You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బలూచిస్తాన్ భారత్‌లో విలీనం కావాలని కోరుకుందా? నెహ్రూ వల్లే అది జరగలేదా?
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశ విభజన తర్వాత 'స్టేట్ ఆఫ్ కలాత్' అంటే బలూచిస్తాన్ దాదాపు 227 రోజుల పాటు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యంగా ఉంది.
బలూచిస్తాన్ తొలుత పాకిస్తాన్‌లో విలీనం కావాలని అనుకోలేదు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఇందుకు అంగీకరించారు.
కానీ, బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత ఇటు భారత్, అటు పాకిస్తాన్‌లోని సంస్థానాలు స్వతంత్రంగా ఉండలేకపోయాయి.
బలూచిస్తాన్‌లో ఎక్కువ భాగం శీతల ఎడారి ఉంటుంది. ఇది ఇరాన్ పీఠభూమికి తూర్పు అంచున ఉంది.
ప్రస్తుత బలూచిస్తాన్‌ను మూడు భాగాలుగా విభజించారు. ఇందులో పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్‌లో ఒక చిన్న భాగంగా విభజించారు.
అఫ్గానిస్తాన్‌లో నిర్ముజ్, హెల్మంద్, కాందహార్‌లు బలూచిస్తాన్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. బలూచిస్తాన్‌లో సున్నీ ముస్లింలు ఉంటారు.
షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ఇరాన్ బలూచిస్తాన్‌లోనూ బలూచ్ ప్రజలు సున్నీ ముస్లింలే.
పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి బలూచిస్తాన్‌లో తిరుగుబాటు స్వరం మొదలైంది. బలూచిస్తాన్‌లోకి చైనా ప్రవేశించినప్పటి నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బలూచిస్తాన్‌కు చెందిన గ్వాదర్ ఓడరేవును చైనాకు పాకిస్తాన్ కట్టబెట్టింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తున్నారు.
బలూచిస్తాన్ ఎప్పుడూ పర్షియా, హిందూ సామ్రాజ్యాల ఇరుక్కుపోయింది.
స్టేట్ ఆఫ్ కలాత్‌ను చాలామంది పాకిస్తాన్‌కు చెందిన హైదరాబాద్ అని పిలిచేవారు. కలాత్ ఒక స్వతంత్ర సంస్థానం. ఇది పాకిస్తాన్‌లో విలీనం అయ్యేందుకు నిరాకరించింది. హైదరాబాద్ సంస్థానం కూడా భారత్‌లో విలీనం అయ్యేందుకు నిరాకరించింది.
స్వతంత్ర బలూచిస్తాన్‌ను సమర్థించిన జిన్నా
1947 ఆగస్టు 15న భారత్‌లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత కూడా కలాత్, హైదరాబాద్ సంస్థానాలు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యాలుగా ఉండవచ్చని మొహమ్మద్ అలీ జిన్నా న్యాయ సలహా ఇచ్చారు.
అయితే, ఈ రెండు కేసుల్లోనూ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. చివరకు సైనిక చర్య తర్వాత హైదరాబాద్ 1948 సెప్టెంబర్ 13న భారత్‌లో విలీనమైంది.
కలాత్‌కు జిన్నా ఇచ్చిన సలహా పట్ల బ్రిటిష్ పాలకులు ఆశ్చర్యపోయారని, హైదరాబాద్‌లా కలాత్ లేదని జర్మనీ రాజకీయ శాస్త్రవేత్త మార్టిన్ ఆక్స్‌మన్ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. 'బ్యాక్ టు ద ఫ్యూచర్: ద ఖానెట్ ఆఫ్ కలాత్ ఎండ్ ద జెనెసిస్ ఆఫ్ బలూచ్ నేషనలిజం 1915-1955' అనే పుస్తకాన్ని మార్టిన్ రాశారు.
''1948 మార్చి 20న ఖాన్ ఆఫ్ కలాత్, పాకిస్తాన్‌లో విలీనం అయ్యేందుకు రాజీకి వచ్చారు. భారత్, అఫ్గానిస్తాన్‌ల వైఖరితో నిరాశ చెందిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్రంగా ఉండటానికి భారత్, అఫ్గానిస్తాన్ నుంచి మద్దతు దొరుకుతుందని ఖాన్ ఆఫ్ కలాత్ భావించారు'' అని మార్టిన్ పుస్తకంలో పేర్కొన్నారు.
