You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్-ఇరాన్‌ల ఒప్పందం చైనా, పాకిస్తాన్‌లపై ప్రభావం చూపిస్తుందా?
భారత్, ఇరాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం చైనా, పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
చాబహార్‌లోని షాహిద్ బెహెస్తీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్‌లు సోమవారం కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
షాహిద్ బెహెస్తీ ఇరాన్‌లోని రెండవ అతిపెద్ద పోర్టు.
ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
భారత పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఒప్పందం కోసం ఇరాన్ వెళ్లారు. ఆ దేశ షిప్పింగ్ మంత్రితో కలిసి ఈ కీలక ఒప్పందంపై సంతకం చేశారు.
ఇరాన్ సరిహద్దుకి సమీపంలో పాకిస్తాన్ - చైనా, గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాయి. భారత్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌ను కలిపే చాబహార్ పోర్టును గ్వాదర్ పోర్టుకి సవాల్‌గా భావిస్తున్నారు.
ఈ దీర్ఘకాలిక ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది.
షాహిద్ బెహెస్తీ పోర్టు నిర్వహణకు సంబంధించి 2016లో భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కొత్త ఒప్పందం 2016 ఒప్పందానికి కొత్త వెర్షన్‌గా చెబుతున్నారు.
ఈ ఒప్పందం పోర్టులో భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం అన్నారు.
భారత్ ఏం చెప్పింది?
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఒప్పందం ప్రాంతీయ సంబంధాలను మెరుగుపరుస్తుంది. అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా, యూరప్, ఆసియా దేశాలకు కొత్త మార్గాలను తెరవనుంది.
వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఈ ఒప్పందం కింద ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సుమారు 120 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.1000 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. దానితో పాటు మరో 250 మిలియన్ డాలర్ల (సుమారు 2,087 కోట్ల రూపాయలు) ఆర్థిక సాయం అందించనుంది. అంటే, ఈ ఒప్పందం విలువ సుమారు 370 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3090 కోట్లు).
ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ 2018 చివరి నుంచి ఈ పోర్టు నిర్వహణ చేపట్టింది.
ఈ ఒప్పందం కోసం ఇరుదేశాల మధ్య గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో సంబంధాలు మరింత మెరుగవుతాయని భారత్ ఆశిస్తోంది.
భారత వ్యూహాత్మక, దౌత్య ప్రయోజనాలకూ ఈ పోర్టు కీలకమైంది.
చాబహార్ పోర్టు విషయంలో ఇరుదేశాల మధ్య కొద్దికాలం పాటు విభేదాల అనంతరం భారత్, ఇరాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
జైశంకర్‌తో ఇరాన్ అధ్యక్షుడి భేటీ
ఈ ఏడాది జనవరిలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు.
భారత్, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాల అమలు, వాటిని వేగవంతం చేయడం గురించి ఇబ్రహీం రైసీ ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో జాప్యానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందంటూ చాబహార్ పోర్టు గురించి రైసీ లేవనెత్తారు.
2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు రైసీ మధ్య చర్చల సందర్భంగానూ చాబహార్ సమస్య ప్రస్తావనకు వచ్చింది.
భారత్ చేపట్టిన చాబహార్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరాన్ కోరుతోంది.
ఈ విషయంలో భారత్, చైనా మధ్య పోలిక కూడా వచ్చింది. చైనా తాను చేపట్టిన ప్రాజెక్టులను త్వరగా అమలు చేస్తోంది. కానీ, భారత్ అలా చేయలేకపోయింది. చైనాకు నిధులు, వనరుల కొరత లేదని, అందువల్ల చైనాదే పైచేయి అని నిపుణులు కొందరు చెబుతుంటారు.
వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, అమెరికా ఆంక్షల కారణంగా ఈ పోర్టు అభివృద్ధిలో జాప్యం జరిగింది. భారత్, ఇరాన్ మధ్య ఈ ఒప్పందం జరిగిన సమయంలోనూ అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు చెందిన 600 సంస్థలపై గత మూడేళ్లుగా ఆంక్షలు విధించి ఉంది.
‘‘ఆంక్షలున్న ఇరాన్‌తో ఎవరైనా ఒప్పందాలు చేసుకుంటే ఆ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. తద్వారా వారు కూడా ఆంక్షల ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని అమెరికా హోంశాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు.
అయితే, దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, ఈ ఒప్పందాన్ని చూసే దృష్టి కోణం మారాలని అమెరికాకు సూచించారు.
‘‘ఈ ఒప్పందం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒకప్పుడు అమెరికా కూడా ఈ ఒప్పందానికి అనుకూలంగా మాట్లాడింది. ఎక్కువమందికి లాభదాయకమైన ఈ ఒప్పందాన్ని చూసే విధానం మారాలి.’’ అని జయశంకర్ అన్నారు.
