You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఘనా నుంచి జర్మనీకి: 'పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి చనిపోయాడనుకున్నాను.. ఆయన్ను చివరికి ఎలా కనిపెట్టానంటే..'
- రచయిత, థామస్ నాడి
- హోదా, బీబీసీ న్యూస్, లాండెడూసా, అక్రా అండ్ బ్రెమెన్
ఎండకు ఎండి రంగు వెలసిన నల్లని ప్లాస్టిక్ పర్స్ ఒకటి ఇటలీకి చెందిన ద్వీపం లాంపెడూసాలో దొరికింది. ఆఫ్రికాలోని ఘనా నుంచి 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపానికి చేరిన ఈ పర్స్ ఆ తరువాత చాలాకాలం ఎవరికీ పట్టనిదిగా మిగిలిపోయింది.
ఆ పర్స్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న లైసెన్స్‌పై కనిపిస్తున్న రిచర్డ్ ఒపోకు నా (అంటే వ్యాసకర్త థామస్ నాడి) వైపు చూస్తున్నట్లనిపించింది.
వేర్వేరు వ్యక్తులకు చెందిన పర్సనల్ డాక్యుమెంట్లు అందులో ఉన్నాయి.
మధ్యదరా సముద్రం మీదుగా యూరప్ వెళ్లే వలసదారులను తీసుకెళ్లే బోట్లు నిలిపే చోట వేర్వేరు వ్యక్తుల నుంచి తీసుకున్న డాక్యుమెంట్లు ఉన్న పర్స్ అది.
చాలా ఏళ్ల కిందటే దొరికిన ఈ పర్స్ నాలో ఆసక్తిని పెంచింది. అందులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ యజమాని కథను తెలుసుకోవాలనుకున్నాను.
రిచర్డ్ ఒపోకుకు ఏమైందో తెలుసుకోవాలనిపించింది.
ఉత్తర ఆఫ్రికా తీరాల నుంచి లాంపెడూసాకు మధ్యదరా సముద్రం మీదుగా ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించిన వేలమంది వలసదారుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన మ్యూజియంలో ఉంచడానికి సేకరించిన వస్తువుల్లో ఈ పర్స్ కూడా ఒకటి.
లాంపెడూసా ఓడరేవు పక్కనే ఉన్న ఈ గది గోడలకు లైఫ్ జాకెట్‌లు, వంటపాత్రలు, వాటర్ బాటిళ్లు, హెడ్ ల్యాంప్స్, క్యాసెట్ టేప్‌లు వంటివి చక్కగా అమర్చారు.
2009 నుంచి ఇలాంటి వస్తువులను వాలంటీర్లు సేకరించారు.
‘కొంత మంది వారి దేశం నుంచి మట్టి తీసుకొస్తారు’ అని ఒక చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్ చూపిస్తూ గియాకోమో స్ఫెర్లాజో చెప్పారు. ఇలాంటి వస్తువులను సేకరించేవారిలో ఆయనా ఒకరు.
‘ఆఫ్రికాతో తమకు ఉన్న బంధాన్ని చెప్పే ఇలాంటి ఎన్నో ప్యాకెట్లను మేం చూశాం’ అన్నారు స్ఫెర్లాజో.
ఆ తరువాత ఆయన ఒక పెద్ద ఫోల్డర్ చూపించారు. దాన్నిండా పాస్‌పోర్టులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఉత్తరాలు ఉన్నాయి. రిచర్డ్ ఒపోకుకు చెందిన కొన్ని డాక్యుమెంట్లు కూడా అందులో ఉన్నాయి.
యూరప్, ఆఫ్రికా మధ్య ఉన్న ఈ లాంపెడుసా ద్వీపంలో ఆరు వేల మంది జనాభా ఉంటారు. పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. ఫిషింగ్ కూడా ఎక్కువగా చేస్తుంటారు. కొత్త జీవితం కోరుకునే వలసదారులు, శరణార్థులు ఆఫ్రికా నుంచి తొలుత ఇక్కడకు వస్తారు. ఇక్కడ నుంచి యూరప్ ప్రధాన భూభాగానికి వెళ్తారు.
