ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులను జగన్ సర్కారు ‘కేర్’ చేయటం లేదా?

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పట్ల రాష్ట్ర ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యోగులు తమ అసహనాన్ని ప్రదర్శించారు.

తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) నేరుగా ప్రభుత్వం పైనే ఫిర్యాదు చేసింది. గవర్నర్‌ని కలిసి తమ వేతనాల విషయంలో కొత్త చట్టం కోరుతూ వినతిపత్రం అందించింది.

గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉద్యోగులే ప్రభుత్వంపై ఫిర్యాదు చేసే పరిస్థితి రావడం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గానే స్పందించింది. గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఏపీజీఈఏ గుర్తింపుని రద్దు చేసే చర్యలకు ఉపక్రమించింది. సంజాయిషీ కోరుతూ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

అదే సమయంలో ఉద్యోగ సంఘాల ఆరోపణలపై ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. వేతనాలు సకాలంలో చెల్లించడం లేదనే ఆరోపణలను తోసిపుచ్చింది.

దాంతో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వైరుధ్యం స్పష్టమవుతోంది. ఉద్యోగ సంఘాలపై చర్యలకు పూనుకుంటున్న తరుణంలో వివాదం ముదురుతోంది.

పీఆర్సీ ఉద్యమంతో మొదలు...

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రారంభం నుంచి ఆర్థిక డిమాండ్లపై భారీ ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉంది.

ఆ క్రమంలోనే వేతన సవరణ కోసమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం సాగింది.

చివరకు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సంతృప్తి కలిగించలేదంటూ ఛలో విజయవాడ పేరుతో భారీ ప్రదర్శన జరిగింది.

అంతకుముందు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు, పీఆర్సీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయులు అసహనంతో కనిపిస్తున్నారు. దానికి తోడుగా వేతనాలు సకాలంలో జమకాకపోవడం మరింత సమస్యగా మారుతోంది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన జమ అవుతాయనే దీమా ప్రస్తుతం కనిపించడం లేదు. ఒక్కో నెల ఒక్కో రీతిన ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందుతున్నాయి.

ఇవన్నీ ప్రభుత్వం తమను వేధించేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి.

పీఎఫ్ నిధుల విషయంలోనూ...

ఉద్యోగుల భవిష్య నిధిలో ప్రతి నెలా సిబ్బంది వేతనం నుంచి కొంత మొత్తం తీసుకుని జమ చేస్తారు. ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించాల్సి ఉంటుంది.

ఆ మొత్తం జీపీఎఫ్‌లో నిల్వ ఉంచుతారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాల నిమిత్తం అందులో కొంత మొత్తం తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే జీపీఎఫ్‌కి సంబంధించిన నిధులు దారి మళ్లించారని, ఉద్యోగులు తమ అవసరాల్లో వాటిని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడం లేదనే విమర్శలు కూడా పదే పదే వినిపిస్తున్నాయి.

నెలల తరబడి జీపీఎఫ్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీపీఎస్ అంశంలో ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతో పాటుగా తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ అడుగు వేసిన తరుణంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రుచించడం లేదు.

గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో కొత్త విధానం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయా సంఘాలు తప్పుబడుతున్నాయి.

నాయకులపై ఒత్తిడి...

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఆయా సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతోంది. దాంతో ప్రభుత్వంతో పీఆర్సీ సహా వివిధ ఒప్పందాల విషయంలో సానుకూలంగా వ్యవహరించిన నేతలు కూడా ఇటీవల తమ స్వరం పెంచుతున్నారు.

ఏపీ ఎన్జీవో, అమరావతి జేఏసీ వంటివి కూడా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. త్వరలోనే కార్యాచరణ అంటూ హెచ్చరికలు చేస్తున్నాయి.

ఈ వ్యవహారంలో ఏపీజీఈఏ మరో అడుగు ముందుకేసింది. నేరుగా గవర్నర్‌ని కలిసి, ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే తమకు వేతనాలు చెల్లించేలా కొత్త చట్టం తీసుకురావాలని కోరింది.

