You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం: ‘అరకు కాఫీ’కి వందేళ్లు.. గిరిజన ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరింది?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
కొందరికి కాఫీతో రోజు మొదలై కాఫీతోనే పూర్తవుతుంది. మరికొందరికి చేసే పనికి కారణం లేకపోయినా పరవాలేదు కానీ...కాఫీ మాత్రం ఉండాల్సిందే. ఇంకొందరు ఒత్తిడి నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే కాఫీ కావాల్సిందే.
భారతదేశంలో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్ లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది?
చెట్ల మధ్య తోటల పెంపకం...
విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్) మాజీ ఎండీ రవి ప్రకాష్ గతంలో బీబీసీకి వివరించారు. "1898లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువగా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10 వేల ఎకరాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగించింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి 'అరకు కాఫీ' అనే పేరు స్థిరపడింది" అని చెప్పారు.
పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి...
గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయించారు.
వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీనగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు.
అయితే స్వాతంత్ర్యం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది.
మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా...ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరించాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.
అరకు కాఫీ రుచికి కారణం అదే...
అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యంలోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ బీబీసీకి తెలిపారు.
"సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ...పొడవాటి మిరియాలు, సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది" అని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.
బ్రెజిల్ 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది.
ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో... 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా... అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో అరబికా రకం కాఫీని పండిస్తారు.
ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ తెరిచారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి 'అరకు కాఫీ' షాప్ ఇది.
నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని ప్యారిస్ లో ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత అరకు కాఫీ రుచులు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలకూ పాకాయి.
2018లో పారిస్ లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూర్స్-2018 పోటీలో (Prix Epicures) అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది.
రుచికరమైన కాఫీ బ్రాండులకి పేరుపొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.
కాఫీ పిక్క ఎర్రగా మారిన తర్వాతే..
సేంద్రీయ పద్ధతుల్లో అరకు కాఫీని పండిస్తారు. కాఫీ మొక్కల నుంచి రాలిపడే ఆకులనే వాటికి మళ్లీ ఎరువుగా వేస్తూ...మిరియాలు, సిల్వర్ ఓక్ వంటి చెట్ల నీడలో వీటిని పెంచుతారు.
ఈ తోటల్లో పనిచేసే కూలీలకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కాఫీ మొక్కకు వచ్చే పిక్కను మూడు దశల్లో పరిశీలిస్తూ...ఎర్రగా చెర్రీ ఫ్రూట్ రంగులోకి మారిన వాటిని మొక్క నుంచి వేరు చేస్తారు. వీటినీ చెర్రీఫ్రూట్ అనే పిలుస్తారు.
ఎర్రగా మారిన కాఫీ పిక్కలను ఎప్పటికప్పుడు వేరు చేస్తూ...వాటిని ప్రాసెసింగ్ కోసం పంపిస్తారు. ఈ గింజలను ఏపీఎఫ్‌డీసీ కొనుగోలు చేస్తుంది.
కొందరు కాఫీ రైతులు స్వయంగా తమ సొంత యూనిట్లతో కాఫీ పొడిని తయారు చేస్తుంటారు.
అయితే కోవిడ్ కారణంగా గత ఏడు నెలలుగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలోని తోటల్లో పని చేసే కూలీలకు, అలాగే రైతు తోటల్లో పని చేసే కూలీలకు పని లభించడంలేదు. మన్యంలో కోవిడ్ నిబంధనలను కాస్త సడలించడంతో ఇప్పుడిప్పుడే కొద్ది మంది కూలీలకు పని దొరుకుతోంది.
కాఫీ తోటల్లో పని చేసే కూలీలు గీత, రమ బీబీసీతో మాట్లాడారు. "కోవిడ్ కారణంగా పని లేక తీవ్రంగా నష్టపోయాం. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తోటల్లో పని చేసినా...రైతు తోటల్లో పని చేసినా కూడా తగిన కూలీ రావడం లేదు. ప్రభుత్వంతో మాట్లాడి కూలీ పెంచుతామని ఎప్పుడూ చెప్పే మాటే ఇప్పుడు చెప్తున్నారు. రోజు కూలీ లేదా కాఫీ గింజలను వేరు చేసేందుకు కేజీల చప్పున ఇచ్చే ధరైనా పెంచాలి" అని అన్నారు.
తోటల నుంచి ప్రాసెసింగ్‌కి...
కాఫీ గింజలను మొక్కల నుంచి వేరు చేసిన తరువాత ప్రాసెసింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రాసెసింగ్ కి సంబంధించి ఏజెన్సీలోని బీస్ పురానికి చెందిన రాము బీబీసీకి వివరించారు.
