‘మా నాన్న సీఎం’

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నీలం సంజీవరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో నలుగురు మినహా మిగతా అందరిదీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలే.

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో వీరిలో చాలామంది వారసులు పోటీ చేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఆరుగురు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుండగా మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు కూడా ఈ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

వీరు కాకుండా మాజీ ముఖ్యమంత్రుల సోదరులు, సమీప బంధువులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

వారు ఎవరు? ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?

వైఎస్ రాజశేఖరరెడ్డి - జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు.

జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2014, 2019 ఎన్నికలలో ఆయన తాను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు.

2019లో ఆయన ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు.

అంతకుముందు 2009లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంటు స్థానంలో పోటీ చేసి గెలిచారు. తన తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. దీంతో 2011లో కడప లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికలలో జగన్ అక్కడి నుంచి తాను స్థాపించిన కొత్త పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 5 లక్షల 45 వేలకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.

నారా చంద్రబాబునాయుడు - లోకేశ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన తరువాత ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్.

లోకేశ్ గత 2019 ఎన్నికలలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీచేశారు. అయితే, ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు.

అంతకుముందు 2014 - 19 మధ్య తండ్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేశ్ మంత్రిగా పనిచేశారు. శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.

నాదెండ్ల భాస్కరరావు - మనోహర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1983లో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి చిట్టచివరి స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ 2011 నుంచి 2014లో రాష్ట్ర విభజన వరకు ఆ పదవిలో ఉన్నారు.

ఆయన ఇంతకుముందు 2004, 2009లో తెనాలి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు గెలిచారు. 2019 ఎన్నికలలో ఆయన ఇదే సీటు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.

మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయించారు.

ఎన్టీ రామారావు - బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) కుమారుడు బాలకృష్ణ హిందూపురం శాసనసభాస్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు.

2014, 2019 ఎన్నికల్లో ఆయన ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఇదే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1985, 1989, 1994లో ఆయన ఇక్కడి నుంచి వరుసగా గెలిచారు.

అనంతరం 1996 ఉప ఎన్నికలలో ఎన్టీఆర్ మరో కుమారుడు హరికృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

నేదురుమల్లి జనార్దన రెడ్డి - రాంకుమార్ రెడ్డి

తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆయన తండ్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి 1990 నుంచి 1992 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1989 ఎన్నికలలో జనార్దనరెడ్డి వెంకటగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు.

వెంకటగిరి నుంచి జనార్దనరెడ్డి భార్య, రాంకుమార్ రెడ్డి తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1999, 2004లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

కోట్ల విజయ భాస్కరరెడ్డి - సూర్యప్రకాశ్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర రెడ్డి కుమారుడే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి.

గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సూర్యప్రకాశ్ రెడ్డి ప్రస్తుత ఎన్నికలలో డోన్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సూర్యప్రకాశ్ రెడ్డి భార్య సుజాతమ్మ గతంలో గెలిచారు. విజయభాస్కర రెడ్డి కూడా డోన్ నుంచి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.

నందమూరి తారక రామారావు - దగ్గుబాటి పురందేశ్వరి

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి 2024 లోక్‌సభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఆమెకు అధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

2014లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆమె ఆ ఎన్నికలలో రాజంపేట లొక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో బాపట్ల, విశాఖపట్నం నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచారు ఆమె.

రాజశేఖరరెడ్డి - వైఎస్ షర్మిల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె రానున్న ఎన్నికలలో కడప లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తానన్నట్లుగా సంకేతాలిచ్చారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆమె ఎక్కడ పోటీ చేస్తారు? అసెంబ్లీకా? లోక్‌సభకా? అనేది స్పష్టత రాలేదు. కానీ, పీసీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఎన్నికలలో పోటీ చేయడమన్నది ఖాయమే.

వీళ్లూ మాజీ సీఎంల బంధువులే

వీరే కాకుండా మీజీ ముఖ్యమంత్రుల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

నల్లారి బ్రదర్స్:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.

మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు.

కాసు మహేశ్ రెడ్డి:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మహేశ్ రెడ్డిది కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబమే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుడు వెంగళరెడ్డికి ఈయన మనవడు.

మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నరసరావుపేట ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. టంగుటూరి అంజయ్య, రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు.

2014లో రాష్ట్రం విడిపోయేనాటికి కాసు వెంకటకృష్ణారెడ్డి సహకార శాఖ మంత్రిగా ఉండేవారు.

బేబీ నాయన:

వీరితో పాటు స్వాతంత్ర్యానికి పూర్వం మద్రాస్ ప్రెసిడెన్సీకి మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసిన రాజా రావ్ శ్వేతాచలపతి సర్ రామకృష్ణ రంగారావు మనవడు బేబీనాయన కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

ఆయన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

2014లో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలో ఆయన వైసీపీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బేబీనాయన సోదరుడు సుజయ కృష్ణ రంగారావు మూడు సార్లు బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగానూ పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)