You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చే గువేరా నుంచి సనాతన ధర్మం దాకా.. ఈ పదకొండేళ్లలో జనసేన ప్రస్థానం ఎలా సాగింది?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
జనసేన పార్టీ పెట్టిన పదేళ్లకు దక్కిన విజయానికి గుర్తుగా 12వ ఆవిర్భావ సభను ఆ పార్టీ భారీగా జరుపుకుంటోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభను నిర్వహిస్తున్నారు.
మార్చి 14, 2014న జనసేన పార్టీ ఏర్పాటైంది. పదేళ్ల తర్వాత...జూన్ 4, 2024 న సూపర్ హిట్ అయ్యింది. కూటమిలో భాగంగా ఆ పార్టీకి దక్కిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెల్చుకుని '100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్' సాధించింది.
దీనిని ఉత్సవంగా జరుపుకునేందుకు ‘జయకేతనం’ పేరుతో ఈ సభను ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ జరుపుకుంటున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ విషయం సభ ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను బట్టి అర్థమవుతోంది.
ఈ సభతో జనసేన పార్టీ సత్తాను మరోసారి చాటుకుంటుందని ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసేన పుట్టింది హైదరాబాద్‌లో..
పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. పవన్ కల్యాణ్‌కు ఇదే రాజకీయంగా తొలి అడుగు. అయితే ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో కేవలం 18 స్థానాలకే పరిమితం కాగా...తర్వాత కాలంలో ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదని ఆ సమయంలో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదుర్కొవడమే ప్రధాన ఎజెండాగా తాను జనసేన పార్టీని పెట్టినట్లు 2014 ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు.
2014 మార్చి 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్‌లో మాదాపూర్ వద్ద ఉన్న నోవోటెల్ హోటల్లో జనసేన పార్టీని ప్రకటించారు పవన్ కల్యాణ్.
పార్టీ పెట్టినప్పటికీ తొలి ఎన్నికల్లో పోటీ చేయని జనసేన..
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. అయితే ఆ మద్ధతు పవన్ కల్యాణ్ తర్వాత కాలంలో కొనసాగించలేదు. రెండేళ్ల తర్వాత, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనీ, టీడీపీ కూడా ప్రశ్నించడం లేదనీ ఆరోపిస్తూ ప్రతిపక్షపార్టీగా మారి గళం విప్పారు.
2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళ్లింది. మొత్తం 134 సీట్లతో జనసేన, ఆ పార్టీతో జతకట్టిన బీఎస్పీ, వామపక్షాలు ఎన్నికల బరిలో దిగగా...ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెల్చుకున్నారు. తూర్పు గోదావరి జల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. కొంత కాలం తర్వాత ఆయన కూడా వైసీపీకి మద్దతుదారుడిగా మారారు.
అయితే ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీకి దిగారు. రెండు చోట్ల ఆయన ఓడిపోవడం సంచలనం రేపింది. పార్టీ అధ్యక్షుడే గెలవలేని పార్టీ జనసేన అంటూ ప్రత్యర్థులు పవన్ కల్యాణ్‌ను, ఆయన పార్టీని హేళన చేశారు.
ఆ సందర్భంలో ఇక జనసేన పార్టీ 'అంతే' అనుకున్నారంతా. ఆ పార్టీ భవితవ్యం ఏమవుతుందోనని ప్రశ్న పార్టీలోనే వినిపించింది.
ఆందోళనలు, ఉద్యమాల బాట..
2019 ఎన్నికల్లో జనసేన పరాజయం తర్వాత...ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన పరిస్థితులు ఎదురయ్యాయి.
అయితే ఆరునెలల్లోనే పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలోనే 'ఇసుక సంక్షోభం' కారణంగా కూలీలకు పనులు లేక ఆత్మహత్యల ఘటనలు నమోదయ్యాయి.
ఈ సమస్యనే ఆయుధంగా చేసుకుని పవన్ కల్యాణ్ విశాఖలో భారీ ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనలకు ఇప్పటి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు...పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఈ ఆందోళన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.
ఇది మొదలు క్రమంగా పవన్ కల్యాణ్...రైతు సంక్షేమం, మహిళల రక్షణ, భూ ఆక్రమణలు వంటి అంశాలపై ప్రశ్నిస్తూ...సభలు నిర్వహించేవారు. అలా మెల్లగా ప్రజల్లో కనిపిస్తూ వచ్చింది జనసేన పార్టీ.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో ఉన్న పవన్ కల్యాణ్...మళ్లీ బీజేపీ వైపు వచ్చారు.
రావడమే కాకుండా క్రమంగా సనాతన ధర్మానికి తనను తాను బ్రాండ్ అంబాసిడర్‌గా చూపించుకునే ప్రయత్నం చేశారు.
2014లో పార్టీ పెట్టినప్పుడు చే గువేరాను అనుకరించే ప్రయత్నం చేసిన పవన్ కల్యాణ్ 2024 నాటికి సనాతన ధర్మం వైపు అడుగులు వేయడం పవన్ కల్యాణ్‌లోని మార్పుకు చిహ్నంగా కనిపిస్తుంది.
టర్నింగ్ పాయింట్..
