You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈసారి ఎన్నికల ప్రచారంలో 40 కోట్ల యూజర్లున్న వాట్సాప్ ఎంతో కీలకంగా మారిందా... గ్రూప్ అడ్మిన్లు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- రచయిత, భాను ప్రకాశ్ కర్నాటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019 సార్వత్రిక ఎన్నికలనే 'వాట్సాప్ ఎన్నికలు' అని కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాశాయి.
గడిచిన ఐదేళ్లలో సోషల్ మీడియా ఏ మేరకు విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారత్‌లో 400 మిలియన్ల మంత్లీ యాక్టీవ్ యూజర్లు ఉన్న వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఈసారి ఎన్నికల్లో చూపించే ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.
2024 లోక్‌సభ ఎన్నికలకు భారత్ సిద్ధమైంది.
ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న తొలి విడుత పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
మార్చి నెల మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ అక్టోబర్ 2013లోనే రాజకీయ పార్టీలకు స్పష్టమైన నిబంధనలను జారీ చేసింది.
అందులో భాగంగానే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు కూడా ఫారం నెం.26లో తెలియజేయాలి.
మరి ఈ ఎన్నికల్లో వాట్సాప్ కీలకమే కానుందా? ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంది? వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి?
వాట్సాప్ ఛానెళ్లు...
ఎప్పటికప్పుడు పరిధిని పెంచుకుంటూ, కొత్త సాంకేతికతను జోడించుకుంటూ వెళ్తోన్న వాట్సాప్‌లో, గత ఏడాది సెప్టెంబర్‌లో వాట్సాప్ చానెల్స్ ప్రారంభించింది.
యూజర్లకు ఆసక్తి ఉన్న వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన అప్‌డేట్స్ పొందేందుకు వీలుగా ప్రైవేటు వాట్సాప్ ఛానెళ్లను నిర్వహించుకోవచ్చు. దాని ద్వారా యూజర్లకు చేరువకావొచ్చు. ఈ ప్రయోగం కూడా సక్సెయింది.
ఇప్పుడు ఈ ఫీచర్ కూడా ఎన్నికల ప్రచారంలో సాధనంగా మారింది.
దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా అదే సమయంలో వాట్సాప్ చానళ్లను ప్రారంభించాయి.
ప్రస్తుతం బీజేపీ అధికారిక వాట్సాప్ చానల్‌కు 7.11 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను 5.02 లక్షల మంది అనుసరిస్తున్నారు.
ఎన్నికల కమిషన్ ఏం చెబుతోంది?
ప్రచారంలో సోషల్ మీడియా పాత్రపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియా, కేబుల్ టీవీ వంటి మాధ్యమాల ప్రచారాలపై ఉన్నట్లుగానే సోషల్ మీడియా విషయంలోనూ నిబంధనలు వర్తింపజేసింది.
ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బాధ్యులు ఉంటారు.
అన్ని రకాల రాజకీయ ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం చేసే ముందు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి వాటికి అనుమతులు లభించిన తర్వాతనే ప్రచారంలో వినియోగించుకోవాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది.
వికసిత్ భారత్ క్యాంపెయిన్ విషయంలో..
ఇటీవల 'వికసిత్ భారత్' పేరిట వాట్సాప్ యూజర్లకు ప్రభుత్వ పథకాలు, పనితీరుపై ఫీడ్‌బ్యాక్ కోరుతూ పీడీఎఫ్‌తో కూడా సందేశాలు చేరుతున్నాయి.
అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఆ సందేశాలు కొనసాగడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి.
దీనిపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఆ క్యాంపెయిన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది.
దీనిపై సంబంధిత శాఖ నుంచి స్పందన కూడా వచ్చింది. "ఎన్నికల కోడ్ అమలుకాక ముందే ఈ సందేశాలు పంపామని, కోడ్ అమలులోకి వచ్చాక ఆ క్యాంపెయిన్ నిలిపివేసినట్లు తెలిపింది. సాంకేతిక, నెట్వర్క్ పరిమితుల కారణంగా కొన్ని సందేశాలు ఆలస్యంగా మొబైళ్లకు చేరుతున్నాయి" అని తెలిపింది.