కలాత్, పాకిస్తాన్‌లో విలీనం అవ్వకముందు నుంచే అక్కడ ఒక ప్రజాస్వామ్య జాతీయవాద ఉద్యమం కొనసాగుతుందని 'ఎ ప్రిన్స్లీ అఫైర్' అనే పుస్తకంలో రచయిత, పాకిస్తాన్ చరిత్రకారుడు యాకుబ్ ఖాన్ బంగాశ్ పేర్కొన్నారు.
''జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన 1945లో జరిగిన ఆలిండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్‌లో కూడా ద కలాత్ స్టేట్ నేషనల్ పార్టీ (కేఎస్‌ఎన్‌పీ) పాల్గొంది. మరోవైపు, బలూచిస్తాన్‌లో ముస్లిం లీగ్‌కు ఎప్పుడూ మద్దతు దక్కలేదు'' అని అందులో పేర్కొన్నారు.
స్టేట్ ఆఫ్ కలాత్ ఏం కోరుకుంది?
ఖాన్ ఆఫ్ కలాత్, కేఎస్‌ఎన్‌పీ సైద్ధాంతికంగా ప్రజాస్వామికవాదులు అని యూకుబ్ ఖాన్ బంగాశ్ తన పుస్తకంలో రాశారు.
''జాతీయవాదులైన కారణంగా కేఎస్‌ఎన్‌పీ, ముస్లిం లీగ్ నేతృత్వంలోని పాకిస్తాన్‌లోని విలీనం అయ్యేందుకు ఇష్టపడలేదు. కేఎస్‌ఎన్‌పీ, భారత్‌కు దగ్గర కావాలని కోరుకుంది. లేదా ఖాన్ ఆఫ్ కలాత్‌తో కలిసి స్వతంత్రంగా ఉండాలని అనుకుంది.
ప్రజాస్వామ్య ఉద్యమానికి ఖాన్ ఆఫ్ కలాత్ మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రెండు సభలతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పాటైంది. బలూచ్‌లు ముస్లింలనే ఒకే కారణంతో బలూచిస్తాన్‌ను పాకిస్తాన్‌లో భాగం చేయకూడదని కలాత్ పార్లమెంట్ భావించింది. కానీ, ఈ ప్రతిఘటనను పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేసింది. బలవంతంగా కలాత్‌ను స్వాధీనం చేసుకుంది'' అని యాకూబ్ ఖాన్ పుస్తకంలో రాశారు.
ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదనే షరతు మీద పాకిస్తాన్‌లో భారత సంస్థానాల విలీనం జరిగిందని పాకిస్తాన్ ప్రముఖ చరిత్రకారుడు ముబారక్ అలీ అన్నారు.
''కానీ, క్రమంగా ఈ రాచరిక సంస్థానాల ప్రతిపత్తి పూర్తిగా రద్దు అయింది. దీంతో అనేక రాజ్యాల ప్రాథమిక గుర్తింపు మసకబారడం మొదలైంది. ఇలాంటి సంస్థానాల్లో బలూచిస్తాన్ కూడా ఒకటి. బలూచిస్తాన్ అసలు పాకిస్తాన్‌లో విలీనం అవ్వాలని అనుకోలేదు. కానీ, పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. కలాత్ స్వతంత్రంగా ఉండాలని ఖాన్ ఆఫ్ కలాత్ కోరుకున్నారు. కానీ, పాకిస్తాన్ అలా అనుకోలేదు. స్వతంత్రంగా ఉండటం చిన్న సంస్థానాలకు అంత సులభం కాదు'' అని ముబారక్ చెప్పారు.
కలాత్ స్వతంత్రంగా, సార్వభౌమాధికారంతో ఉండాలని తొలుత కోరుకున్న జిన్నా తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నారని ముబారక్ అలీని ప్రశ్నించగా ఆయన స్పందించారు.
''చూడండి, రాజకీయాల్లో ఒకే మాట ఉండదు. సమయాన్ని బట్టి అన్నీ మారుతుంటాయి. కాబట్టి రాజకీయ నాయకుల మాటలను పట్టించుకోకూడదు. పాకిస్తాన్ ఏర్పాటైనప్పడు, బలూచిస్తాన్ పట్ల జిన్నా వైఖరి వేరు.
