You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇబ్రహీం రైసీ: మత బోధకుడు ఇరాన్ అధ్యక్షుడు ఎలా అయ్యారు, ఆయన ప్రయాణం ఎలా సాగింది?
ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీకి బాగా సన్నిహితుడు.
2021లో ఆయన అధ్యక్షుడైన తర్వాత ఇరాన్ అంతటా సంప్రదాయ వాదుల మీద పట్టు సాధించారు.
జుడీషియరీ చీఫ్‌గా ఉన్న 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ, హసన్ రౌహనీ తర్వాత భారీ మెజార్టీతో విజయం సాధించి దేశానికి అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికలకు ప్రముఖ నాయకులు, సంస్కరణవాదులు, అనేకమంది ఓటర్లు దూరంగా ఉన్నారు.
ఆర్థికపరమైన కష్టాలు, స్థానికంగా ఉద్రిక్తలు, అణు ఒప్పందం మీద ప్రపంచదేశాలతో నిలిచిపోయిన చర్చలు.. ఇలా ఇరాన్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఆయన అధ్యక్షుడైన తర్వాత 2022లో బురఖా ధరించడాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్ అంతటా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి.
ఇరాన్ మద్దతిస్తున్న పాలస్తీనీయన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించింది.
కొన్ని వారాల కిందట సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఆ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందనే అనుమానంతో ఇజ్రాయెల్ మీద ఇరాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
1980లలో రాజకీయ ఖైదీల మూకుమ్మడి మరణశిక్షలపై విచారణ జరపాలని ఇరానియన్లతో పాటు మానవహక్కుల కార్యకర్తలు కూడా రైసీని డిమాండ్ చేస్తున్నారు.
ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరం మషాద్‌లో ఇబ్రహీం రైసీ 1960లో జన్మించారు. ఈ నగరంలో షియా ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం ఉంది. ఆయన తండ్రి మత బోధకుడు, రైసీకి ఐదేళ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు.
షియా సంప్రదాయంలో మహమ్మద్ ప్రవక్త వారసుడు ధరించే నల్లటి తలపాగాను ధరించే రైసీ, తన తండ్రి అడుగుజాడలను అనుసరించి 15 ఏళ్లకే పవిత్ర నగరం కోమ్‌లోని సెమినరీకి హాజరయ్యారు.
విద్యార్థిగా ఉండగా పశ్చిమ దేశాల అండదండలున్న షా(Shah)కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రైసీ పాల్గొన్నారు. 1979లో అయేతుల్లా రుహల్లా ఖొమైనీ నాయకత్వంలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం షాను గద్దె దించింది.
ఇస్లామిక్ విప్లవం తర్వాత రైసీ న్యాయ వ్యవస్థలో ప్రాసిక్యూటర్‌గా చేరారు. అయేతుల్లా ఖమేనీ శిష్యుడిగా అనేక నగరాల్లో పని చేశారు. ఖమేనీ 1981లో ఇరాన్ అధ్యక్షుడయ్యారు.
‘డెత్ కమిటీ’తో సంబంధాలు
రైసీ 25 ఏళ్లకే తెహ్రాన్‌లో డిప్యూటీ ప్రాసిక్యూటర్ అయ్యారు.
ఆ పదవిలో ఉండగా 1988లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రహస్య ట్రైబ్యునల్‌లోని నలుగురు న్యాయమూర్తులలో ఆయన ఒకరుగా ఉన్నారు. తర్వాతి రోజుల్లో ఈ ట్రైబ్యునల్‌ను “డెత్ కమిటీ” అని పిలిచేవారు.
ఈ ట్రైబ్యునల్స్ అప్పటికే జైళ్లలో ఉన్న వేల మంది రాజకీయ ఖైదీల కేసులపై మరోసారి విచారణ చేపట్టాయి. ఇందులో ఎక్కువమంది వామపక్ష వ్యతిరేక గ్రూపు ముజాహిదీన్ ఇ ఖల్క్ సభ్యులు. వీరిని పీపుల్స్ ముజాహుదీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అని పిలిచేవారు.