జీపీఎఫ్ సహా వివిధ సమస్యలపై జోక్యం చేసుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు ఆశిస్తూ వినతిపత్రం సమర్పించింది.

ఆ సంఘం నాయకుడు కె.ఆర్.సూర్యనారాయణ తదితరులు జనవరి 19న రాజ్‌భవన్ వద్దే మీడియాతో చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఉద్యోగ సంఘాల గుర్తింపు నియామళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ జనవరి 21న నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని గడువు పెట్టింది.

అదే సమయంలో ఏపీ ఎన్జీవో నాయకులు ఏపీజీఈఏ తీరుని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు కె.ఆర్.సూర్యనారాయణ, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.

‘‘మీడియాతో మాట్లాడటం.. నిబంధల ఉల్లంఘనా?’’

ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద 2010లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పడింది. 2012లో గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కి తమ సంఘం కంటగింపుగా ఉందని కె.ఆర్.సూర్యనారాయణ అంటున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన తాజా నోటీసుల పట్ల నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెబుతున్నారు.

"నోటీసులు అందాయి. ఆఫీస్ బేరర్స్‌తో చర్చించాము. నోటీసులకు సమాధానం ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు నిత్యం మీడియాలో మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. మేమే మొదలు పెట్టింది కాదు’’ అని ఆయన చెప్పారు.

‘‘ప్రభుత్వంతో చర్చించడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండగా, ఎందుకు అనుసరించలేదనేది జీఏడీ నుంచి వచ్చిన తాఖీదుల్లో ఉన్న అంశం. ప్రభుత్వ నిబంధనలు పాటించలేదనేది ప్రభుత్వ అభిప్రాయం. మేము అతిక్రమించలేదని ప్రభుత్వానికి చెబుతాం. మీడియాతో మాట్లాడడమే నిబంధనల ఉల్లంఘనయితే అది అన్నిసంఘాలకు వర్తిస్తుంది" అని సూర్యనారాయణ అంటున్నారు.

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే ఎటువంటి వివాదం ఉండదని, సమస్యల పరిష్కారం విషయంలో తాత్సారం చేయడమే అసలు అంశమని ఆయన పేర్కొన్నారు. లేదంటే ఏప్రిల్ నుంచి ఆందోళనకు పిలుపునిస్తామని బీబీసీకి తెలిపారు.

ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నిబంధనలను 1962లో రూపొందించారు. 2001లో సవరించారు. వాటి ప్రకారం పలు షరతులున్నాయి. ముఖ్యంగా మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదనే నిబంధన రోసా (రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్) చట్టంలో ఉంది.

ఈ నిబంధనను పాటించలేదనే అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

తామే కాదు, అన్ని సంఘాలు ఈ నిబంధన పాటించలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చెబుతున్న తరుణంలో వ్యవహారం ఆసక్తిగా ఉంది.

ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలి: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం బలపడుతోందని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. అందుకు ప్రభుత్వ తీరు ప్రధాన కారణంగా ఆయన వ్యాఖ్యానించారు.

‘‘జీపీఎఫ్ బిల్లులు, డీఏ చెల్లింపు వంటి విషయంలో జరుగుతున్న ఆలస్యం చాలామందిని వేధిస్తోంది. సామాజిక పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీన అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. కానీ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విషయంలో కాలయాపన చేస్తూ వేధిస్తోందనే అభిప్రాయం కలిగేందుకు కారణమవుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘సీపీఎస్ వంటి సమస్యల నుంచి ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ వైఖరి అలానే ఉంది. ప్రభుత్వ తీరు మార్చుకోకుండా ఉద్యోగ సంఘాలను తప్పుబట్టడం వల్ల ఉపయోగం ఉండదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అభిప్రాయాన్ని, ఆందోళనను కూడా వెలిబుచ్చే అవకాశం లేకుండా అడ్డుకుంటున్న తీరు సరికాదని లక్ష్మణరావు అన్నారు.

