You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: బెంగళూరు యువతికి రెండోసారి కరోనా సోకిందన్న అనుమానాలు.. నయమైనవారిలో భయాందోళనలు
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
బెంగళూరులో ఓ యువతికి రెండోసారి కరోనావైరస్ సోకిందేమోనని వైద్యులు అనుమానిస్తున్నారు. నగరంలో ఈ తరహా కేసు ఇదే మొదటిది కావొచ్చని భావిస్తున్నారు.
ఆ యువతికి చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి ఫోర్టిస్ ఈ విషయాన్ని వెల్లడించింది.
27 ఏళ్ల ఆ యువతి జులైలో కరోనావైరస్ పాజిటివ్‌గా తేలారని, ఆ సమయంలో ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవని ఆ ఆసుపత్రి తెలిపింది.
అప్పుడు కొన్ని రోజులు చికిత్స అందించిన తరువాత ఆమెకు తిరిగి పరీక్ష నిర్వహించినప్పుడు ఫలితం నెగిటివ్‌గా రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ, ఆగస్టు 24న తిరిగి ఆ యువతికి ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి.
‘‘ఆమెకు రాపిడ్ యాంటిజెన్, ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు చేశాం. రెండు పరీక్షల్లోనూ ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. యాంటీ బాడీ (కోవిడ్ ఇమ్యునోగ్లోబ్యులిన్-జీ) పరీక్ష ఫలితం నెగటివ్‌గా వచ్చింది. దీంతో ఆమెకు రెండో సారి కరోనా సోకి ఉండొచ్చని సందేహించాం’’ అని ఫోర్టిస్ ఆసుపత్రి అంటువ్యాధుల విభాగం కన్సల్టెంట్ డాక్టర్ ప్రతీక్ పటేల్ బీబీసీతో చెప్పారు.
‘‘కరోనావైరస్ రెండో సారి సోకిన కేసు బెంగళూరులో ఇదే మొదటిది కావొచ్చు. కరోనా సోకినప్పటికీ ఆమె శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగలేదనుకుంటా’’ అని ప్రతీక్ చెప్పారు.
10-12 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆ యువతి రెండో సారి కూడా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారని ఆయన వివరించారు.
‘‘సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మొదటిసారి సోకిన వైరస్‌కు, రెండోసారి సోకిన వైరస్‌కు మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా అని మేం డీఎన్ఏ విశ్లేషణలు చేస్తాం. కానీ, దురదృష్టవశాత్తు మా దగ్గర ఆమెకు వైరస్ తొలిసారి సోకినప్పటి శాంపిల్స్ లేవు. శాంపిల్స్‌ను ఎక్కువ కాలం సురక్షితంగా దాచే వ్యవస్థ లేదు. ఈ విషయమై చర్యలు అవసరం’’ అని ప్రతీక్ అన్నారు.
‘‘ఇదంతా ఒకే సంక్రమణ కూడా అయ్యుండొచ్చు. ఆమె శరీరంలో యాంటీ బాడీలు తయారుకాలేదు. రోగుల్లో ఎంతమందికి యాంటీబాడీలు తయారవుతాయి? అవి ఎంతకాలం ఉంటాయి? అన్న సమాచారం కూడా మాకు తెలియదు’’ అని ఆయన చెప్పారు.
కరోనావైరస్ నుంచి కోలుకున్నవారు ఇక తమకేమీ కాదని, అజాగ్రత్తగా వ్యవహరించకూడదని ప్రతీక్ సూచించారు. మాస్క్ ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం అందరికీ అవసరమేనని అన్నారు.
కరోనావైరస్ రోగుల్లో రెండు సార్లు పరీక్షల్లో నెగటివ్ వచ్చిన తర్వాత కూడా మూడో సారి పరీక్షలో పాజిటివ్‌గా తేలుతున్నవారు చాలా మందే ఉంటున్నారని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి బీబీసీతో అన్నారు.
గత వారం ముంబయిలో కూడా ఓ డాక్టర్ రెండో సారి కరోనావైరస్ బారినపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)