You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'పీఎం -కుసుమ్' అంటే ఏంటి? ఈ పథకంతో రైతులు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చా?
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
అది ఉచిత విద్యుత్తైనా, కొనుక్కునే కరెంటైనా సరే భారత దేశంలో సగటు రైతుకు వ్యవసాయ విద్యుత్తు ఇప్పటికీ నిత్య సమస్యే.
పొలాల్లో నీరు పారించేందుకు కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అగమ్యగోచర పరిస్థితి. అపరాత్రి అపరాత్రి అంటూ వేళపాళా లేకుండా వచ్చిపోయే కరెంటుకోసం రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఇక వేసవి కాలమొస్తే రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. కరెంటు రాకడ పోకడ గాల్లో దీపంలా మారుతున్నాయి. ఓల్టేజీ సమస్యలతో మోటార్లు కాలిపోయి రైతులు కొన్ని ప్రాంతాల్లో సాగుకు విరామమిచ్చే దుస్థితి కూడా నెలకొంటోంది.
ఈ కరెంటు కష్టాలకు ముగింపు పలికి కర్షకులకు ఉదయం నుంచీ సాయంత్రం వరకు నిరంరతాయంగా విద్యుత్తు సరఫరా అందించి, రైతులు తమ బావుల నుంచీ పొలాలకు రోజంతా నీరు పారించుకునే వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి కుసుమ్ పథకం (Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthan Mahabhiyaan (PM-KUSUM).
రైతులు తాము ఇప్పుడు వాడుతున్న కరెంటు లేదా డీజిల్ మోటార్ల స్థానంలో అతి తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకుని కరెంటు కష్టాల నుంచీ ఉపశమనం పొందడం, తాము వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను రైతులు డిస్కంలకు విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా రూపొందించిందే ఈ PM-KUSUM యోజన.
ఈ పథకం ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడమెలా? సబ్సీడీ, బ్యాంకు రుణాలు పొందడమెలా? తమ పొలాల వద్ద దీన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? తదితర పూర్తీ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఏమిటీ కుసుమ్?
భారత ప్రభుత్వానికి వ్యవసాయ విద్యుత్తు ఒక పెను సమస్య. ఏటా దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం కరెంటులో 17 శాతం పొలాల్లోని 20 మిలియన్ల వ్యవసాయ విద్యుత్తు మోటార్లకే వినియోగమవుతోంది.
విద్యుత్తు పంపిణీ సంస్థలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్తు రాయితీలను భరించలేకపోతున్నాయి. ఇప్పటికి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పగలంతా రైతులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించే పరిస్థితిలో లేవు.
పొలాల వద్ద ఇప్పటికే ఉన్న కరెంటు మోటార్లకే విద్యుత్తు ఇవ్వడానికి విద్యుత్తు పంపిణీ సంస్థలు (DISCOMs) సతమతమవుతుంటే, కొత్తగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం లక్షలాది మంది రైతులు దరఖాస్తులు పెట్టుకుని సంవత్సరాల తరబడి ఎదురు చూపులు చూస్తున్నారు. కొత్తగా సాగుకు కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే డిస్కంలు హడలిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాయి. ఈ రాయితీ బిల్లు ప్రభుత్వాలకు గుదిబండగా మారుతోంది. వేసవిలో కరెంటు కష్టాల సుడిగుండంలో ప్రభుత్వాలు చిక్కుకుంటున్నాయి.
కరెంట్‌గా ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి
ఈ నేపథ్యంలో సహజంగా దొరిగే ప్రత్యామ్నాయ ఇంధనాన్ని కరెంటుగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. భారత ప్రభుత్వ Ministry of New and Renewable Energy (MNRE) తన Intended Nationally Determined Contributions (INDCs)లో భాగంగా 2030 సంవత్సరానికల్లా ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన కరెంటు స్థానంలో 40 శాతం సౌర విద్యుత్తు ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 2022 సంవత్సరాంతానికి లక్ష మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసి గ్రిడ్‌కు కనెక్ట్ అవ్వాలని సంకల్పించింది.
పనిలో పనిగా కరెంటు, డీజిల్‌తో నడిచే వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లను అమర్చి రైతులకు కరెంటు కష్టాలతో పాటు డీజిల్ వ్యయభారాల నుంచీ కూడా పూర్తీ ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. ఇలా రైతులను సోలార్ పవర్‌వైపు ప్రోత్సహించడానికి ఉద్దేశించి కేంద్రం తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి కిసాన్ సురక్షా ఏవమ్ ఉత్తాన్ మహాభియాన్ (Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthan Mahabhiyaan (PM-KUSUM).
