You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ అమ్మాయి ఫొటో భారత ఫొటోగ్రాఫర్‌కు ఎంత పేరు తెచ్చిందంటే....
- రచయిత, మాథ్యూ టక్కర్
- హోదా, బీబీసీ న్యూస్
సుందర్‌బన్స్‌లోని ఫ్రేజర్‌గంజ్‌లో విధ్వంసకర తుపాను తర్వాత నిస్సహాయంగా నిలుచున్న ఒక అమ్మాయి ఫొటోను భారత ఫొటోగ్రాఫర్ సుప్రతిమ్ భట్టాచార్జీ తీశారు.
ఈ ఫొటోకు గానూ ఆయన ఈ ఏడాది ‘మాంగ్రోవ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్’ ఓవరాల్ విన్నర్‌గా ఎంపికయ్యారు.
మాంగ్రోవ్ యాక్షన్ ప్రాజెక్ట్ నిర్వహించే ఈ పోటీ ద్వారా వన్యప్రాణులు, తీరప్రాంతాలు, మడ అడవుల మధ్య సంబంధాలను, ఈ ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను ప్రపంచం ఎదుట ప్రదర్శిస్తారు.
‘సింకింగ్ సుందర్‌బన్స్’ అని పిలిచే ఈ ఫొటోను పల్లవి అనే అమ్మాయి తన ఇల్లు, టీ దుకాణం ముందు నిలబడి ఉన్నప్పుడు సుప్రతిమ్ తీశారు. తుపాను సమయంలో సముద్రం ఆ రెండింటిని తుడిచి పెట్టేసింది.
"ఆ దు:ఖ సమయంలోనూ ఆమె దృఢత్వాన్ని, ఆమె ముఖంలోని ప్రశాంత స్వభావాన్ని గమనించాను" అని భట్టాచార్జీ అన్నారు.
బంగాళాఖాతంలో ఉన్న సుందర్‌బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు.
‘‘ఈ చిత్రం వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. వాతావరణ మార్పులు, తీరప్రాంత ప్రజలు అనుభవిస్తున్న పెరుగుతున్న సముద్ర మట్టాల ప్రభావాన్ని ఆమె ముఖం ప్రతిబింబిస్తుంది" అని ఈ పోటీకి న్యాయమూర్తిగా వ్యవహరించిన ధ్రుతిమాన్ ముఖర్జీ అన్నారు.
వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో మడ అడవులు ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఒక ఎకరం (4,000 చదరపు మీటర్లు) మడ అడవులు, దాదాపు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోని ఎకరం అడవి గ్రహించినంతగా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. తీరప్రాంతాలు కోతకు గురికాకుండా కాపాడతాయి.
న్యాయమూర్తులలో మరొకరైన మోర్గాన్ హీమ్, "భాషతో సంబంధం లేకుండా కొన్ని కథలను వినడానికి, అనుభూతి చెందడానికి ఫొటోగ్రఫీ సహాయపడుతుంది’’ అని అన్నారు.
ఫొటోగ్రాఫర్ల వివరాలతో పాటు ఏడు విభాగాలలో గెలుపొందిన ఫొటోల వివరాలు ఇక్కడ చూద్దాం.
విభాగం - మడ అడవులు, ప్రజలు
విజేత – ‘మడ్ బాత్ రిచువల్’
ఫొటోగ్రాఫర్: జోహాన్నెస్ పంజి క్రిస్టో, ఇండోనేసియా
ఇండోనేసియాలోని బాలిలో డెన్‌పసర్ పట్టణం ఉంటుంది. దీనికి సమీపంలోని కెడోంగనన్ గ్రామంలో పురుషులు, మహిళలు, పిల్లలు చీరకట్టు, సంప్రదాయ తలపాగా ధరించి మడ అడవుల నుంచి మట్టిని సేకరిస్తారు.
మెబుగ్ బుగన్ అనే శుద్దీకరణ ఆచారంలో భాగంగా వాళ్లు తమను తాము మట్టితో కప్పుకుని, భూమి సుసంపన్నం కావాలని ప్రార్థిస్తారు.
విభాగం: మడ అడవులు, ప్రజలు
ప్రత్యేక ప్రశంసలు: సింకింగ్ సుందర్‌బన్స్ II
ఫొటోగ్రాఫర్: సుప్రతిమ్ భట్టాచార్జీ, భారతదేశం
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించిన సుందర్‌బన్స్ ద్వీపసమూహం అటవీ వనరులకు ప్రసిద్ధి చెందింది.
విపరీతమైన అటవీ నిర్మూలన, తుపానులు కలిసి ఇక్కడ తీవ్ర ఆహార, నీటి కొరతను సృష్టించాయి. వ్యవసాయ ఉత్పాదకత, భూసారం తగ్గిపోయి, స్థానికులను వాతావరణ శరణార్థులుగా మార్చాయి.
