You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగుదేశం పార్టీ విజయానికి దారులు వేసిన 5 పరిణామాలివే...
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. సొంతంగా 135 సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 164 స్థానాలను గెలుచుకుంది.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత, ఫినిక్స్ పక్షిలా తెలుగుదేశం పార్టీ అంతే పవర్‌ఫుల్‌గా అధికారంలోకి వచ్చింది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించగా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
ఓటమిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, వాయిస్ లేనివారి కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
చరిత్రాత్మక విజయంలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు సంబరాలలో మునిగిపోగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీల నాయకత్వం సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కలిసి వచ్చిన ప్రధానమైన అంశాలేంటి? అందుకు దారితీసిన పరిణామాలేంటి? ఒక్కసారి చూద్దాం.
కూటమి కట్టడమే తొలి మలుపు
ఒంటరి పోరాటం కాకుండా జట్టుకట్టి పోరాడాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వ్యూహం ఫలించింది. బీజేపీ ఓటు బ్యాంకును, పవన్ కల్యాణ్ పాపులారిటీని తనవైపు తిప్పుకోవడంలో తెలుగుదేశం సఫలమైంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడటం కూడా ఒక ఎత్తు. ఈ ప్రయోగం ఫలితం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
‘‘కూటమి కట్టడం అన్నది చంద్రబాబు నాయుడు సాధించిన తొలి విజయం’’ అని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ బీబీసీతో అన్నారు.
పొత్తుల్లో చిన్నచిన్న సమస్యలు వచ్చినా అవి నెగెటివ్‌గా మారకుండా జాగ్రత్తపడింది తెలుగుదేశం పార్టీ. సీట్ల పంపకాల విషయంలో మిత్రులకు తగు సంఖ్యలో సీట్లు కేటాయించడం, సొంత పార్టీలో అసమ్మతి రాకుండా, కూటమిలోని ఇతర పార్టీలకు ఆగ్రహం తెప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించడం ఈ పొత్తు సక్సెస్ కావడంలో కీలకంగా మారింది. ఈ జాగ్రత్తల కారణంగానే ఓటు బదిలీ సవ్యంగా సాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం ఉంటే ఇక్కడ అధికార పార్టీ అధికార యంత్రాంగం బల ప్రదర్శనను దీటుగా అడ్డుకోవచ్చన్న వ్యూహంతోనే బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
అయితే బీజేపీ, జనసేన ఓటు బ్యాంకు కీలకమని, మూడు పార్టీలు కలిసి ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకున్నాయని టీడీపీ నేత మాణిక్య వరప్రసాద్ బీబీసీతో అన్నారు.
‘‘మూడు పార్టీలు కలవడం మాస్టర్ స్ట్రోక్. దీనికి తోడు జగన్‌ను ఓడించాలని ప్రజలు కసితో ఉన్నారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉండదని తెలుసు. అందుకే కూటమి సాధ్యమైంది.’’ అని వరప్రసాద్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో బీజేపీకి 10 సీట్లు, జనసేనకు 21 సీట్లు ఇచ్చి 144 స్థానాల్లో తాను పోటీకి దిగింది తెలుగుదేశం.
‘‘2014లో కూటమిగా ఉండటం వల్ల గెలిచాం. 2019 నాటికి దాని విలువను గుర్తించలేకపోయాం. అందుకే ఓడిపోయాం. ఈసారి మళ్లీ కూటమిగా ఉంటేనే మంచిదని భావించాం. అందుకే కూటమి కట్టాం. అనుకున్న విధంగా విజయం సాధించాం’’ అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుజనా చౌదరి అన్నారు. మోదీ అభివృద్ధి, పవన్ కల్యాణ్ మానవతా గుణం, చంద్రబాబు విజన్...ఈ ముగ్గురి ఆశయాల కలయికే తమ కూటమి అని సుజనా చౌదరి అన్నారు.
మరోవైపు చంద్రబాబు రాజకీయ అనుభవం కూడా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చింది. ఎవరితో కలిస్తే ఎంత ఓటు పర్సంటేజ్ కలిసొస్తుందో, అది ఎన్నికల్లో ఎలా లాభిస్తుందో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు బాగా తెలుసని, అందుకే చాలా కొద్ది పర్సంటేజ్ ఉన్న బీజేపీని, పాపులారిటీ, ఓటు బ్యాంకు ఉన్న జనసేనను సమకట్టి ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకున్నారు చంద్రబాబు నాయుడు.
పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్
2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన జనసేన పార్టీ 2019 నాటికి ఆ పార్టీతో లేదు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కల్యాణ్ పట్టుదల, అదే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ఆలోచనా జతకావడంతో రెండు పార్టీల మధ్య పొత్తుకు సమన్వయం కుదిరింది.
అయితే, జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉండటంతో, తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకెళ్లే విషయంలో జనసేనకు కొంత సందిగ్ధత ఏర్పడింది. జగన్ పాలనపై మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలిపోవద్దని మొదటి నుంచి చెబుతూ వచ్చారు.
తెలుగుదేశానికి పొత్తుకు సిద్దమవుతూనే ఇటు బీజేపీని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని చెబుతారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్ బేస్, కుల సమీకరణాలు రెండూ కూడా ఎన్డీయే కూటమికి బాగా కలిసొచ్చాయి.
పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. అలాగే 2 ఎంపీ స్థానాలలో పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించింది. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పవన్ త్యాగాలకు కూడా సిద్ధపడ్డారని, కనీసం 50, 60 సీట్లు డిమాండ్ చేయగలిగే స్థితిలో ఉన్నాకూడా, ఉమ్మడి లక్ష్యం కోసం 21 సీట్లు తీసుకోవడానికి కూడా పవన్ కల్యాణ్ అంగీకరించారని చెబుతారు.
‘‘ఈ గెలుపు పవన్ కల్యాణ్ గెలుపు. పవన్ కల్యాణ్‌కు కాపులు వన్ సైడెడ్‌గా చేశారు. వైసీపీ ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేయడం మహిళలకు నచ్చలేదు.’’ అని మాణిక్య వరప్రసాద్ అన్నారు. కూటమి విజయంలో పవన్ కల్యాణ్ పాత్ర చాలా కీలకమని తెలుగుదేశం నేతలు అంగీకరిస్తున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడమే కాక, తన పార్టీ అభ్యర్ధులను కూడా గెలిపించుకోలేక పోయారు. గెలిచిన ఒకే ఒక అభ్యర్ధి రాపాక వరప్రసాదరావు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మారారు. ఈసారి అందుకు భిన్నంగా, పోటీ చేసిన అన్ని స్థానాలను జనసేన గెలుచుకుంది.
2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయడం కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటారు. అదే పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఈసారి తెలుగు దేశంతో కలిసి పోటీ చేసి, భారీ విజయానికి బాటలు వేశారు.
కాపు ఓటు బ్యాంకు 2014లో చంద్రబాబుకు కలిసొచ్చి అధికారంలోకి తీసుకురాగలిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ‘‘ పవన్ కల్యాణ్ కేవలం జనసేన ఇంట్రెస్ట్‌లోనే చంద్రబాబుతో కలిశాడు. చాలామంది ఈ కలయికను రకరకాలుగా విమర్శించవచ్చుగాక. కానీ, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చవద్దన్నదే ఆయన లక్ష్యం’’ అని నాగేశ్వర్ అన్నారు.
‘‘నేనుగానీ, చంద్రబాబుగానీ పదవుల గురించి ఎప్పుడూ చర్చించలేదు. అవన్నీ ఎన్నికల తర్వాత. ముందు మా లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని(వైసీపీ ప్రభుత్వాన్ని) లేకుండా చేయడమే.’’ అని పవన్ కల్యాణ్ ఓ ఇంటర్యూలో అన్నారు.
అభివృద్ధి నినాదం
కూటమిలోని పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన అభివృద్ధి నినాదం కూడా బాగా పని చేసిందని చెప్పాలి. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదన్న విమర్శ గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల విషయంలో విమర్శలు విపరీతంగా వినిపించాయి. పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం కూడా దీనిపై తీవ్రమైన ప్రచారం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవిక పరిస్థితులు కూడా అంతే కనిపించాయి. దీనికి తోడు చంద్రబాబు తన విజన్ గురించి చేసిన ప్రచారం తెలుగుదేశానికి బాగా కలిసి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతి ఎన్నికల సభలోనూ వివరిస్తూ వచ్చారు.
