You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాగబాబు 'ఖర్మ' కామెంట్స్ 'వర్మ' గురించేనా, పిఠాపురంలో ఏం జరుగుతోంది?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి కారణం తామేనని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ." అంటూ నాగబాబు జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్ పిఠాపురంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈ కామెంట్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించి చేసిందేనని సామాజిక మాధ్యమాలలో చర్చ సాగుతోంది.
ఇంతకీ నాగబాబు అన్న ఆ 'ఖర్మ' అనే మాటను వర్మకు ఎందుకు ఆపాదిస్తున్నారు? ఎవరీ ఎస్‌వీఎస్ఎన్ వర్మ? నాగబాబు వ్యాఖ్యలకు ముందు, తర్వాత వర్మ ఏమన్నారు?
ఎవరీ వర్మ...?
ఎస్వీఎస్ఎన్ వర్మ పూర్తి పేరు శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం, పి. దొంతమూరుకు చెందిన వర్మ తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలోనే ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు.
వర్మ 2009 ఎన్నికలలో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజారాజ్యం అభ్యర్థి వంగా గీత చేతిలో ఓడిపోయారు. తరువాత 2014లో వర్మకు టీడీపీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 47వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పి.దొరబాబుపై గెలిచి పిఠాపురంలో తన పట్టు ఏమిటో చూపించారు. తరువాత మళ్లీ టీడీపీలో చేరారు.
2019లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి దొరబాబుపై 15వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2024 ఎన్నికలలో పిఠాపురంలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
అయితే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు నాయుడు బుజ్జగించడంతో...పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వర్మ అంగీకరించినట్టు టీడీపీ నాయకులు చెప్పారు.
ఎమ్మెల్సీ హామీతో..
ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలలో ఆయనకు అవకాశం ఇవ్వలేదు టీడీపీ. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా టీడీపీ 3, జనసేన, బీజేపీ చెరొక సీటు తీసుకున్నాయి.
ఇందులో జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికకాగా, తెలుగుదేశం పార్టీ కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీనాయుడులను మండలికి పంపింది. బీజేపీ తన అభ్యర్థిగా సోము వీర్రాజును ఎంపిక చేసింది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని వర్మ అభిమానులమని చెప్పుకుంటున్న వారు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 30 వేలమంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 95 వేలకు పైగా కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు.
"గతంలో పవన్ కల్యాణ్ కాపుల ఓట్లతో గెలవచ్చని భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి భంగపడ్డారు. మళ్లీ కాపులనే నమ్ముకుని 2024లో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ విజయం దక్కించుకున్నారు. దీంతో కాపులు ఎక్కువగా ఉండి, తనని ఎమ్మెల్యేను చేసిన పిఠాపురం నియోజకవర్గంలో మరో పొలిటికల్ సెంటర్‌ని తయారు చేసుకోవడం పవన్‌కి ఇష్టం లేకపోవచ్చు. అది కూడా వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి ఒక కారణం కావచ్చు." అని రాజకీయ విశ్లేషకుడు కె. ప్రకాశ్ అన్నారు.
జనసేన 12వ ఆవిర్భావ సభ సందర్భంగా బీబీసీ పిఠాపురం వెళ్లినప్పుడు కొందరు టీడీపీ నేతలు కూడా దాదాపు ఇదే విధంగా స్పందించారు.
"వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజకవర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అయినా కూడా వర్మకు నియోజకవర్గంలో ఉన్న పట్టుకి, పార్టీలో ఆయనకున్న పరపతికి అలాగే జరుగుతుంది." అని తూర్పు గోదావరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్.ఎస్. మూర్తి అన్నారు.
"తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ టర్నింగ్ పాయింట్ ఇచ్చి...పిఠాపురంలో ఆయన విజయానికి శ్రమపడిన వర్మనే ఈ నియోజవవర్గానికే దూరం చేయాలని చూస్తున్నారు. ఇది తప్పు." అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు నగేశ్ బీబీసీతో అన్నారు.
