You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో ఏం చేయబోతున్నారు?
- రచయిత, జీఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సునామీ సృష్టించింది. అంచనాలకు మించి తెలుగుదేశం విజయం సాధించింది. కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశానికి పునరుత్తేజం మాత్రమే కాదు, చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రముఖమైన స్థానాన్ని కట్టబెట్టింది.
ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పటికే వృద్ధ్యాప్యంలో ఉన్న చంద్రబాబు రాజకీయంగా అప్రధానం కావడమే కాకుండా తెలుగుదేశం అస్తిత్వ సంక్షోభంలో పడే స్థితి ఉండేది.
తెలుగుదేశం కేడర్ నిరాశలో కూరుకుపోయే అవకాశం ఉండేది.
ఆంధ్రలో ఉన్న రాజకీయ వాతావరణం రీత్యా శ్రేణులను కాపాడుకోవడం ఇబ్బందికరం అయ్యేది.
ఇపుడిది ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం.
కేంద్రంలో బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు సంపాదించలేదు కాబట్టి తెలుగుదేశం సీట్లు అక్కడ కూడా కీలకం కాబోతున్నాయి.
ఇలాంటి సన్నివేశాలు చంద్రబాబుకు కలిసొచ్చే అంశాలు. ఆయన సీజన్డ్ పాలిటిషియన్.
గతంలో ఇలాంటి సన్నివేశాల్లో జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించిన సందర్భాలున్నాయి.
ఒక దశలో అంటే 84 ఎన్నికల తర్వాత లోక్ సభలో తెలుగుదేశమే ప్రధాన ప్రతిపక్షంగా ఉండిన సందర్భాన్ని ఇపుడు గుర్తుచేసుకోవాలి.
అలాగే కేంద్రంలో ప్రధానిని, రాష్ట్రపతిని తామే నిర్ణయించామని కూడా తెలుగుదేశం చెప్పుకుంటూ ఉంటుంది. బహుశా అదే స్థితి ఇపుడు కూడా తెలుగుదేశం కోరుకుంటూ ఉండొచ్చు.
తెలుగు గడ్డ మీదైనా, జాతీయ స్థాయిలో అయినా కూటమి రాజకీయాల్లో చంద్రబాబుకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది.
ఆ ఇద్దరు..
ఇపుడు అందరి చూపూ చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ మీదే.
ఇద్దరూ ఎప్పటికప్పుడు భాగస్వాములను, స్ట్రాటజీలను మార్చుకోవడంలో పేరున్న వారు.
అనేక ఎన్నికల్లో ఆరితేరిన సీనియర్ నాయకులు.
చంద్రబాబు తాను రాజకీయ భాగస్వాములను మార్చుకోవడానికి ఇటీవల ఆంధ్రకు ప్రత్యేకహోదా అనే దాన్ని కారణం చూపుతున్నారు. ఆ కారణం వల్లే తాను బిజెపిని వీడి కాంగ్రెస్‌తో గతంలో జతకట్టానని చెప్పుకొచ్చారు.
కానీ ఇటీవల మళ్లీ అదే బిజెపీతో ఎందుకు జతకట్టారనే దానికి సరైన కారణం కనిపించదు.
ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని పార్టీకి ఆరు ఎంపీ స్థానాలు, పది ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం సంచలనాత్మకమైన నిర్ణయం.
ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ వైసీపికి అనుకూలంగా వ్యవహరించొచ్చని భావించి దాన్ని అడ్డుకోవడానికి అంతకంటే పెద్ద అధికారంతో చేతులు కలపడం అనే కారణం తప్ప మరోటి ప్రాక్టికల్‌గా కనిపించదు.
ఆ రకంగా చంద్రబాబుకు బిజెపితో అవసరార్థ బంధం తప్ప భావజాల భావోద్వేగ బంధం ఏమీ లేదు.
కాబట్టి వారిని కలిపి ఉంచే బాండ్ నిర్దుష్టంగా ఏమీ లేదు. కాబట్టి ఏమో గుర్రం ఎగురావచ్చు లాగా ఏదైనా జరగొచ్చు. సమీకరణాలు ఎటైనా మారొచ్చు.
ఎన్నికలకు ముందే ఏర్పాటు చేసుకున్న కూటమి కాబట్టి వెంటనే ఏ మార్పు ఉంటుంది ఉండదు అని చెప్పలేం. కానీ, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో రాజకీయ బేరసారాలు మాత్రం గట్టిగా ఉండొచ్చు.
తాము గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నపుడు రామజన్మభూమి, ఆర్టికల్ 370, ఉమ్మడి సివిల్ కోడ్ మూడు అంశాలు కామన్ ప్రోగ్రామ్‌లో ముందుకు రాకుండా చూశామని తెలుగు దేశం నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా షరతులు వర్తిస్తాయనే మాట రావచ్చు.
మారిన పరిస్థితుల్లో షరతుల రంగు రూపు రేఖలు మారొచ్చు కూడా. షరతులు రాష్ట ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. ప్రత్యర్థి మీద అంటే జగన్ మీద చర్యలు కూడా రాజకీయ బేరసారాల్లో భాగం కావచ్చు. ఏమైనా కావచ్చు.
కానీ ఇటీవల ఏకచ్ఛత్రాధిపత్యానికి అలవాటు పడిన బిజెపికి ముఖ్యంగా మోదీ షా ద్వయానికి షరతుల పరిధిలో పనిచేయడం ఇబ్బందికరమైన పరిణామం. ఇదెలాగా పరిణమించొచ్చు అనేది ఇపుడిపుడే చెప్పలేం.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- చంద్రుడిపై ఆవల వైపు దిగిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- తెలంగాణ అనే పదం ఎక్కడ పుట్టింది? మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)