అనేక సమస్యలు పరిష్కరించకుండా, ఆందోళన చేయకూడదనే రీతిలో ప్రభుత్వం కట్టడి చేసేందుకు యత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధంగా కనిపిస్తోందన్నారు.

ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో చెప్పండి?: ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి వివిధ రూపాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు వంటి హామీలు అమలుకాకపోవడం, ప్రభుత్వం చెల్లించాల్సిన జీపీఎఫ్‌, డీఏలు సకాలంలో అందకపోవడం కీలక సమస్యలుగా ఉన్నాయి.

అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల వ్యతిరేకతను ప్రభుత్వం పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు.

అడపాదడపా చర్చల కోసం సమావేశాలు నిర్వహిస్తున్నా సానుకూల స్పందన రావడం లేదనే అభిప్రాయం సంఘాల నాయకుల నుంచి వినిపిస్తోంది.

ప్రభుత్వం మాత్రం తాము చేయాల్సిందంతా చేస్తున్నామనే వాదనతో ఉంది. అందుకు తోడుగా ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు నోటీసులు కూడా జారీ చేయడం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

"గత ప్రభుత్వంలో వేతనాలు ఒకటో తేదీన ఇచ్చారా..? పోనీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒకటో తేదీనే వేతనాలు వస్తున్నాయా..? ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకటో తేదీనే బిల్లులు వచ్చిన దాఖలాలు లేవు’’ అని ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ పేర్కొన్నారు.

‘‘బిల్లుల అప్ లోడింగ్‌కి, ప్రాసెసింగ్ చేయటానికి కొంత సమయం పడుతుంది. దానిని తగ్గించే ప్రయత్నంలో ఉన్నాం. ప్రతి నెలా వీలయినంత త్వరగా వేతనాలు చెల్లించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ అంశాన్ని భూతద్దంలో చూపించడం తగదు. కోవిడ్ సంక్షోభంలో కూడా క్రమం తప్పకుండా వేతనాలు అందాయి. అయినా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని ఆయన తప్పుపట్టారు.

గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా 3.01 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లకు కూడా వేతనాలు ప్రతి నెలా అందుతున్నాయని ఆయన చెప్పారు. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరుగుతోందని బీబీసీకి తెలిపారు.

‘‘ఇంత ‘దూరం’ గతంలో ఎన్నడూ లేదు’’

ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఇంత తీవ్రమైన వైరం గతంలో ఎన్నడూ చూడలేదని ఏపీ పెన్షనర్ల సంఘం నాయకుడు కె.సత్తిరాజు అన్నారు.

‘‘1970ల నుంచి వివిధ ప్రభుత్వాలను చూశాను. కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చేవి. మా సంఘాలు ఉద్యమాలు చేసేవి. ఆ తర్వాత మళ్లీ సాధారణమే అన్నట్టుగా ఉండేది. సమ్మెల తర్వాత కూడా ఉద్యోగులతో మళ్లీ కలిసిమెలిసి సాగిన ప్రభుత్వాలు ఉన్నాయి. తొలిసారిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను, వారి సంఘాలను ఈ ప్రభుత్వం లక్ష్య పెడుతున్నట్టుగా లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించే యత్నాలు సహా వివిధ ప్రయత్నాల ద్వారా మేము ఎవరినీ ఖాతరు చేయబోమనే సంకేతాలు పంపుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందని అనుకోవడం లేదు. ఉద్యోగులను ఖాతరు చేయడం లేదనే సందేశం కొందరిని సంతృప్తిపర్చవచ్చు గానీ లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు దూరం కావడం ఎవరికీ శ్రేయస్కరం కాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కూడా ప్రతిపక్ష పార్టీల మాదిరిగా చూడడం సరికాదని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి విరుద్ధంగా సాగుతున్న వైఖరిని మార్చుకోవాలని సత్తిరాజు వ్యాఖ్యానించారు.

అయితే.. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తోందని, కొందరు చేస్తున్న ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వబోమని ఏపీ సమాచార, పౌరసంబంధాల మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)