You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత తొలిసారి ఓటు హక్కు పొందిన గిరిజనాపురం గ్రామస్థులు.. ఈ ఊరి కథేంటి
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
‘‘మాకు ఓటు హక్కు లేదు. ఓటు ఎలా వేయాలో కూడా తెలియదు.’’
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గిరిజనాపురం గ్రామానికి చెందిన ఆదివాసీలు చెప్పిన మాట ఇది.
గోకవరం పంచాయతీలోని ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తున్నారు. వీరిలో 19 మందికి ఇటీవలే తొలిసారి ఓటు హక్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కొండదొర తెగకు చెందిన వీరంతా తాము ఇంతవరకు ఓటు వేయలేదని చెబుతున్నారు.
అంతేకాదు, వీరిలో చాలా మందికి ఎటువంటి గుర్తింపు పత్రాలూ లేవు.
చాలా మందికి ఆధార్ కార్డు కూడా లేదు
తూర్పు కనుమల్లో జీవించే ఈ తెగ ప్రజల్లో చాలా మందికి నేటికీ అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదు. చివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం వంటివి కూడా వర్తించడం లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.
కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కొండ మీద గిరిజనాపురం గ్రామం ఉంటుంది. పెద్దిపాలెం వరకు బస్సులో వెళ్లి, అక్కడి నుంచి నడిచి లేదా అప్పుడప్పుడు తిరిగే ఆటోల ద్వారా కొండ వరకు వెళ్లొచ్చు. ఆ తర్వాత కిలోమీటరు దూరం నడిచి కొండ మీదకు వెళ్లాలి.
గిరిజనాపురంలో మొత్తం 13 కుటుంబాలు ఉన్నాయి. సుమారు మూడు తరాలుగా అక్కడే నివసిస్తున్నామని వారు చెబుతున్నారు.
కొండల్లో ఉండే చెట్లు నరికి కలప అమ్ముతారు. బొగ్గు తయారు చేసి దిగువకు తీస్కెళ్లి అమ్ముకుంటారు.
వీరిలో చాలా మందికి ఆధార్ కార్డ్ సహా ఎలాంటి గుర్తింపు పత్రాలూ లేవు. కొందరికి మాత్రం ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉన్నాయి. ఈ గుర్తింపు కార్డులున్నవారికి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందడం లేదని వారు చెప్పారు. గ్రామంలో ముగ్గురికి పెన్షన్లు, కొందరికి రేషన్ బియ్యం మినహా ఇతర సంక్షేమ పథకాలు ఏవీ అందడం లేదని తెలిపారు.
గిరిజనాపురంలో చదువుకున్న వారు లేరు. తాము, తమ పిల్లలు ఎప్పుడూ బడికి పోలేదని వారు చెబుతున్నారు. ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన ఇద్దరు మహిళలు మాత్రం ఏడో తరగతి, అయిదో తరగతి చదువుకున్నారు. అంగన్‌వాడీ గానీ, పాఠశాల గానీ అందుబాటులో లేకపోవడంతో పిల్లలు బడికి వెళ్లడం లేదు.
1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటివరకు తాము ఒక్కసారి కూడా ఓటు వేయలేదని గిరిజనాపురం వాసులు చెబుతున్నారు. 50,60 ఏళ్ల వయస్కులు కూడా ఇదే మాట అన్నారు.
"నలభై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నాకు, నా బిడ్డలకు ఓటు లేదు. చాలా సార్లు అడిగాం. ఓటు వేయడానికి వెళ్తే, మీ ఓటు లేదని పంపించేశారు. రెండు నెలల క్రితం మాకు ఓటు హక్కు ఇస్తామని వచ్చారు. ఫోటోలు కూడా అడిగారు" అని అక్కడ నివసించే మాతే బూరమ్మ చెప్పారు.
యువత కూడా తమకు ఓటు హక్కు లేదని చెబుతోంది.
"నాకు పాతికేళ్లు. నేనెప్పుడూ ఓటు వేయలేదు. మా అమ్మ, నాన్నలు కూడా ఓటు వేయలేదు. అసలు ఓటు ఎలా వేస్తారో కూడా మా వాళ్లకు తెలీదు. చాలాసార్లు ప్రభుత్వం తరపున వచ్చి, మాకు అన్నీ ఇస్తామని చెబుతుంటారు. ఓటు కూడా వచ్చేస్తుందని అంటారు. అది ఎన్నడూ జరగలేదు" అని ఇదే గ్రామంలో నివసించే మాతే బాబులు అన్నారు.
ఈ గ్రామంలో మాతే, ఉల్లి ఇంటిపేర్లతో ఉన్న కుటుంబాల వారు మాత్రమే నివసిస్తున్నారు.
వివిధ గ్రామాల నుంచి గిరిజనాపురం యువకులను పెళ్లి చేసుకుని వలస వచ్చిన కొందరు మహిళలు మాత్రం తాము సొంతూళ్లలో ఓటు వేశామని తెలిపారు.
ఎక్కువ మందికి ఇళ్ల దగ్గరే ప్రసవం
ముఖ్యమంత్రి అంటే ఎవరో తమకు తెలియదని గిరిజనాపురం గ్రామస్థులు అన్నారు. రాజకీయ పార్టీల పేర్లు కూడా తెలియవు అని చెప్పారు.
ఇక్కడ ఎక్కువ మందికి ఇళ్ల దగ్గరే ప్రసవం అవుతుంది. కొందరికి పుట్టింటికి వెళ్లినప్పుడు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగాయి. ఈ ఊరిలో ఇద్దరికే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వీఆర్వో తప్ప తమకు ప్రభుత్వ అధికారులు ఎవరూ తెలియరని వారు చెబుతున్నారు.