కేసుల పునర్విచారణలో భాగంగా అనేకమందికి మరణశిక్ష విధించారు. ఎంతమందికి మరణశిక్ష విధించారనే సంఖ్యపై స్పష్టత లేదు. అయితే 5 వేల మంది స్త్రీ, పురుషులను చంపేసి, పూడ్చి పెట్టి ఉండవచ్చని మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి. వారందరినీ గుర్తు లేకుండా సమాధి చేయడం మానవత్వానికి వ్యతిరేకం అనేది హక్కుల సంఘాల వాదన.
ఈ మారణకాండను ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకులు ఎవరూ తిరస్కరించడం లేదు, అయితే ఈ కేసుల విచారణకున్న చట్టబద్దత, కేసుల వివరాల గురించి వారు మాట్లాడటం లేదు.
మరణశిక్షల విషయంలో తన పాత్రను రైసీ పదే పదే తిరస్కరిస్తూ వచ్చారు. అయితే ఫత్వా లేదా అయేతుల్లా ఖమేనీ మత ఆదేశాల ప్రకారం అవి చట్టబద్దమైనవేనని సమర్థించుకునేవారు.
1988లో రైసీ, న్యాయవ్యవస్థలోని ఇతర సభ్యులు, అప్పటి డిప్యూటీ సుప్రీం లీడర్ హొస్సేన్ అలి మొంటాజెరి మధ్య సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపు ఒకటి 2016లో లీకయింది.
“మరణశిక్షలు ఇస్లామిక్ రిపబ్లిక్‌లో అతి పెద్ద నేరం” అని మొంటాజెరి చెప్పడం ఆ టేపులో ఉంది. టేపు బయటకు వచ్చిన ఏడాది తర్వాత మొంటాజెరి ఖొమేనీ వారసుడి హోదాను కోల్పోయారు. దీంతో ఖొమేనీ మరణం తర్వాత అయేతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యారు.
“ఓ న్యాయమూర్తి, ఓ ప్రాసిక్యూటర్ తన ప్రజల భద్రతకు మద్దతిస్తే, అందుకు అతనిని ప్రస్తుతించాలి. నేను ప్రతీ పదవిలోనూ మానవ హక్కులకు అండగా నిలిచాను. ఇప్పటికీ అదే చేస్తున్నాను.” మరణశిక్షల గురించి 2021లో పాత్రికేయులు రైసీని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అది.
అధ్యక్ష పదవి మీద నిరాసక్తత
2017లో అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు రైసీ ముందుకు రావడంతో పర్యవేక్షకులు ఆశ్చర్యపోయారు.
ఈ అధ్యక్ష ఎన్నికల్లో రైసీ తోటి మత బోధకుడు రౌహనీ తొలి రౌండ్‌లో 57 శాతం ఓట్లతో రెండోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఈ ఎన్నికల్లో తనను తాను అవినీతిపై పోరాట యోధుడిగా రైసీ ప్రచారం చేసుకున్నారు. అయితే ఆయన న్యాయవ్యవస్థ ఉపాధిపతిగా ఉన్న సమయంలో లంచం తీసుకున్నారని రహౌనీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రైసీకి 38 శాతం ఓట్లు దక్కాయి.
ఎన్నికల్లో ఓటమి రైసీ ప్రతిష్టను ఏమీ చెయ్యలేకపోయింది. 2019లో అయేతుల్లా ఖమేనీ ఆయన్ని దేశంలో అత్యంత కీలకమై జ్యుడీషియరీ చీఫ్‌గా నియమించారు..
జ్యుడీషియరీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 88 మంది మత బోధకులు ఉండే ఈ అసెంబ్లీ తర్వాతి సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటుంది.
జ్యుడీషియరీ చీఫ్‌గా రైసీ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. దీని వల్ల మరణశిక్షల సంఖ్య తగ్గింది. డ్రగ్స్‌కు సంబంధించిన నేరాల్లో ఉరిశిక్ష విధించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ చైనా తర్వాత అత్యధికంగా మరణశిక్షలు విధిస్తున్న దేశంగా ఇరాన్ తన గుర్తింపును కొనసాగిస్తోంది.
