You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ ఎన్నికలు 2024: మోదీ మ్యాజిక్ ఈసారి ఎక్కడ ఫెయిలయింది?
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తేదీ: ఫిబ్రవరి 5, 2024
స్థలం: లోక్‌సభ, భారత పార్లమెంటు
సందర్భం: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం
వక్త: ప్రధాని నరేంద్ర మోదీ
"అధ్యక్షా, నేను గణాంకాలలోకి వెళ్లను. ప్రజల స్పందనను బట్టి వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు దాటుతుందని, బీజేపీకి 370 సీట్లు వస్తాయని అనిపిస్తోంది"
తేదీ: జూన్ 4, 2024
సందర్భం: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
- బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి 20 సీట్లు వెనుకబడి ఉంది.
- గత పదేళ్లలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చింది.
"బలమైన ప్రతిపక్షం లేకుండా, ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం సురక్షితంగా ఉండదు" అని 19వ శతాబ్దపు బ్రిటీష్ ప్రధాన మంత్రి బెంజమిన్ డిస్రాయిలీ అన్నారు.
భారతదేశ తొలి ప్రధాని, నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత జవహర్‌లాల్ నెహ్రూ 52 ఏళ్ల క్రితం, అంటే 1962లో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాగలరని సూచిస్తున్నాయి. కానీ, గత రెండు ఎన్నికలలకు భిన్నంగా ఈసారి బీజేపీ తనంతట తానుగా మెజారిటీని సంపాదించుకోలేకపోయింది.
ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుస్తామన్న ఎన్డీయే కూటమి, ఆ సంఖ్యను చేరులేక పోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పని రుజువు కాగా, అటు బీజేపీ లేదా ఎన్‌డీఏ కూటమి అంచనా వేసినన్ని స్థానాలలో గెలవలేకపోయాయి.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో, అధికార బీజేపీని సవాలు చేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు అనేక ఇతర రాజకీయ పార్టీలు 'ఇండియా కూటమి'గా ఏర్పడ్డాయి.
ఎగ్జిట్ పోల్ చెప్పిన గణాంకాల కంటే ‘ఇండియా’ కూటమి మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
ఈ ఎన్నికలలో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, "చివరికి ప్రధానమంత్రే స్వయంగా పోటీలో కేంద్ర బిందువుగా మారారు"
'మోదీకి ఓటు వేయండి లేదా మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయండి'గా అన్నదే ఎన్నికలలో ప్రధాన అంశంగా మారింది.
అయితే, 'మోదీకి ఓటు' నినాదం బీజేపీ ఆశించిన ఫలితాలను రాబట్టలేదని ఫలితాలను అర్ధం చేసుకోవచ్చు. ఏదేమైనా, బీజేపీ సొంత మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ఇంతకూ ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారంలో కీలక అంశాలుగా పని చేసినవి ఏమిటి?
1. మోదీ హామీ
సార్వత్రిక ఎన్నికల చరిత్రలో తొలిసారి దేశంలోనే అతిపెద్ద అధికార రాజకీయ పార్టీ ప్రధానమంత్రి పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఏప్రిల్ 14న విడుదల చేసిన 'సంకల్ప్ పత్ర'లో ప్రతి వాగ్దానంలోనూ 'మోదీ హామీ' అనే పేరు ఉండటంతో ఆ పార్టీ తమ నాయకుడిని 'ఎన్నికల ముఖచిత్రం'గా ప్రదర్శించదల్చుకున్నట్లు స్పష్టమైంది.
అంటే 2013లో మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదు.
ఈ కాలమంతా, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా, ఇతర రాష్ట్రాలలోనూ పట్టును సంపాదించింది. కానీ ఈ ఎన్నికల్లో ‘మోదీ హామీ’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
"మొదటి నుంచి చివరి వరకు బీజేపీ వ్యూహం పూర్తిగా ప్రధానమంత్రి చుట్టూ కేంద్రీకృతమైంది" అని సీనియర్ జర్నలిస్ట్, హిందుస్తాన్ టైమ్స్ మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ వీర్ సంఘ్వి అన్నారు.