"ప్రాసెసింగ్ అంటే ఎండబెట్టడం నుంచి కాఫీ పొడి తయారు చేయడం వరకూ. మేం ఈ మిషన్లను లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాలయకు కొంటాం. వీటిలో ముందుగా ఎండబెట్టిన కాఫీ గింజలను మరింత వేడి చేస్తాం. ఆ తరువాత వేడి చేసిన గింజలను మిషన్ లోని జల్లెడపై ఉంచి అరగంట సేపు రోస్టింగ్ చేస్తాం. అనంతరం పొడి చేసే యంత్రం సహాయంతో కాఫీ పొడి చేసి...దానికి రుచిని పెంచడం కోసం ఒక రకమైన దుంప నుంచి తయారైన చకోరి అనే పొడిని కలుపుతాం. అనంతరం పావు కిలో, అరకిలో ప్యాకెట్లుగా తయారు చేసి రిటైల్ గా అమ్మకాలు చేసేవారికి ఇచ్చేస్తాం. అయితే ఈ ప్రొసెసింగ్ మిషన్ల ద్వారా మేం కేవలం రోజుకి 40 కిలోలు మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన మిషన్లను ప్రభుత్వం రాయితీకి అందిస్తే రోజుకి 500 కిలోల వరకు చేయగలం" అని చెప్పారు.
తోటల పక్కనే అమ్మకాలు...
ప్రాసెసింగ్ తర్వాత ఘుమఘుమలాడే అరకు కాఫీ పొడి రెడీ అయిపోయినట్లే. అయితే పెద్ద మొత్తంలో రైతుల దగ్గర నుంచి జీసీసీ కొనుగోలు చేసి అరకుకాఫీ పేరుతో జీసీసీ స్టాల్స్, రైతు బజారుల్లో అమ్మకాలకు పెడుతుంది.
ఏజెన్సీలో కాఫీ తోటల పక్కనే చాలా మంది రిటైల్ గా కూడా అమ్ముతుంటారు. వీటిని ఇక్కడికి వచ్చే పర్యాటకులు కొనడానికి ఇష్టపడతారు. అరకు, అనంతగిరి, సుంకరమెట్ట తదితర ప్రాంతాల దగ్గర ఇలా కాఫీ తోటల పక్కనే అమ్ముకునేవారు ఎక్కువ మంది కనిపిస్తారు.
ఇలా అమ్మకాలు చేసే ప్రణీత్, సుష్మా బీబీసీతో మాట్లాడారు. "అరకు వచ్చినవారంతా కచ్చితంగా మా వద్ద అరకు కాఫీని కొంటారు. కొందరు ఇక్కడే కాఫీ తాగుతారు. కానీ మాకు సరైన సౌకర్యం లేక, మేమే సొంతంగా కర్రలతో షెల్టర్ తయారు చేసుకుని వాటిలో అమ్మకాలు చేస్తున్నాం. ప్రభుత్వం మా కోసం మంచి స్టాళ్లను ఏర్పాటు చేస్తే, చూసేవారికీ బాగుండి మరింత అమ్మకాలు పెరుగుతాయని నమ్ముతున్నాం" అని చెప్పారు.
కాఫీ చరిత్రను తెలిపే కాఫీ మ్యూజియం...
కాఫీ చరిత్ర మొత్తాన్ని కళ్లకుకట్టినట్లు వివరించే కాఫీ మ్యూజియం అరకులో ఉంది.
ఇక్కడే స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ కాఫీ రుచినీ సందర్శకులకు అందిస్తారు. ఈ కాఫీ మ్యూజియంలో లభ్యమయ్యే కాఫీలు, తయారైన చాకెట్లు, కాఫీ చరిత్రను ఈ మ్యూజియం సూపర్ వైజర్ రామారావు బీబీసీకి వివరించారు.
"ఈ మ్యూజియంలో కాఫీ చరిత్రని తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశాం. ఇథియోపియాలో పుట్టిన కాఫీ అరకు వరకు ఎలా వచ్చిందనే విషయాన్ని ఇక్కడికి వచ్చే వారికి వివరిస్తాం. అలాగే కాఫీ రుచులతో నిరంతరం రీసెర్చ్ చేస్తుంటాం. ఆ రీసెర్చ్ ద్వారా కాఫీకి వివిధ రకాల పళ్లు, ఫ్లేవర్స్ ను కలుపుతూ సరికొత్త రకాల చాకెట్లను తయారు చేస్తాం. అలాగే కాఫీని కూడా వివిధ రకరకాల రుచులలో అందిస్తాం" అన్నారు.
‘‘కాఫీ తాగకపోతే రోజే గడవదు...’’
