నరవణే చెప్పారు, ‘పెంగ్విన్’ చెప్పింది.. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ నిజంగానే పబ్లిష్ కాలేదా?

భారత్, చైనా, ఆర్మీ, అగ్నిపథ్, గల్వాన్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 6 నిమిషాలు

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ప్రచురణకాని పుస్తకంపై మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది.

ఈ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

దిల్లీ పోలీసులు ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఈ ఎఫ్ఐఆర్‌కు సంబంధించిన సమాచారం కోసం దిల్లీ పోలీసులను సంప్రదించడానికి బీబీసీ చాలాసార్లు ప్రయత్నించింది. కానీ స్పష్టమైన సమాధానం రాలేదు.

నరవణే పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇండియా కూడా వివరణ ఇచ్చింది. ఆ పుస్తకం ఇంకా ప్రచురించలేదని పెంగ్విన్ స్పష్టం చేసింది.

నరవణే కూడా అదే విషయం చెప్పారు. అయినప్పటికీ ఈ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణగలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పుస్తకంపై రాహుల్ గాంధీ ఏమన్నారు?

రాహుల్ గాంధీ వాదనలు కల్పితాలని నరవణే వివరణతో స్పష్టమైందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేదీ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ అన్నారు.

"రాహుల్ గాంధీ సభలో చెప్పడానికి ప్రయత్నించిన అందమైన కథను ప్రచురణ సంస్థ, పుస్తక రచయిత ఇద్దరూ స్పష్టంగా కొట్టివేశారు. ప్రచురణసంస్థ అబద్ధం చెబుతోందా, జనరల్ నరవణే అబద్ధం చెబుతున్నారా అని రాహుల్ గాంధీ సభలో అడిగారు. ఇప్పుడు రెండు వైపుల నుంచీ ప్రకటనలు వచ్చాయి. ఎవరు అబద్ధం చెబుతున్నారో ఆ ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి" అని సుధాంశు అన్నారు.

నరవణే పుస్తకానికి సంబంధించి దిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేశారు.

''జనరల్ నరవణే నిజం చెప్పడం లేదా? లేక పెంగ్విన్ నిజం చెప్పడం లేదా. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని నేను అనుకోను. పుస్తకం ఇంకా ప్రచురించలేదని పెంగ్విన్ చెబుతోంది. కానీ అది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 'నా పుస్తకం కొనండి' అని జనరల్ నరవణే 2023లో ట్వీట్ చేశారు'' అని రాహుల్ గాంధీ చెప్పారు.

"నేను పెంగ్విన్ మాటలను కాకుండా నరవణే మాటలను నమ్ముతాను. ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అసౌకర్యం కలిగించే కొన్ని విషయాలను నరవణే తన పుస్తకంలో రాశారని నేను నమ్ముతున్నా. ఇప్పుడు ఎవరు నిజం చెబుతున్నారో మీరు నిర్ణయించుకోవాలి. పెంగ్విన్ లేదా దేశ మాజీ ఆర్మీ చీఫ్" అని రాహుల్ అన్నారు.

భారత్, చైనా, ఆర్మీ, అగ్నిపథ్, గల్వాన్

ఫొటో సోర్స్, Getty Images

నరవణే ట్వీట్‌లో ఏముందంటే?

దీనికి సంబంధించి పెంగ్విన్ ఇండియా ఏ వివరణ ఇచ్చిందో, నరవణే స్వయంగా ఏమి చెప్పారో తెలుసుకునే ముందు రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న నరవణే ట్వీట్‌లో ఏముందో తెలుసుకుందాం.

2023 డిసెంబరు 15న నరవణే ట్వీట్ చేశారు. "హలో ఫ్రెండ్స్. నా పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. లింక్‌ను ఫాలో అవ్వండి. హ్యాపీ రీడింగ్. జైహింద్" అని రాశారు.

