కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?

    • రచయిత, డొమినిక్ బైలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒకవేళ కరోనావైరస్ వ్యాక్సీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారుచేసినా, ప్రపంచమంతటికీ దాన్ని అందించడం పెద్ద పని.

సమర్థమైన వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసి, పరీక్షించి, తయారుచేసేందుకు పట్టే సమయాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా సంస్థలు, పరిశోధనశాలలు ఇప్పుడు కొత్త ప్రక్రియలకు దిగుతున్నాయి.

వ్యాక్సీన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి.

అయితే, ఈ వ్యాక్సీన్ రేసులో ధనిక దేశాలు నెగ్గి, పేద దేశాలకు నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరి, ఈ వ్యాక్సీన్ మొదట ఎవరికి అందుతుంది? ఎంత ధర ఉంటుంది? పేద దేశాల పరిస్థితేమిటి?

ఏదైనా అంటువ్యాధికి వ్యాక్సీన్ అభివృద్ధి చేసి, పరీక్షించి, సరఫరా చేయాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. అయినా, అది సఫలమవుతుందున్న భరోసా లేదు.

ఇప్పటివరకూ ఒకే అంటు వ్యాధిని మనం పూర్తిగా నిర్మూలించగలిగాం. అదే స్మాల్‌పాక్స్. ఇందుకు 200 ఏళ్ల సమయం పట్టింది.

ఎంత త్వరగా రావొచ్చు?

కోవిడ్-19 వ్యాక్సీన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వేల మందిపై ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఒక వ్యాక్సీన్ పరిశోధన స్థాయి నుంచి పంపిణీ దశ వరకూ రావడానికి సాధారణంగా ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. కానీ, ఇప్పుడు దీన్నంతటినీ కొన్ని నెలల్లోనే పూర్తి చేయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి.

పెట్టుబడిదారులు, తయారీదారులు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. తయారీ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతున్నారు.

తాము రూపొందించిన స్పుత్నిక్-V వ్యాక్సీన్ ట్రయల్స్ దశలో కోవిడ్ రోగుల్లో మంచి వ్యాధి నిరోధక ప్రతిస్పందనలను చూపించిందని రష్యా ప్రకటించింది. అక్టోబర్‌లో మూకుమ్మడి వ్యాక్సీనేషన్‌ మొదలుపెడతామని తెలిపింది.

చైనా కూడా విజయవంతంగా వ్యాక్సీన్ రూపొందించినట్లు చెబుతోంది. సైనిక సిబ్బందికి దీన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.

అయితే, ఈ రెండు వ్యాక్సీన్ల ఉత్పత్తి తగినంత వేగంగా జరగడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొన్న వ్యాక్సీన్ల జాబితాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకున్న వ్యాక్సీన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ దశలో మనుషులపై విస్తృతంగా వ్యాక్సీన్‌ను పరీక్షించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది చివరికల్లా తమ వ్యాక్సీన్లకు ఆమోదం లభిస్తుందని తయారీ ప్రయత్నాల్లో ఉన్న చాలా సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే, 2021 ఏడాది సగం పూర్తయ్యేవరకూ విస్తృతంగా వ్యాక్సీన్లు అందించే పరిస్థితి ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ అంటోంది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్‌కు లైసెన్సు పొందిన బ్రిటన్‌ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా... అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఒకవేళ ప్రయత్నాలు విజయవంతమైతే, ఒక్క బ్రిటన్‌కే 10 కోట్ల డోసులు అందించేందుకు ఆ సంస్థ అంగీకారం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డోసులు ఆ సంస్థ సరఫరా చేయవచ్చు. అయితే, బ్రిటన్‌లో ఈ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొంటున్న కొందరు వాలంటీర్లకు తీవ్రమైన అస్వస్థత రావడంతో వాటిని ఇప్పుడు నిలిపివేశారు.

కోవిడ్ కోసం ఎమ్ఆర్‌ఎన్ఏ వ్యాక్సీన్ అభివృద్ధి చేసేందుకు ప్ఫీజర్, బయోఎన్‌టెక్ సంస్థలు 100 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపాయి. వచ్చే అక్టోబర్‌లో తమ వ్యాక్సీన్‌కు రెగ్యులేటరీ అనుమతి తీసుకునే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి.

