ఆళ్లగడ్డ: చనిపోయిందని తెలిసినా ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించారు

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల కిందట 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆళ్లగడ్డ ఓటర్లు ప్రత్యేకమైన తీర్పు ఇచ్చారు. ఆ ఎన్నికలలో వారు చనిపోయిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారు.

అవును.. నామినేషన్ వేసిన తరువాత మరణించిన అభ్యర్థిని ఓటర్లు గెలిపించారు. దాంతో అక్కడ మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్నికలవి.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అన్ని నియోజకవర్గాలకు పోటీ చేసిన తొలి ఎన్నిక.. ఆ ఎన్నికలలో ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

ఎలా చనిపోయారు?

అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శోభానాగిరెడ్డికి అవి అయిదో ఎన్నికలు. నామినేషన్ వేసిన తరువాత పోలింగ్‌కు ఇంకా సుమారు రెండు వారాల గడువు ఉండడంతో రోజంతా ఆమె ప్రచారంలోనే ఉండేవారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవి తొలి పూర్తిస్థాయి ఎన్నికలు కావడంతో ఆళ్లగడ్డ ఒక్కటే కాకుండా ఇతర నియోజకవర్గాలలో ప్రచారానికీ ఆమె వెళ్లేవారు.

ఆ క్రమంలోనే 2014 ఏప్రిల్ 23న వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల రెడ్డి నంద్యాలలో నిర్వహించిన జనభేరి సభలో పాల్గొన్నారు శోభానాగిరెడ్డి.

సభ ముగిసిన తరువాత నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు రోడ్డు మార్గంలో తిరుగుపయనమయ్యారు.

నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణంలో జాతీయ రహదారిపై గూబగుండం మిట్ట వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది.

రహదారిపై రైతులు ధాన్యం ఆరబోయడంతో శోభానాగిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. దీంతో వాహనంలోపల నుంచి పైకి ఎగిరిపడిన శోభానాగిరెడ్డి పక్కటెములకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు.

వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించగా మరుసటి రోజు ఏప్రిల్ 24న ఉదయం చికిత్స పొందుతూ మరణించారు.

అభ్యర్థి మరణించినా ఆగని ఎన్నికలు

శోభానాగిరెడ్డి చనిపోయే నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ ఎన్నికలలో ఏప్రిల్ 12న మొదలైన నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 19తో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఏప్రిల్ 23తో పూర్తయింది.

మే 7వ తేదీన పోలింగ్, 16వ తేదీన ఓట్ల లెక్కింపు మాత్రమే అప్పటికి మిగిలి ఉంది.

దీంతో ఎలక్షన్ కమిషన్ యథావిధిగా పోలింగ్ జరిపించింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గంగుల ప్రభాకరరెడ్డి పోటీ చేశారు.

ఇక రారని తెలిసినా జనం ఓటేశారు

వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి ఇక రారని తెలిసినా కూడా ప్రజలు ఆమెకు ఓట్లేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం 1,73,270 ఓట్లు పోలవగా.. అందులో 92,108 ఓట్లు శోభానాగిరెడ్డికి పడ్డాయి.

టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర రెడ్డికి 74,180 ఓట్లు వచ్చాయి.

దీంతో 17,928 ఓట్ల ఆధిక్యంతో శోభానాగిరెడ్డిని జనం గెలిపించారు. కానీ, తన విజయాన్ని చూడ్డానికి ఆమె లేరు.

ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో వైసీపీలోకి..

భూమా శోభానాగిరెడ్డి 1996లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆమెకు అది తొలి విజయం అనంతరం 1999లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు.

2004లో శోభానాగిరెడ్డి నంద్యాల లోక్‌సభకు పోటీ చేయగా ఆమె భర్త నాగిరెడ్డి ఆళ్లగడ్డ అసెంబ్లీకి పోటీ చేశారు. ఇద్దరూ ఆ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.

అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో వారు చేరారు. 2009 ఎన్నికలలో ఆళ్లగడ్డలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి శోభానాగిరెడ్డి గెలిచారు.

కానీ 2011లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో నాగిరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జగన్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలలో 2012లో శోభానాగిరెడ్డి ఆళ్ళగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

2014 ఎన్నికలలో మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసి పోలింగ్‌కు రెండు వారాల ముందు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఉప ఎన్నికలో గెలిచిన భూమా అఖిలప్రియ

శోభానాగిరెడ్డి గెలిచినప్పటి భౌతికంగా లేకపోవడంతో ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో 2014 అక్టోబరులో ఉప ఎన్నిక నిర్వహించగా వైసీపీ నుంచి శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియకు టికెట్ దక్కింది. అయితే, తెలుగుదేశం సహా మిగతా పార్టీలు ఏవీ పోటీగా అభ్యర్థులను నిలపలేదు.

దీంతో అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు. అనంతరం 2016లో అఖిలప్రియ అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తోంది?

లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సమయంలో అభ్యర్థులు మరణిస్తే ఏం చేయాలనే విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ -52లో పేర్కొన్నారు.

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసి అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తరువాత అభ్యర్థులలో ఎవరైనా చనిపోతే ఎన్నిక వాయిదా వేయాలో వద్దో రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి మరణిస్తే మరో అభ్యర్థిని నామినేట్ చేయడానికి వారం రోజుల సమయం ఇస్తుంది ఎలక్షన్ కమిషన్.

ఇలా అన్ని సందర్భాలలోనూ అవకాశం ఇవ్వకపోవచ్చు. అభ్యర్థి చనిపోవడానికి కారణాలపై రిటర్నింగ్ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యర్థి పార్టీల నేతలు హత్య చేయించడం వంటి కారణాలైతే ఎన్నిక వాయిదా వేస్తారు.

కానీ, శోభానాగిరెడ్డి మరణానికి కారణం రోడ్డు ప్రమాదం కావడం, అప్పటికే ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తవడంతో ఎన్నిక వాయిదా వేయలేదు.

2024 ఎన్నికలలో..

పోటీలో ఉన్న అభ్యర్థి మరణించమనేది చాలా తక్కువ సందర్భాలలో జరిగింది. ప్రస్తుత 2024 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ ఇటీవల మరణించారు.

మొరాదాబాద్‌లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగ్గా ఏప్రిల్ 20న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు.

ఇక్కడి ఫలితం ఏంటనేది జూన్ 4న తెలియనుంది.

అలాగే, 2023లో ఉత్తరప్రదేశ్‌లోని హసన్‌పుర్ నగర్ మున్సిపల్ ఎన్నికలలో ఓ మహిళా అభ్యర్థి పోలింగ్‌కు ముందు మరణించారు. ఆమెను స్థానిక ప్రజలు గెలిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)