ఈ పోస్ట్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. పుస్తకం అందుబాటులో ఉందని నరవణే చెప్పినప్పుడు ప్రచురణ సంస్థ ఎందుకు అబద్ధం చెబుతోందని ప్రశ్నించారు.

కానీ ఇప్పుడు పెంగ్విన్ మాటలను నరవణే స్వయంగా ధ్రువీకరించారు.

భారత్, చైనా, ఆర్మీ, అగ్నిపథ్, గల్వాన్

ఫొటో సోర్స్, @PenguinIndia

ఫొటో క్యాప్షన్, ‘ఫోర్ స్టార్స్ఆఫ్ డెస్టినీ’ పబ్లిషింగ్ రైట్స్ తమకు మాత్రమే ఉన్నాయని పెంగ్విన్ తెలిపింది.

పెంగ్విన్ వివరణ

ఈ మొత్తం వివాదానికి సంబంధించి పెంగ్విన్ ఇండియా రెండు రోజుల్లో రెండుసార్లు వివరణ ఇచ్చింది.

ఫిబ్రవరి 9న మొదటి ప్రకటన వచ్చింది.

"ఇటీవలి చర్చలు, మీడియా నివేదికల దృష్ట్యా, 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'ని ప్రచురణ హక్కులు మొత్తం మాకు ఉన్నాయని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేయాలనుకుంటోంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

"ఈ పుస్తకాన్ని భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాశారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురించలేదని మేం స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఈ పుస్తకం ఏ కాపీ - ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో మేం ప్రచురించలేదు. పంపిణీ చేయలేదు. అమ్మలేదు. ప్రజలకు అందుబాటులో ఉంచలేదు"

"ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం పుస్తకం లేదా భాగాలు, ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్, ఏ ఫార్మాట్‌ అయినా, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్, ఏ ప్లాట్‌ఫామ్‌ అయినా... పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కాపీరైట్‌ను ఉల్లంఘిస్తున్నాయి. వాటిని వెంటనే నిలిపివేయాలి. పుస్తకం కాపీలను అనధికార మార్గాల ద్వారా పంపిణీ చేస్తున్న వారిపై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది" అని పెంగ్విన్ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది.

నరవణే ట్వీట్‌ను ఉటంకిస్తూ.. పుస్తకం ప్రచురితమైందని రాహుల్ చెప్పిన తర్వాత పెంగ్విన్ ఇండియా రెండో ప్రకటన చేసింది.

భారత్‌లో పుస్తకాల ప్రచురణ ప్రక్రియ తీరును రెండో ప్రకటనలో పెంగ్విన్ ఇండియా తెలిపింది.

''ఒక పుస్తకాన్ని ప్రకటించడం, దానిని ముందస్తు ఆర్డర్‌కు అందుబాటులో ఉంచడం, ప్రచురించడం... ఇవి మూడూ వేర్వేరు దశలు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లో ముందస్తు ఆర్డర్ కోసం కనిపించే పుస్తకం లేదా భవిష్యత్తులో విడుదల తేదీ ఉండటం అది ప్రచురితమైందని సూచించదు. రిటైల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షంగా కొనడానికి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే పుస్తకం ప్రచురితమైనట్టు పరిగణించాలని పెంగ్విన్ పేర్కొంది" అని పెంగ్విన్ ఇండియా తెలిపింది.

దీనిపై జనరల్ నరవణే చేసిన పోస్ట్ కూడా మంగళవారం(ఫిబ్రవరి 10) బయటకు వచ్చింది. నరవణే పోస్టు పెంగ్విన్ ప్రకటన ఒకేలా ఉన్నాయి.

అయినప్పటికీ పుస్తకం అందుబాటులో ఉండడంపై భిన్నమైన వాదనలున్నాయి.

భారత్, చైనా, ఆర్మీ, అగ్నిపథ్, గల్వాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుస్తకం ప్రచురితమవ్వలేదని నరవణే పోస్టు చేశారు.

‘ప్రచురణ కాకుండా పుస్తకంలోని విషయాలు బయటికెలా వచ్చాయి?’