ఒక వేళ దీనికి ఆమోదం లభిస్తే, 2020 కల్లా 10 కోట్ల డోసులు, 2021 చివరికల్లా 130 కోట్ల డోసులు తయారయ్యే అవకాశాలున్నాయి.

మరో 20 దాకా ఫార్మా సంస్థలు కూడా కోవిడ్ వ్యాక్సీన్‌లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

వీటిలో ఓ పది శాతం మేర ట్రయల్స్ విజయవంతం కావొచ్చు.

‘వ్యాక్సీన్ జాతీయవాదానికి అడ్డుకట్ట వేయాలి’

అధికారికంగా ఆమోదించుకున్నా, విజయవంతమయ్యే అవకాశముందని భావిస్తున్న వ్యాక్సీన్లను పొందేందుకు ముందుగానే ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వమే ఆరు వ్యాక్సీన్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది.

అమెరికా తమ పెట్టుబడి కార్యక్రమం ద్వారా జనవరిలోగా 30 కోట్ల డోసులు పొందాలని ఆశిస్తోంది. వ్యాక్సీన్లు వేసేందుకు అమెరికాలోని రాష్ట్రాలు నవంబర్ 1కల్లా సంసిద్ధంగా ఉండాలని ఆ దేశ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) సూచించింది.

కానీ, అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితిలో లేవు.

ఫార్మా సంస్థలతో ఇలా ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం వల్ల ‘ధనిక దేశాలు వ్యాక్సీన్ జాతీయవాదం అనే ప్రమాదకర ధోరణి’కి దారితీస్తుందని మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటీయర్స్ (డాక్టర్స్ వితౌట్ బార్డర్స్) లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటి పరిణామాలతో పేద దేశాలకు వ్యాక్సీన్లు అందుబాటులో లేకుండా పోతాయి.

గతంలో అధిక ధరల కారణంగా చాలా దేశాలు తమ చిన్నారులకు మెనింగిటిస్ లాంటి వ్యాధులు రాకుండా వ్యాక్సీన్లు వేయించలేకపోయాయి.

వ్యాక్సీన్ జాతీయవాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియాంగెలా సిమావో అన్నారు.

‘‘అధిక ధర చెల్లించేవారికే కాదు, అన్ని దేశాలకు ఈ వ్యాక్సీన్ సమానంగా అందుబాటులో ఉండేలా చూడటం మన ముందున్న సవాలు’’ అని ఆయన చెప్పారు.

పేద దేశాల మాటేమిటి?

సెపీ, వివిధ దేశాల ప్రభుత్వాలు, సంస్థలు కలిసి వ్యాక్సీన్ల కోసం ఏర్పాటు చేసిన కూటమి ‘గావీ’లతో కలిసి డబ్ల్యూహెచ్ఓ అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

కోవాక్స్ అనే అంతర్జాతీయ వ్యాక్సీన్ కార్యక్రమం కోసం 80కిపైగా దేశాలు జత కలిశాయి. వ్యాక్సీన్‌ను కొనుగోలు చేసి, ప్రపంచవ్యాప్తంగా పారదర్శకంగా సరఫరా చేసేందుకు 2020 చివరికల్లా 200 కోట్ల డాలర్లు సమీకరించాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, డబ్ల్యూహెచ్ఓను వీడే యోచనలో ఉన్న అమెరికా ఇందులో భాగం కాలేదు.

ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని అల్పాదాయ దేశాలు కూడా ‘వేగంగా, పారదర్శకంగా, అందరితో సమానంగా’ కోవిడ్ వ్యాక్సీన్లు పొందేందుకు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.

దీని ద్వారా వ్యాక్సీన్ పరిశోధనలకు, అభివృద్ధి కార్యకలాపాలకు, తయారీ సామర్థ్యం పెంచేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

చాలా వ్యాక్సీన్ ట్రయల్స్‌ను ఈ కార్యక్రమ పరిధిలోకి తీసుకువచ్చారు. వీటిలో ఏ ఒక్కటి సఫలమైనా, 2021 చివరికల్లా 200 కోట్ల డోసులు సరఫరా చేయాలని ఆశిస్తున్నారు.

‘‘ఒకవేళ ధనిక దేశాలకు మాత్రమే రక్షణ దక్కితే... మహమ్మారి మిగతా ప్రపంచంపై ప్రతాపం కొనసాగిస్తున్నకొద్దీ అంతర్జాతీయ వాణిజ్యం, సమాజం అన్నీ దెబ్బతింటాయి’’ అని గావీ సీఈఓ డాక్టర్ సేత్ బెర్క్లీ అన్నారు.