"ప్రస్తుతం మోదీ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ దీనినే తన అస్త్రంగా మార్చుకుంది. ఆ పార్టీ చరిత్రను చూస్తే, 2024లో జరిగినంతగా, ఏ ఎన్నికల్లోనూ ప్రచారం ఇంత విస్తృతంగా కేవలం ఒక వ్యక్తి చుట్టే కేంద్రీకృతం కాలేదు. 1971 ప్రచారం ఇందిరా గాంధీ చుట్టూ ఎంతగా కేంద్రీకృతమైందో, ఈసారి నరేంద్ర మోదీకి దానికన్నా ఎక్కువ ప్రచారం కల్పించారు" అని అన్నారు.
నిజానికి, బీజేపీ అంచనా కొన్ని ఫలితాలపై ఆధారపడింది.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ, దాని కూటమి ప్రభుత్వాల సంఖ్య ఏడు కాగా, 2024 ఎన్నికలకు ముందు, బీజేపీ దేశంలోని 16 రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాన్ని, నాలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అంటే మొత్తం సంఖ్య 20.
సహజంగానే, ఆ పార్టీని వివిధ రాష్ట్రాలలో అధికారంలో తేవడంలో మోదీ ఫ్యాక్టర్ ప్రధాన పాత్ర పోషించింది.
అయితే 'మోదీ హామీ'పై అందరికీ పూర్తి విశ్వాసం లేదని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. లేదంటే 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మెజారిటీకి దూరం అయ్యేది కాదు.
“కాంగ్రెస్ మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకుని ప్రధాని చేసిన ఎన్నికల ప్రసంగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రామమందిరం వంటి అంశాలు ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు. లేదంటే బీజేపీకి సొంతంగా ఎక్కువ సీట్లు వచ్చేవి. ఇప్పుడు వాళ్లు తమ మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి వచ్చింది’’ అని టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్ వార్తాపత్రికలలో ఎడిటర్‌గా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ భరత్ భూషణ్ అన్నారు.
2. సంక్షేమ పథకాల రాజకీయం
బీజేపీ తన మేనిఫెస్టో 'మోదీ కి గ్యారెంటీ'లో దృష్టి సారించిన నాలుగు విభాగాలు - పేదలు, యువత, రైతులు, మహిళలు; భారతదేశంలోని నాలుగు ప్రధాన కులాలు ఇవేనని ప్రధాని మోదీ అన్నారు.
'తాయిలాల రాజకీయాలు' అంటే వస్తువులు, సేవలను ఉచితంగా ఇచ్చే పథకాలపై బీజేపీ చాలా శ్రద్ధ చూపింది.
'పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన' కింద వచ్చే ఐదేళ్లపాటు 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్ అందించడం, 'ఆయుష్మాన్ భారత్' వంటి పథకాల ద్వారా ఉచిత వైద్య సౌకర్యాలు, 'పీఎం ఆవాస్ యోజన', ఎల్‌పీజీని అందించే ‘పీఎం ఉజ్వల్ యోజన’ వంటి అన్ని పథకాల లక్ష్యం ప్రజాదరణను కాపాడుకోవడమే.
గత 10 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం దాదాపు 22 కోట్ల కుటుంబాలను ఇటువంటి అనేక పథకాల పరిధిలోకి తీసుకువచ్చిందని, దాని కారణంగా అనేక ఎన్నికల్లో విజయాలు సాధించామని పేర్కొన్నారు.
మే 30న తన ఎన్నికల ప్రచారం చివరి రోజున హోషియార్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. పేదలకు ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించామని, ప్రజలకు ఇప్పుడు రేషన్‌కార్డులు, ఆయుష్మాన్ కార్డులు ఉన్నాయని అన్నారు.
ఈ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ పర్యటన తర్వాత, బ్రౌన్ యూనివర్శిటీలో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ అశుతోష్ వార్ష్‌నే మాట్లాడుతూ, "బుందేల్‌ఖండ్, అవధ్‌లలో చాలా మంది ప్రజలు విద్యుత్ కానీ, నీరు కానీ, ఉపాధి కానీ లేదని చెబుతున్నారు. 'లబ్దిదారుల' పథకాలు మంచివే కానీ ఉపాధి ద్వారా లభించే భవిష్యత్తును, పథకాలు ఇవ్వలేవు" అని అన్నారు.