ఇరాన్ న్యాయవ్యవస్థ ఇప్పటికీ భద్రతా బలగాలతో కలిసి పని చేస్తోంది. దేశంలో అసమ్మతి స్వరాలను అణచివేస్తోంది. ఇరాన్‌లో ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారు, విదేశాల్లో శాశ్వత నివాసాలు ఉన్న వారిని గూఢచారులుగా ముద్ర వేస్తూ ప్రాసిక్యూట్ చేస్తోంది.
మానవహక్కుల ఉల్లంఘనలో రైసీకున్న రికార్డు దృష్ట్యా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమంయలో డొనాల్డ్ ట్రంప్ ఆయనపై ఆంక్షలు విధించారు. 2009లో అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రతిపక్ష గ్రీన్ మూవ్‌మెంట్ నిరనసలను హింసాత్మకంగా అణచివేశారని, తన పాలనా కాలంలో బాల నేరస్తులకు ఉరిశిక్షలు విధించడంలో పాలనాపరమైన పర్యవేక్షణ ఉందని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
2021 అధ్యక్ష ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రచార సభల్లో తనను తాను అవినీతిపై పోరాట యోధుడిగా రైసీ ప్రచారం చేశారు.
2021లో తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు రైసీ ప్రకటించారు. “ దేశంలోని పేదరికం, అవినీతి, వివక్ష మీద పోరాడతాను. కార్యనిర్వాహక వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే స్వతంత్రంగా ముందుకు వచ్చాను” అని ఎన్నికల్లో చెప్పారు.
ఆ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులు పోటీ చేయకుండా అతివాద గార్డియన్ కౌన్సిల్ అడ్డుకోవడం అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపింది. అసమ్మతి వాదులు, సంస్కరణ వాదులు ఎన్నికలను బహిష్కరించాలని ఓటర్లను కోరారు. రైసీకి గట్టి పోటీ లేకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని వారు ఆరోపించారు.
అధ్యక్ష ఎన్నికల్లో రైసీ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్‌లో ఆయనకు 62 శాతం ఓట్లు వచ్చాయి. అయితే పోలింగ్ 49శాతం మాత్రమే జరిగింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇంత తక్కువ పోలింగ్ నమోవడం ఇదే తొలిసారి.
“దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తాను. ఇరాన్ మీద ఆంక్షల్ని తొలగించేందుకు దౌత్య మార్గంలో ప్రయత్నాలు చేస్తాను” 2021 ఆగస్టులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైసీ చేసిన వ్యాఖ్యలివి.
ఇరాన్ అణు కార్యకలాపాలను పరిమితం చేసే 2015 ఒప్పందాన్ని పునరుద్దరించేందుకు చర్చల్లో ఏర్పడిన స్థంభనను తొలగించడంపై ఆయన మాట్లాడేవారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్చలను పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో ఇరాన్ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఎదురుదాడి మొదలుపెట్టింది.
ఇరాన్‌కు ఇరుగుపొరుగున ఉన్న దేశాలు సంబంధాలను మెరుగుపరచుకోవడంపై రైసీ హామీ ఇచ్చారు. అదే సమయంలో స్థానికంగా తన చర్యలను సమర్థించుకున్నారు.
అణు కార్యక్రమాన్ని పునరుద్దరించేందుకు అమెరికాతో చేసుకున్న ఒప్పందం 2022 ఆగస్టులో రద్దయ్యింది. చర్చల్లో రైసీ కఠినంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగింది. దాని ప్రభావం తర్వాతి కాలంలో ఇరాన్ మీద పడింది.
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలతో ప్రకంపనలు
గతేడాది సెప్టెంబర్‌లో మత బోధకుల పాలనకు ముగింపు పలకాలంటూ ఇరాన్ అంతటా జరిగిన ఆందోళనలతో ఇస్లామిక్ రిపబ్లిక్ దద్దరిల్లింది.
హిజాబ్ సరిగ్గా ధరించలేదనే ఆరోపణలతో తెహ్రన్‌లో మోరాలిటీ పోలీసులు మహ్‌సా అమినీ అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారు కొట్టడంతో ఆమె మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను పోలీసులు తిరస్కరించారు. అయితే పోలీసులు కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు ఐక్యరాజ్య సమితి నిజ నిర్థరణ కమిటీ తేల్చింది.