జిన్నా బలవంతంగా స్టేట్ ఆఫ్ కలాత్‌ను పాకిస్తాన్‌లో చేర్చారు'' అని ఆయన చెప్పారు.
జిన్నా ఎందుకు మనసు మార్చుకున్నారు?
పాకిస్తాన్‌లోని మాజీ భారత హై కమిషనర్, చరిత్రకారుడు టీసీఏ రాఘవన్‌ను ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ''అప్పుడు జిన్నా మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం. కానీ, కలాత్ స్వతంత్రంగా ఉండటానికి జిన్నా మద్దతు ఇచ్చాడన్నది మాత్రం నిజం. 1947లో బుగ్తీ నవాబ్, ఖాన్ ఆఫ్ కలాత్‌తో జిన్నాకు ఉన్న సంబంధాలు తర్వాత చాలా మారిపోయాయి. ఆ తర్వాతే ఆయన మనసు మారింది. అప్పుడే బలూచిస్తాన్‌ను బలవంతంగా పాకిస్తాన్‌లో కలిపారు'' అని చెప్పారు.
బలూచిస్తాన్‌లో ఏదైనా జరిగినప్పుడు భారత మీడియాలోని ఒక వర్గం స్పందిస్తుంది. స్టేట్ ఆఫ్ కలాత్‌ను అక్కడి నవాబు, భారత్‌లో కలపాలని ప్రతిపాదించినప్పుడు నెహ్రూ అందుకు ఒప్పుకోలేదని భారత మీడియాలోని ఒక వర్గం చెప్పడం మొదలుపెడుతుంది.
ఇదంతా వాట్సాప్ చరిత్ర అంటూ టీసీఏ రాఘవన్ కొట్టిపారేశారు.
''ఆ కాలంలో నెహ్రూ చాలా గౌరవనీయ నాయకుడు. ఖాన్ ఆఫ్ కలాత్ కూడా నెహ్రూను చాలా గౌరవించేవారు. మిగతా రాజ్యాల కంటే తమ రాజ్యం హోదా పూర్తిగా భిన్నంగా ఉండాలని ఖాన్ ఆఫ్ కలాత్ కోరుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా కలాత్ హోదా ఇతర రాచరిక రాజ్యాల కంటే భిన్నంగా ఉండేది.
కలాత్ రాజ్యం, భారత్‌లో విలీనం అవ్వాలని కోరుకున్నట్లుగా ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఖాన్ ఆఫ్ కలాత్ తన రాజ్యానికి ప్రత్యేక హోదాను కోరుకున్నారు. దీని గురించే ఇరాన్, బ్రిటిష్ సామ్రాజ్యం, పాకిస్తాన్, భారత్‌లతో చర్చలు జరిపారు. కలాత్ కోసం ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం ఆయన లక్ష్యం'' అని రాఘవన్ వివరించారు.
స్టేట్ ఆఫ్ కలాత్ ఎప్పుడూ భారత్‌లో విలీనం అయ్యేందుకు ముందుకు రాలేదని ముబారక్ అలీ కూడా అన్నారు.
''కలాత్ రాజ్యం స్వతంత్రంగా, సార్వభౌమ రాజ్యంగా ఉండాలనుకుంది. కలాత్ స్వతంత్రంగా ఉండటానికి నెహ్రూ సహాయపడాలని వారు కోరుకున్నారు. అంతేకానీ భారత్‌లో చేరాలనుకుంటున్నామని ఖాన్ ఆఫ్ కలాత్ ఎప్పుడు చెప్పలేదు. నెహ్రూ గొప్ప నాయకుడు. అందుకే ఖాన్ ఆఫ్ కలాత్‌కు ఆయనంటే చాలా గౌరవం. కలాత్‌ను భారత్‌లో కలిపే ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారని చెప్పడం చాలా తప్పు'' అని ముబారక్ వివరించారు.
అయితే, పాకిస్తాన్‌లో చేరకపోవడం గురించి బలూచిస్తాన్‌లో తీవ్ర చర్చ నడిచింది.