ఒకే ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది. ఈ ఊరికి కోడలిగా వచ్చిన దారా కుమారి వాడుతున్నారు. ఆమె కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారు.
‘పెన్షన్ల కోసం కొండదిగి వెళ్తున్న వృద్ధులు’
గిరిజనాపురం గ్రామం గతంలో మరో కొండపై ఉండేది. అక్కడ కొందరు తోటలు పెంపకం పేరుతో ఖాళీ చేయించడంతో నిరుడు ఆ కొండ దిగువన మరో కొండమీద గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇప్పటికీ తాటాకులతో గుడిసెలు వేసుకుని అందులోనే నివసిస్తున్నారు. కొందరు మేకలను పెంచుతున్నారు.
కొండపైన తోటల సాగు కోసం ఇటీవల బాట సరిచేయడంతో రోడ్డులా మారింది. కానీ, ఏడాది క్రితం అదంతా కాలిబాటలా ఉండేదని గిరిజనాపురం వాసులు చెబుతున్నారు.
"మాకు భూ పట్టాలు లేవు. ఇళ్ల పట్టాలు కూడా లేవు. మేం సాగు చేయడానికి లేదు. స్థిరంగా ఇళ్లు కట్టుకోవడానికి లేదు. నీరు కూడా ఉండదు. ఒక దాత వచ్చి బోరు వేయించారు. కానీ, ఆ నీరు బాగోదు. దాంతో ఊట నీరు తాగుతుంటాం. కరెంటు వేశారు. కానీ, ఎప్పుడైనా పోతే మళ్లీ రాదు. మాకు ఇళ్లు కట్టించి, తాగు నీరు కల్పించాలని కోరుతున్నాం. కనీసం అంగన్‌వాడీ సెంటర్ ఏర్పాటు చేసినా బాగుంటుందని అధికారులను కోరినా ఇంకా స్పందించలేదు" అని మాతే దారా కుమారి అన్నారు.
పెన్షన్ల కోసం కూడా వృద్ధులు కొండదిగి వెళ్లాల్సి వస్తోందని, తమ వారికి కొండపైనే అందించే ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
గిరిజనాపురం వాసులకు తాగునీరు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రయత్నించాలని ప్రత్తిపాడుకు చెందిన కార్మిక సంఘం నాయకుడు ఈశ్వరరావు కోరారు.
అర్హులైన అందరినీ ఓటర్లుగా గుర్తించడంతో పాటు వారికి తాగునీరు అందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘గిరిజనాపురం గ్రామస్థులతో పాటు వంతాడ సమీపంలో వివిధ కొండలపై నివసిస్తున్నవారికి కనీస సదుపాయాలు అందుబాటులో లేవు.
అక్కడ విలువైన మైనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ, స్థానికులను మాత్రం గుర్తించడం లేదు. మైనింగ్ పేరుతో తవ్వకాలకు అనుమతించే సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూపించడం కోసమే ఇంతకాలంగా వారిని విస్మరించారు.
మేం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కదలలేదు. ఇప్పటికైనా వారికి ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వడం సంతోషం. ఉపాధి హామీ పనులు కల్పించి, వారి జీవనానికి భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఈశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.
ఇంతకాలం ఓటు ఎందుకు లేదో మాకు తెలియదు: అధికారులు
సబ్ ప్లాన్ ఏరియా పరిధిలో నివసిస్తున్న కొండదొర గిరిజన తెగకు చెందిన గిరిజనాపురం వాసులకు ఓటు లేదనే విషయంలో కొన్ని నెలల క్రితం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దాంతో అధికార యంత్రాంగం కూడా స్పందించింది.
ప్రస్తుతం అర్హులుగా గుర్తించిన 19 మందిని ఓటర్లుగా చేర్చినట్టు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ఏ.శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వారంతా ఓటును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
"ఇన్నేళ్లుగా వారికి ఎందుకు ఓటు లేకుండా విస్మరించారన్నది మా నోటీసులో లేదు. కొందరికి ఆధార్ కార్డులు కూడా లేకపోవడం, వారికి సమాచార సదుపాయాలు కూడా లేకపోవడంతోనే విస్మరించినట్టు భావిస్తున్నాం. ఇకపై వారు ప్రతీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు అనుగుణంగా ఓటరు గుర్తింపు కార్డులు త్వరలోనే అందిస్తాం" అని ఆయన బీబీసీకి చెప్పారు.
జనవరి 22న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో వారి పేర్లున్నాయి. అయితే వారికి ఓటరు గుర్తింపు కార్డు మాత్రం ఇంకా అందలేదు. దాంతో ఫిబ్రవరి నెలాఖరున కూడా తమ పేరు ఓటరు జాబితాలో ఉందన్న విషయం ఆ గిరిజన గ్రామంలోని వారికి తెలియదు. గుర్తింపు కార్డుల పంపిణీలో జాప్యం జరిగిందని, త్వరలోనే వాటిని అందిస్తామని ఆర్వో చెప్పారు.
పథకాలన్నీ వారికి వర్తింపజేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 300 ఏళ్ల క్రితం భారీ సంపదతో సముద్రంలో మునిగిపోయిన యుద్ధ నౌక.. దీని వెలికితీతకు చేపడుతున్న ఆపరేషన్ ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
- గ్రీన్ అమ్మోనియా: కంపెనీలు దీని కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్: భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)