కాలినడకన ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన మహిళ

    • రచయిత, ఫ్లోరియన్ స్టర్మ్
    • హోదా, బీబీసీ ట్రావెల్

ఏంజెలా మ్యాక్స్‌వెల్ ప్రపంచాన్ని చుట్టిరావాలని అనుకున్నారు. అది కూడా నడుచుకుంటూ. పైగా ఒంటరిగా.

అనుకున్నదే ఆలస్యం ఒకరోజు ప్రపంచ యాత్రకు బయలుదేరారు. ఆరు సంవత్సరాల్లో ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు.

వ్యక్తిగత సమస్యలు లేదా పరాజయం వల్లో ఆమెకు ఇలాంటి ఆలోచన రాలేదు.

ఆమె ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు ఆమె 30ల వయసులో ఉన్నారు.

ఆమె విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతున్నారు.

తన కలలను నెరవేర్చుకునేందుకు సాఫీగా సాగుతున్న మెరుగైన జీవితాన్ని కూడా వదిలిపెట్టారు.

ఈ ఆలోచన ఎలా వచ్చింది

ఆర్ట్ క్లాస్‌కి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి ప్రపంచాన్ని చుట్టి వచ్చారనే విషయాన్ని ఆమె విని అప్పటికి 9 నెలలు అయింది.

ప్రపంచంతో, ప్రకృతితో మమేకం కావాలని ఏంజెలా కూడా అనుకుంది.

ఒంటరిగా కాలి నడకన ప్రపంచాన్ని చుట్టి రావాలని ఆమె 2013లో నిర్ణయించుకున్నారు.

నేను సంతోషంగా ఉన్నానని అనుకున్నాను. కానీ నేను ప్రకృతితో, ప్రజలతో లోతైన సంబంధం ఏర్పర్చుకోవడం కోసం వెతుకుతున్నానని అనిపించింది. తక్కువ వనరులతో జీవిస్తూ నా చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకం అవ్వాలని అనుకున్నాను అని ఏంజెలా చెప్పారు.

అందుకు కాలి నడకే ఉత్తమమైన మార్గం అని అనిపించింది. ప్రయాణం వల్ల ఏర్పడే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని అనిపించింది అని ఆమె అన్నారు.

నిదానంగా సాగే ప్రయాణంలో ప్రకృతితో పూర్తిగా మమేకమై దారిలో అనేక సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని భావించారు. ఇవన్నీ సాధారణ ప్రయాణంలో సాధ్యపడవు.

ఆమె ఈ ప్రయాణాన్ని ఒంటరిగా చేయాలని ముందుగా ప్రణాళికలేమీ చేసుకోలేదు.

ఈ ప్రయాణానికి సిద్ధం కావడానికి ముందు ఆమె చాలా మంది మహిళా యాత్రికుల గురించి తెలుసుకున్నారు.

రాబిన్ డేవిడ్ సన్ తరహాలో, ఒంటెలపై ఆస్ట్రేలియాలో నెమ్మదిగా చేసే ప్రయాణాలను, రాయడాన్ని ప్రేమించారు. కాలినడకన సుదూర ప్రయాణాలు చేసిన ఫియోనా క్యాంప్‌బెల్ గురించి తెలుసుకున్నారు.

యూరప్ నుంచి నేపాల్ వరకు దారిలో కనిపించిన వాహనాల ద్వారా వెళ్లి, సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి, గుర్రంపై చిలీని దాటి, 59 సంవత్సరాల వయస్సులో ప్రపంచం చుట్టూ జాగింగ్ చేసిన రోజీ స్వేల్‌పొప్ గురించి చదివారు.

"నేను చేయబోయే సాహసానికి ప్రోత్సాహం కోసం నేను వాళ్ల పుస్తకాలు చదివాను. వాళ్లు ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు, విజయాల గురించి తెలుసుకున్నాను. ప్రతి మహిళ కథ విభిన్నంగా ఉండి నా ప్రయత్నం కొనసాగించడానికి నమ్మకం కలిగించాయి" అని మ్యాక్స్‌వెల్ చెప్పారు.

ఇంట్లో సామాన్లు అమ్మేసి ప్రయాణానికి కావాల్సిన వస్తువులు సమకూర్చుకున్నారు

కాలినడకన ప్రపంచాన్ని చుట్టిరావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏంజెలా మ్యాక్స్‌వెల్‌ తన ఇంట్లో సామాన్లు అమ్మేసి, ప్రయాణానికి అవసరమైన వస్తువులను సమకూర్చుకున్నారు.

ఆమె క్యాంపింగ్‌కు అవసరమైన పరికరాలు, డిహైడ్రేటెడ్ ఆహారం, మిలటరీ గ్రేడ్ వాటర్ ఫిల్టర్, నాలుగు కాలాలకు అవసరమైన దుస్తులను మొత్తం 50 కేజీలను తన కార్ట్‌లో ప్యాక్ చేసుకున్నారు.

ఆమె స్వస్థలం అమెరికాలోని ఒరెగాన్‌లో ఉన్న బెండ్ నుంచి 2014 మే 2న సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు.

ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో అప్పుడు ఆమెకు కూడా తెలియదు.

నేను 2018 జూన్‌లో ఆమెతో తొలిసారి స్కైప్‌లో మాట్లాడినప్పుడు ఆమె ప్రయాణం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు కావస్తోంది. అప్పటికే ఆమె 3 ఖండాల్లో, 12 దేశాల్లో, 20,000 కిలోమీటర్లు నడిచారు.

ప్రపంచం చుట్టూ నడవాలంటే ఎలాంటి మనిషై ఉండాలని ఆసక్తిగా ఆమెను ప్రశ్నించాను. ఆమె మెరుస్తున్న ముఖంతో "మొండి మనిషి" అయి ఉండాలని సమాధానమిచ్చారు.

"ఈ నడక ఒక క్రీడలా కాకుండా, సొంత జ్ఞానం కోసం, సాహసం అని అనుకుని చేయాలి. దానికి ఒక ఆశయం, కొంత మొండితనం, మరి కాస్త అభిరుచి ఉండాలి" అని ఏంజెలా అన్నారు.

పొద్దునే లేచి రెండు కప్పుల కాఫీ తాగి, అల్పాహారంలో ఒక బౌల్ ఓట్‌మీల్ తిని, వస్తువులను ప్యాక్ చేసుకుని, నడుచుకుంటూ వెళ్లేదాన్ని. రాత్రికి ఎక్కడ క్యాంప్‌ చేయాలో చూసుకుని, ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటూ, స్లీపింగ్ బ్యాగ్‌లోనే నిద్రపోయేదాన్ని అని ఆమె చెప్పారు.

అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండేవి కావు.

ముందు ప్రణాళికాబద్ధంగా ఆమె ముందుకు సాగేవారు. కానీ ప్రణాళిక లేకపోతేనే సాహసంలా అనిపిస్తుందని తర్వాత తెలుసుకున్నారు.

సాధారణ దిక్కులు అనుసరిస్తూనే వెళ్లేవారు. కానీ ఎడమ వైపుకు తిరగాలా, కుడి వైపుకు తిరగాలా అనే విషయంలో ఆమె పూర్తిగా తన మనసు చెప్పే మాటపైనే ఆధారపడేవారు.

ఎండకి వేడి కాయలు, ఆస్ట్రేలియాలో వడ దెబ్బ, వియత్నాంలో డెంగీ జ్వరంతో ఇబ్బంది పడ్డారు.

ఆమె మంగోలియాలో ఉన్నప్పుడు ఒక సంచార జాతికి చెందిన వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు.

టర్కీలో ఉండగా తుపాకీ పేలుళ్ల శబ్దాలు విన్నారు.

గాఢ నిద్రలోకి జారుకుంటానేమోననే భయంతో ఆమె ఒక కన్ను తెరిచి నిద్రపోవడం నేర్చుకున్నారు.

మ్యాక్స్‌వెల్‌కు తన ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో సరిగ్గా తెలియనప్పటికీ అన్ని రకాల కష్టాలు ఉంటాయని మాత్రం ముందుగానే అనుకున్నారు.

భయంతోనే నడక మొదలుపెట్టాను..

నాకు భయం లేక కాలినడకన ప్రపంచయాత్ర మొదలుపెట్టలేదు. నేను చాలా భయపడటం వల్లే నడవడం మొదలుపెట్టాను.

నా మనసు మాట వినకపోతే నా సొంతమైనవి, ప్రేమించినవి కోల్పోతానేమోననే భయంతో నడిచాను.

అత్యాచార ఘటన తర్వాత కూడా ఆమె ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నారు.

ఆమెలో కాస్త భయం ఉన్నప్పటికీ, కష్ట సమయంలో పట్టుదలగా ముందుకు సాగిన ఇతర మహిళల కథలు ఆమె ముందుకు నడవడానికి ఆమెలో స్ఫూర్తి నింపాయి.

ఆ ఒక్క సంఘటన నా కలలను ఆపుకుని వెనక్కి వెళ్లేటట్టు చేయకూడదని నేను దృఢంగా నిర్ణయించుకున్నాను.

నా ప్రపంచాన్ని అంతటినీ నేను వదిలి పెట్టి వచ్చాను. నాకు వెనక్కి వెళ్లినా అక్కడేమీ మిగిలి లేదు.

"నా ప్రయాణంలో దాగున్న ముప్పును కూడా అర్థం చేసుకున్నాను" అని ఆమె చెప్పారు.

హింసాత్మక పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఆమె శరీరం, మనసు ఎంత దృఢంగా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆమె తన ప్రయాణం కొనసాగించారు.

దారిలో ఆమె ఇతర సంస్కృతుల పట్ల ఆకర్షితులయ్యారు. ఆమె వివిధ ప్రదేశాల్లో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ప్రసంగాలు ఇచ్చేందుకు ఆహ్వానాలను ఆమోదిస్తూ, కూర్చుని వైన్ తాగుతూ, ఇటలీ టిర్ హేనియన్ సముద్ర తీరంలో ఉన్న గ్రామాల్లో తిరిగారు.

