You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: పోడు వ్యవసాయమా? హరిత హారమా? పాత పగలా? ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరణానికి కారణం ఏంటి?
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు హత్య నిందితులు దొరికారు. కోర్టులో సాక్ష్యం కోసం వాళ్లు వాడిన కత్తులు, నేలపై చిందిన రక్తం ఆనవాళ్లు, రక్తంతో తడిసిన నిందితుల బట్టలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన 45 ఏళ్ళ మడకం తుల, 37 ఏళ్ల పోడియం నంగాలు ఈ హత్య చేశారు.
‘‘హత్య జరిగిన స్థలం దగ్గర అటవీ అధికారులు కొత్తగా మొక్కలు పెంచుతున్నారు. వాటి మధ్యే నిందితులు పశువులను మేపుతున్నారు. విషయం తెలుసుకున్న రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు, తన సిబ్బంది రామారావుతో కలసి అక్కడికి వెళ్లారు. వాళ్లను అడ్డుకోబోయారు. ఈ సన్నివేశాన్ని శ్రీనివాస రావు వీడియో తీస్తున్నాడు. వాళ్లు రామారావును కొట్టారు. దీంతో అడ్డుగా వెళ్ళిన శ్రీనివాస రావును వీడియో ఎందుకు తీస్తున్నావంటూ తమ చేతిలో ఉన్న కొడవళ్లతో నరికారు’’ అని పోలీసులు మీడియాకు చెప్పారు.
అంటే హరితహారం మొక్కలను కాపాడటానికి జరిగిన హత్య అని పైకి కనిపిస్తోన్న కారణం. గ్రామంలో ఇప్పటికే పోడు సర్వే పూర్తి అయిపోయిందని, కాబట్టి అది పోడు వివాదం వల్ల జరిగిన హత్య కాదని అటవీ శాఖ ప్రధానాధికారి డోబ్రియాల్ మీడియాతో అన్నారు. కొత్తగూడెం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇది పోడుకు సంబంధం లేని హత్యే అని బీబీసీతో అన్నారు.
పోడు వల్ల కాకపోతే మరి ఎందుకు హత్య జరిగినట్టు?
ఈ ప్రాంతంలో అటవీ సిబ్బందికి, ఆదివాసీలకు మధ్య పోడు వివాదం ఏళ్లుగా నలుగుతోంది. రాజకీయ నాయకులు ఒకవైపు అటవీ సిబ్బందికి సహకరించాలని పిలుపునిస్తూ, తెర వెనుక వారిపై దాడులను ప్రోత్సహించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మరో నెల రోజుల్లో అయిపోతుంది అంటున్న వేళ ఈ హత్య జరిగింది.
శ్రీనివాస రావు మరణించారు కాబట్టి విషయం పెద్దది అయింది కానీ, ఆసిఫాబాద్ నుంచి భద్రాచలం వరకూ నిత్యం ఏదో మూల అటవీ సిబ్బంది, ఆదివాసీల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ సమస్యను మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఇప్పుడు అడవిపై హక్కు కోరుతున్న వాళ్లలో 2005 తరువాత కొత్తగా అడవిని నరికిన వాళ్లే ఎక్కువ. చట్ట ప్రకారం వారికి హక్కు రాదు. కానీ వారికి ఎలాగైనా హక్కు ఇప్పించాలని కొందరు నాయకుల ప్రయత్నం. ఆ భూమిని ఎలాగైనా వారికి వెళ్లకుండా చూడాలని అటవీ సిబ్బందికి ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్. ‘మీకు మేం భూమి ఇప్పించాలనుకున్నా అటవీ సిబ్బంది ఒప్పుకోవడం లేదు’ అంటూ అధికారులపై నెపం మోపే నాయకులు.. ఇవన్నీ కలసి పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.
అసలు కారణం ఏంటి?
‘‘శ్రీనివాస రావుపై నిందితులకు పాత పగ ఉందా?’’
‘‘అడవిలో పోడును తరచూ అడ్డుకుంటున్నాడన్న కోపం పెంచుకున్నారా?’’
‘‘గతంలో అదే గ్రామస్తులపై అటవీ సిబ్బంది, పోలీసు సిబ్బంది దాడి చేసిన దానికి ప్రతీకారమా?’’
‘‘పాత పగలు లేకున్నా, పశువులు మేపవద్దన్నందుకు అప్పటికప్పుడు ఆవేశంలో జరిగిన హత్యా?’’
‘‘పోడు గురించిన చర్చ పెద్దది చేయడానికో, లేక అటవీ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయడానికో – ఎవరైనా వెనుక ఉండి హత్యకు పథకం వేశారా?’’