రైసీ అధ్యక్షుడైన ఏడాదికే ఇరాన్‌లో మత బోధకుల పాలనకు వ్యతిరేకంగా దేశంలోని మహిళలు మూకుమ్మడిగా ఆందోళనలకు దిగారు.
ఈ వ్యవహారాన్ని నిర్ణయాత్మక ఒప్పందం ద్వారా పరిష్కరిస్తానని రైసీ హామీ ఇచ్చారు. అయితే ఆందోళనలను బలవంతంగా అణచివేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఎంత మంది చనిపోయారనే దాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, 551 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇందులో ఎక్కువమంది తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు తేల్చింది. ఆందోళనల్లో 75 మంది పోలీసులు చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది.
20 వేల మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో 9 మంది పురుషుల్ని పోలీసు కస్టడీలో హింసించి తర్వాత వారికి ఉరిశిక్ష విధించినట్లు యూఎన్ మిషన్ గుర్తించింది.
ఆందోళనలు సద్దుమణిగినప్పటికీ, మత బోధకుల పాలనకు, హిజాబ్ చట్టాలపై వ్యతిరేకత విస్తరిస్తూనే ఉంది. ఇరాన్ పార్లమెంట్, రైసీ తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ధిక్కరిస్తూ అనేకమంది మహిళలు, యువతులు బహిరంగ ప్రదేశాల్లో తమ జుట్టును కప్పి ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
పెరుగుతున్న స్థానిక ఉద్రిక్తతలు
ఆశ్చర్యకరంగా సౌదీ అరేబియాతో సంబంధాల పునరుద్దరణకు రైసీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య ఏడేళ్లుగా నిలిచిపోయిన సంబంధాలు తిరిగి గాడిన పడ్డాయి.
అయితే 2023 అక్టోబర్ 7న పాలస్తీనాలోని హమాస్ సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి వెళ్లి స్థానికులపై దాడులు చేసి ఇజ్రాయెలీలు, కొంతమంది విదేశీయులను బంధీలుగా పట్టుకెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గాజాపై ఇజ్రాయెల్ యుద్దం ప్రకటించింది.
ఆ సమయంలో ఇరాన్ మద్దతున్న సాయుధ గ్రూపులు, ఇతర సంస్థలు మిడిల్ ఈస్ట్ అంతటా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్, సిరియాలో ఇతర మిలిషియా గ్రూపులు పాలస్తీనీయులకు మద్దతు పేరుతో ఇజ్రాయెల్‌పై దాడులు చేయడం మొదలుపెట్టాయి.
ఏప్రిల్‌లో ఇరాన్ తన భూభాగం నుంచి ఇజ్రాయెల్ మీదకు నేరుగా దాడి చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇజ్రాయెల్ మీదకు 300కి పైగా డ్రోన్లు, క్షిపణలు ప్రయోగించాలన్న నిర్ణయానికి రైసీ మద్దతిచ్చారు. అయితే పశ్చిమ దేశాల మద్దతుతో వీటన్నింటినీ ఇజ్రాయెల్ మధ్యలోనే కూల్చివేసింది.
ఇజ్రాయెల్ మీద డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించడాన్ని తమ 'దృడమైన నిశ్చయం'గా చెప్పారు రైసీ.
ఆ తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులతో ఇరాన్‌లోని ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేసింది. పశ్చిమ దేశాలు సంయమనం పాటించాలని పిలుపివ్వడంతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయి.
ఇజ్రాయెల్ దాడిని తేలిగ్గా కొట్టి పారేసిన రైసీ తమ దాడులను సమర్థించుకున్నారు.
“ముస్లిం సమాజానికి పాలస్తీనా తొలి సమస్య” అని పాలస్తీనీయన్లకు ఇరాన్ మద్దతు కొనసాగుతుందని హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని గంటల ముందు రైసీ ప్రకటించారు.
రైసీ భార్య జమిలా తప్ప, రైసీ వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. జమిలా తెహ్రాన్‌లోని షాహిద్ బెహష్తీ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. రైసీ, జమిలా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. రైసీ మామ అయేతుల్లా అహ్మద్ అల్మహోదా మషాద్‌లో అతివాద ఇస్లామ్ బోధకుడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)