పారిస్ ఒలింపిక్స్‌కు నేడే చివరి రోజు, ముగింపు వేడుకలు ఎలా జరగనున్నాయంటే..

పారిస్ ఒలింపిక్స్ పోటీలు తుది అంకానికి చేరాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జులై 26న మొదలైన ఒలింపిక్స్ ఈరోజు అంటే ఆగస్టు 11తో ముగియనున్నాయి.

చివరి రోజున భారత్‌ తరఫున ఎవరూ పోటీలో లేరు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఆరు పతకాలు వచ్చాయి.

శనివారం భారత్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్‌లు నిరాశపరిచారు. భారత రెజ్లర్ రితికా హుడా కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, కిర్గిస్థాన్‌కు చెందిన అపెరి కైజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రితికా ఓడిపోయింది.

ఆరు పతకాలు ఎవరెవరికి వచ్చాయి?

‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో భారత అథ్లెట్లు మొత్తం ఆరు పతకాలు సాధించారు. అందులో మూడు షూటింగ్‌లోనే సాధించారు.

పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించాడు.

మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ పోటీలో మను భాకర్, సరబ్‌జోత్ సింగ్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలె కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

భారత హాకీ జట్టు కాంస్యం సాధించింది.

పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని సాధించి భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు.

ఇప్పటి వరకు ఒలింపిక్స్ రికార్డులు

ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్స్‌లో కలిపి భారత్ మొత్తం 41 పతకాలు సాధించింది.

1900లో భారత్ మొదటి ఒలింపిక్స్‌ పతకం సాధించింది. నార్మన్ ప్రిచర్డ్ రెండు రజతాలు గెలుచుకున్నారు.

1952లో హెల్సింకి ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం గెలిచి, స్వతంత్ర భారతదేశం నుంచి వ్యక్తిగతంగా ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి అథ్లెట్‌గా నిలిచాడు.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రైఫిల్ షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ గెలిచి, వ్యక్తిగతంగా ఒలింపిక్ బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.

మరో బంగారు పతకం సాధించడానికి ఇండియాకు 12 ఏళ్లు పట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు.

ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టు ఎనిమిది స్వర్ణాలతో సహా మొత్తంగా 13 పతకాలు సాధించింది. ఏడు పతకాలతో రెజ్లింగ్ తర్వాతి స్థానంలో ఉంది.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమంగా ఒక స్వర్ణం సహా ఏడు పతకాలు గెలిచింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 16 క్రీడలలో మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.

భారతీయ అథ్లెట్లు పాల్గొన్న క్రీడలలో హాకీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, విలువిద్య, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, జూడో, రోయింగ్ మొదలైనవి ఉన్నాయి.

ముగింపు వేడుకల విశేషాలు

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకకు 'రికార్డ్స్' అని పేరు పెట్టారు. హాకీ టీం గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్, షూటర్ మను భాకర్ ఈ వేడుకలో భారత ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు.

80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న ఫ్రాన్స్‌లోని అతిపెద్ద స్టేడియం స్టేడ్ డి ఫ్రాన్స్‌లో ముగింపు వేడుక జరగనుంది. దాదాపు రెండు గంటల పాటు సాగే ముగింపు వేడుకను ఆదివారం రాత్రి 12.30 గంటల నుంచి భారతదేశంలో చూడవచ్చు.

ఒలింపిక్ సంప్రదాయం ప్రకారం, పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకలో ఒలింపిక్ జ్యోతిని అధికారికంగా ఆర్పివేస్తారు. ఒలింపిక్ జెండాను లాస్ ఏంజిల్స్ 2028 ఆర్గనైజింగ్ కమిటీకి అప్పగిస్తారు, తదుపరి సమ్మర్ గేమ్స్‌ అక్కడే జరగనున్నాయి.

ముగింపు వేడుక వివరాలు పూర్తిగా వెల్లడి కానప్పటికీ, పలువురు సెలబ్రెటీల ప్రదర్శనలుంటాయని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో ఈ పట్టికలో చూడొచ్చు