You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 30 లక్షలు దాటింది. వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది.
అయితే ఒకవైపు వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండగా, చికిత్స తర్వాత వ్యాధి నుంచి బైటపడిన వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది.
రెండో విడత సెరో సర్వే నివేదికను దిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. దిల్లీ ఆరోగ్యశాఖా మంత్రి సత్యేందర్ జైన్ గురువారం విడుదల చేసిన ఈ సర్వే ఫలితాలలో దేశ రాజధానిలో 29 శాతానికి పైగా ప్రజల్లో యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది.
అంటే వీరందరికీ ఇన్ఫెక్షన్ సోకగా, వారి శరీరం వాటిని తట్టుకునే యాంటీబాడీస్‌ను వృద్ధి చేసుకోగలిగింది.
ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ సెరో సర్వే కోసం నమూనాలు తీసుకున్నామని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మొత్తం 29.1 శాతం మందిలో యాంటీబాడీస్‌ను గుర్తించామని మంత్రి తెలిపారు.
జూలైలో జరిగిన మొదటి సెరో సర్వేలో దిల్లీలో నాలుగింట ఒకవంతుమందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. అప్పటి సర్వే కోసం 21,387 శాంపిల్స్ తీసుకున్నారు. వీరిలో 23.48 శాతం మందిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి.
రెండో సర్వేలో శాంపిల్ సైజ్‌ను 15,000 మందికి పరిమితం చేశారు. రెండో సర్వే ప్రకారం 32.2 శాతం మంది స్త్రీలలో, 28 శాతం మంది పురుషులలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి.
రెండు కోట్ల జనాభా ఉన్న రాజధానిలో వైరస్ వ్యాప్తి తర్వాత దాదాపు ఆరు లక్షలమంది దీన్నుంచి కోలుకున్నారని స్పష్టమయింది.
అయితే హెర్డ్ ఇమ్యూనిటీని వృద్ధి చేసుకోడానికి ఢిల్లీకి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒక ప్రదేశంలో 40 నుంచి 70 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి అయితే అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్యమంత్రి జైన్ తెలిపారు.
ముంబై, పుణెలలో జరిపిన సెరో సర్వేలో 40 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు.
రెండోసారి వైరస్ సోకి యాంటీబాడీస్ వృద్ధి కావా?
“రెండోసారి వైరస్ సోకుతుందో లేదో తెలియదు. కానీ ఒకసారి వైరస్ సోకిన వారిలో కొందరికి యాంటీబాడీస్ వృద్ధి చెందాయి’’ అని ఐసీఎంఆర్‌లోని ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ నివేదితా గుప్తా అన్నారు.
“ శరీరంలో యాంటీబాడీస్ తయారైన వారు సురక్షితమని మేం భావిస్తున్నాము. కానీ వారు మళ్లీ వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు లభించ లేదు. వస్తుందని కచ్చితంగా చెప్పలేము’’ అన్నారు నివేదితా గుప్తా.
సెరో సర్వే ఫలితాలలో ఎవరు వ్యాధిబారినపడ్డారు, ఎవరికి నయమైంది అన్నది మాత్రమే తెలుస్తుంది.
ఇన్‌ఫెక్షన్ అంటే ఏంటో ముందు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రొగ్రెసివ్ మెడికోస్ అండ్ సైంటిస్ట్స్ ఫోరం (PMSF) జాతీయ అధ్యక్షులు డాక్టర్ హర్జిత్ సింగ్ భట్టి.
“శరీరభాగాలకు, శరీరానికి హాని కలిగించే ఒక ఫారిన్‌బాడీ (బయటి వస్తువు లేదా జీవి) శరీరంలోకి ప్రవేశిస్తే దానినే ఇన్‌ఫెక్షన్ అంటారు. ఆ పరిస్థితుల్లో మన శరీరం వాటిని నిరోధించే శక్తిని సంపాదించుకుంటే ఆ ఫారిన్‌బాడీ వల్ల మనకు ఇబ్బంది ఉండదు’’ భట్టి చెప్పారు.
“శరీరంలో యాంటీబాడీస్‌ను వృద్ధి చేసుకున్న వారికి ఇన్‌ఫెక్షన్ సమస్య ఉండదు. వారిపై ఏదైనా వైరస్ దాడి చేస్తే వారిలోని యాంటీబాడీస్ యాక్టివేట్ అవుతాయి. వైరస్‌ను అడ్డుకుంటాయి’’ అని హర్జీత్ సింగ్ చెప్పారు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించిన ఈ కరోనా, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అనేక రూపాలను మార్చుకుంటూ వెళుతోంది.