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ తాను ఈ పుస్తకాన్ని చదివానని చెప్పారు.

"నేను ఆ పుస్తకం చదివాను. అది అందుబాటులో ఉంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచార యుగంలో మీరు వాటిని ఎలా ఆపగలరు? మీరు కారణం లేకుండా దిల్లీ పోలీసుల పరువు తీస్తున్నారు. ఎవరిదో ఆదేశం మేరకు, ఎవరో ఉద్దేశాల ఆధారంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పెంగ్విన్ రాండమ్‌హౌస్ నుంచి వచ్చిన ఆ సర్క్యులర్‌ను నేను కూడా సోషల్ మీడియాలో చూశా. బాధ కలిగింది" అని ఆయన చెప్పారు.

ప్రచురణ కాని నరవణే పుస్తకం సర్క్యులేషన్‌కు సంబంధించి ఫిబ్రవరి 9న దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు మీడియా చెబుతోంది. ప్రచురించని పుస్తకంలోని విషయాలను అనుమతి లేకుండా ఎలా బహిరంగపరిచారు, ఈ సంఘటన వెనుక ఎవరున్నారు అనేదానిపై దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తారని మీడియాలో వార్తలొచ్చాయి.

భారత్, చైనా, ఆర్మీ, అగ్నిపథ్, గల్వాన్

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే...

ప్రచురణ కాని ఓ పుస్తకం(ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ)పై కారవాన్ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఒక వ్యాసం నుంచి వాక్యాలను చదవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి 3న లోక్‌సభలో ప్రయత్నించారు.

"దీనిని ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. నేను దాని నుంచి ఐదు లైన్లు మాత్రమే చదవాలనుకుంటున్నాను" అని రాహుల్ గాంధీ అన్నారు.

ప్రచురణ కాని పుస్తకంలోని భాగాలను ఎలా చదువుతారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. అధికార పార్టీ భయపడుతోందని, భయాందోళనలకు గురిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయినప్పటికీ రాహుల్‌గాంధీని చదవడానికి అనుమతించలేదు.

నరవణే రాసిన ఈ పుస్తకం జనవరి 2024లో మార్కెట్‌లో విడుదల కావాల్సి ఉందని, కానీ ప్రస్తుతం దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి రాలేదని మీడియా కథనాలు చెబుతున్నాయి.

జనవరి 2024లో 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రచురించిన కథనం ప్రకారం దర్యాప్తు పూర్తయ్యే వరకు పుస్తకం సారాంశాలను లేదా సాఫ్ట్ కాపీలను ఎవరికీ ఇవ్వవద్దని ప్రచురణకర్త పెంగ్విన్ రాండమ్ హౌస్‌ను కోరినట్టు తెలిసింది.

భారత్, చైనా, ఆర్మీ, అగ్నిపథ్, గల్వాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023లోనే పుస్తకంలోని కొన్ని భాగాలు బయటికొచ్చాయని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది.

2023లోనే బయటికొచ్చిన పుస్తకంలోని కొన్ని భాగాలు

"తూర్పు లద్దాఖ్‌లో చైనాతో 2020లో జరిగిన సైనిక వివాదం గురించి ఈ పుస్తకంలో ఉంది. గాల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళిక గురించి కూడా ఉంది. ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సంభాషణ ప్రస్తావన కూడా ఇందులో ఉంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం తెలియజేస్తోంది.

వార్తా సంస్థ పీటీఐ డిసెంబరు 2023లో జనరల్ నరవణే పుస్తకంలోని భాగాలను ప్రచురించిందని ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది.

ఆగస్టు 31 సాయంత్రం జరిగిన సంఘటనలను కూడా ఇది వివరించింది. ఈ సంఘటనపై, నరవణే పుస్తకంపై కారవాన్ మ్యాగజైన్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ వ్యాసంలో ప్రచురించిన భాగాన్నే పార్లమెంటులో చదవాలనుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)