ఈ అంశం గురించి తాజ్ మొహమ్మద్ బ్రేసిగ్ తన పుస్తకం 'బలోచ్ నేషనలిజం: ఇట్స్ ఆరిజన్ అండ్ డెవలప్‌మెంట్ అప్ టూ 1980'లో రాశారు.
''1947లో మీర్ గౌస్ బక్ష్, కలాత్ స్టేట్ నేషనల్ పార్టీ సభ్యునిగా ఉన్నారు. మన సంస్కృతి ఇరాన్, అఫ్గానిస్తాన్ తరహాలో భిన్నంగా ఉంటుందని 1947 డిసెంబర్‌లో అసెంబ్లీలో జరిగిన దీవాన్ ఎ మీటింగ్‌లో బక్ష్ అన్నారు. ముస్లిం అయినందున పాకిస్తాన్‌లో విలీనం అవ్వాలనుకుంటే ఇరాన్, అఫ్గానిస్తాన్ కూడా పాకిస్తాన్‌లో చేరి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
'అణ్వాయుధాల యుగంలో మనల్ని మనం రక్షించుకోలేమని చెబుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్‌లు తమను తాము సూపర్ పవర్స్ నుంచి రక్షించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయా? ఒకవేళ మనల్ని మనం రక్షించుకోలేకపోతే, ఇతర చాలా దేశాలు కూడా తమను తాము రక్షించుకోలేవు' అని బక్ష్ అన్నారని'' పుస్తకంలో బ్రేసిగ్ రాశారు.
పాకిస్తాన్‌లో కలాత్ రాజ్యం విలీనమైన ఆరు నెలల తర్వాత, భారత్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపారు.
మరోవైపు 1947 ఆగస్టు 14న గవర్నర్ జనరల్, ఇండియన్ ఇండిపెండెంట్ చట్టం-1947 ప్రకారం ఒక ఆదేశాన్ని జారీ చేశారు.
''భారత్, కలాత్ హోదాతో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లను విభజించే డ్యూరాండ్ లైన్‌పై ప్రశ్నలు రేకెత్తించలేదు. మెక్‌మోహన్ రేఖపై పాకిస్తాన్ ప్రశ్నలు అడగలేదు'' అని ఆదేశంలో పేర్కొన్నారు.
జిన్నా తర్వాత మార్పులు
జిన్నా పాకిస్తాన్‌కు మతపరమైన గుర్తింపును కాకుండా సార్వత్రిక పౌరసత్వాన్ని కోరుకున్నారు.
1947 ఆగస్టు 11న ఆయన చేసిన ప్రసంగం చాలా ప్రసిద్ధి పొందింది.
''మీరు స్వతంత్రులు. మీకు నచ్చిన గుడి లేదా మసీదుకు వెళ్లే స్వాతంత్ర్యం ఉంది. మీరు పాకిస్తాన్‌లోని ఏ ప్రార్థనా స్థలానికైనా వెళ్లే స్వేచ్ఛ మీకు ఉంది. మీ కులం, మతం, జాతి ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపదు'' అని ఈ ప్రసంగంలో జిన్నా అన్నారు.
కానీ, జిన్నా మరణం తర్వాత పాకిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. 1956లో పాకిస్తాన్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. తర్వాత పాకిస్తాన్‌లో విలీనమైన సంస్థానాల సైన్యం, బ్యూరోక్రాట్లపై నియంత్రణ పెరిగింది.
భౌగోళికంగా ఈ సంస్థానాలు పాకిస్తాన్‌లో విలీనం అయ్యాయి కానీ, సామాజిక ఏకీకరణ జరుగలేదని యాకూబ్ ఖాన్ బంగాశ్ రాశారు.
బలూచిస్తాన్‌ను ఒక భద్రతా, సైనిక దృక్కోణంలో పాకిస్తాన్ చూసినంత కాలం ఎలాంటి పరిష్కారం దొరకదని టీసీఏ రాఘవన్ అన్నారు.
''1947కు ముందు పరిస్థితికీ, నేటికీ చాలా తేడా ఉంది. పాకిస్తాన్‌లో ఇలాంటి రాజకీయ సమస్యలు అన్నింటికీ పరిష్కారాన్ని భద్రతా కోణంలో చూస్తున్నారు. బలూచిస్తాన్ ప్రజల కోపాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి'' అని రాఘవన్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)