యూసుఫ్ డికెక్: స్టైల్‌గా వచ్చి పతకాన్ని ఎగరేసుకుపోయిన ఈ తుర్కిష్ షూటర్‌ గురించి చర్చ ఏంటి?

జూలై 30న భారత షూటర్లు మను భాకర్‌, సరబ్‌జోత్‌ సింగ్‌లు కాంస్య పతకం సాధించిన అదే మ్యాచ్‌కు సంబంధించిన ఒక ఫోటో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ఫోటోపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు విమర్శలు చేశారు.

పారిస్‌లో 51 ఏళ్ల తుర్కిష్ షూటర్ యూసుఫ్ డికెక్ స్టైల్‌ ఎంతోమందిని ఆకర్షించింది.

మను, సరబ్‌జోత్‌లు కాంస్య పతకం గెలుచుకున్న అదే మ్యాచ్‌లో యూసుఫ్ డికెక్, ఆయన షూటింగ్ పార్ట్‌నర్ సెవ్వల్ ఇల్యాదా తర్హాన్‌లు ఒక చేతిని జేబులో పెట్టుకుని షూటింగ్ చేసి రజత పతకం సాధించారు.

అయితే, ఈ మ్యాచ్‌లో యూసుఫ్ షూటింగ్ స్టైల్ మిగిలిన వారి కంటే భిన్నంగా ఉంది. యూసుఫ్ ఒక చేతిని జేబులో పెట్టుకుని, మామూలు కళ్లద్దాలు పెట్టుకుని షూటింగ్ చేశాడు. ఈ డబుల్స్ జంట రజత పతకం గెలుచుకుంది.

ప్రత్యేకత ఏంటి?

సాధారణంగా షూటింగ్‌లో పాల్గొనే అథ్లెట్లు తమ చెవులకు ఇయర్ ప్రొటెక్టర్లు, లక్ష్యాన్ని గురిచూసేందుకు సాయపడే లెన్సులు, బ్లైండర్ల వంటివి ధరిస్తారు.

కంటిపై పడే వెలుతురుని తగ్గించేందుకు ఒక కన్నుపై వైజర్, స్పష్టమైన దృష్టి కోసం మరో కంటిపై బ్లైండర్ ధరిస్తారు. వీటిని షూటింగ్‌కు తప్పనిసరి అవసరాలుగా పరిగణిస్తారు.

కానీ, యూసుఫ్ డికెక్ ఇవేవీ లేకుండానే షూటింగ్ రేంజ్‌కు వెళ్లి, లక్ష్యాన్ని ఛేదించి రజతం సాధించడంలో కీలకంగా మారాడు. అయితే, ఆ శబ్దం తన దృష్టి మరల్చకుండా యూసుఫ్ చాలా చిన్న ఇయర్ ప్లగ్స్ మాత్రమే చెవుల్లో పెట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌‌లో తీసిన యూసుఫ్ ఫోటోపై ఇప్పుడు సామాన్యుల నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వరకు అనేకమంది స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కామెంట్లు

యూసుఫ్‌ భాగస్వామి తర్హాన్ మాత్రం పెద్ద ఎయిర్ డిఫెండర్, వైజర్ ధరించి పోటీలో పాల్గొంది. అయితే, ఆమె కూడా తన చేతిని జేబులో పెట్టుకునే షూట్ చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక యూజర్, "ప్రత్యేక లెన్సులు, ఐ కవర్లు, ఇయర్ ప్రొటెక్టర్లు లేకుండా తుర్కియే పంపిన 51 ఏళ్ల వ్యక్తి రజత పతకం గెలుచుకున్నాడు" అని రాశారు.

ఆయన "కాఫీ తాగుదామని వెళ్తూ, షూటింగ్ కోసం ఆగినట్లున్నారు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ తన ప్రత్యర్థులు ఫేస్‌బుక్, మెటా, లింక్డ్‌ఇన్‌లను యూసుఫ్ ప్రత్యర్థులుగా, యూసుఫ్‌ను 'ఎక్స్'తో పోలుస్తూ ఒక ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు.

దీపేంద్ర అనే ఫేస్‌బుక్‌ యూజర్ "ఈ తుర్కియే ఆటగాడు మంచి ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు. కానీ, నేను ఆయన తీరును, స్టైల్‌ను వ్యతిరేకిస్తున్నా’’ అని రాశారు.

‘‘ఇంత పెద్ద ఈవెంట్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు సాధారణంగా కొన్ని నియమాలను పాటిస్తారు. కానీ, ఆయన అలాంటివేవీ పాటించలేదు. ఆయన వినూత్న పద్ధతిలో షూట్ చేసి రజతం సాధించారు. నా అంచనా ప్రకారం, ఆయన ఒక చేతిని జేబులో పెట్టుకోకపోయి ఉంటే స్వర్ణం గెలిచేవారు. వచ్చేసారి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.’’ అని ఆ పోస్టులో రాశారు.

ఎవరీ యూసుఫ్ డికెక్?

51 ఏళ్ల యూసుఫ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం తొలిసారి కాదు. 2008 నుంచి సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు.

ఈ ఒలింపిక్స్‌లో, వ్యక్తిగత ఈవెంట్‌లో 13వ స్థానంలో నిలిచిన యూసుఫ్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకం సాధించాడు.

ఇప్పుడాయన 2028లోనూ పతకం సాధించాలని అనుకుంటున్నాడు.

‘‘2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని అనుకుంటున్నా’’ అని యూసుఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

"తుర్కియేకి మొదటి ఒలింపిక్ పతకం సాధించడం చాలా సంతోషం. దీని కోసం ప్రార్థనలు చేసిన కోట్లాది మంది తుర్కియె ప్రజలకు ఈ పతకం అంకితం'' అన్నాడు.

యూసుఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైరల్ అవుతున్నాయి.

వాటిలో తుర్కిష్ భాషలో మీమ్స్ కూడా ఉన్నాయి.

షూటింగ్ నిబంధనలేంటి?

ఒలింపిక్స్‌లో షూటర్లు తమకు నచ్చినవి ధరించి పోటీలో పాల్గొనే స్వేచ్ఛ ఉంది.

చాలా మంది షూటర్లు తమ కళ్లపై వెలుతురు పడకుండా వైజర్లను ధరిస్తారు. రెండో కన్నుకు బ్లైండర్ ధరించి, ఒకే కన్నుతో గురిపెట్టి, లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి షూటింగ్ చేస్తారు.

బంగారు పతకం సాధించిన చైనా రైఫిల్ షూటర్ లియు యుకున్ కూడా యూసుఫ్ మాదిరిగా ఇయర్‌ప్లగ్‌లు మాత్రమే ధరించారు. ఆయన కూడా ఎలాంటి వైజర్ లేదా బ్లైండర్ ధరించలేదు.

ఈ ఒలింపిక్స్‌లో యూసుఫ్‌తో పాటు దక్షిణ కొరియా షూటర్ కిమ్ యెజీ కూడా చర్చనీయాంశమయ్యాడు.

ఒలింపిక్ గేమ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కిమ్ యెజీ, యూసుఫ్‌ల ఫోటోలను షేర్ చేస్తూ, 'ఒలింపిక్ షూటింగ్ స్టార్స్' అని పేర్కొంది.