ఏటా వేల మంది ప్రాణాలకు తెగించి మధ్యదరా సముద్రం మీదుగా బోట్లలో ప్రయాణించి ఐరోపా వెళ్లేందుకు ప్రయాణిస్తుంటారు.
ఈ ఏడాది ఒక్క మార్చ్ నెలలోనే లాంపెడుసాకు 3 వేల మంది చేరుకున్నారు. గత ఏడాది మార్చ్‌లో లాంపెడుసా వచ్చినవారి కంటే ఈ ఏడాది మార్చిలో వచ్చినవారి సంఖ్య రెండింతలు ఎక్కువ.
ఇక్కడ 2014 నుంచి ఇప్పటివరకు 20 వేల మంది కంటే ఎక్కువ మంది చనిపోవడమో, గల్లంతవడమో జరిగింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం మధ్యదరా సముద్రం.
రిచర్డ్ ఒపోకు ప్రాణాలతోనే ఉన్నారని భావిస్తున్నాను. ఆయన గురించి మరింత తెలుసుకునేందుకు, వెతికేందుకు నేను మళ్లీ ఘనా వెళ్లాను.
ఘనా మధ్యప్రాంతమైన బ్రాంగ్ అహాఫో ప్రాంతానికి వెళ్లాను నేను. అక్కడి నుంచే ఎక్కువ మంది వలస వెళ్తుంటారు.
ఒపోకుతో పాటు వెళ్లినవారు ఎవరైనా అక్కడి ఉండి ఉండొచ్చు.
అక్కడ చాలా కుటుంబాలు తమ బంధువుల గురించి సమాచారం తెలుసుకోవడం కోసం ఏళ్లుగా వేచి చూస్తున్నాయి.
2016లో లిబియా నుంచి లాంపెడుసాకు మధ్యదరా సముద్రం మీదుగా వెళ్లడానికి ప్రయత్నించిన తన భర్త గురించి ఏమైనా తెలుస్తుందేమోనని రీటీ ఒహెనెవా సుదీర్ఘ కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు.
2016 డిసెంబరులో ఆయన లిబియా నుంచి ఫోన్ చేసినప్పుడు మాట్లాడారు. అదే చివరిసారి ఆయనతో మాట్లాడడం. ఆ తరువాత ఆయన ఏమయ్యారో తెలియనేలేదు.
‘ఘనా వస్తున్న వ్యక్తితో కొంత డబ్బు పంపిస్తానని ఆయన చెప్పారు. పిల్లలకు మొబైల్ ఫోన్, క్రిస్మస్ దుస్తులు కూడా పంపిస్తానని చెప్పారు. ఆ రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి కాల్ చేశారు. ఆ తరువాత నుంచి ఎలాంటి సమాచారం లేదు’ అని చెప్పారు రిటీ ఒహెనెవా.
ఆమెలాగే ఒపోకు నుంచి సమాచారం వస్తుందని ఎదురుచూసే భార్యో, లేదంటే ఇతర బంధువులో ఉండే అవకాశం ఉంది.
అక్కడి నుంచి రాజధాని అక్రా చేరాను. అక్కడ డేటా ప్రొటెక్షన్ నియమాలు, అధికారుల నుంచి ఆటంకాల వల్ల రిచర్డ్ ఒపోకు గురించి మరింత తెలుసుకోవడం సాధ్యం కాలేదు.
అయితే, అక్కడకు నెల రోజుల తరువాత నా అన్వేషణలో కొంత పురోగతి కనిపించింది.
ఘనా ఇమిగ్రేషన్ సర్వీసెస్‌లో డాక్యుమెంట్ ఫ్రాడ్ ఎక్సపర్టైజ్ సెంటర్‌కు చెందిన ఫ్రాంక్ అప్రోంటీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అధారంగా రిచర్డ్ బంధువుల ఫోన్ నంబర్ సంపాదించడంలో సాయం చేశారు.
ఆ నంబర్ రిచర్డ్ సోదరిది. ఆమెతో మాట్లాడిన తరువాత రిచర్డ్‌తో నన్ను కనెక్ట్ చేశారామె. ఆయన తాను బతికే ఉన్నానని, జర్మనీలో ఉన్నానని చెప్పారు.