వియత్నాంలో హై వాన్ పాస్ పైకి వెళ్లేసరికి అలిసిపోయినప్పుడు ఒక వృద్ధ మహిళ తన చెక్క ఇంటిలో ఆ రాత్రికి విశ్రాంతి తీసుకునేందుకు ఏంజెలాను ఆహ్వానించారు.

మంగోలియా, రష్యా సరిహద్దులో ఒక స్నేహబంధం వెల్లివిరిసింది. ఆ తర్వాత వారిని స్విట్జర్లాండ్‌లో తిరిగి కలుసుకున్నారు.

ఆమె ఇటలీలో కలిసిన ఒక చిన్నారికి గాడ్ మదర్ కూడా అయ్యారు.

విభిన్న సంస్కృతులతో పరిచయం 7 నిమిషాలు అయినా, 7 రోజులు అయినా కూడా ఆమె రెండే రెండు విషయాలను దృష్టిలో పెట్టుకున్నారు.

మొదటగా, ఏదైనా విషయం నేర్చుకోవాలంటే అవతలి వారు చెప్పే మాటలను వినాలని అనుకున్నారు.

"ప్రతి ఒక్కరికి పంచుకోవడానికి ఒక కథ ఉంటుందని ఈ కాలినడక ప్రయాణం నాకు నేర్పింది. వారు చెప్పిన కథలను వినడానికి మనం సిద్ధంగా ఉండటమే ముఖ్యం" అని ఆమె అన్నారు.

ఆమె ఇటలీలో ఒక గ్రామంలో తరతరాల నాటి సంప్రదాయ కుటుంబ వంటకాలను, జార్జియాలో తేనె పట్టు పెంపకాన్ని, మంగోలియాలోని చారిత్రాత్మక సిల్క్ రోడ్‌పై ఒంటెలను మచ్చిక చేసుకోవడాన్ని నేర్చుకున్నారు.

ఇక రెండవ విషయం... ఇవ్వడంలో ఉన్న ప్రాముఖ్యతను ఆమె తెలుసుకున్నారు.

ఆమె న్యూజీలాండ్‌లో చెక్కను కోయడం నేర్చుకున్నారు. ఇటలీలో ఇల్లు లేని వారికి ఆహారం పంచారు.

ఇటలీలో ఒక రైతు ఇంటి మరమ్మత్తు పనుల్లో సహాయం చేశారు.

ఏంజెలా చెప్పే కథలే ఆమె ఇచ్చే అతి పెద్ద విరాళం.

ఆమె సాధారణ సమావేశాల్లో, పాఠశాలల్లో, యూనివర్సిటీలలో ఆమె మాట్లాడారు.

ఇతరుల్లో స్ఫూర్తిని కలిగించడానికి ఆమె ఎడిన్‌బరోలో టెడ్‌ఎక్స్ వేదికపై తన అనుభవాలను పంచుకున్నారు.

మంగోలియాలో అత్యాచార దాడి జరిగిన తర్వాత కూడా నడవాలని నిర్ణయించుకున్నాక మహిళా సాధికారతకు ఆమె ఒక వాణిలా మారారు.

"నడవడం మానాలని నేను అనుకోలేదు" అని ఆమె అన్నారు.

ఆమె ప్రయాణం చేస్తున్నంతసేపు వరల్డ్ పల్స్ అనే స్వచ్చంద సంస్థతో పాటు చిన్న పిల్లలు, మహిళల కోసం దృష్టి సారించే ఆమె సొంత సంస్థ ఫ్యూచర్ కోయలిషన్ కోసం కూడా విరాళాలు సేకరించారు. ఈ ప్రయాణంలో ఆమె మొత్తం 30,000 డాలర్లను విరాళాలుగా సేకరించారు.

"ఈ ప్రపంచాన్ని, అందులో నివసిస్తున్న జీవులను గాఢంగా అనుభూతి చెందడానికి ఆసక్తి, ఆహ్వానించే హృదయంతో ఉండటమే శక్తివంతమైన మార్గాలు" అని మ్యాక్స్‌వెల్ అన్నారు.

ఆరున్నరేళ్ల పాటు మ్యాక్స్‌వెల్ ఆసక్తితో నిండిన, అనిశ్చితితో కూడిన, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో గడపాలని అనుకున్నారు.

దొరుకుతుందో లేదో తెలియని వ్యక్తిగత ఆనందం, చుట్టూ ఉన్న ప్రపంచంతో గాఢమైన సంబంధం కోసం వెతుకుతూ ఆమె ఈ ప్రయాణం చేశారు.

బెండ్‌లోప్రయాణాన్ని ప్రారంభించిన తన ఆప్త మిత్రురాలు ఎలైస్ ఇంటి దగ్గరే డిసెంబరు 16, 2020న ఆమె ప్రయాణాన్ని ముగించారు.

ప్రస్తుతం ఆమె తన పుస్తకం రాసే పనిలో ఉన్నారు.

ఆమె భవిష్యత్తు ప్రయాణాలకు, మహిళలు తమను తాము వ్యక్తపరచుకోవడానికి, వారి నిత్య జీవితాల్లో ధైర్యం నింపుకునేందుకు సహకరించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)