మరోవైపు, దీనికి విరుద్ధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ 'న్యాయ్ పత్ర'ను ప్రకటించింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 'సంక్షేమ పథకాలు' విజయవంతం కావడమే దీనికి కారణం.
అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడే వ్యూహంతో ప్రతిపక్ష 'ఇండియా కూటమి' లాభపడిందని జూన్ 4 నాటి ఫలితాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావం బీజేపీ తగ్గిన సీట్ల సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది.
3. 'విశ్వగురు'గా మోదీ
విదేశాంగ విధానం విషయంలో, భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు 'వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి'ని కొనసాగించాలని నొక్కి చెబుతున్నాయి.
అయితే, బీజేపీ విదేశాంగ విధానంలో దూకుడును అవలంబించింది. దీని ప్రకారం 'నవీన భారతదేశంలో ఇంట్లోకి వెళ్లి మరీ శత్రువులను చంపండి' అనడం వరకు వెళ్లింది.
బీజేపీ ఎన్నికల ప్రచారంలో 'ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారతదేశ విశ్వసనీయత'కు ప్రాధాన్యత ఇచ్చారు.
"జి-20 అధ్యక్షత, అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు, రష్యా ద్వారా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న మోదీ ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా బీజేపీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించింది. పుల్వామా వంటి జాతీయ భద్రతా సమస్యలు లేదా ఆర్టికల్ 370 రద్దు అంశాలను ఓటర్ల వరకు తీసుకెళ్లారు. కానీ, వాటి ప్రభావం ఫలితాల్లో కనిపించలేదు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన వైఖరి ఎప్పుడూ ప్రభావవంతంగా ఉంటుందని నిరూపితమైనా, ఈసారి దాని గురించి తక్కువ చర్చ జరిగింది" అని దక్షిణాసియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలపై అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్వేతా సింగ్ అన్నారు.
"హిందూ జాతీయవాద ఎజెండాను ముందుకు తెచ్చినా, పాశ్చాత్య దేశాలు అమెరికా-చైనా పోటీ, పరస్పర వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంతో తమ సంబంధాలను కొనసాగిస్తాయి. దేశ రాజకీయాల్లో ఇది ఎంతవరకు పని చేస్తుందో ఇప్పుడు భారతదేశం ఆలోచించుకోవాలి’’ అని సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక మేధోసంస్థ చాటామ్ హౌజ్‌లో సీనియర్ ఫెలో చైటిగ్ బాజ్‌పాయ్ అన్నారు.
'శత్రువుల' ఇంట్లోకి దూరి వారిని చంపాలన్న ప్రభుత్వ విధానం విషయానికొస్తే, దక్షిణాసియా లేదా చైనా వరకు ఈ 'వాక్చాతుర్యం' ఉపయోగపడుతుందని, అయితే ప్రపంచ స్థాయిలో దీనిని అనుమానంగా చూస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
మైఖేల్ కుగెల్‌మాన్ ఫారిన్ పాలసీ జర్నల్‌లో ఇలా రాశారు: "కెనడా గ్లోబల్ ఇమేజ్ అసలు దూకుడుగా ఉండదు. కెనడా తన పౌరులను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు భారతదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. దానిని భారతదేశం ఖండించింది. అలాంటి ఆరోపణలు ఒక నిర్దిష్ట రకమైన సందేశాన్ని ఇస్తాయి." అని పేర్కొన్నారు.
అయితే, ఎన్నికల సమయంలో దక్షిణాసియాలో భారత విదేశాంగ విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రతిపక్షం ప్రభుత్వానిది మాటల గారడీ అని ఆరోపించింది.
2019 ఎన్నికల్లో అన్ని సరిహద్దుల్లో స్మార్ట్ ఫెన్సింగ్‌కు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇది ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని గుర్తు చేసింది.
"ఒక దేశ రాజకీయ మార్పులలో స్థానిక అంశాలే కాకుండా అంతర్జాతీయ అంశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి అనడానికి చరిత్రే సాక్షి. భౌగోళిక, రాజకీయ స్థితి అనిశ్చితంగా ఉన్నప్పుడు దాని ప్రభావం ప్రజాస్వామ్య దేశాలలోనూ ఏదో ఒక విధంగా కనిపిస్తుంది" అని అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ఫెలోగా ఉన్న ప్రొఫెసర్ ఎంకె ఝా అన్నారు.