ధర ఎంత ఉంటుంది?

వ్యాక్సీన్ల కోసం వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. మరోవైపు వాటిని కొనుగోలు చేసి, ప్రజలకు అందించేందుకు మిలియన్ల కొద్దీ డాలర్ల విరాళాలు వస్తున్నాయి.

వ్యాక్సీన్ ఏ రకం, తయారీదారు ఎవరు, ఎన్ని డోసులు ఆర్డర్లు చేశారన్న అంశాలపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ఫార్మా సంస్థ మోడెర్నా తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్‌‌ (ఒక్క డోసు)ను రూ.2,350 నుంచి రూ.2,717 మధ్య ధరకు అందుబాటులో ఉంచుతున్నట్లు వార్తలు వచ్చాయి.

మరోవైపు ఆస్ట్రాజెనెకా సంస్థ తాము పూర్తిగా లాభం తీసుకోకుండా గానీ, లేదా చాలా తక్కువ లాభం మీదే గానీ అమ్ముతామని ప్రకటించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీన్ తయారీదారు అయిన భారత సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఎస్‌ఐ)కి గావీ, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ 15 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నాయి. ఈ సంస్థ భారత్‌తోపాటు మధ్య ఆదాయ దేశాలకు కోవిడ్ వ్యాక్సీన్ 10 కోట్ల డోసులను అందించాలని ఆశిస్తోంది. ఒక్కో డోసుకు రూ.220 గరిష్ఠ ధరగా ఎస్ఎస్ఐ నిర్ణయించింది.

వ్యాక్సీన్ల కోసం రోగులు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి చాలా వరకూ ఉండకపోవచ్చు.

బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ ద్వారా ప్రజలకు దీన్ని అందిస్తారు. ఆస్ట్రేలియా లాంటి ఇంకొన్ని దేశాలు తమ జనాభాకు ఉచితంగానే వ్యాక్సీన్ అందిస్తామని ప్రకటించాయి.

అంతర్జాతీయంగా వ్యాక్సీన్లను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా కూడా ప్రజలకు ఉచితంగానే వ్యాక్సీన్లు అందుతాయి.

అమెరికాలో కూడా వ్యాక్సీన్ ఉచితంగానే ఉండొచ్చు. అయితే, వ్యాక్సీన్ వేసినందుకు వైద్య సిబ్బంది ఫీజు తీసుకునే ఉంది. ఇన్సూరెన్స్ లేనివారు సొంతంగా దీన్ని చెల్లించాల్సి రావొచ్చు.

ముందు ఎవరికి?

వ్యాక్సీన్లను ముందు ఎవరికి అందించాలన్న విషయం... వాటిని తయారు చేస్తున్న సంస్థల చేతుల్లో లేదు.

‘‘వ్యాక్సీన్‌ను ముందుగా ఎవరికి వేయాలి? ఎలా వేయాలి? అన్నది ప్రతి సంస్థా, దేశమూ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది’’ అని ఆస్ట్రాజెనెకా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మెన్ పంగాలోస్ బీబీసీతో అన్నారు.

ఆరంభంలో వ్యాక్సీన్ల సరఫరా పరిమితంగానే ఉంటుంది కాబట్టి... మరణాలను నియంత్రణలో పెట్టడం, వైద్య వ్యవస్థను రక్షించుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టవచ్చు.

కోవాక్స్ కోసం ఒప్పందం చేసుకున్న దేశాలకు... పేద దేశాలా?, ధనిక దేశాలా? అన్న తేడా లేకుండా, వాటి జనాభాలో మూడు శాతానికి సరిపోయేలా వ్యాక్సీన్ డోసులను సరఫరా చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు గావీ తెలిపింది. వైద్య, సామాజిక కార్యకర్తలకు వ్యాక్సీన్లు వేసేందుకు ఆయా దేశాలకు ఈ మూడు శాతం డోసులు సరిపోవచ్చు.