కొత్తగూడెం – ఖమ్మంలో హత్య గురించి మట్లాడుకునే ఏ నలుగురిని కదిపినా ఇలాంటి ప్రశ్నలెన్నో వినిపిస్తున్నాయి.
గుత్తికోయలు ఏమంటున్నారు?
నిందితులు సొంత ఊరు ఎఱ్ఱబోడు గ్రామానికి బీబీసీ వెళ్లింది. అందరూ గుత్తికోయలు మాత్రమే ఉన్న 45 ఇళ్ళ వాడ అది. 2003లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా నుంచి సల్వాజుడుం భయంతో ఇక్కడకు వచ్చి స్థిరపడ్డట్టు గ్రామ పెద్ద బీబీసీతో చెప్పారు. అక్కడ వారంతా పోడు సాగు చేస్తున్నారు. కోళ్లను పెంచుతున్నారు. కొందరు కూలి పనులకు కూడా వెళతారు.
‘‘మేం ఇక్కడకు వచ్చినప్పుడు కొట్టిన అడవే తప్ప, మళ్లీ కొత్తగా మేం అడిని కొట్టడం లేదు. అటవీ అధికారులే మా పొలాలకు వెళ్లకుండా ట్రెంచ్ (భూమిపై లోతుగా గోయి తవ్వడం) కొడుతున్నారు. మా ఆడవాళ్లను అకారణంగా కొట్టారు. బయటి వాళ్లు చెట్లు నరికి గుత్తికోయలు నరికారని చెబుతున్నారు. మేం సజ్జ, వరి సాగు చేసేవాళ్లం. రెండు మూడేళ్లుగా పత్తి కూడా వేస్తున్నాం’’ అని బీబీసీకి చెప్పారు గ్రామ పెద్ద రమేశ్.
శ్రీనివాస రావు హత్య గురించి వారితో మాట్లాడింది బీబీసీ.
‘‘హత్య తప్పే. ఆ రోజు ఏం జరిగిందో మాకు ఏమీ తెలియదు. వాళ్లు పశువులను మేపడానికి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చి ‘చంపేశాం’ అని మాతో చెప్పారు. తప్పు కదా అన్నాం. ఈలోపే పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు’’ అని అన్నారు రమేశ్.
అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తారా?
అటు అటవీ సిబ్బంది కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారు. శ్రీనివాస రావు అంత్యక్రియలకు వచ్చిన అటవీ మంత్రితో తమకు ఆయుధాలు కావాలని అడిగారు. ఒకప్పుడు ఫారెస్టు గార్డుల దగ్గర తుపాకులు ఉండేవి. వారిని బెదిరించి ఆ తుపాకులను నక్సలైట్లు తీసుకువెళ్తున్నారన్న కారణంతో వాటిని వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. అప్పటి నుంచీ వారికి తుపాకులు లేవు.
2013లో ఇందల్ వాయిలో దాడి జరిగినప్పుడూ, తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్‌లో స్వయంగా టీఆఎర్‌ఎస్ నాయకులే అటవీ సిబ్బందిని గట్టిగా కర్రలతో కొట్టినప్పుడు కూడా ఈ ఆయుధాల విషయం ప్రస్తావనకు వచ్చింది. కానీ వారికి ఆయుధాలు ఇవ్వలేదు.
అసలు తమ రక్షణ సంగతి తేలే వరకూ పోడు విధులకు వెళ్లబోమంటూ నిన్న ఖమ్మంలో సమావేశమైన అటవీ రేంజర్, డిప్యూటీ రేంజర్ల సంఘం నాయకులు తీర్మానించారు. అదే విషయాన్ని మంత్రికీ చెప్పారు. రాజకీయ నాయకుల డబుల్ గేమ్ అనే పదాన్ని స్వయంగా మంత్రికే చెప్పారు అటవీ అధికారులు.
పోడు సమస్య తీవ్రంగా ఉంది. అది ఎంత తీవ్రంగా ఉందంటే, నిన్న అటవీ సిబ్బంది అంతా శ్రీనివాస రావు అంత్యక్రియల్లో ఉన్న సమయంలో, కొత్తగూడెం జిల్లాలో మరో చోట చెట్లు నరికారు కొందరు.
ఇది 13 లక్షల ఎకరాల భూమి సమస్య కాబట్టి ఎవరూ తగ్గరు. నేనే స్వయంగా వెళ్లి సమస్యను పరిష్కరిస్తా అని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్, మాట నిలబెట్టుకుంటారా?
ఇవి కూడా చదవండి:
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- ఆంధ్రప్రదేశ్: రెండేళ్ళ బాలుడి రెండు కాళ్ళూ తీసేశారు, ఈ దారుణానికి కారకులెవరు, ప్రభుత్వం ఏమంటోంది?
- ఖతార్ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...