You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్ లండన్‌కు.. చంద్రబాబు, పవన్ కాశీకి – పోలింగ్ ముగిశాక ఎవరెక్కడంటే
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు, హింసాత్మక ఘటనలు, చెంప దెబ్బలు, ఈవీఎంల ధ్వంసాలు, గాల్లోకి కాల్పులు, రాళ్ల దాడులు.. మొత్తానికి ఒకింత ఉద్రిక్త వాతావరణంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి.
సుమారు 80 శాతం పోలింగ్ జరగడంతో అటు వైసీపీ, ఇటు విపక్ష ఎన్డీయే కూటమి రెండు పక్షాలవారూ ఎవరికి వారు ఆ సరళి తమకే అనుకూలమని చెప్పుకొంటున్నారు.
అధికారికంగా ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 25 రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల వేడి తీవ్రంగా ఉండగా.. అంతకు నెలల ముందు నుంచే రాజకీయ వేడి కొనసాగుతోంది.
నాయకులు పాదయాత్రలు, బస్ యాత్రలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు.
మొత్తానికి సోమవారం పోలింగ్ పూర్తవడంతో ఎన్నికల హడావుడి దాదాపు ముగిసింది.
మరి.. ప్రధాన పార్టీల నాయకులు పోలింగ్ తరువాత ఏం చేస్తున్నారో తెలుసా.. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో ఉన్నారా.. ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లబోతున్నారు?
జగన్ యూరప్ పర్యటనకు కోర్టు అనుమతి
వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుతానికి రాష్ట్రంలోనే ఉన్నారు. ఆయన ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు.
అందుకు గాను ఇప్పటికే సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కానీ, ఆయనకు అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టులో దీనిపై మే 9న వాదనలు జరిగాయి. మే 14కి కేసు వాయిదా వేసింది కోర్టు.
తన కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లాలని, అలాగే స్విట్జర్లాండ్ వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.
గతంలో కూడా అనుమతిచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో మంగళవారం(మే 14) సీబీఐ కోర్టు ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన మే 16న లండన్ బయలుదేరనున్నారు.
కాశీలో పూజలు చేసిన పవన్ కల్యాణ్, అనా కొణిదెల
పిఠాపురం శాసన నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ పోలింగ్ రోజున సోమవారం మంగళగిరిలో ఓటేశారు.
హైదరాబాద్ నుంచి ఆయన భార్యతో కలిసి హెలికాప్టర్‌లో మంగళగిరి వచ్చి ఓటేసి అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
పోలింగ్ రోజు సాయంత్రమే ఆయన కాశీ(వారణాసి) బయలుదేరారు. ఈ మేరకు సోమవారం రాత్రే జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
మంగళవారం ఉదయం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
అనంతరం భార్య అనా కొణిదెలతో కలిసి కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.
నరేంద్ర మోదీ ఇవాళ(మంగళవారం) వారణాసిలో నామినేషన్ వేశారు.
రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు, ఎన్డీయే కూటమి సభ్యులతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
నామినేషన్ సమర్పణకు ముందు మోదీ అక్కడి ఆలయాలలో గంగా ఘాట్‌లలో పూజలు నిర్వహించారు.
చంద్రబాబు తిరుపతి, కాశీ, కొల్హాపుర్, శిర్డీ యాత్ర
రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీ, కూటమిలో ఎక్కువ స్థానాలకు పోటీ చేసిన పార్టీ అయిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పోలింగ్ తరువాత మొదట తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన వారణాసి వెళ్లారు.
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
వారణాసి చేరుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ మూడో సారి ప్రధాని కానున్నారని.. ఎన్డీయే కూటమికి దేశంలో 400కు పైగా సీట్లు వస్తాయని అన్నారు.
అంతేకాదు.. మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని ఆయన చరిత్రాత్మక సందర్భంగా అభివర్ణించారు.
గురువారం(మే 16న) ఆయన మహారాష్ట్రలోని కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయం, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను దర్శించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)