ఆ తర్వాత వ్యాక్సీన్ల ఉత్పత్తి పెరిగిన కొద్దీ, 20 శాతం జనాభాకు సరిపడేలా డోసులు కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు 65 ఏళ్ల పైబడినవారు, ముప్పు ఎక్కువగా ఉన్న ఇతర వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

అన్ని దేశాలకూ 20 శాతం కోటా పంపిణీ పూర్తైన తర్వాత ఆయా దేశాలకు ఉన్న ముప్పు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేయొచ్చు.

కోవాక్స్ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అన్ని దేశాలకూ సెప్టెంబర్ 18వరకూ గడువు ఉంది. ఇందులో చేరిన దేశాలు అక్టోబర్ 9కల్లా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

వ్యాక్సీన్ డోసుల కేటాయింపు విషయంలో ఇంకా సంప్రదింపులు సాగుతున్నాయి.

‘‘చాలినంత వ్యాక్సీన్ డోసులు ఉండవన్నది మాత్రం కచ్చితం. మిగతా పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంకా స్పష్టత లేదు’’ అని డాక్టర్ సిమావో అన్నారు.

‘‘అందుబాటులో ఉన్న వ్యాక్సీన్ డోసుల్లో ఐదు శాతం పక్కకు పెట్టొచ్చు. ఎక్కడైనా తీవ్ర వ్యాప్తి ఉన్నప్పుడు, స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించేందుకు వీటిని వినియోగించవచ్చు. శరణార్థుల్లాంటి వారికి ఈ కోటా నుంచి వ్యాక్సీన్లు వేయొచ్చు’’ అని బెర్క్లీ అన్నారు.

పంపిణీ ఎలా?

వ్యాక్సీన్ విజయవంతమయ్యే అవకాశాలు చాలా అంశాల మీద ఆధారపడి ఉంటాయి.

అది చవగ్గా లభించాలి. తిరిగి ఎప్పటికీ ఆ వ్యాధి రాకుండా, నిరోధకత శక్తిని అందించాలి. దాన్ని రవాణా చేసేందుకు సరళమైన రీఫ్రిజరేటింగ్ వ్యవస్థ ఉండాలి. తయారీదారులు వేగంగా ఉత్పత్తి స్థాయి పెంచగలగాలి.

డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటీయర్స్ సంస్థలకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీనేషన్‌కు అవసరమైన పంపిణీ వ్యవస్థలు ఉన్నాయి. ఉత్పత్తి అయిన చోటు నుంచి క్షేత్ర స్థాయి వరకు వ్యాక్సీన్‌ను తీసుకువెళ్లగలిగే శీతల ట్రక్కులు, సోలార్ ఫ్రిడ్జ్‌లు వంటి సదుపాయాలు ఉన్నాయి.

కానీ కొత్త వ్యాక్సీన్లతో కొత్త సవాళ్లు కూడా ఎదురుకావొచ్చు.

వ్యాక్సీన్లను సాధారణంగా 2-8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

అభివృద్ధి చెందిన దేశాలకు ఇది పెద్ద సమస్య కాదు. కానీ, విద్యుత్ సరఫరా, రీఫ్రిజరేషన్ సదుపాయాలు సరిగ్గా లేని దేశాల్లో ఇదొక సవాలే.

తమ వ్యాక్సీన్‌ను 2-8 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన పరిస్థితి రావొచ్చని ఆస్ట్రాజెనెకా తెలిపింది.

మిగతా వ్యాక్సీన్లు -60 డిగ్రీలు, అంతకన్నా చల్లటి ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

‘‘ఎబోలా వ్యాక్సీన్‌ను -60 డిగ్రీల వద్ద నిల్వ ఉంచి, సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన సామగ్రిని తయారు చేశాం. దాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపైనా సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది’’ అని మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటీయర్స్ వైద్య సలహాదారు బార్బరా సైట్టా అన్నారు.

వ్యాక్సీన్ విషయంలో శాస్త్రవేత్తల పాత్ర పూర్తైన తర్వాత, ఇంకా పెద్ద సవాళ్లు ప్రపంచం ఎదుర్కోవాల్సి రావొచ్చు.

‘‘వ్యాక్సీన్లు మాత్రమే పరిష్కారం కాదు. వ్యాధి నిర్ధారణ వ్యవస్థ ఉండాలి. మరణాలను తగ్గించాలి. చికిత్సలు చేయాలి. వ్యాక్సీన్లు ఇవ్వాలి. ముందుగా... సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం’’ అని డాక్టర్ సిమావో అన్నారు.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)