ఈ పథకం ద్వారా రైతులు తమ బావులు, పొలాల వద్ద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని కాణి ఖర్చు లేకుండా రోజంతా విద్యుత్తు సరఫరాను పొందగలుగుతారు. సాగుకు నీరు అవసరం లేనప్పుడు తమ వద్ద ఉత్పతయ్యే మిగులు సౌర విద్యుత్తును దగ్గర్లోని సబ్ స్టేషన్‌కు అమ్మేసి సొమ్ము చేసుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు.
ఈ పథకం ఎలా ఉంటుంది?
ఇందులో మూడు కాంపొనెంట్స్ ఉంటాయి.
కాంపొనెంట్-ఏ :
- సోలార్ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఎనర్జీలకు సంబంధించి 10,000 వికేంద్రీకృత గ్రౌండ్ గ్రిడ్ ( Decentralized Ground Grid)లను ఏర్పాటు చేస్తారు.
- రైతులు తమకు తాము సొంతంగా లేదా సమూహంగా/ పంచాయతీలు/ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (Farmer Producer Organisations (FPO))/ నీటి వినయోగ సంఘాలు (Water User associations (WUA) గా ఏర్పడి ఈ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
- 500 kW (కిలో వాట్)ల నుండీ 2 MW (మెగా వాట్) ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇలా విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలను Renewable Power Generator (RPG)గా గుర్తిస్తారు.
కాంపొనెంట్-బీ:
- డీజిల్ పంపుసెట్ల స్థానంలో 17.50 లక్షల సౌర విద్యుత్తు మోటార్లను అమర్చుతారు.
- 7.5 HP (హార్స్ పవర్) సామర్థ్యం వరకూ సోలార్ పంపుసెట్లను అమర్చుకునే వీలుంటుంది.
- సోలార్ పంపుసెట్ల వల్ల రైతులకు డీజిల్ ధరల భారం పూర్తీగా తప్పుతుంది.
- పగలంతా కూడా నిరంతరాయంగా విద్యుత్తు పొందగలుగుతారు.
- వేసవిలో మంచి ఎండ ఉంటుంది కాబట్టి వేసవిలోనూ సాగు మెరుగుపరచుకోవచ్చు.
కాంపొనెంట్-సీ:
- 10 లక్షల వ్యవసాయ విద్యుత్తు మోటార్లను సోలార్ పంపుసెట్లుగా మార్చుతారు.
- కరెంటు పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు అమర్చుతారు
- ఒక్కో సోలార్ పంపుసెట్ సామర్థ్యం 2 HP (హార్స్ పవర్) కంటే తక్కువ ఉండకూడదు.
- దీనివల్ల రైతులు పగలంతా కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు పొందుతారు
- పవర్ కట్ సమస్యలకు చరమగీతం పాడుతారు
- తాము వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను రైతులు దగ్గర్లోని సబ్ స్టేషన్ ద్వారా డిస్కంలకు అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చు.
- ఈ మూడు కాంపోనెంట్ల ద్వారా వ్యవసాయ రంగంలో ఈ ఏడాది చివరకు 25,750 మెగావాట్ల సోలార్ పవర్‌ను అధనంగా పొందాలనేది లక్ష్యం.
- దీనికోసం 11 మిలియన్ల సోలార్ 3 HP పంపుసెట్లను లేదా 7 మిలియన్ల 5 HP పంపుసెట్లను నెలకొల్పనుంది.
- ఇందులో భాగంగా సౌర సాగు చేసే రైతులకు కేంద్రం ఆర్థిక సహకారం అందించడానికి రూ.34,422 కోట్లు కేటాయించింది.
ఎవరు అర్హులు?
రైతులందరూ అర్హులే. ఇందులో ఏ విభాగం కింద తాము సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆయా రైతు అవసరాలు, సామర్థ్యం, ప్రతిపాదనలు,ప్రణాళికలను బట్టి ఆధారపడి ఉంటుంది.
ఎంత భూమి ఉండాలి?
ఇంత భూమి ఉండాలనే పరిమితి ఏమీ లేదు. మీరు మీ పక్క పొలాల రైతులంతా కలిసి సహకార స్ఫూర్తితో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
సోలార్ పవర్ కోసం భూమిని కౌలుకు ఇవ్వొచ్చా?
ఇచ్చుకోవచ్చు. రైతులు తమ పొలాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కౌలుకిచ్చుకోవచ్చు.
సబ్సిడీ ఎవరిస్తారు?
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకయ్యే మొత్తంలో 60శాతం రాయితీ ఇస్తారు.
- 30% కేంద్ర ప్రభుత్వం
- 30% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు .
- 30% బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాల రూపేణా ఇస్తాయి
- 10% రైతు భరించాల్సి ఉంటుంది.
బ్యాంకు రుణానికి ష్యూరిటీలు ఇవ్వాలా?
ఈ పథకం కింద రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు కొన్ని ష్యూరిటీ అడుగుతుంటారు.
రైతులు నెలకొల్పే సోలార్ పవర్ ప్లాంటు సామర్థ్యం, నిర్మాణ వ్యయం తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతుకు రుణం మంజూరు చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం .5లక్షలకు పూచీకత్తు ఇస్తోంది.