అలా పరివర్తనం చెందుతున్నప్పుడు యాంటీబాడీస్ మనల్ని ఎంత వరకు రక్షించగలవు? అయితే అసలు ఎలా పరివర్తనం చెందుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని డాక్టర్ నివేదితా గుప్తా అంటున్నారు.
ప్రస్తుతం ఇది కొత్త వైరస్‌ని, రెండోసారి వైరస్ సోకుతుందా లేదా అన్నదానిపై పూర్తి సమాచారం లేదని డాక్టర్ హర్జీత్ సింగ్ భట్టి తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయన్నారు.
"ఈ వైరస్ పరివర్తన గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ మార్పే నిజమైతే దీనితో చాలా ప్రమాదం. ఎందుకంటే దీని కోసం తయారు చేసిన మందులు కొంతకాలమే పని చేస్తాయి. ఇప్పటి వరకు కరోనా జంతువుల నుంచి మనుషులకు నాలుగుసార్లు మాత్రమే పరివర్తన జరిగింది” అని భట్టి తెలిపారు.
మొదటి సర్వే అంత శుభసూచకంగా లేదని, రెండోసర్వే కాస్త ఉపశమనం కలిగించేలా ఉందని వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వైరాలజీ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ టి. జాకబ్ అన్నారు.
"కరోనా వైరస్ మనం ఊహించన విధంగానే పని చేస్తోందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. దానిలో ఎలాంటి పరివర్తన కనిపించలేదు" అని జాకబ్ అన్నారు.
కరోనా 'పీక్‌స్టేజ్' దాటినట్లేనా?
ఢిల్లీలో కరోనా పతాక స్థాయికి చేరిందని ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సర్వే ఫలితాలను అర్దం చేసుకునే ముందు వైరస్ ఏ స్థాయిలో ఉన్నప్పుడు సర్వే జరిగిందో కూడా గమనించాలి. వైరస్ ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడయితే అవసరమైన సమాచారం రాదని గులేరియా అన్నారు.
ఢిల్లీలో మొదటి సెరో సర్వే జూన్ 27 నుంచి జులై 10వ తారీఖుల మధ్య జరిగింది. రెండో సర్వే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 మధ్య జరిగింది. మూడో సెరో సర్వే సెప్టెంబర్ మొదటి వారంలో జరుగుతుంది.
యాంటీబాడీస్ ఉన్నవారు ప్లాస్మా దానం చేయవచ్చా?
యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన వారంతా ప్లాస్మా దానం చేయడానికి అర్హులేనని చెప్పడానికి ఈ సర్వే సరిపోదని నిపుణులు అంటున్నారు. ప్లాస్మాదానానికి ప్రత్యేకమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొద్దిమంది వైరస్ బాధితులు మాత్రమే ప్లాస్మా దానం చేయడానికి అర్హత పొందుతారు.
"ప్రతి శరీరానికి దాని సొంత మెమరీ పవర్ ఉంటుంది. ఏ వైరస్‌తో ఎలా పోరాడాలో, ఎలా స్పందించాలో శరీరం తెలుసుకుంటుంది. ఒక వ్యక్తిలో ఒక కణం బాగా పనిచేస్తే , అది ఇతరులలో కూడా బాగా పనిచేయాలి” అని డాక్టర్ హర్జీత్ సింగ్ భట్టి అన్నారు.
సెరో లాజికల్ టెస్ట్ అంటే ఏంటి?
సెరో లాజికల్ టెస్ట్ ఒక రకమైన రక్త పరీక్ష. ఇది ఒక వ్యక్తి రక్తంలో ఉన్న యాంటీబాడీస్‌ను గుర్తిస్తుంది. రక్తంలోని ఎర్రరక్త కణాలను తొలగించిన తర్వాత మిగిలిన పసుపు పదార్ధాన్ని సీరం అంటారు. ఈ సీరంలోని యాంటీబాడీస్‌ను, వివిధ వ్యాధులను గుర్తించడానికి సెరోలాజిక్ టెస్ట్ చేస్తారు.
ఈ పరీక్షలు ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా తయారయ్యే ప్రోటీన్లపై దృష్టి పెడతాయి. రోగ నిరోధక శక్తి కలిగిన శరీరంలోని నిరోధక వ్యవస్థ బాహ్య జీవులు శరీరంపై చేసే దాడిని అడ్డుకుంటుంది. తద్వారా జబ్బునపడకుండా చేస్తుంది.
ఈ పరీక్ష ద్వారా ఏం తెలుస్తుంది?
కంటైన్‌మెంట్ ఫ్రణాళికల్లో మార్పులు చేయాలనుకున్నప్పుడు ఈ టెస్టులు ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. కరోనా వ్యాప్తి నిరోధంలో ఈ పరీక్షలు ఎంతో అవసరం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)