విభాగం: మడ అడవులు, ప్రకృతి దృశ్యాలు
విజేత: నేచర్స్ రిబ్బన్
ఫొటోగ్రాఫర్: అమ్మర్ అల్‌సయీద్ అహ్మద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
మడ అడవుల గుండా ప్రవహించే ఈ నీటి ప్రవాహ చిత్రం మనల్ని ఆలోచింపజేస్తుంది.
ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన చెట్ల వేర్ల కారణంగా పుట్టుకొచ్చి వృక్షాలు, ప్రవహించే నీటికి అంచులా శోభనిస్తాయి.
విభాగం - మడ అడవులు, ప్రకృతి దృశ్యాలు
ప్రత్యేక ప్రశంసలు: ఫ్రేమింగ్ ది సన్‌సెట్
ఫొటోగ్రఫర్: వ్లాదిమీర్ బోర్జికిన్, భారత్
అండమాన్ దీవుల ద్వీప సమూహంలోని నీల్ ద్వీప (షహీద్ ద్వీప్) తీరంలో, ఆటుపోట్లు తీరానికి దూరంగా ఉన్న పదునైన రాళ్లను బహిర్గతం చేస్తాయి.
విభాగం - మడ అడవులు, వన్యప్రాణులు
విజేత: మడ్-రింగ్ ఫీడింగ్
ఫొటోగ్రఫర్: మార్క్ ఇయాన్ కుక్, అమెరికా
‘మడ్-రింగ్ ఫీడింగ్’ అనేది బాటిల్‌నోస్ డాల్ఫిన్‌లు ప్రవర్తించే ప్రత్యేక విధానం.
డాల్ఫిన్లకు చేపలు ఎక్కడికి దూకబోతున్నాయో తెలుసుకునే అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ చేపలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, డాల్ఫిన్లు గాల్లోనే వాటిని పట్టేసుకుంటాయి. మార్క్ ఆ దృశ్యాన్ని అద్భుతంగా తన కెమెరాలో బంధించారు.
విభాగం - మడ అడవులు, వన్యప్రాణులు
ప్రత్యేక ప్రశంసలు: ది ఫైర్ విత్ ఇన్
ఫొటోగ్రాఫర్: జేవియర్ ఒరోజ్కో, మెక్సికో
ఫొటోగ్రాఫర్ జేవియర్ ఒరోజ్కో, మెక్సికోలోని బాండెరాస్ బేలోని బుసెరియాస్‌లోని ఎల్ కోరా మొసళ్ల అభయారణ్యంలో ఒక మొసలిని ముఖాముఖి ఎదుర్కొన్నారు.
ఒక చిన్న సరస్సు పక్కన ఉన్న ఆ మొసళ్ల అభయారణ్యాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. కానీ, దీని చుట్టుపక్కల ప్రాంతమంతా షాపింగ్ సెంటర్లు, హోటళ్లు, కాండోలు వచ్చేశాయి. జేవియర్ తీసిన క్లోజప్ షాట్, ఆ మొసలి మన కళ్ల ముందే ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
విభాగం - మడ అడవులు, అవి ఎదుర్కొంటున్న ప్రమాదాలు
విజేత: మాంగ్రోవ్ వాల్స్ బ్రోకెన్
ఫొటోగ్రఫర్: దీపయాన్ బోస్, భారతదేశం
బంగాళాఖాతంలో ఉష్ణమండల తుపానులు, సముద్ర మట్టాల పెరుగుదలతో, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో ఎత్తైన అలల కారణంగా నది కట్టలు తెగిపోతున్నాయి.
దీంతో ఇళ్లు, పొలాలు ముంపుకు గురవుతున్నాయి, సముద్రపు నీటి వల్ల మత్స్య సంపద నాశనమై ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫొటోలో వరదలో తన ఇంట్లోని వస్తువులన్నీ కోల్పోయిన గ్రామస్తుడు కనిపిస్తాడు.
విభాగం - మడ అడవులు, అవి ఎదుర్కొంటున్న ప్రమాదాలు
ప్రత్యేక ప్రశంసలు: లవ్ ఎన్‌టాంగిల్డ్ ఇన్ ఘోస్ట్ నెట్
ఫొటోగ్రాఫర్: డాఫ్నే వాంగ్, హాంకాంగ్
పీతల పునరుత్పత్తిలో మగ గుర్రపుడెక్క పీత, ఆడ పీత వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకుంటుంది.
అవి పెరుగుతున్న ఆటుపోట్లతో కదులుతాయి, గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతాయి. కానీ, కొన్నిసార్లు అవి మడ అడవులకు చేరుకోగానే వలల్లో చిక్కుకుపోతాయి. వాటిని సకాలంలో రక్షించకపోతే చనిపోతాయి.