సోలార్ పంపుసెట్లు ఎవరు అమర్చుతారు?
సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది.
కేంద్రం ఎంపిక చేసిన సంస్థల ద్వారానే సోలార్ పంపుసెట్లు ఇన్‌స్టలేషన్ చేయించుకోవాలి.
రైతుకు ఇష్టమొచ్చిన కంపెనీ వారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చా?
కుదరదు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీవారివే ఏర్పాటు చేసుకోవాలి.
సోలార్ పవర్ ను రైతు అమ్ముకోవడం ఎలా?
రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు.
దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలు సోలార్ పవర్ కొంటారు?
డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచీ కరెంటు కొంటారు. .
రైతు 1 MW సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తే ఆయనకొచ్చే ఆదాయం ఎంత?
- రైతులు సొంతంగా లేదా ఒక సమూహంగా ఏర్పడి 2MW సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
- 1MW సోలార్ ప్లాంటు నుంచీ సంవత్సరానికి 1584000 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చయొచ్చు.
- ఒక యూనిట్‌ను రూ.3.50ల లెక్కన డిస్కంలకు విక్రయించారనుకోండి అప్పడు
- 1584000 × 3.5 = 55,44,000ల ఆదాయం పొందుతారు.
డీజిల్ మోటార్లున్న రైతుల పరిస్థితి?
రైతు 10 శాతం డబ్బులు ఎక్కడ చెల్లించాలి
- రైతు ప్రతిపాదనలను అంగీకరించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రైతుల జాబితా ప్రకటిస్తుంది.
- తరువాత ఆయా రైతుకు ఎంపిక చేసిన సోలార్ పంపుసెట్ల సంస్థల జాబితా పంపుతుంది.
- కేంద్ర ప్రభుత్వం సూచించిన ఈ సంస్థలకు రైతు తాను చెల్లించాల్సిన 10 శాతం వ్యవయాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
ఎన్నిరోజుల్లో సబ్సీడీ మంజూరవుతుంది
సహజంగా దరఖాస్తు ఎంపిక చేసన తరువాత 10 నుంచీ 90 రోజుల్లోపు సబ్సీడీ సొమ్ము విడుదల చేస్తారు.
ఎప్పటిలోగా సోలార్ పంపుసెట్లు అమర్చుకోవాలి?
ఈ పథకానికి ఎంపికైన రైతు ఎంపికైన నాటి నుంచీ సరిగ్గా 12 నెలల్లోపు తన పొలంలో సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రైతులకు 15 నెలల వరకు మినహాయింపు ఉంటుంది.
గడువులో సోలార్ పంపుసెట్టు ఏర్పాటు చేయకపోతే?
- లబ్దిదారుడుకు కేంద్ర ఎంపిక చేసిన ఏజెన్సీ 12 నెలల్లోపు పంపు సెట్లు ఏర్పాటు చేయాలి.
- ఒక నెల ఆలస్యం చేస్తే ఏజెన్సీకి చెల్లించే సర్వీసు ఛార్జీలో 10 శాతం కోత విధిస్తారు
- రెండు నెలలు ఆలస్యం చేస్తే మరో 10 శాతం సర్వీసు ఛార్జీల్లో కోత
- మూడు నెలలకు మించి ఆలస్యమైతే మరో 10 శాతం కోత
- ఆరు నెలలకు మించి ఆలస్యమైతే ఎలాంటి సర్వీసు రుసుం చెల్లించకుండానే ఆ సంస్థ సోలార్ పంపుసెట్లను అమర్చాల్సి ఉంటుంది.
హెల్ప్ లైన్ ఉందా?
PM Kusum Yojana Helpline Number
PM KUSUM Toll Free Number: 1800-180-3333.
Contact No: 011-2436-0707, 011-2436-0404.
నకిలీ వెబ్‌సైట్లున్నాయి జాగ్రత్త?
పీఎం కుసుమ యోజన పేరిట కొన్ని నకిలీ వెబ్‌సైట్లున్నాయి. అలాంటి వాటి జోలికెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం వారి అధికారిక వెబ్‌సైట్‌లోనే రైతులు దరఖాస్తు చేసుకోవాలి.
వీలుకాని పక్షంలో మీకు దగ్గర్లోని బ్యాంకు అధికారులను సంప్రదించి వారి సహాయంతో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కోహిస్తాన్: పరువు హత్యల పేరుతో ఈ జిల్లాలో అమ్మాయిలు, అబ్బాయిలను చంపుతున్నారు
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని.. ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది
- ఖతార్: ఈ కృత్రిమ ద్వీపం ప్రత్యేకత ఏంటి.. ప్రజలు ఇక్కడ ఉండటానికి ఎందుకు ఎగబడుతున్నారు
- మహిళా లీడర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారిపై నమ్మకం తగ్గుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)