నేను రిచర్డ్ ఒపోకుకు ఫోన్ చేసినప్పుడు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ నాకు లాంపెడుసాలో దొరికిందని చెప్తే నమ్మలేదు. తాను అది 2011లో పోగొట్టుకున్నానని, మళ్లీ దొరుకుతుందని అనుకోలేదని చెప్పాడు.
అంతేకాదు.. ఆ లైసెన్స్ ఫొటోను ఆయనకు పంపించే వరకు నిజంగానే నా దగ్గర ఆ లైసెన్స్ ఉందని ఆయన నమ్మలేదు.
నేను చివరకు ఆయన్ను కలిసేందుకు జర్మనీ వెళ్లాను.
జర్మనీలోని బ్రెమెన్ నగర శివారులో రిచర్డ్ ఉంటున్న సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌కు నేను మంచు కురుస్తున్న ఒక శీతాకాలపు ఉదయాన వెళ్లాను.
40 ఏళ్ల రిచర్డ్ అప్పుడు అక్కడ ఫోర్క్‌లిఫ్ట్ ట్రక్ డ్రైవరుగా పనిచేస్తున్నారు.
ఘనాలో ఉన్నప్పుడు ఆయన యూరప్ ప్రయాణానికి డబ్బు సమకూర్చుకునేందుకు ఆయన అక్రమ బంగారు గనుల్లో పనిచేశారు. అక్కడ కూడా ఏమాత్రం సురక్షితం కానీ ఇరుకు సొరంగాల్లోకి వెళ్లి తవ్వకాలు జరిపేవారు.
2009లో ఆయన యూరప్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుందో తనకు తెలుసని.. అయితే, ఘనాలో ప్రమాదకరంగా చేస్తున్న పనికంటే ఆ ప్రయాణం తక్కువ ప్రమాదకరంగా భావించానని రిచర్డ్ చెప్పారు.
రిచర్డ్ తొలుత ఘనా నుంచి బెనిన్‌లోని కోటోనౌ వెళ్లారు... అక్కడి నుంచి నైజీరియాలోని లాగోస్ చేరారు. అక్కడ ఆయన నగరం చుట్టూ ప్రయాణికులను తిప్పే మోటార్ స్కూటర్లు నడిపి కొంత డబ్బు సంపాదించారు.
అక్కడి నుంచి మళ్లీ కోటోనౌ వచ్చి కొన్నాళ్లు ఉన్నాక నైజర్ వెళ్లారు. నైజర్‌లో ఒక రెస్టారెంట్‌లో పనిచేశారు.
నైజర్ నుంచి లిబియా వరకు ఎడారి మీదుగా వాహనంలో ప్రయాణించడమంటే చాలా కష్టం. నైజర్, నైజీరియాలో పనిచేసి సంపాదించిన డబ్బును ఈ ప్రయాణానికి ఉపయోగించారు రిచర్డ్.
ఎడారిలో సాగిన ఆ ప్రయాణంలో రోడ్లు ఏమీ లేకున్నా కావాల్సిన ప్రదేశానికి ఎలా వెళ్లడమో ఆ వాహనం డ్రైవరుకు తెలియడం రిచర్డ్‌కు ఎంతో ఆశ్చర్యం కలిగించింది.
‘ఈ ప్రయాణంలో ఓసారి ఓ సమూహాన్ని కలిశాం. డ్రైవరుతో కలిపి సుమారు 35 మంది ఉంటారు వాళ్లు. అందరూ చనిపోయారు. బహుశా దాహంతో చనిపోయి ఉంటారు వారంతా’ అని రిచర్డ్ ఆ ప్రయాణంలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చారు.
‘ఎడారి ప్రయాణంలో నీరు- బంగారం, వజ్రాలతో సమానమైనది. రోజులో ఒకటి రెండు సార్లు మాత్రమే నీరు తాగే అవకాశం రావొచ్చు. లేదంటే రోజంతటికీ ఒక చిన్న సిప్‌తో సరిపెట్టుకోవాల్సి రావొచ్చు’ అన్నారు రిచర్డ్.
