భావిస్తూ ఉండొచ్చు.

అంటే, ఈ క్రిమినల్ ట్రయల్‌ను ప్రైమరీ ఎన్నికల్లో తన రాజకీయ లబ్ధి కోసం ట్రంప్ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రిపబ్లికన్లే ఓట్లు వేస్తారు. కానీ, ఈ వ్యూహం అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపించకపోవచ్చు.

ప్రజలు ఏం అంటున్నారు?

జార్జియా నుంచి విస్కాన్సిన్ వరకు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, ఓటర్లతో మేం మాట్లాడాం. అయితే, అధ్యక్షుడిగా ఉండేటప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన విధానాలు తమకు నచ్చేవని వారు చెప్పారు.

కానీ, ప్రస్తుతం ఆయన చుట్టూ అల్లుకుంటున్న నాటకీయ పరిణామాలతో మాత్రం విసుగెత్తిపోయామని అంటున్నారు.

నేర విచారణను రాజకీయ ప్రయోజనంగా మార్చుకునే ప్రయత్నంలో ఆయన ప్రజలకు దూరం అవుతున్నారు. 2024 నవంబరు ఎన్నికల్లో వీరు ఓట్లు వేస్తేనే ట్రంప్‌కు అధ్యక్ష పీఠం దక్కుతుంది.

ట్రంప్‌కు కరుడుకట్టిన మద్దతుదారుల్లో జాన్ మెక్‌గుయన్ కూడా ఒకరు. ఆయన్ను మన్‌హట్టన్‌లో ట్రంప్ టవర్ వెలుపల నేను కలిశాను. ఈ కోర్టు కేసు అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని ఆయన నాతో అన్నారు.

‘‘ట్రంప్ చెడ్డవారని భావించేవారు ఎలాగూ ఈ కేసుతో ప్రభావితం కారు. అదే సమయంలో ట్రంప్‌కు గట్టి మద్దతుదారులు కూడా అంతే’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘కాస్త అటూఇటూగా ఉండే ఓటర్లు కూడా ఈ కేసుతో ట్రంప్ వైపు వచ్చేస్తారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)