ఉద్యమాలు, ఆందోళనలతో పవన్ ప్రజల్లోకి వెళ్లినా రాజకీయంగా ఇంకా నిలదొక్కుకోలేదనే విమర్శను ఎదుర్కొనేవారు. ఇదే క్రమంలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్...రాష్ట్రంలో టీడీపీకి మద్ధతు తెలుపుతున్నట్లుగా తన చర్యలు కనిపించేవి.
పవన్ కల్యాణ్ కేంద్రంలో బీజేపీతో, రాష్ట్రంలో టీడీపీతో ఉంటున్నారని...వైసీపీ విమర్శలు చేసేది. దీనిని పవన్ కల్యాణ్ ఏనాడు ఖండించలేదు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ విమర్శలు చేసేది.
2023 సెప్టెంబరులో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ బహిరంగంగా స్పందించి...చంద్రబాబుని రాజమండ్రి జైలుకు వెళ్లి కలిశారు. ఇదే జనసేనకు, టీడీపీకి 2024 ఎన్నికల్లో బూస్టులా పని చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటారు.
అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్... 2024 ఎన్నికల్లో టీడీపీతో తాను కలిసి వెళ్తున్నానని...వైసీపీ అరాచకాలను ఎదుర్కొవాలంటే తన ఒక్కడి బలం చాలదంటూ రాజమండ్రి జైలు వద్ద జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానని అన్నారు. ఆ సందర్భంగానే....పవన్ కల్యాణ్ తనకు ఒక అన్నలా అండగా నిలబడ్డారంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
అనంతరం 2024 పొత్తుల్లో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి...వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాయి. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి...తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.
అందుకే పిఠాపురంలో..
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆ రెండు చోట్ల కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటంతో తన గెలుపు సులభం అవుతుందనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ రెండు స్థానాల్లోనూ ఆయన పరాజయం పాలయ్యారు.
2024 ఎన్నికల్లోనూ ఆయన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈసారి 70వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. తనను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని పవన్ కల్యాణ్ భావించి ఉంటారని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.
ఈ సభకు జయకేతనం అని పేరు పెట్టామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
'సభా స్థలానికి వెళ్లేందుకు మూడు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశాం. వీటికి ఎన్నో విద్యాలయాలకు స్థలాలు, నిధులు ఇచ్చిన పిఠాపురం రాజు శ్రీరాజా సూర్యారావు బహుదూర్, సేవా కార్యక్రమాలకు తన సంపాదన దానం ఇచ్చిన మల్లాడి సత్యలింగం నాయకర్, అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరును పెట్టి వారిని గౌరవించుకుంటున్నాం." అని తెలిపారు.
"సభ జరిగే మొత్తం 24 ఎకరాల్లో ఒక ఎకరం విస్తీర్ణంలో సభావేదిక నిర్మించాం. 12ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చొనేలా ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేశాం. వేదికపై 250 మంది వరకూ కూర్చొనే అవకాశం కల్పిస్తారు. సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రధాన రహదారుల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించే ఏర్పాట్లు చేశాం." అని జనసేన నాయకులు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ ఏం చెబుతారు?
సాయంత్రం 4 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది.
"అభివృద్ధి సంక్షేమం గురించి చర్చిస్తాం. రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు పవన్ వివరిస్తారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రణాళిక ప్రకటిస్తారు." అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
"కూటమి ప్రభుత్వంలో తన పాత్ర ఎంత బలమైనదో పవన్ కల్యాణ్ చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ సభను విజయోత్సవ సభలా నిర్వహించడం ద్వారా పవన్ కల్యాణ్ సత్తాను మిత్రపక్షాలకు, ప్రతిపక్షాలకు చూపించాలని భావిస్తారు. ఇతర పార్టీల్లోని కాపు సామాజిక వర్గం నేతలు కూడా తెర వెనక నుంచి సహకారం అందిస్తారు. అధికారంలోకి వచ్చాక జరిగే తొలి ఆవిర్భావ సభ కాబట్టి ఇది సహజంగానే జరుగుతుంది." అని సీనియర్ జర్నలిస్ట్ ఆర్. మురళి అన్నారు.
పిఠాపురానికి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలేంటంటే..
తనను ఎన్నుకుంటే పిఠాపురానికి ఏం చేస్తారనే విషయంపై ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ కొన్ని హామీలిచ్చారు.
- టెంపుల్ సర్క్యూట్ సిటీగా పిఠాపురం
- కేంద్రం నుంచి రూ. 100 కోట్ల నిధులు
- గొల్లప్రోలు సంత అభివృద్ధి, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు
- ఉప్పాడ తీర ప్రాంతం అభివృద్ధి
- ప్రతీ మండలంలో ఆధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం
- పట్టురైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం
- కొత్తపల్లి ఎస్ఈజెడ్ కు కొత్త పరిశ్రమలు, యువతకు ఉపాధి కల్పన
- ఉప్పాడ రోడ్డు కలుపుతూ రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం
"పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం వలన మా ఊరుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ఆయన ఇచ్చిన హామీలన్ని పూర్తి చేస్తే చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందులా ఎలాగో... పవన్ కల్యాణ్‌కు పిఠాపురం కూడా అలాగే మారుతుంది." అని పిఠాపురం నియోజకవర్గం ఓటరు కృష్ణ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)