You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మధ్యధరాసముద్రంలో పడవ మునక.. 65 మంది శరణార్థులు మృతి
యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు మరోసారి మధ్యధరా సముద్రంలో మునిగిపోయి చనిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది.
ట్యునీసియా సమీపంలో వీరి బోటు మునిగిపోయిందని 65 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదం నుంచి 16 మందిని కాపాడినట్లు చెప్పింది.
లిబియాలోని జువారా నుంచి గురువారం తమ బోటు బయలుదేరిందని.. బలమైన అలల్లో చిక్కుకుని తిరగబడిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్తున్నారు.
లిబియా నుంచి యూరప్ వెళ్లే మధ్యధరాసముద్ర మార్గంలో 2019 మొదటి నాలుగు నెలల్లో 164 మంది చనిపోయినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ లెక్కలు చెప్తున్నాయి.
తాజా ప్రమాదం ఈ ఏడాది శరణార్థులకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా మారింది.
ప్రమాదం నుంచి కాపాడిన వారిని ట్యునీసియా నౌకాదళం దేశ తీరానికి తీసుకువచ్చింది. నౌక నుంచి ట్యునీసియాలోకి అడుగుపెట్టేందుకు వీరు వేచివున్నారు.
ఒక వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ తెలిపింది.
ప్రమాదం గురించి విన్న వెంటనే నౌకాదళం ఒక ఓడను పంపించిందని, ఘటన జరిగిన ప్రాంతంలో ప్రాణాలతో ఉన్నవారిని నీటి నుంచి కాపాడుతున్న చేపల బోటు కనిపించిందని ట్యునీసియా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.
ఆ బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు ఆఫ్రికాలోని సహారా దిగువ దేశాల ప్రజలుగా గుర్తించారు.
అయితే.. మునిగిపోయిన బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని కొన్ని వార్తలు చెప్తున్నాయి. అది నిజమైతే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు.
ప్రతి ఏటా వేలాది మంది శరణార్థులు యూరప్ చేరుకోవటం కోసం మధ్యధరా సముద్రాన్ని దాటటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాణాంతక ప్రయాణం ప్రారంభించటానికి లిబియా ఒక కీలక కేంద్రంగా మారింది.
ఈ ప్రయాణంలో పాతబడిపోయిన పడవల్లో, ప్రయాణికులను పెద్ద సంఖ్యలో ఇరికించి పంపిస్తున్నారు. ఫలితంగా చాలా మంది చనిపోయారు.
అయితే 2017 మధ్య నుంచి శరణార్థుల ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి.
ఈ శరణార్థులు బయలుదేరకుండా చూడటానికి, ఒకవేళ సముద్రంలో కనిపించినట్లయితే లిబియాకు తిప్పిపంపించేలా చేయటానికి లిబియా దళాలను ఇటలీ ఉపయోగించుకోవటం దీనికి కారణం. ఈ విధానాన్ని మానవ హక్కుల సంస్థలు ఖండించాయి.
2019లో మొదటి మూడు నెలల్లో దాదాపు 15,900 మంది శరణార్థులు మూడు మధ్యధరాసముద్ర మార్గాల ద్వారా యూరప్ చేరుకున్నారు. ఇది 2018లో మొదటి మూడు నెలల్లో వచ్చిన వారి కన్నా 17 శాతం తక్కువ.
2018లో మధ్యధరా సముద్రం దాటుతూ సగటున రోజుకు ఆరుగురు శరణార్థులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి జనవరిలో విడుదల చేసిన నివేదిక ఒకటి తెలిపింది.
ఇవి కూడా చదవండి.
- ప్రధాని రేసులో చంద్రబాబు, కేసీఆర్: చరిత్ర పునరావృతం అవుతుందా?
- ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత
- రవి ప్రకాశ్‌పై కేసేంటి? టీవీ9లో ఏం జరిగింది?
- ఆస్ట్రేలియన్ డాలర్: 4.6 కోట్ల నోట్లపై అక్షర దోషం.. ఆర్నెల్లకు బయటపడింది
- అమెజాన్ బ్లూ మూన్: చంద్రుడి మీదికి మనుషులు, ఉపగ్రహాలు.. అక్కడే అంతరిక్ష కాలనీలు
- అమెరికా-చైనా ట్రేడ్ వార్: 200 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచిన అమెరికా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)