టీడీపీ కూటమి విజయం సాధించిన తరువాత నాగబాబు పిఠాపురంలో పర్యటించిన సందర్భంలో నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ కి చెప్పాలని, వర్మ వద్దకు వెళ్లొద్దంటూ షరతులు పెట్టారని, అసలు నాగబాబు ఏ హోదాలో అలా చెబుతున్నారంటూ అప్పట్లో టీడీపీ క్యాడర్ ప్రశ్నించింది.
"పవన్ కల్యాణ్ లాంటి ఒక బ్రాండ్ పిఠాపురం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరున్నా కూడా ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి ఎక్కువగా రాలేకపోవచ్చు. కానీ, పిఠాపురానికి ఏం చేయాలో ఆయన చేస్తూనే ఉన్నారు. డెవలప్‌మెంట్‌లో పిఠాపురం త్వరలో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతుంది" పిఠాపురం జనసేన లీడర్ ఎం.అప్పాజీ బీబీసీతో అన్నారు.
పవన్ గెలుస్తారని ముందే తెలుసు: నాగబాబు
పిఠాపురంలో ఘన విజయం సాధిస్తానని పవన్‌కు ముందే తెలుసునని జయకేతనం సభలో నాగబాబు అన్నారు.
"పిఠాపురంలో పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ" అని నాగబాబు ప్రసంగంలో అన్నారు.
"ఎవరైనా పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి, లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలి" అంటూ నాగబాబు ఆ ప్రసంగాన్ని కొనసాగించారు.
ఖర్మ అనే పదాన్ని...వర్మని ఉద్దేశించే సెటైరికల్ గా అన్నారంటూ నాగబాబు కామెంట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి.
2024 ఎన్నికల ప్రచారంలో పిఠాపురంలో వర్మ చేయిపట్టుకుని 'నా గెలుపు మీ చేతిలో ఉంది.' అని పవన్ కల్యాణ్ అన్న వీడియోను వర్మ అభిమానులు నాగబాబు కామెంట్‌కు కౌంటర్‌గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ పై బీబీసీ వర్మతో మాట్లాడింది. "అది నా వరకు చేరలేదు" అని ఆయన అన్నారు.
"నాగబాబు కామెంట్స్ నాపైనే అని చర్చ నడుస్తోంది. సర్లేండి. అటువంటివేవీ నేను పట్టించుకోను. ఇంతకు మించి మాట్లాడలేను’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
"చంద్రబాబు నాకు అన్యాయం చేస్తారనుకోవడం లేదు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవచ్చు. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు." అని జయకేతనం సభలో నాగబాబు మాట్లాడక ముందు వర్మ మీడియాతో అన్నారు.
పిఠాపురంలో ఏమంటున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి పైకి పెద్దగా కనిపించనప్పటీకి వర్మ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
‘‘గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గంలో ఉన్నది పదిరోజుల కంటే తక్కువే కావొచ్చు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన వర్మకు ఈ నియోజకవర్గంలో పట్టు ఉండటంతో ఆయనదే పై చేయిగా అనిపిస్తుంటుంది. ఇది జనసేన స్థానిక నాయకులకు గిట్టడం లేదు" అని పిఠాపురం స్థానికుడు శంకర్ అభిప్రాయపడ్డారు.
"పవన్ కల్యాణ్ వలన పిఠాపురానికి ఒక బ్రాండ్ వచ్చింది. మేం ఎక్కడికైనా వెళ్తే మీది పవన్ కల్యాణ్ నిజయోకవర్గమా అంటూ మా చుట్టూ ఓ నలుగురు చేరి మాట్లాడుతున్నారు. అది ఆయనపై జనాల్లో ఉన్న ఆసక్తి. అయితే, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆసుపత్రిపై దృష్టిపెట్టారు. మిగతావి కూడా క్రమంగా పూర్తి చేస్తే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పుకుంటారు. మిగతా వారెవరి పేరు అప్పుడు వినిపించదు" అని మరో స్థానికుడు సత్యనారాయణ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)