‘‘చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద పెద్ద కంపెనీల అధినేతలతో మాట్లాడారు. దావోస్ వరకు వెళ్లారు. పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇవన్నీ ఆయన్ను జనం నమ్మడానికి కారణమైంది.’’ అని సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు.
సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వం పై ఎలాంటి సందేహాలు లేకున్నా, కేవలం సంక్షేమం ఒక్కటే పని చేయదని ప్రజలు నమ్మినట్లు కనిపించిందని ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన జయప్రకాశ్ నారాయణ అన్నారు.
‘‘ఆర్ధిక ప్రగతి లేనటువంటి సంక్షేమం సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. దాంతో పాటు ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంలా నడిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు. పెద్ద మెజారిటీని కట్టబెట్టారు’’ అని జయప్రకాశ్ నారాయణ విశ్లేషించారు.
‘‘ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముందుకు చేర్చాను. మరి ఆ లబ్ధిదారుల ఆప్యాయతా అనురాగాలు ఏమయ్యాయో అర్ధం కావడం లేదు.’’ అంటూ ఓటమి అనంతరం తొలిసారి స్పందించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాజధాని అయోమయం
రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అయోమయ నిర్ణయాలు, రాజధాని మార్పు విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రజలను అసహనానికి గురి చేసినట్లు స్పష్టంగా అర్ధమైంది.
అసలే రాష్ట్ర విభజనపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు రాజధాని విషయంలోనైనా ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటాయని భావించారు. అయితే, చంద్రబాబు హయాంలోనూ రాజధాని నిర్మాణం వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
జగన్ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల పేరుతో మరింత అయోమయం పెరిగింది. ఒకపక్క రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతుండగా, మరోవైపు జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధాని భవనాల నిర్మాణం అంటూ హడావుడి చేయడం, అసెంబ్లీలో తీర్మానాలు, కోర్టుల్లో కేసులతో రాజధాని వ్యవహారం ఒక ప్రహసనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు దాటినా, ఒక్క రాజధాని కాదు..ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించి నాలుగేళ్ళు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ విషయంలో చంద్రబాబే బెటరన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపించారు ఏపీ ప్రజలు.
‘‘అమరావతి దీనావస్థలో ఉంది. దాన్ని మళ్లీ డెవలప్ చేయడం చంద్రబాబు వల్లే అవుతుందని ప్రజలు భావించారు. చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటన్న అసహనం ప్రజల్లో కనిపించింది.’’ అని సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణ అన్నారు. చంద్రబాబు అనుభవాన్ని ప్రజలు నమ్మారని వెంకటనారాయణ అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ సానుభూతి
జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టుతో మరింత విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. అంతకు ముందు రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ సహకారంతో దాడులు పెరిగాయన్న ఆరోపణలు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చేశారు.
అది అలా సాగుతుండగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపు, తప్పుడు నివేదికలు, ప్రభుత్వ నిబంధనల నుంచి పక్కకు జరగడం వంటివి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారు.
‘‘ఇది రూ. 550 కోట్ల స్కామ్. ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వచ్చింది. నకిలీ ఇన్‌వాయిస్ ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే. ఇందులో జరిగిన లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. దీనిపై ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేశాయి.’’ అని అప్పట్లో ఏపీ సీఐడీ చీఫ్‌గా పని చేస్తున్న సంజయ వెల్లడించారు. ఇది పదేళ్ల శిక్ష పడే నేరమని ఆయన అన్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత జనసేన టీడీపీ పొత్తుపై స్పష్టతనిచ్చారు పవన్ కల్యాణ్. జైల్లో చంద్రబాబును కలవడానికి వెళ్లి వచ్చిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిర్ణయించినట్లు జైలు వెలుపలే ప్రకటించారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్, ఆ పార్టీ ఆమోదం తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టును పలుసమావేశాల్లో, పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు. ఇది చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. అది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించింది.
‘‘చంద్రబాబును అరెస్టు చేయడమన్నది పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన అరెస్టుతోనే పొత్తు పురుడు పోసుకుంది. అదే తెలుగుదేశం విజయానికి దారి తీసింది’’ అని మాణిక్య వర ప్రసాద్ విశ్లేషించారు.
‘‘ఇందిరాగాంధీని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తర్వాత ఏం జరిగింది? ఇది కూడా అలాంటిదే’’ అని సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)