4. మతం ఆధారంగా ప్రజలను విడదీసే రాజకీయం
2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ, 2019 మొదటి దశ మధ్య ఒక పెద్ద వ్యత్యాసం ఉంది - అది ఓటింగ్ శాతం తగ్గుదల.
రాజస్థాన్‌లోని బాన్‌స్వారాలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ, ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి పంచుతుంది’’ అని అన్నారు.
ఇది ప్రజలను చీల్చే ప్రయత్నం అని, 'మైనారిటీలపై వ్యంగ్యాస్త్రం' అని పేర్కొంటూ కాంగ్రెస్, ప్రతిపక్షాలు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
కొంతమంది విశ్లేషకులు ప్రధాని ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని "ఆ పార్టీ ఓటర్లను పోలరైజ్ చేసే" ప్రయత్నంగా భావించారు.
"ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో మొదటిసారిగా బహిరంగంగా హిందూ-ముస్లిం వ్యాఖ్యలు చేశారు. ఆయన మునుపటి ఎన్నికలలో అలాంటి ప్రకటనలు చేయలేదు." అని సీనియర్ జర్నలిస్ట్ వీర్ సంఘ్వీ అన్నారు.
ఎన్నికలకు ముందు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం అకస్మాత్తుగా వివాదాస్పదమైన పౌరసత్వ (సవరణ) నిబంధనల నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
అయితే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ అనేక పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
ఓటర్లు బహుశా ఈ చర్యను 'విభజన రాజకీయం'లో భాగంగా భావించారు.
"ప్రస్తుతం భారతదేశంలో విభజన రాజకీయాలు ఉచ్ఛస్థితికి చేరుకున్నాయి" అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాల మాజీ ప్రొఫెసర్ పుష్పేష్ పంత్ అభిప్రాయపడ్డారు.
"నెలకు పైగా సాగిన ఈ సుదీర్ఘ ఎన్నికల్లో, మందిర్-మసీదు మొదలైన సమస్యలపై కొన్ని వర్గాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో అందరూ చూశారు. ఇదంతా ఏదో ఆవేశంతో జరగదు. ఇది బాగా ఆలోచించి చేసే వ్యూహంలో భాగం" అని అన్నారు.
చివరగా, బీజేపీ 'సంకల్ప్ పత్ర' నుంచి, ప్రతి ఎన్నికల ప్రచారకర్త ప్రసంగంలో భాగమైన అంశం గురించి చర్చిస్తే, ఈ ఏడాది జనవరిలో ప్రధాని నేతృత్వంలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.
అయితే, అయోధ్య నగరంలో 10 వేల కోట్లు వెచ్చిస్తామని, నగరాన్ని 'గ్లోబల్ సిటీ'గా తీర్చిదిద్దుతామనే ప్రచారం ఆ ప్రాంత ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు.
"రామ మందిర ప్రారంభోత్సవంతో బీజేపీ ఒక రేసును ప్రారంభించింది. ఆ సమయంలో ప్రతిపక్షం చాలా వెనుకబడి ఉన్నట్లు అనిపించింది. కానీ ప్రజల నాడి భిన్నంగా ఉంది. ఫైజాబాద్ (అయోధ్య)లో బీజేపీ ఓటమి దీనికి నిదర్శనం’’ అని అయోధ్యలోని టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ అర్షద్ అఫ్జల్ ఖాన్ అన్నారు.
అయితే, మోదీ ప్రభావం మీద మాత్రం భారతీయ జనతా పార్టీ తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. ‘‘ఎన్నికల్లో నడిపించడంలోగానీ, ప్రజల సమస్యలను తీర్చడంలోగానీ మోదీజీ ముందుంటారు. ఆయన దేశాన్ని ముందుకు నడిపించారు.’’ అని ఎన్నికల ఫలితాల అనంతరం దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి: కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోయిన కెరటం
- చంద్రబాబు నాయుడు: ‘ప్రజలే నడిపించాలి’
- మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్
- ‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?
- దోషిగా తేలిన డోనల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యకుడు కావొచ్చా? 5 కీలక ప్రశ్నలు- సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)