కరోనా కారణంగా కాఫీ మ్యూజియంకి సందర్శకుల రాకపోకలు లేకున్నా...స్థానికులు కొందరు ఈ కాఫీ రుచులను రోజూ ఆస్వాదిస్తూనే ఉంటారు. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడానికో...కాస్త రిలాక్సేషన్ కోసమో ఇక్కడకి వచ్చి కాఫీ తాగుతారు. అరకు స్థానికుడు, కాఫీ ప్రియుడైన ప్రశాంత్... అరకు కాఫీ గొప్పతనం గురించి బీబీసీతో మాట్లాడుతూ.. "ఈ కాఫీ తాగకపోతే ఆ రోజుకి ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందుకే ఏదో సమయంలో ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతాను. అరకు వచ్చే సందర్శకులంతా ఇక్కడికి వచ్చి కాఫీని తప్పక రుచిచూస్తారు. అసలు అరకు కాఫీ తాగకుండా అరకు టూర్ పూర్తవదు. అరకు కాఫీ అంటే అదొక బ్రాండ్.. అంతే" అని చెప్పారు.
కాఫీ పుట్టుక వెనుక కథలు..
ప్రపంచంలో ఎంతో మందిని తన రుచితో కట్టిపడేస్తున్న కాఫీ పుట్టుకకి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
యూఎస్ లోని నేషనల్ కాఫీ అసోసియేషన్ ప్రకారం..."కాఫీ ప్రపథమంగా ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలోపుట్టింది. అక్కడి నుంచే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ ప్రాంతంలోని ఓరోమె తెగకు చెందిన పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించారు. 'కల్డి' అనే ఓ పశువుల కాపరి ఒక రకమైన మొక్కలను తిన్న తన మేకలు చురుకుదనాన్ని ప్రదర్శించడం గమనించాడు. దాంతో ఆ మొక్కల గింజల్లో ఏదో శక్తి ఉందని నమ్మి వాటిని పానీయంగా తయారుచేసి తాగడం మొదలు పెట్టాడు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తాగడం మొదలు పెట్టారు. కాలక్రమంలో ఈ కాఫీ ఇధియోపియా నుంచి అరేబియాకి చేరుకుంది. కాప్ఫే అనే జాతికి చెందిన మొక్క గింజల నుంచి తయారుకావడంతో ఈ పానీయానికి కాఫీ అనే పేరు వచ్చింది" అని తెలిపింది.
భారతదేశానికి కాఫీ ఎలా వచ్చిందనే చరిత్రను పరిశీలిస్తే... కాఫీ బోర్డ్ వెబ్ సైట్ కథనం ప్రకారం 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బూదాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా నుంచి, భారతదేశానికి తీసుకువచ్చారనీ, వాటిని కర్ణాటకలోని చిగ్‌మగళూర్‌లో తన ఆశ్రమంలో నాటారనీ ప్రస్తావించారు. అక్కడ నుంచి వ్యాప్తి చెంది భారతదేశంలో పలు ప్రాంతాలకి కాఫీ పంట విస్తరించిందని ఆ కథనం తెలిపింది.
అలా ఇథియోపియాలో మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచమంతా విస్తరించి...ఇప్పుడు 75 దేశాల్లో వాణిజ్య పంటగా పండుతోంది.
ఆ కాఫీలు చాలా ఖరీదు...
రుచిని బట్టి ప్రపంచంలో ఖరీదైన కాఫీలున్నాయి. కాఫీ గింజలు ఎక్కడి నుంచి సేకరిస్తారనే దాని మొదలు తయారయ్యే పద్ధతి వరకు అన్నీ కాఫీ రుచినీ, ధరనీ నిర్ణయిస్తాయి.
2016 ఏప్రిల్‌లో నేషనల్ జియోగ్రఫిక్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం ప్రపంచంలోనే ఖరీదైన కాఫీగా కోపిలువాక్ (Kopi Luwak) నిలిచింది. పునుగు పిల్లి (CIVET CAT) విసర్జితాలతో ఈ కాఫీ విత్తనాలను తయారు చేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అమెరికాలో దీని ధర 60 నుంచి 90 డాలర్ల వరకు ఉంటుంది.
దీంతోపాటు ఏనుగు విసర్జితాల నుంచి తయారు చేసే బ్లాక్ ఐవరీ కాఫీ (Black Ivory Coffee), పనామా దేశ కొండల్లో పండే ఎస్మెరాల్డా స్పెషల్ కాఫీ (Esmeralda Special coffee), ఫ్రాన్స్ లో లభ్యమయ్యే సెయింట్ హెలెనా కాఫీ (St. Helena coffee), లాటిన్ అమెరికా కొండల్లో పండించే ఎల్ ఇన్జెట్రో (El Injerto) ఈ ఖరీదైన కాఫీల జాబితాలో ఉన్నాయి.
ఇలాంటి అనేక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాఫీలతో పోటీపడుతూ విశాఖ మన్యంలోని అరకు కాఫీ తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించింది.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)