పాకిస్తాన్, చైనాపై చాబహార్ ప్రభావం
అరేబియా సముద్రంలో చైనాను సవాల్ చేసేందుకు భారత్‌కు చాబహార్ పోర్టు సాయపడుతుంది.
మరోవైపు, పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. ఇది చాబహార్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మార్గంలో అయితే 100 కిలోమీటర్లు మాత్రమే.
అలా, గ్వాదర్ పోర్టు, చాబహార్ పోర్టుల విషయంలో భారత్, చైనాల మధ్య పోటీ ఉంది.
వ్యూహాత్మకంగా చూసినా, గ్వాదర్ పోర్టులో చైనా ప్రమేయం భారత్‌కు సమస్యాత్మకం. అందువల్ల చాబహార్ పోర్టులో ప్రమేయం ఉండడం భారత్‌కు అనుకూలమైన అంశం.
బీబీసీలో మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణులు ఖమర్ అఘా మాట్లాడుతూ, ''ఇరాన్‌కు భారత్‌తో చారిత్రక సంబంధాలున్నాయి. ఆ సత్సంబంధాలను కొనసాగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. చాబహార్ పోర్టు పని కొనసాగుతుంది, ఆ ప్రాజెక్టుతో సంబంధాలను కూడా భారత్ కొనసాగిస్తుంది'' అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత భారత్‌కు మధ్య ఆసియాతో ప్రత్యక్ష సంబంధాలు తగ్గాయి. చాబహార్ పోర్టు ద్వారా భారత్ ఇప్పుడు కాబూల్‌తో సంబంధాలు నెరపగలదు. మధ్య ఆసియా దేశాలతోనూ వాణిజ్యం పెరిగే అవకాశం ఉంది.
ఇంతకుముందు, అఫ్గానిస్తాన్‌కు ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సి వచ్చింది.
ఈ పోర్టు ద్వారా చమురు, గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగానూ, చైనా నియంత్రణలోని గ్వాదర్ పోర్టు సమీపంలో భారత్ కార్యకలాపాలు పాకిస్తాన్‌లో చాలా కీలకంగా మారతాయి.
చాబహార్ పోర్టు ఎందుకంత కీలకం?
ఇరాన్ తీరప్రాంత నగరమైన చాబహార్‌లో పోర్టు అభివృద్ధికి 2003లో భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది.
2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్‌లో పర్యటించారు. గత 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
2016లో ఈ ఒప్పందాన్ని ఇరుదేశాలు ఆమోదించాయి. 2019లో అఫ్గాన్ వస్తువులు పాకిస్తాన్ మీదుగా కాకుండా ఈ పోర్టు ద్వారా భారత్‌కు చేరాయి.
2020లో ఈ ప్రాజెక్ట్ నుంచి భారత్‌ను ఇరాన్ తప్పించినట్లు కథనాలు వచ్చాయి.
ఇంటర్నేషనల్ నార్త్ - సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, అంటే ఐఎన్ఎస్‌టీసీకి ఈ పోర్టు చాలా కీలకం.
ఈ కారిడార్‌లో భాగంగా భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌ల మధ్య రవాణా కోసం 7,200 కిలోమీటర్ల సముద్ర, రైలు, రోడ్డు మార్గాల నెట్‌వర్క్‌ను నిర్మించాల్సి ఉంది.
ఈ కారిడార్ భారత్‌ను యూరప్‌కు దగ్గర చేస్తుంది. ఇరాన్, రష్యాకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టుకు చాబహార్ పోర్టు చాలా కీలకం.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైల్వే ఒప్పందంలో జాప్యంపై ఇరాన్ అసంతృప్తి కూడా కనిపించింది.
దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో నూతన వాణిజ్య మార్గ నిర్మాణానికి ఒప్పందం కుదిరినప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి.
ఇది ఇండియా - యూరప్ - మిడిల్ ఈస్ట్ కారిడార్‌గా మారితే చాబహార్ పోర్టుకు అంతగా ప్రాధాన్యత ఉండదని చెబుతున్నారు. అది కూడా ఇరాన్ నిర్లక్ష్యంగానే భావిస్తున్నారు.
అయితే, తాజాగా చాబహార్‌పై భారత్, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల మధ్య తలెత్తిన ప్రతిష్ఠంబన క్రమంగా తగ్గుతున్నట్లుగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అర్ధశతాబ్దం తర్వాత చంద్రుడిపై కాలుమోపేదెవరు, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?
- ఈ నగరం కిందంతా భూగర్భ సొరంగాలే.. మరి వాటిపై భారీ భవనాలు ఎలా కడుతున్నారు?
- స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....
- ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గాజాలో అమెరికా ఆయుధాలను ప్రయోగించిందా, తాజా నివేదిక ఏం చెబుతోంది?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)