చాద్ సరిహద్దుల్లో నేను ప్రయాణిస్తున్న వాహనాన్ని కొందరు నేరగాళ్లు ఆపారు. డబ్బు దోచుకోవడానికి వారు ప్రయాణికులతో దుస్తులు కూడా విప్పించారని చెప్పారు రిచర్డ్.
అయితే, రిచర్డ్ తన దగ్గర ఉన్న డబ్బును తన ఒంటిపైనే రహస్యంగా దాచిపెట్టి వారికి దొరక్కుండా కాపాడుకున్నట్లు చెప్పారు.
అయితే, లిబియా చేరాక కూడా ఆయన కష్టాలు తీరలేదు.
లిబియాలో ఆయన్ను కొందరు కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. బంధువులకు ఫోన్ చేసి డబ్బులు వేయించమన్నారు. కానీ, ఆయన బంధువులు ఎవరినీ ఫోన్లో రీచ్ కాలేకపోవడంతో కిడ్నాపర్లు కోపంతో రిచర్డ్‌ను చితకబాదారు. చివరకు ఇంట్లో పనిమనిషి కోసం వెతుకుతున్న ఓ మహిళ డబ్బులిచ్చి కిడ్నాపర్ల నుంచి రిచర్డ్‌ను విడిపించింది.
ఆ తరువాత 2011లో రిచర్డ్ లిబియా నుంచి లాంపెడుసాకు వెళ్లేందుకు ఓ బోటు ఎక్కారు. అప్పటికి లిబియాలో గఢాఫీకి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉంది.
రిచర్డ్ ఎక్కిన బోటు ఇంజిన్ సముద్రం మధ్యలో పాడైంది. ఇంజిన్ పనిచేయకపోవడంతో బోటు గాలి వాటంగా సముద్రంలో అటూఇటూ కొట్టుకుపోతున్న సమయంలో ఇటలీ కోస్ట్ గార్డులు రిచర్డ్ సహా మిగతా ప్రయాణికులను రక్షించారు.
అలా వారిని లాంపెడుసా తీరానికి చేర్చినప్పుడు రిచర్డ్ తన లైసెన్స్‌ను పోగొట్టుకున్నారు.
రిచర్డ్ సహా మిగతా ప్రయాణికులను తొలుత ఒక శిబిరంలో ఉంచారు. అనంతరం సిసిలీలోని ఓ వలస కేంద్రానికి తరలించారు.
అయితే, ఎలాగైనా జర్మనీ వెళ్లాలనేది రిచర్డ్ కోరిక. జర్మనీయే సరైన ప్రదేశమని ఘనాలో చాలామంది చెప్పగా ఆయన విన్నాడు.
అయితే, ఇటలీలో ఉన్న సమయంలో ఆయన అక్కడ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తొలుత ఆయన దరఖాస్తును తిరస్కరించారు. అయితే, 2011లో లిబియాలో అస్థిరత కొనసాగుతున్న సమయంలో ఆ దేశం నుంచి వచ్చినవారికి ఏడాది పాటు ఆశ్రయం ఇవ్వాలని ఐరాస ఇటలీకి సూచించడంతో రిచర్డ్‌కు కూడా ఆశ్రయం దొరికింది.
అయితే, రిచర్డ్ చెప్పిన ఈ విషయం నిజమో కాదో నాకు కూడా తెలియదు.
‘అప్పటి వరకు సాగించిన ప్రయాణం చాలా కఠినమైనది. నరకప్రాయం’ అని చెప్పారు రిచర్డ్.
కానీ, ఘనాలో ఎలాంటి జీవితం లేదు కాబట్టి ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవాల్సిందేనన్నారు రిచర్డ్.
యూరప్ వెళ్తే జీవితం సుఖంగా సాగుతుందని రిచర్డ్ ఊహించుకున్నారు. కానీ, అక్కడ కూడా ఆయన అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు.
‘యూరప్‌లో డబ్బు సులభంగా సంపాదించొచ్చని అనుకున్నాను. కానీ, ఇక్కడ కూడా కష్టపడితేనే డబ్బు వస్తుంది’ అన్నారు రిచర్డ్.
‘కానీ, ఘనాలో ఇంట్లో ఉంటూ జీవించడానికి ఎలాంటి ఆధారం లేదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని’ అన్నారు రిచర్డ్.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)