ఎన్నికల పై వాట్సాప్ ఏమంది?
వాట్సాప్ సంస్థ కూడా అసత్య వార్తల సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
యూజర్లు అసత్య సమాచారాన్ని రిపోర్ట్ చేయడానికి అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపింది.
భారత్‌లో ఎన్నికలకు సంబంధించి అభ్యంతర కంటెంట్ లేదా తప్పుడు సమాచారం లేదా అసత్య వార్తలు లేదా మరేదైనా సమాచారాన్ని ఏఎఫ్‌ఫీ అనే సంస్థకు రిపోర్ట్ చేయవచ్చు.
అందులో, “వాట్సాప్‌లో పంపే సందేశాలు ఎండ్ టూ ఎండ్ ఇన్‌క్ట్రిప్టెడ్. అంటే, ఆ సందేశాలను ఎవరూ తెలుసుకోలేరు. రాజకీయ ప్రసంగాలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, అభ్యర్థులు పంపే సందేశాలను కూడా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ విషయమై ఎన్నికల నిపుణులతో వాదనలు కూడా జరిగాయి ” అని పేర్కొంది.
సంస్థ వెబ్‌సైట్‌లో అందుకోసం తీసుకున్న చర్యలు, విధానాల గురించి ప్రస్తావించింది.
ఫార్వర్డ్ లిమిట్: సందేశాలు, ఛానెల్ అప్‌డేట్స్‌ను ఒకేసారి ఐదు కాంటాక్ట్స్‌కు మించి ఫార్వర్డ్ చేయడం సాధ్యం కాదు. ఈ పరిమితి అమలులోకి వచ్చాక ఫార్వర్డ్ మెసేజ్‌ల సంఖ్య 25 శాతానికి పైగా తగ్గిందని వాట్సాప్ తెలిపింది.
అదనపు పరిమితి, లేబులింగ్: ఎక్కువసార్లు ఫార్వర్డ్ అయిన సందేశమని తెలిపేలా మార్క్‌ను ఆ సందేశంపైన డిస్‌ప్లే చేస్తోంది. అంటే అది బయటి సమాచారమని, తమ వారి నుంచి వచ్చినది కాదని తెలుసుకోవచ్చు.
రాజకీయ ప్రయోజనాల విషయంలో..
రాజకీయ పార్టీలు లేదా రాజకీయ అభ్యర్థులు ఆటోమేషన్ వ్యవస్థతో సందేశాలు పంపడం లేదా అనుమతి లేకుండా వాట్సాప్ యూజర్లకు సందేశాలను పంపడం గనుక చేస్తే, వారి అకౌంట్లను బ్యాన్ చేసే అవకాశం ఉందని తెలిపింది సంస్థ. వాట్సాప్ బిజినెస్ ఫీచర్‌ను రాజకీయ ప్రచారాల కోసం వినియోగించుకోవడానికి అనుమతులు లేవని తెలిపింది.
చాలా దేశాల్లో ముఖ్యంగా ప్రధాన ఎన్నికల సమయాన భద్రత విషయంలో తమ విధానంపై రాజకీయ సంస్థలతో స్పష్టంగా చెబుతామని పేర్కొంది.
వాట్సాప్ ప్రచారాలపై పర్యవేక్షణ సాధ్యం కాాదా?
“ఫేస్‌బుక్, ట్విటర్‌ల వంటి ఓపెన్ మెసేజింగ్ యాప్‌లతో పోలిస్తే వాట్సాప్, టెలిగ్రాం వంటి క్లోజ్‌డ్ మెసేజింగ్ యాప్‌లపై పర్యవేక్షణ సులువు కాదు, ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్ సభ్యులెవరైనా సమాచారాన్ని పంచుకుంటే తప్ప, ఆ గ్రూప్‌లో ఏం జరుగుతుందో తెలీదు. అలాంటప్పుడు పర్యవేక్షణ ఏవిధంగా సాధ్యం?” అన్నారు ఫ్యాక్ట్‌లీ వెబ్‌సైట్ వ్యవస్థాపకులు రాకేష్.
భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ కావాలని అన్నారు.
ఆయన మాట్లాడుతూ, ఆరు నెలల ముందుగానే ప్రత్యేకించి సోషల్ మీడియా సంస్థలతో సమావేశం అవ్వాలి. సోషల్ మీడియాలో అసత్య వార్తల ప్రచారం, ఉద్దేశపూర్వకంగా లేదా ఓ వర్గాన్ని ప్రభావితం చేసే వీడియోల నియంత్రణ, కంటెంట్ పర్యవేక్షణకు అవసరమైన సాంకేతిక సన్నద్ధత కోసం ప్రణాళికలు అమలు చేయాలి" అన్నారు.
"ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ, తప్పుడు సమాచారం, ఓటర్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలపై ఎక్కువగా దృష్టిసారించింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపే ప్రత్యేక వ్యవస్థ లేదు" అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పలు సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా అన్ని వేదికలు సహకరించాలని ఎన్నికల కమిషనర్ సంస్థల ప్రతినిధులను కోరారు.
ఎన్నికల కోడ్ నిబంధనలకు తగినట్లుగా సంస్థలన్ని ‘వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్’ను రూపొందించి, ఆ నిబంధనలు అమలయ్యేలా చూస్తామని ఐఏఎంఏఐ ప్రతినిధులు, సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కమిషన్‌కు చెప్పాయి.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
వాట్సాప్ గ్రూపులను నిర్వహించే అడ్మిన్‌లు కూడా ఎన్నికల కోడ్‌ను అనుసరించి, గ్రూపుల్లో షేర్ అయ్యే సమాచారం, ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు, సమాచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఈ విషయంలో వాట్సాప్ కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో కచ్చితమైన సమాచారం మాత్రమే పంచుకోవాలని, ఫేక్ వార్తలను రిపోర్ట్ చేయాలని సూచించింది.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే, పర్యావసానాలు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకునేలా మారొచ్చు.
- జాతి, మత, కుల వ్యతిరేకమైన కంటెంట్‌ను షేర్ చేయకూడదు.
- అసత్య ప్రచారాలు, ధృవీకరణలేని వార్తలన్ని షేర్ చేయకూడదు.
- అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఫొటోలు, వీడియోలు షేర్ చేయకూడదు.
- హింసను ప్రేరేపించే కంటెంట్, పోర్నోగ్రఫీ కంటెంట్‌ను షేర్ చేయకూడదు.
ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్లు, యూజర్లకు మార్గదర్శకాలు లేనప్పటికీ, ఇతర సందర్భాల్లో వర్తించే మార్గదర్శకాలే వర్తిస్తాయి.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు...
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రత్యేకించి పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేయడం కొత్త ట్రెండ్.
ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, టెలిగ్రాం వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు తమకు అనుకూలంగా ప్రచారం (పెయిడ్ కంటెంట్) చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలు, నాయకులు ప్రత్యేకంగా వారిని నియమించుకున్న సందర్భాలు చూశాం.
2024 ఎన్నికల్లో వీటి ప్రాధాన్యతపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది.
ఎన్నికల సమయంలో రాజకీయాలకు సంబంధించి పరోక్షంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రచారాలపై కూడా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ జరుపుతుంది. కానీ ఇది సవాళ్లతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పే కంటెంట్ వెనుక ఉద్దేశం, పెయిడ్ కంటెంట్‌కు, సాధారణ కంటెంట్‌కు మధ్య తేడాని గుర్తించడం సులభం కాదు అని హిందూ పత్రికకు తెలిపారు కర్ణాటక స్పెషల్ ఆఫీసర్ (మీడియా& ఐటీ) సూర్యసేన్ ఏ.వీ.
ఇవి కూడా చదవండి:
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందా, ప్రపంచం మీద ప్రభావం ఏంటి? 5 కీలక పరిణామాలు
- మిషన్ కనెక్ట్ పాడేరు: వేయని రోడ్డుకు రూ.65 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు...బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
- బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)