హాంకాంగ్, ఆసియా అంతటా ఇలా వదిలేసిన వలలు ఒడ్డుకు లేదా మడ అడవుల్లోకి కొట్టుకుపోతే, అనేక సముద్ర జీవులు వీటిలో చిక్కుకుపోతున్నాయి. వాంగ్ తీసిన ఫొటో అలాంటి సముద్ర జీవాలు ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని కళ్లకు కట్టింది.
విభాగం - మడ అడవులు, నీటి అంతర్భాగం
విజేత: గార్డియన్స్ ఆఫ్ ది మాంగ్రోవ్
ఫొటోగ్రాఫర్: ఆలివర్ క్లెమెంట్, బహామాస్
ఒక తాబేలు రాత్రిపూట మడ అడవుల అడుగు భాగంలో చక్కగా తిరుగుతోంది.
ఆటుపోట్లు ఎక్కువగా ఉన్న సమయంలో, నీళ్లు వేర్లను చుట్టుముడతాయి. అప్పుడు భద్రతను కోరుకునే సముద్ర జీవులకు ఆ స్థలం స్వర్గధామంగా మారుతుంది.
క్లెమెంట్ తీసిన ఫొటో నీళ్ల అడుగున ఉన్న మడ అడవుల సౌందర్యాన్ని మరోసారి ప్రపంచానికి చూపించింది.
విభాగం - మడ అడవులు, నీటి అంతర్భాగం
ప్రత్యేక ప్రశంసలు: కాకబన్ మాంగ్రోవ్
ఫొటోగ్రాఫర్: పూర్వాంటో నుగ్రోహో, ఇండోనేసియా
మడ అడవులు సహజమైన ఫిల్టర్‌గా పనిచేస్తాయి. ఇవి సముద్రంలో కలిసిపోయే చాలా కాలుష్య కారకాలను ముందే తొలగిస్తాయి.
మట్టి, మడ అడవుల్లోని జీవపదార్థాలకు వాతావరణంలోని కార్బన్‌ను నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. ఇవి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ సాంద్రతను తగ్గించడంలో సహాయపడతాయి. పూర్వాంటో, సహజసిద్ధమైన ఫిల్టర్‌లా పని చేసే మడ అడవులను మన కళ్ల ముందు ఉంచారు.
విభాగం - మడ అడవులు, పరిరక్షణ కథలు
విజేత: సింబయాసిస్
ఫొటోగ్రాఫర్: గియాకోమో డి ఓర్లాండో, ఇండోనేసియా
ఇండోనేసియాలోని డెమాక్ రీజెన్సీలో, తీరప్రాంతం తీవ్రంగా కోతకు గురైంది. ఒకప్పుడు తీరాన్ని రక్షించే మడ అడవులను నరికేసి, వాటి స్థానంలో ఆక్వాకల్చర్ చెరువులను తవ్వారు. ఫలితంగా, సముద్రం ప్రజల ఇళ్లను మింగేస్తోంది.
నరికేసిన మడ అడవులను తిరిగి నాటడం ద్వారా పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడమే ఏకైక పరిష్కారమని డెమాక్ నివాసితులు గ్రహించారు.
విభాగం - మడ అడవులు, పరిరక్షణ కథలు
విజేత: టుగెదర్
ఫొటోగ్రాఫర్: రాజ్ హస్సనాలీ, మడగాస్కర్
మడ అడవుల్లోని చెట్లను నరికివేయడంతో చేపలు, పీతలను పట్టడం, వాతావరణ మార్పులు, తుపానుల నుంచి రక్షించుకోవడం కష్టంగా మారింది.
పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై పనిచేస్తున్న బాండీ అనే ఒక ప్రైవేట్ సంస్థ, మడగాస్కర్‌లోని మజుంగాలోని గ్రామీణ ప్రజలతో కలిసి మడ అడవుల పునరుద్ధరణకు సహకరిస్తోంది.
విభాగం – యంగ్ మాంగ్రోవ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్
విజేత: మాంగ్రోవ్ అట్ నైట్
ఫొటోగ్రాఫర్: నికోలస్ అలెగ్జాండర్ హెస్, ఆస్ట్రేలియా
నికోలస్ అలెగ్జాండర్ మడ అడవులలో ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న ఉప్పునీటి మొసలి కనిపించగానే తన కెమెరాలో బంధించారు.
మడ అడవుల దట్టమైన చెట్ల మధ్య ఏ జంతువులు దాగి ఉన్నాయో, వాటి వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని భయాన్ని, ఈ భీకరమైన క్లోజప్ ఫొటో చూపుతుంది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)